చేకూరి గౌతమరాజు

చేకూరి గౌతమరాజు
Facebook

Monday, September 19, 2011

' జీవాలను కాసి జీవితంలో గెలిచా ' - చింతల వెంకటరమణ

 












బాల్యంలో ఉండగా గొర్రెలు కాయడంలోనే ఆనందం ఉందనుకున్నాడు. స్కూల్‌కి వెళ్లడాన్ని ఇష్టపడేవాడు కాదు. కాని ఇప్పుడు... గొర్రెల వెంట వెళ్తే 'గొర్రెతోక బెత్తెడు' సామెతలానే జీవితం ఉంటుందని చెపుతూ అందరూ ఉన్నతమైన చదువులు చదవాలి అంటున్నాడు. చదువుతో పాటు ఆంగ్ల భాషపై పట్టు సాధిస్తే చాలు ప్రపంచాన్ని ముంగిట్లో నిలుపుకోవచ్చు అంటున్నాడు. పదో తరగతి మూడుసార్లు తప్పి, ఇంటర్మీడియెట్ ఇన్‌స్టంట్‌లో పాసయిన చింతల వెంకటరమణ(28) ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పిహెచ్‌డి స్కాలర్. అంతేకాదు విదేశీ విశ్వవిద్యాలయాల్లో పేపర్ ప్రెజెంటేషన్ చేసే స్థాయికి ఎదిగాడు. ఇప్పుడితను 'నిశ్చింతల' వెంకటరమణ. ఈ ఎదుగుదల గురించి అతని మాటల్లోనే...

"ముందుగా మా కుటుంబనేపథ్యం చెప్తాను. మా స్వగ్రామం చిత్తూరు జిల్లా, సదుం మండలంలోని బక్తలవారిపల్లె. అమ్మ పేరు చిన్నక్క, నాన్న పేరు మల్లయ్య. మా అమ్మానాన్నకి పెళ్లయిన 27 యేళ్ల తరువాత పుట్టాను నేను. మాది కురుమ కులం. గొర్రెల కాపర్ల కుటుంబం మాది. మాకు నలభై గొర్రెలు ఉండేవి. వాటిని మేతకు తీసుకెళ్లి వాటివెంట తిరగడమంటే తెగ ఇష్టం నాకు. అందుకే స్కూల్‌కి సరిగా వెళ్లేవాడ్ని కాదు. ఎలాగోలా ఆ ఊళ్లోనే ఏడవ తరగతి అయ్యిందనిపించాను. ఆ తరువాత చదువు గురించి మళ్లీ ఆలోచించలేదు.
ఎరువుకి తిండిపెట్టే వాళ్లు

రాయలసీమలో వర్షాలు తక్కువ కావడంతో నీళ్ల కరువు. మరీ ముఖ్యంగా వేసవికాలంలో గొర్రెలకు మేత, నీళ్ల కోసం ఎంత దూరమయినా తీసుకెళ్లే వాళ్లం. మాకున్న నలభై గొర్రెల్ని తోలుకుని నేను, మా నాన్న దాదాపు నెల్లూరు సరిహద్దు వరకు వెళ్లేవాళ్లం. మాతోపాటు మరికొందరు గొర్రెల కాపర్లు కూడా వచ్చేవాళ్లు. గొర్రెల ఎరువు పొలాల్లో వేసినందుకు ఒకరోజు తిండి పెట్టి, ఒక బీడీ కట్ట ఇచ్చే వాళ్లు ఆ పొలాల యజమానులు. మరొక పొలం దొరికే వరకు మేమే తిండి వండుకోవాలి. అందుకని వంటసామాగ్రి కూడా వెంట తీసుకెళ్లాలి. నేను చిన్నోడ్ని కావడంతో రాత్రుళ్లు నిద్రపోయేవాడ్ని. కాని పెద్దవాళ్లు మాత్రం గొర్రెలకు కాపలాగా ఒక్కొక్కరు రెండేసి గంటల చొప్పున నిద్ర మేలుకుని ఉండేవారు.
మాంసం మాకు దండిగా సంవత్సరం పొడవునా ఉండేది. ఎందుకంటే ఊళ్లలో పొట్టేలు మాంసం కొంటారు కాని గొర్రె మాంసం అంతగా అమ్ముడుపోయేది కాదు. (నవ్వుతూ బహుశా ఆడదనేమో...) అందుకని గొర్రెలు చనిపోతే ఆ మాంసాన్ని ఎండ పెట్టి మేమే వాడుకునే వాళ్లం. అలాగే గొర్రెల చర్మం ఒలవడంలో ఒక నేర్పు ఉంటుంది. ఆ నేర్పు నాకు ఏడో తరగతిలోనే అలవడింది. చిన్న వయసులోనే ఆ నేర్పు రావడానికి కారణం లేకపోలేదు. ఒకసారి గొర్రె చర్మం తీస్తున్నప్పుడు చిన్న రంధ్రం పడింది. అది చూసి మా అమ్మ బాగా తిట్టింది. ఎందుకంటే రెండు వందలకు కొనే చర్మం చిన్న రంధ్రం పడితే పది రూపాయలకే అమ్మాలి. అప్పుడు మా బంధువువైన అన్నయ్య ఒకరు నాలుగైదు చర్మాలు తీయరా నష్టం నేను భరిస్తా అన్నాడు. దాంతో బాగా తీయడం వచ్చింది. ఇప్పటికీ గొర్రె చర్మాన్ని కొద్దిగా కూడా డామేజ్ కాకుండా తీయగలను.

కసి రగిలింది

కొన్నాళ్ల తర్వాత మా ఇంట్లో వాళ్లు నన్ను మళ్లీ బడిలో చేర్చేందుకు ప్రయత్నించారు. కాని ఏడో తరగతి తరువాత చాలా గ్యాప్ రావడంతో ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకోలేదు. దాంతో పక్క మండలంలోని ప్రైవేట్ స్కూల్‌లో పదవతరగతిలో చేరాను. స్కూల్లో అయితే చేరానే కాని చదువు మీద ధ్యాస ఉండేది కాదు. దాంతో మొదటిసారి రాసిన పబ్లిక్ పరీక్షల్లో మూడు సబ్జెక్ట్స్ ఫెయిలయ్యాను. రెండోసారి రాశాను. మళ్లీ తప్పాను. ఫలితం... రెండోసారీ చదువుకు బ్రేక్ పడింది. చదువు ఇక ఒంటపట్టదనుకున్నాను. మళ్లీ గొర్రెల కాపరిగా వెళ్లడం మొదలుపెట్టాను.

ఒకసారి గొర్రెల్ని తీసుకుని నేను, మా నాన్న ఊరు వదిలి బయటికి వెళ్లినప్పుడు. మా ఊళ్లో పెద్ద గొడవ జరిగింది. మా ఊళ్లో మా కులానికి చెందిన కుటుంబాలు 40 ఉంటే... 39 కుటుంబాలు ఒకవైపూ, మా కుటుంబం ఒక్కటీ ఒకవైపు ఉండిపోయింది. సామాజిక బహిష్కరణ విధించారు మా మీద. బోరింగు పంపు దగ్గర నీళ్లు పట్టుకోనిచ్చే వారు కాదు. గొర్రెల్ని తీసుకుని వాళ్ల ఇళ్ల ముందునుంచి వెళ్లనిచ్చేవాళ్లు కాదు. ఆఖరికి ఉప్పు కొనుక్కోవాలన్నా టౌన్‌కి వెళ్లాల్సిందే. నలుగురూ నాలుగువైపులా తొక్కేయడంతో నాలో కసి రగులుకుంది.
గొర్రెలతో పాటు నడుస్తున్నప్పుడు... నేనేమిటి? నా జీవితం ఏమైపోతోంది? అని ఆలోచించేవాడ్ని. ఆ సమయంలోనే దూరవిద్య ద్వారా పదవతరగతి పాస్ కావొచ్చని మా ఊళ్లో ఉండే వసంత్ చెప్పాడు. అందుకు సంబంధించిన పత్రికా ప్రకటన కటింగ్ తెచ్చి నాకు చూపించాడు. అది నేషనల్ ఓపెన్ స్కూల్ ప్రకటన. అతనే దగ్గరుండి నన్ను తిరుపతి తీసుకెళ్లాడు. వివరాలు కనుక్కుంటే నాలుగువేలు కడితే పదో తరగతి పరీక్షలు రాయొచ్చని చెప్పారు.

ఇంటికి వచ్చి అమ్మానాన్నలకు చెప్పాను. ఒక్కో గొర్రెకు పదిహేను వందల రూపాయలు వస్తాయి. మూడు గొర్రెల్ని అమ్మి ఫీజు కట్టమని డబ్బు ఇచ్చారు. అయితే వసంత్ వాళ్ల నాన్న... డబ్బులు కడితే పాస్ చేస్తారనడం మోసం అన్నాడు. అయినా నేనొక్కడినే తిరుపతి వెళ్లి డబ్బులు కట్టి పుస్తకాలు తెచ్చుకున్నాను. అలా పదో తరగతి మూడోసారి అత్తెసరు మార్కులతో పాసయ్యేందుకు మార్గం ఏర్పడింది. పదో తరగతి పాసవడం అనేది నా జీవితంలో ఊహించని పరిణామం. అయితే పరీక్షా ఫలితాలు ఆలస్యంగా రావడంతో ఇంటర్మీడియెట్ అడ్మిషన్లు పూర్తయిపోయాయి.

ఇక మళ్లీ గొర్రెలే నా జీవితం అనుకుంటున్న సమయంలో మా బంధువులాయన ఒకరు నేరుగా ఇంటర్మీడియెట్ బోర్డ్‌కి ఫీజు కడితే పరీక్షలు రాయొచ్చని చెప్పాడు. 130 రూపాయలు కట్టి హెచ్ఇసి గ్రూపు తీసుకున్నాను. మొదటి ఏడాది తెలుగు, పాలిటిక్స్ మాత్రమే పాసయ్యాను. మిగతా సబ్జెక్ట్‌లన్నీ ఫెయిల్. అప్పుడు నాకు బట్టీ బట్టి రాయమని సలహా ఇచ్చారు. అలానే చేసి మిగతావన్నీ పాసయ్యాను. కాని మళ్లీ ఇంగ్లీషు సబ్జెక్ట్ పోయింది. ఆ ఒక్కటీ ఇన్‌స్టంట్ పరీక్ష రాసి 37 మార్కులతో పాసయ్యాను. తరువాత డిగ్రీ కోసం పీలేరు వెళ్లడం నా జీవితాన్ని మలుపు తిప్పింది.

బతికించే చదువు వేరు...

డిగ్రీలో పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్‌ను చంద్రయ్య మాస్టారు బోధించేవారు. ఆయన విద్యతో పాటు జీవితంలో పైకి వచ్చే అవకాశాల గురించి కూడా చెప్పేవారు. అదే నా జీవితపథంలో మార్పు తెచ్చింది. ఆయన ప్రోత్సాహంతోనే గ్రూప్ ఎగ్జామ్స్ ఉంటాయని, సెంట్రల్ యూనివర్శిటీలో చేరి చదవొచ్చనేలాంటి విషయాలు తెలిశాయి. డిగ్రీ ఆఖరి సంవత్సరంలో ఉండగా గ్రూప్స్ రాసి సెలెక్ట్ అయ్యాను. హైదరాబాద్‌లోని ఆర్‌సి రెడ్డి కోచింగ్ సెంటర్‌కి వెళ్లమని చెప్పారు సార్.

ఆయన చెప్పినట్టే పది గొర్రెలు అమ్మేసి డబ్బులు తీసుకుని హైదరాబాద్‌లో కోచింగ్ కోసం చేరాను. కాని ఏవో కారణాల వల్ల మెయిన్స్ పరీక్ష జరగలేదు. అప్పుడే సెంట్రల్ యూనివర్శిటీ నోటిఫికేషన్ పడింది. దాంతో యూనివర్శిటీకి వెళ్లి దరఖాస్తు కొన్నాను. కానీ నాకది ఎలా పూర్తి చేయాలో కూడా అర్థంకాలేదు. అది ఇంగ్లీషులో ఉండడంతో ఒకతన్ని అడిగి దరఖాస్తు పూర్తి చేయించాను. అలా ఎమ్మే పొలిటికల్ సైన్సుకి అప్లయ్ చేశాను. ఒబిసి కోటాలో వెయిటింగ్ లిస్ట్ 5 వ నంబరు నాది. ఎవరైనా రాకపోతే సమాచారం చెప్తామన్నారు. అప్పుడు స్టూడెంట్ లీడర్ నగేష్ రెడ్డి నువ్వు ఇంటికెళ్లిపో సీటు వస్తే నేను చెప్తానన్నారు. సరిగ్గా ఒక నెల తరువాత ఫోన్ చేసి సీట్ ఉంది రమ్మన్నారు.

ఒక స్టూడెంట్ జెఎన్‌యుకి వెళ్లిపోవడంతో సీటు వచ్చింది. అలా 2005 లో ఎమ్మేలో చేరాను. పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ పట్ల నాకు ఆసక్తి కలగడానికి కారణం చంద్రయ్య సారే. ఆయన ఎప్పుడూ ఇంగ్లీషు నేర్చుకోండి. వట్టి డిగ్రీలు తిండి పెట్టవనేవారు. అందుకు నా జీవితమే చక్కటి ఉదాహరణ. క్యాంపస్‌లో అడుగుపెట్టినప్పుడు ఒక్క ముక్క ఇంగ్లీషు మాట్లాడడం వచ్చేది కాదు. అప్పటివరకు ఇంగ్లీషులో మార్కులు 37 మించిన దాఖలాలు లేవు. అందుకని హాస్టల్‌లో రూమ్ ఇస్తున్న ఇన్‌చార్జ్ తో చెప్పాను- తెలుగు మాట్లాడడం రాని విద్యార్ధులున్న గదిలో నన్ను ఉంచండని. వాళ్లు నాకు నాగాలాండ్‌కు చెందిన అకాయ్‌తో గది పంచుకోమని చెప్పారు. ఇంగ్లీషులో నా గాడ్‌ఫాదర్ ఆయనే. మొదట్లో బాడీ లాంగ్వేజ్‌తో సంభాషించేవాడ్ని. అన్నిటికీ ఓపికగా సమాధానం చెప్పేవారు అకాయ్. ఎమ్మే పూర్తయ్యేసరికి ఆంగ్లంపై పట్టు వచ్చింది.

"ఐ... ఐ... మార్క్ ్స... తెలుగు మీడియం...''

ఎమ్మేలో చేరిన కొత్తలో ఎగ్జామ్ రాసినప్పుడు హెచ్ఒడి సారంగి నాకు సున్నా మార్కులు వేశారు. ఆయనే పొలిటికల్ సైన్స్ కూడా బోధించేవారు. ఆయనతో మాట్లాడడం కోసం ఆయన గదికి వెళ్లి "ఐ... ఐ... మార్క్స్... తెలుగు మీడియం...'' అని ముక్కలు ముక్కలుగా మాట్లాడాను. అప్పట్లో 'ఐ గాట్' అనాలనే విషయం కూడా తెలియదు. అప్పుడాయన ఒకటే చెప్పారు... చదువు రాలేదని బెదిరిపోయి ఇంటికెళ్లొద్దు. పట్టుదలగా చదువుకో వస్తుందన్నారు. పిజి ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాను. ఆ తరువాత ఎంఫిల్ కూడా ప్ర«థమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాను.

మరో విషయం ఏమిటంటే ఎమ్మేలో మెరిట్ కమ్ మీన్స్ అనే ఫెలోషిప్ రావడం. సాధారణంగా ఇటువంటివి టాపర్స్‌కి ఇస్తారు. అయితే మా బ్యాచ్‌లో అందరూ ఆర్థికంగా ఉన్నవాళ్లు. దాంతో వాళ్లెవరూ దరఖాస్తు చేసుకోలేదు. అలా నాకు వచ్చింది. 'ఉన్నతవిద్యలో సమానావకాశాలు' అనే అంశంపై పిహెచ్‌డి చేస్తున్నాను. ఇప్పుడు మూడో సంవత్సరం. ఫెలోషిప్ డబ్బుతో ల్యాప్‌టాప్ కొన్నాను. ఇంటర్నెట్‌లో బ్రౌజ్ చేస్తుండగా కనిపించిన అవకాశాలకు దరఖాస్తు చేశాను.

ఫిలిప్పీన్స్, సైప్రస్‌లలో సెమినార్లలో పాల్గొనేందుకు ఎంపికయ్యాను. కాని వాళ్లు స్పాన్సర్ చేయలేదు. సొంత ఖర్చులంటే నాకు కష్టం. అందుకని ఆ అవకాశాలు వదులుకున్నాను. జర్మనీలోని బెర్లిన్ యూనివర్శిటీలో 'సెంటర్ ఫర్ సొసైటీ అండ్ టెక్నాలజీ' డిపార్టుమెంట్ వాళ్లు నిర్వహిస్తున్న సదస్సుకు మాత్రం వాళ్లే అన్ని ఖర్చులు భరిస్తూ నన్ను సెలెక్ట్ చేశారు. ఇందులో పాల్గొనడం కోసం ఈ నెల 28 న బయల్దేరుతున్నాను. 'ప్రపంచీకరణ వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా రవాణా వ్యవస్థ దెబ్బతిన్న తీరు'పై పేపర్ సమర్పిస్తున్నాను.

అదృష్టం కూడా తోడ్పడింది

ఈ యూనివర్శిటీ గొప్పతనం గురించి మా వాళ్లకేమీ తెలియదు. ఆ మధ్య 'జర్మనీ వెళ్తున్నాను' అంటే జపాన్‌కా అని అడిగారు. ఆ... అదే అన్నాను. వాళ్లకి అమెరికా, జపాన్ తప్ప వేరే దేశాలు తెలియదు. ఎక్కువసార్లు వినడం వల్ల అమెరికా పేరు, రేడియోలు, ట్రాన్సిస్టర్‌ల వంటివాటివల్ల జపాన్ పేరు వాళ్లకు తెలుసు. నాకు వస్తున్న ఫెలోషిప్ నుంచి కూడబెట్టి ఒకసారి అమ్మా నాన్నల్ని విమానం ఎక్కించి తిరుపతి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను.

నా దగ్గర ఒక వారం రోజులు ఉంచుకుని హైదరాబాద్ అంతా తిప్పి చూపించాను. నాన్నకి 70, అమ్మకి 65 యేళ్లు ఉంటాయి. వాళ్ల కళ్లలో కనిపించిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. బాగా స్థిరపడిన తరువాత వాళ్లని తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకుంటాను. నేనేది అడిగినా కాదనలేదు. బహుశా నా ఆలోచనలకు వాళ్లిచ్చిన స్వేచ్ఛే నన్ను ఇంతటి వాడ్ని చేసింది కాబోలు. వీటన్నిటితో పాటు నా జీవితంలో అదృష్టం ప్రధాన పాత్ర పోషించింది. ఈ స్థాయికి చేరుకోవడానికి తెల్లవారుఝామునే లేచి చదవడం, విపరీతంగా కష్టపడడం వంటివి చేయలేదు.

కాని చదువుకుంటేనే బతకగలను అనుకున్నాను. 'చదువు దారి మరిచావో... గొర్రెలు కాయాల్సిందే' అనే విషయం హెచ్చరికలా నా బుర్రలో తిరుగుతుండేది. అదే నాలో పట్టుదలని పెంచింది. ఆంగ్లంలో పట్టు సాధించడం కోసం తెలుగు సినిమాలు, చానళ్లు చూడడం మానేశాను. చూసినా, చదివినా అంతా ఇంగ్లీషే. అంత స్ట్రిక్ట్‌గా నా చుట్టూ ఆంగ్ల ప్రపంచాన్ని నిర్మించుకున్నాను.

భవిష్యత్తు కళ్లముందు కనిపించినప్పుడే దేన్నయినా సీరియస్‌గా తీసుకుంటాం. లేకపోతే నేనీ స్థాయికి వచ్చే వాడినా చెప్పండి. 'వాటీజ్ యువర్ నేమ్?' అని అడగడానికే కాళ్లు చేతులు వణికిపోయేవి. అలాంటి నేను ఇప్పటికే మూడు నాలుగుసార్లు స్టేజి ప్రెజెంటేషన్ ఇచ్చాను.''
 
- కిరణ్మయి
ఫోటోలు: మునావర్‌ఖాన్