చేకూరి గౌతమరాజు

చేకూరి గౌతమరాజు
Facebook

Sunday, March 4, 2012

ఇంటెలిజెంటిల్మన్ - '' వికీలీక్స్ '' జూలియన్ అసాంజ్!

 http://static.guim.co.uk/sys-images/Guardian/Pix/pictures/2010/7/13/1279027004021/Julian-Assange-007.jpg
రహస్యం ఉన్న చోట వ్యూహం ఉంటుంది.
వ్యూహం వెనుక కుట్ర, కుతంత్రం ఉంటాయి.
ఇవన్నీ ఉన్నచోట... చీకటిగా ఉంటుంది.
చీకట్లోకి చిన్న పిల్లవాడు వెళ్లినట్లు వెళ్లి....
టార్చ్‌లైట్ వేస్తాడు జూలియన్ అసాంజ్!
రహస్యం బట్టబయలు అవుతుంది.
అసాంజ్ కోసం ‘హంట్’ మొదలౌతుంది.
ఎవరీ అసాంజ్?
రెండేళ్ల క్రితం ఎవడు కేబుల్ పట్టుకుని లాగితే అమెరికా డొంకంతా కదిలిందో ఆడే... అసాంజ్!
రెండేళ్లుగా ఎవడిని బుక్ చేయాలని అమెరికా ట్రయ్ చేస్తోందో ఆడే... అసాంజ్!
అసాంజ్... మోస్ట్ ఇంటెలిజెంట్.
మోస్ట్ వాంటెడ్.
అందుకే ఇదతడి బయోగ్రఫీ!


జూలియన్ అసాంజ్!
జుట్టుకి కొద్దిగా ఎరుపు, నలుపు కలిపి రంగేస్తే - ‘అతిథి’ సినిమాలో హీరో మహేశ్‌బాబులా ఉంటాడు.
మహేశ్‌బాబు! జుట్టుకి తేలికపాటి గోధుమ రంగేసి, వెంట్రుకల్ని గాలికి వదిలేస్తే వికీలీక్స్ హీరో అసాంజ్‌లా ఉంటాడు.
ఏమిటి వీళ్లద్దరికీ పోలిక? ఏం లేదు.
అసాంజ్ బర్త్ ప్లేస్ ఆస్ట్రేలియా. ఇప్పుడు లండన్‌లో బెయిల్‌పై తిరుగుతున్నాడు.
మహేశ్‌ది హైదరాబాద్. ఇప్పుడు ఏ షూటింగ్‌లోనో -‘హట్ సాలే’- అంటూ ఎవర్నో తరుముతూ ఉండి వుంటాడు!
పోలిక లేదు అంటే అసలే లేదని కాదు. మహేశ్‌బాబు స్క్రీన్ వెర్షన్‌కి... క్రీమ్ వెర్షన్ అసాంజ్.
‘‘ముంబైని (..బీప్..) పోయించడానికి వచ్చా’’ నంటాడు మహేశ్‌బాబు ‘బిజినెస్‌మేన్’ చిత్రంలో.
అమెరికా చేత ఇప్పుడు అదే పని చేయిస్తున్నాడు అసాంజ్!
నలభై ఏళ్ల అసాంజ్... కుర్రాడిలా ఉంటాడు. స్లిమ్‌గా ఉంటాడు. ఒక్కోసారి -ప్రత్యేకమైన హెయిర్ స్టెయిల్‌లో - ఆడపిల్లలా ఉంటాడు! ఫ్రెండ్లీగా నవ్వుతాడు. బ్లాక్ సూట్, రెడ్ టై, నల్ల కళ్లద్దాలు. ఇదీ అతడి అప్పియరెన్స్.
హాండ్సమ్ ఇంటెలిజెంటిల్మన్!
ఇంటర్నేషనల్ పోలీసుల పరిభాషలో - ది మోస్ట్ డేంజరస్ మేన్ ఇన్ ది వరల్డ్.
http://resources0.news.com.au/images/2011/01/14/1225988/009564-julian_assange.jpg
********

అసాంజ్... మీడియా పర్సన్.
మీడియా పర్సన్ అంటే మామూలు పర్సన్. ప్రజల వైపు ఉంటూ పొలిటీషియన్ల వెంట, సెలబ్రిటీల వెంట పడే పర్సన్. కొంపలు మునిగిపోతున్న చోటుకు, కొంపలు కొల్లేరవుతున్న చోటుకు పరిగెత్తే పర్సన్.
కానీ ఇప్పుడు - మీడియానే అసాంజ్ వెంట పడుతోంది. అసాంజ్ కారొచ్చి ఆగి, డోర్ తెరుచుకోగానే వందల కెమెరాలు క్లిక్ మంటున్నాయి. గన్‌మైక్‌లు ఆయన నోటి దగ్గరకు వస్తున్నాయి. ‘‘మిస్టర్ అసాంజ్, తర్వాత మీరెవర్ని (...బీప్...) పోయించబోతున్నారు’’ అన్నది రెగ్యులర్ క్వొశ్చన్.
నవ్వుతాడు అసాంజ్. ‘‘అలాంటిదేమీ నా ధ్యేయం కాదు. గవర్నమెంట్‌లో ఏం జరుగుతున్నదీ ప్రజలకు తెలియాలి. వాళ్లకు తెలియకుండా ఏదీ దాగడానికి లేదు. దాగితే లాగుతాను. అది నా పౌరధర్మం’’ అంటాడు అసాంజ్!
అసాంజ్‌ను ఫాలో అయ్యే వారిలో మీడియా మనుషులు మాత్రమే ఉండరు. వారి మధ్యలోనో, ముందో వెనకో అమెరికన్ గూఢచారులు ఉంటారు. అసాంజ్ ఆ వేళ ఏమని అన్నాడో అది మాత్రమే కాకుండా, అతడు అనుకున్నదీ, అనుకోబోతున్నది కూడా ఒబామా కార్యాలయానికి వారు చేరవేస్తుంటారు.
అసాంజ్ సొంత సంస్థ ‘వికీలీక్స్’. ఆ సంస్థకి ప్రతి దేశంలోనూ అజ్ఞాతంగా ఒక ‘అడ్డా’ ఉంటుంది. అంతకన్నా అజ్ఞాతంగా ఆ అడ్డాపై అమెరికా గద్దలు ఎగురుతుంటాయి. అసాంజ్ ఏ తీగలను లాగబోతున్నాడో ఆ తీగలను అవి ముక్కుకు తగిలించుకుని వైట్‌హౌస్‌లో వాలిపోతాయి. అది వాటి డ్యూటీ. డొంకంతా కదలకుండా అమెరికా జాగ్రత్త పడుతుంది.
వాషింగ్టన్‌లో వేలు పెట్టేవారిని, పెంటగాన్ ‘వన్ వే’కి కాళ్లడ్డు పెట్టేవారిని అమెరికా సహించదు. మొదటి తప్పు కింద వదిలేయదు. ప్రజల్లోంచి తప్పిస్తుంది. లేదంటే ప్రాణాలనే తప్పించేస్తుంది!
ఒసామా బిన్ లాడెన్ (సౌదీ అరేబియా), మువమ్మర్ గడాఫీ (లిబియా), సద్దాం హుస్సేన్ (ఇరాక్), ప్రిన్స్ నరోదమ్ సిహనౌక్ (కాంబోడియా), సాల్వెడార్ అలెండీ (చిలీ), రాఫెల్ ట్రుజిల్లో (డొమినికన్ రిపబ్లిక్), పాట్రిస్ లుముంబా (కాంగో), అక్మడ్ సుకర్నో (ఇండోనేషియా).... పదవులు, ప్రాణాలు కోల్పోయినవారి లిస్ట్ ఇది.
అమెరికా హిట్-లిస్ట్‌లో ఫ్రెష్‌గా ఇప్పుడున్న పేరు అసాంజ్!
జూలియన్ పాల్ అసాంజ్. 

http://www.youthkiawaaz.com/wp-content/uploads/2010/12/Wikileaks-Assange.jpg
అమెరికా నిఘా సంస్థ ‘సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ’ (సి.ఐ.ఎ.) లెక్క ప్రకారం - అణుబాంబులు కూడబెట్టుకుంటున్న ఇరాన్ కన్నా ప్రమాదకరమైనవాడు అసాంజ్. అమెరికా చేత దశాబ్దాలుగా అట్లాంటిక్ మహాసముద్రపు జలాలను తాగిస్తున్న క్యూబా నేత ఫిడేల్ కాస్ట్రో కన్నా మొండివాడు అసాంజ్. అమెరికా అసలు రంగును బయటపెట్టే రహస్య పత్రాలను ఎలా సంపాదించాడో గానీ సంపాదించాడు అసాంజ్. వాటిని ఒకటొకటిగా ప్రపంచానికి లీక్ చేస్తున్నాడు! రెండేళ్లుగా ఇదే పని.
అతడిని ఏం చెయ్యాలి? అతడి పీడ ఎలా వదిలించుకోవాలి? అమెరికా ఆలోచిస్తోంది? ఆ ఆలోచనను కూడా లీక్ చేశాడు అసాంజ్!
అమెరికా మళ్లీ ఒకసారి విలన్ అయింది. అసాంజ్ ఆల్ టైమ్ హీరో అయ్యాడు!
********

‘‘నా మీద నియో-మెకార్తినిస్ట్ విచ్-హంట్ మొదలైంది’’.
రెండ్రోజుల క్రితం లండన్‌లో అమెరికా మీద అసాంజ్ పేల్చి బాంబు ఇది! అదే నిజమైతే - అసాంజ్ పని ఇవాళో రేపో ఆఖరు!
1950లలో అమెరికాలో జోసెఫ్ మెకార్తి అనే రిపబ్లికన్ సెనెటర్ ఉండేవాడు. డేంజరస్ ఫెలో! తనకు గిట్టని వాళ్లపై ‘కమ్యూనిస్టు’ అనే ముద్ర వేసేవాడు. తర్వాత ఆ ‘కమ్యూనిస్టు’ బతుకు దుర్భరమైపోయేది! రాజకీయంగా, సామాజికంగా, అసలు మనిషిగానే అడ్రస్ లేకుండా పోయేవాడు. అలా ఆ ‘మహనీయుడి’ పేరు మీదుగా వచ్చిందే మోకార్తినిస్ట్ విచ్-హంట్ అనే మాట! ఇప్పటికీ మన పల్లెల్లో ‘మంత్రగాళ్లు’ కొందరు హతమౌతున్నట్లు... అప్పట్లో ‘కమ్యూనిస్టులు’ కొందరు అమెరికాలో నైతికంగా హతమయ్యేవారు. మెకార్తినిస్ట్ డెరైక్టుగా పొడిచేవాడు కాదు, నరికేవాడు కాదు, చంపేవాడు కాదు. ‘వాడు కమ్యూనిస్టు’ అని ఎవరి గురించో ఎవరి చెవిలోనో ఊదేవాడు. ఆ ఊదుడే తర్వాత్తర్వాత అడవి మంటై అంటుకునేది. ఇప్పుడు తనపై అలాంటి ప్రయత్నాలే జరుగుతున్నాయని అసాంజ్ సాక్ష్యాధారాలు చూపించాడు. అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేశాడు.
అసాంజ్ దగ్గర పూచిక పుల్లకు, పుల్ల విరుపుకు కూడా ప్రూఫ్‌లు ఉంటాయి. తనపై జరుగుతున్న కుట్రకూ అతడి దగ్గర ప్రూఫ్‌లు ఉన్నాయి. టెక్సాస్‌లోని స్ట్రాట్‌ఫర్ అనే ప్రైవేటు నిఘా సంస్థ నుంచి అత్యున్నత స్థాయి అమెరికన్ అధికారులకు అందిన మూడు ఇ-మెయిల్స్‌ను బట్టి తనను అంతమొందించేందుకు గత పన్నెండు నెలలుగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్పష్టమయిందని అసాంజ్ ప్రకటించాడు. ఆ వివరాలను బైటపెట్టాడు.

http://tundratabloids.com/wp-content/uploads/2010/11/julian-assange-wikileaks.jpg
స్ట్రాట్‌ఫర్ సంస్థలోని ‘కౌంటర్ టైజం అండ్ కార్పోరేట్ సెక్యూరిటీ’ విభాగానికి ప్రస్తుతం వైస్-ప్రెసిడెంట్‌గా ఉన్న ఫ్రెడ్ బర్టన్ అనే పెద్దమనిషి గతంలో కొన్నాళ్లు అమెరికా విదేశీ వ్యవహారాల శాఖకు (డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్స్) డిప్యూటీ చీఫ్‌గా ఉన్నారు. అక్కడి నుంచి స్ట్రాట్‌ఫర్‌కు వచ్చాక ఆయన పేరు మీద వెళ్లిన మూడు ఇ-మెయిళ్లలో అసాంజ్ ప్రస్తావన ఉంది. వాటిని వాటి ఐడీలతో సహా అసాంజ్ సంపాదించాడు!
మొదటి మెయిలు ఐ.డి. నెంబరు 1056988. తేదీ 7 డిసెంబర్ 2010.
సారాంశం: ‘‘అసాంజ్ త్వరలోనే కారాగారానికి నవ వరుడు కాబోతున్నాడు. ఈ టైస్టును తగిన రీతిలో (...బీప్....) చాలి. ఇక ఎప్పటికీ వాడికి చిప్పకూడే గతి’’.
రెండో మెయిలు ఐ.డి. 373862. తేదీ 17 డిసెంబర్ 2010.
సారాంశం: ‘‘అసాంజ్‌ను ఒక నేరస్థుడిగా యు.ఎస్.కి అప్పగించే విషయమై ఇంతక్రితమే స్కై న్యూస్ అధికారులతో మాట్లాడాను. త్వరలోనే అతడిని ఇక్కడికి తెప్పించే అవకాశాలున్నాయి.
మూడో మెయిలు ఐ.డి. నెంబరు 375123. తేదీ 26 జనవరి 2011.
సారాంశం: ‘‘బయటికి పొక్కకూడని రహస్యమిది. అసాంజ్‌ను నేరస్థుడిగా నిర్థారించిన అధికారిక సమాచారం మన దగ్గర ఉంది’’.
********
http://www.tubu.in/wp-content/uploads/2011/11/Julian+Assange+Appears+Court+Extradition+Hearing.jpg
ఈ మూడూ ఏ మూలకీ?!
అమెరికా బెదర్లేదు. బెదురుతుందనీ అసాంజ్ కూడా అనుకోలేదు. అమెరికా విరోధ చరిత్రలో అన్నీ రహస్య విచారణలే. అన్నీ రహస్య తీర్పులే. అన్నీ రహస్య శిక్షలే. అతడికి ఆ సంగతి తెలుసు.
‘‘యు.ఎస్. అటార్నీ జనరల్ ఎరిక్ హోల్డర్ ఏడాదిగా వికీలీక్స్ మీద రహస్యంగా విచారణ జరిపిస్తున్నాడు. అమెరికా టాప్ మోస్ట్ న్యాయాధికారి అతడు. కానీ అలా లేడు. మెకార్తీ వారసుడిలా ఉన్నాడు. రహస్య న్యాయం, అసలు న్యాయమే కాదని అమెరికా దేశ చరిత్ర చదివిన ఏ విద్యార్థికైనా తెలుస్తుంది. న్యాయం జరుగుతున్నట్లు కనిపించాలి. కనిపించేలా జరగాలి. తీర్పనేది ప్రజల ఆమోదంతో చట్టబద్ధమైన ఆధికారం పొందిన న్యాయమూర్తి నుంచి వెలువడాలి. ఎరిక్ హోల్డర్ ప్రెస్ సెక్రెటరీ నుంచి కాదు. అమెరికాను న్యాయంగా డొక్కలో కుమ్మిన ఏ ప్రచురణకర్తకూ కొమ్ములుండేందుకు లేదన్నదే ఎరిక్ న్యాయంలా ఉంది. వెంటనే అతడు దిగిపోవాలి. లేదా కేసు ఇంకొకరి అప్పగించాలి. అతడింకా కొనసాగితే ఒబామా పాలనలో డెమోక్రాట్‌లకు గానీ, రిపబ్లికన్‌లకు గానీ ‘నిజం చెప్పే హక్కు’పై నమ్మకం లేదనే అనుకోవాలి’’ అంటున్నాడు అసాంజ్.

ఇది అసాంజ్ లేటెస్ట్ స్టేట్‌మెంట్. ఇంకో స్టేట్‌మెంట్ ఇచ్చే లోపు అమెరికా అతడిని జైల్లో పెట్టకుండా ఉంటుందా? డౌటే.

ఫ్రెడ్ బర్టన్ పంపిన మెయిళ్లు మాత్రమే కాదు, అమెరికా వేసిన జుట్టు ముడుల గుట్టుమట్లను బయటపెట్టే మెయిళ్ల కుప్పలు అసాంజ్ దగ్గర యాభై లక్షలకు పైగానే ఉన్నాయి!! వాటిని ఈవారం నుంచి వికీలీక్స్ ఒకటొకటిగా బైట పెట్టబోతోంది. ఇక అసాంజ్‌ను కాపాడేదెవరు?
‘‘న్యాయం’’ అంటాడు అసాంజ్!
అసాంజ్‌తో పోలిస్తే ఒసామా బిన్ లాడెన్ ఇప్పుడెంతో మంచివాడుగా కనిపిస్తూ ఉండాలి అగ్రరాజ్యానికి! ‘మే హిజ్ సోల్ రెస్ట్ ఇన్ పీస్’ అని కూడా అనుకుంటుందేమో అమెరికా!
అమెరికా కట్టుకున్న రెండు శిఖరాలను మాత్రమే కూల్చేశాడు లాడెన్. కానీ అసాంజ్ ఏకంగా ఆ దేశం నిర్మించుకున్న కుటిల సామ్రాజ్యవాద రాజనీతి కలల సౌధాన్నే ధ్వంసం చేశాడు! అసాంజ్ ధాటికి... తిరిగి నిర్మించుకోలేనంతగా అమెరికా దౌత్య ప్రతిష్ట కుప్పకూలింది.
చరిత్రలో మునుపెన్నడూ అమెరికా భవిష్యత్తుపై ఇంత పెద్ద దాడి కొనసాగలేదు!! తన దాడులు ఇక్కడితో ఆగిపోతాయన్న నమ్మకాన్ని కూడా అసాంజ్ మిగలనివ్వడంలేదు. రెండేళ్లుగా అతడు అమెరికాతో యుద్ధం చేస్తున్నాడు.
http://www.infowars.com/wp-content/uploads/2012/01/Julian_Assange.jpg
ఒక మనిషి ఒక దేశం పై చేస్తున్న యుద్ధం ఇది!
యాభై రాష్ట్రాలు కలిసిందే అమెరికా. ఆ మాటను అసాంజ్ ఒప్పుకోడు. రెండు నాలుకలకు, రెండు నీతులకు పుట్టిందే అమెరికా అంటాడు. మొదటిసారి అమెరికాపై అతడు గన్ పేల్చింది 2010లో. ఇరాక్, ఆప్ఘనిస్థాన్ యుద్ధాలలో అమెరికా ప్రమేయం ఉందని నిరూపించే డాక్యుమెంట్‌లను ఆ ఏడాది నవంబర్‌లో అతడు బయట పెట్టినప్పుడు యుద్ధవిమానాలేవో పెద్ద ధ్వనితో తన గగన తలంపై చక్కర్లు కొట్టినట్లు చెవులు మూసుకుని, కళ్లు తేలేసింది అమెరికా. ఐదు పత్రికలు... డెర్ స్పైగల్, ది న్యూయార్క్ టైమ్స్, లె మాండె, ది గార్డిన్, ఎల్ పైస్... వికీలీక్స్ విడుదల చేసిన ఆధారాలను ప్రచురించగానే అగ్రరాజ్యానికి చెమటలు పట్టాయి.

నాటి నుంచి నేటి వరకు అమెరికా దుర్బుద్ధిని బైట పెట్టే రహస్య పత్రాలను విడతలవారీగా విడుదల చేస్తూనే ఉన్నాడు అసాంజ్. హిల్లరీ క్లింటన్ కూడా నాటి నుంచి నేటి వరకు ఇంటింటికీ తిరిగి అసాంజ్ ఎంత పనికిమాలిన మనిషో చెబుతూ వస్తున్నారు. అమెరికా విదేశాంగ మంత్రిగా అది ఆమె బాధ్యత అనుకున్నా, అసాంజ్ చేస్తున్నది మాత్రం ఆకతాయి పని కానే కాదని ఇప్పటికే ప్రపంచానికి స్పష్టమయింది. అమెరికా ఏ దేశాలకు ఎలా ముడులు వేస్తున్నదీ, ఏ దేశాలను బుజ్జగిస్తున్నదీ, ఏ దేశాలకు జడుస్తున్నదీ వెల్లడయ్యే రహస్య పత్రాలను అసాంజ్ సంపాదించాడు. వాటినే ఇప్పుడు కొద్దికొద్దిగా లీక్ చేస్తున్నాడు. న్యూఢిల్లీలోని అమెరికన్ దౌత్యవేత్తలు వాషింగ్టన్‌కు పంపిన నాలుగు వేల పత్రాలు కూడా అసాంజ్ దగ్గర ఉన్నాయి. వాటిల్లో అణుఒప్పందపు నిజాలున్నాయి! అవి గనక పేలితే... యు.పి.ఎ. గవర్నమెంట్ గల్లంతే!
********


వికీలీక్స్ వెబ్‌సైట్ 2006లో మొదలైంది. అంతకు ముందు అసాంజే కంప్యూటర్ ప్రోగ్రామర్. హ్యాకర్ కూడా. ఫిజిక్స్, మేథ్స్ అతడి సబ్జెక్టులు. పత్రికా స్వాతంత్య్రం, సమాచార హక్కు, ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్... అతడి బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్. సైట్‌లను పట్టి ముప్పుతిప్పలు పెట్టడం అసాంజ్ సరదా. అతడి మాటలు, రాతలు చురుగ్గా ఉంటాయి. వికీలీక్స్ పెట్టాక అతడికి మూడు జర్నలిజం అవార్డులు వచ్చాయి! కెన్యాలో అమాయక పౌరుల ఊచకోత, ఆఫ్రికా తీరం వెంబడి పేరుకుపోతున్న వ్యర్థ రసాయనాలు, గ్వాంటనామో జైలు దుర్భర పరిస్థితుల వెనుక అమెరికా అమానుష విధానాలు, పెద్దపెద్ద బ్యాంకుల అవకతవకలు... వీటన్నిటినీ రూఢీ పరిచే పత్రాలను సంపాదించి, తన సైట్‌లో పెట్టి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అసాంజ్ సడెన్‌గా ఒకరోజు - 2010 నవంబర్ 28న - ఆఫ్ఘాన్, ఇరాక్ యుద్ధాలలో అమెరికా కుతంత్రాలను వెల్లడించే సమాచారాన్ని లీక్ చేయడంతో ప్రపంచం నివ్వెరపోయింది. అమెరికా దిమ్మెరపోయింది. నిన్నమొన్నటి వరకు నిద్రలోనూ అమెరికాను వెంటాడిన లాడెన్ స్థానంలోకి అసాంజ్ వచ్చాడు. ఇప్పుడు లాడెన్ లేడు. అసాంజ్ ఉన్నాడు. అసాంజ్‌పై అగ్రరాజ్యానికి గొంతువరకు ఉంది. అతడి మీద కేసులు బనాయించి తగిన బుద్ధి చెప్పేందుకు అమెరికా విదేశాంగ శాఖ కసరత్తు మొదలు పెట్టినట్లు తాజాగా ఈ-మెయిళ్లతో స్పష్టం అయింది.

********

అసాంజ్ తొలిసారిగా తన పదహారవ యేట 1987లో ‘మెండాక్స్’ పేరుతో హ్యాకింగ్ మొద లు పెట్టాడు. మెండాక్స్ అంటే ‘పరమ పావన అవిశ్వాసం’ అనే అర్థం ఉంది. కొన్నాళ్లకు అసాంజ్‌కి మరో ఇద్దరు హ్యాకర్లు తోడయ్యారు. సైట్‌లకు నష్టం కలిగించకుండా వాటిని హ్యాక్ చేసి సమాచారం రాబట్టేవారు ఈ మిత్రబృందం. ఆస్ట్రేలియా యూనివర్శిటీ, నార్టెల్ టెలీకమ్యునికేషన్ కంపెనీ, ఇతర సంస్థల కంప్యూటర్‌లలోని సమాచారాన్ని మోడెమ్ ద్వారా సంగ్రహిస్తున్న సమయంలో 1991లో పోలీసులు మెల్‌బోర్న్‌లోని అసాంజ్ ఇంటిపై దాడి చేశారు. అతడిపై ఇరవై నాలుగు కేసులు బనాయించి, ‘ఇకపై మంచి ప్రవర్తనను కలిగి వుంటాను’ అనే హామీపై వదిలిపెట్టారు.


‘‘ఈ అబ్బాయి తెలివితేటలు చూస్తుంటే ముచ్చటేస్తోంది’’ అని ప్రాసిక్యూటర్ అన్నారట!
క్వీన్స్‌లాండ్‌లోని టౌన్స్‌విల్లేలో పుట్టి, మాగ్నెటిక్ ఐలండ్‌లో పెరిగాడు అసాంజ్. అతడి తల్లిదండ్రులకు టూరింగ్ టాకీస్ ఉండేది. సినిమాలు ప్రదర్శిస్తూ ఊర్లు ఊర్లు తిరిగేది వారి కుటుంబం. తల్లి క్రిస్టీన్ భర్తతో విడిపోయి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఆమె రెండో భర్త సంగీతకారుడు. వారికొక కొడుకు పుట్టాక 1982లో క్రిస్టీన్ అతడితో కూడా విడిపోయి, ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఐదేళ్లపాటు ఎవరికీ కనిపించకుండా పోయారు. తన కొడుకును తనకు ఇప్పించమని ఆమె రెండో భర్త కోర్టుకు వెళ్లడమే ఆమె అజ్ఞాత జీవితానికి కారణం. దీంతో అసాంజ్ ఎక్కడా స్థిరంగా చదవలేకపోయాడు. స్కూలు నుంచి స్కూలుకు, ఊరు నుంచి ఊరుకు మారాడు. కొన్నాళ్లు ఇంట్లోనే చదువుకున్నాడు. డిగ్రీలోనూ యూనివర్శిటీలు మారాడు. చదువు కోసం దాదాపు ఆస్ట్రేలియా అంతా తిరిగాడు.

తల్లికి వచ్చిన సమస్యలే అసాంజ్‌కీ వచ్చాయి! అసాంజ్ తల్లి తనకు రెండో భర్త ద్వారా కలిగిన బిడ్డ కోసం కోర్టుల చుట్టూ తిరిగారు. చివరికి అతడి నుంచి పిల్లల్ని దాచేశారు. అదే సమస్య అసాంజ్‌కూ వచ్చింది. ప్రియురాలి వల్ల తనకు కలిగిన కుమారుడిని దక్కించుకునేందుకు అతడు న్యాయపోరాటం చేయవలసి వచ్చింది. అసాంజ్ నుండి విడిపోతూ అ అమ్మాయి తన బిడ్డను తనకు ఇప్పించమని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ రెండు అనుభవాల అనంతరం అసాంజ్ తన తల్లితో కలిసి... ఆస్ట్రేలియాలో బిడ్డల సంరక్షణ చట్టాలకు సంబంధించిన డేటాబ్యాంక్ (సమాచార నిధి) ఏర్పరిచాడు. సమాచారం అందుబాటులో లేని సమాజం అంధకారంలో ఉన్నట్లేనని అసాంజ్ అంటాడు.


అసాంజ్‌కు ఏడాది వయసున్నప్పుడు అతడి తండ్రి జాన్ షిప్టన్...క్రిస్టీన్‌తో తెగతెంపులు చేసుకుని వెళ్లాడు. క్రిస్టీన్ బ్రెట్ అసాంజ్‌ను చేసుకున్నాక అసాంజ్ అతడి దగ్గరే పెరిగాడు. అసాంజ్ తొలిసారిగా తన తండ్రి జాన్ షిప్టన్‌ను చూసింది తన ఇరవై ఐదవయేట!


‘వికీలీక్స్’ సంస్థను రిజిస్టర్ చేయించేటప్పుడు తన బయోడేటాలో అసాంజ్ తన పేరు కింద సన్నాఫ్ అనే చోట... ఈ ఇద్దరు తండ్రుల పేర్లూ పొందుపరిచాడు! రహస్యాలు లేని సమాజం కోసం పోరాడేందుకు అసాంజ్‌కు ఇంతకుమించి ఉండవలసిన అర్హత ఏముంటుంది?

http://mysticmedusa.com/wp-content/uploads/2010/12/433-bw20101129180417.embedded.prod_affiliate.77.jpg
జూలియన్ పాల్ అసాంజ్
‘వికీలీక్స్’ సంస్థ చీఫ్

జననం : 3 జూలై 1971
జన్మస్థలం : టౌన్స్‌విల్లే, క్వీన్స్‌లాండ్ (ఆస్ట్రేలియా)
తల్లిదండ్రులు : జాన్ షిప్టన్ (కన్నతండ్రి),
{బెట్ అసాంజ్ (మారుతండ్రి), తల్లి క్రిస్టీన్
చదువు : గూల్‌మాంగర్ ప్రైమరీ స్కూల్ (1979-1983), న్యూ సౌత్‌వేల్స్
మారిన స్కూళ్లు : 50 పట్టణాలలో 37 స్కూళ్లు!
కారణం : తల్లిదండ్రులు ఉపాధి కోసం ఊళ్లు మారడం.
డిగ్రీ : యూనివ ర్శిటీ ఆఫ్ మెల్‌బోర్న్,యూనివర్శిటీ ఆఫ్ కాన్‌బెర్రా (2002-2005)
భార్య : తెరెస్సా ( కుమారుడు డానియల్ )
ప్రతిష్ట : డేర్ డెవిల్ జర్నలిస్టుగా.
ప్రమాదం : అమెరికా నుంచి తక్షణ ప్రాణాపాయం.

నో సీక్రెట్స్ ప్లీజ్: అసాంజ్


అసాంజ్ ఆస్ట్రేలియా జాతీయుడు. జర్నలిస్టు. పబ్లిషర్. ఇంటర్‌నెట్ వ్యవహారాలలో ఆరితేరినవాడు. అగ్రరాజ్య అక్రమాలను ఎలుగెత్తి చాటుతున్న ‘వికీలిక్స్’ సంస్థకు ఎడిటర్ కమ్ ఛైర్మన్. దేశాలు తిరగడ ం అతడి హాబీ. దేశాల రహస్యాలు సేకరించి తన ప్రాణాలతో తనే చెలగాటమాడుకోవడం కూడా ఆ హాబీలో భాగమే. ఎందుకిదంతా అంటే - సీక్రెట్స్ లేని స్వచ్ఛమైన ప్రపంచం కోసం అంటాడు! అత్యంత ప్రమాదకరమైన అమెరికా దౌత్య వ్యూహాల తాలూకు తొలి విడత అధికార పత్రాలు 2010 నవంబర్ చివరి వారంలో వికీలీక్స్‌లో ప్రత్యక్షం కాగానే అసాంజ్ కోసం వేట మొదలైంది! ఎక్కడ దొరికితే అక్కడ అతడిని అరెస్ట్ చేసేందుకు ఇంటర్‌పోల్ ‘రెడ్ కార్నర్’ నోటీసు జారీ చేసింది. తనను అంతమొందించడం కోసం కుట్ర జరుగుతోందని అప్పట్లోనే ‘గార్డియన్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించాడు అసాంజ్. తర్వాత వారం రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లాడు. 2010 డిసెంబర్ 7 లండన్ మెట్రోపాలిటన్ పోలీసులకు లొంగిపోయాడు. అతడొచ్చి లొంగిపోలేదు, మేమే అతడిని పట్టుకున్నాం అని బ్రిటన్ ప్రకటించింది! 
http://resources1.news.com.au/images/2010/12/07/1225967/248677-wikileaks-founder-julian-assange.jpg
అరెస్ట్ చేశాక అసాంజ్‌ను వాండ్స్‌వర్త్ జైల్లో పెట్టారు. పదిరోజుల్లో బెయిల్ సంపాదించాడు. ప్రస్తుతం అతడు ఇంగ్లండ్ నార్‌ఫోక్‌లోని ఎల్లింగ్‌హామ్ హాల్లో ఉంటున్నాడు. ఆ హాల్లో ఒక ఎలక్ట్రానిక్ టాగ్‌ను బిగించారు. అందులోంచి అసాంజ్ రోజూ పోలీస్‌స్టేషన్‌లో అటెండెన్స్ వేయించుకునే ఏర్పాటు చేశారు. ఒక ‘అత్యాచారం’ కేసులో స్వీడన్‌కి అప్పగించే విషయమై అతడిపై కోర్టులో కేసు నడుస్తోంది. జడ్జ్‌మెంట్ కోసం అసాంజ్ ఎదురు చూడ్డం లేదు. జడ్జ్‌మెంట్‌ను ప్రభావితం చేసే ఫైళ్లను, ఈమెయిళ్లను సంపాదించే పనిలో ఉన్నాడు! వికీలీక్స్ సంస్థకు అదేమంత పెద్ద పని కాకపోవచ్చు.http://lazyoptimist.files.wordpress.com/2011/11/julian-assange-wikileaks-ceo.jpg
అవార్డులు
ఎకానమిస్ట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అవార్డ్ (2008)

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ యు.కె. మీడియా అవార్డ్ (2009)


లె మాండే పర్సన్ ఆఫ్ ది ఇయర్ (2010)


సిడ్నీ పీస్ ఫౌండేషన్ గోల్డ్ మెడల్ (2011)


వోల్టేర్ అవార్డ్ ఆఫ్ ది విక్టోరియన్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్ (2011)


వాక్‌లేస్ అవార్డ్ ఫర్ అవుట్‌స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఫర్ జర్నలిజం (2011)


వీటితో పాటు... 2011 నోబెల్ పీస్ ప్రైజ్‌కు నార్వే ఎం.పి. స్నార్ వాలెన్ ప్రతిపాదన.

- సాక్షి ఫ్యామిలీ

No comments:

Post a Comment