చేకూరి గౌతమరాజు

చేకూరి గౌతమరాజు
Facebook
Showing posts with label కొన్ని సంగతులు. Show all posts
Showing posts with label కొన్ని సంగతులు. Show all posts

Wednesday, September 8, 2010

ఆస్టేలియా .. కొంచెం అసూయ ... కొంచెం చిన్నచూపు ...

కంగారూ..క్రికెట్..ఈ రెండు పేర్లు చెప్పగానే ఎవరికైనా టక్కున గుర్తొచ్చేది ఆస్ట్రేలియా. ఇండియాకు కాస్త దగ్గరగా..అమెరికా తర్వాత మన యూత్‌కి గమ్య స్థానంగా మారిందీ దేశం. ఈ రెండు దేశాల మధ్య సంబంధం ఎలాంటిదంటే.. క్రికెట్‌లో ఈ దేశానికి ఆ దేశం గట్టి పోటీ. చదువుల్లో... ఉద్యోగాలు సంపాదించడంలో అక్కడి స్థానికులకు మన ఫారినర్లు మహా పోటీ. ఎంతంటే..దాన్ని అసూయగా మలచుకుని వీళ్లను వాళ్లు కొందరు కొట్టేంత. అయినా ఆస్ట్రేలియా ఆశ పెంచే దేశమే మనవాళ్లకు. 
అక్కడి వాళ్లలో కలిసిపోయే చిన్న కిటుకు తెలిస్తే చాలు ఇట్టే ఐస్ అయిపోతారు అని చెప్తున్నారు రెండేళ్లుగా మెల్‌బోర్న్‌లో ఉంటున్న మల్టీమీడియా స్టూడెంట్ తుమ్మల సునీల్ రెడ్డి.
నేను ఆస్ట్రేలియా వచ్చి రెండేళ్లవుతోంది. మెల్‌బోర్న్‌లో ఉంటున్నాను. ఇండియాలో డిగ్రీ చదివి మల్టీమీడియాలో డిప్లమా కోర్సు చేయడానికి ఇక్కడికి వచ్చాను. చదువుకుంటూనే రెండు ఉద్యోగాలు చేస్తున్నాను. ఒకటి వాలంటరీ జాబ్. ఇంటర్న్‌షిప్‌లాగా. టెంపరరీ రెసిడెంట్‌షిప్ పొందడానికి సంబంధిత రంగంలో ఆరునెలల ఇంటర్న్ షిప్ చేయడం చాలా అవసరం ఇక్కడ. అందుకే ఉదయం పూట ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో ఈ జాబ్ చేస్తున్నాను. ఇంకో ఉద్యోగమేమో 'ది ఏజ్' అనే న్యూస్ పేపర్‌లో మార్కెటింగ్ ఫీల్డ్‌లో. ఆ పత్రికకు చందాదారులను చేర్పించే పనన్న మాట.

వారానికి రెండు రోజులే
నేను ఫ్రెండ్స్‌తో కలిసుంటున్నాను. ప్రతి సోమ, శనివారాలు మాత్రమే కాలేజ్ ఉంటుంది మాకు. వారానికి రెండురోజులే. బ్యాచ్‌లను బట్టి ఇలా విభజిస్తారు. కాలేజ్ స్ట్రిక్ట్‌గా ఏమీ ఉండదు. ఉదయం ఏడింటికల్లా రెడీ అయిపోయి బయటపడతాను. రైళ్లు, ట్రామ్‌లు, బస్‌లు ఉంటాయి. ఇక్కడో విషయం చెప్పాలి.

విదేశాల్లో అన్నీ టైమ్ ప్రకారం జరుగుతాయి అనుకుంటారు కాని ఇక్కడ మాత్రం అంత పంక్చువాలిటీ ఏమీ ఉండదు. ఇవి చాలా వరకు ఆలస్యంగా నడుస్తుంటాయి. మరీ గంటలు గంటలు కాదు కాని ఐదు, పది నిమిషాలు లేట్ అవుతుంటాయి. ఒక్కోసారి రద్దవుతుంటాయి కూడా. మొత్తమ్మీద గంట ప్రయాణం చేసి ఎనిమిదికల్లా ఆఫీస్ చేరుకుంటాను. పదింటి దాకా అక్కడ పని చూసుకుని (కాలేజ్ ఉన్న రోజుల్లో ) కాలేజ్‌కి వెళ్తాను.

మూడింటి వరకు కాలేజ్. పొద్దున్న ఇంట్లో కార్న్‌ఫ్లేక్సే టిఫిన్. ఓపికుంటే వంట చేసుకోవడం లేదంటే బయట తినడం. కాలేజ్‌లో క్యాంటీన్ ఉండదు. మెక్‌డొనాల్డ్స్, కెఎఫ్‌సి లాంటి రెస్టారెంట్లు ఉంటాయి. నార్త్ ఇండియన్ రెస్టారెంట్లు కూడా ఉంటాయి. (ఇండియాలో దొరికే ప్రతి వస్తువు ఇండియన్ స్టోర్స్‌లో దొరుకుతుంది) ఆస్ట్రేలియన్లు మన ఫుడ్‌ని చాలా ఇష్టపడతారు. కాని కారాన్ని భరించలేరు. లంచ్ తర్వాత మూడింటికి 'ది ఏజ్' పత్రిక ఆఫీస్‌కి వెళ్తాను. ఇక్కడ నా పని..ఫోన్లో అప్పాయింట్‌మెంట్ ఫిక్స్ చేసుకోవడం..వాళ్లు ఇచ్చిన టైంకి వాళ్ల దగ్గరకి వెళ్లడం, చందా కట్టించుకోవడం. ఆ పని చూసుకుని ఇంటికి వెళ్లేసరికి రాత్రి పదకొండు అవుతుంది. రాత్రి మాత్రం వంట చేసుకుంటాం.

వాళ్ల పద్ధతుల్ని ఆచరిస్తే....
వీకెండ్స్ మామూలే. శనివారం మార్కెటింగ్ వాళ్లకు ఎక్కువ పనుంటుంది. అందుకే నాకు ఆదివారం ఒక్క రోజే సెలవు. ఆ ఒక్కరోజు బట్టలుతుక్కోవడం, ఇంకేమైనా చిన్న చిన్న పనులు చేసుకోవడంతోనే సరిపోతుంది. టైం ఉంటే సినిమాలు చూస్తాం. ఇక్కడ రెండు థియేటర్స్ ఉన్నాయి, వాటిల్లో హిందీ, తెలుగు సినిమాలు వస్తాయి కాని పెద్ద పెద్ద స్టార్స్‌వి మాత్రమే.

మా చుట్టుపక్కల వాళ్లంతా ఆస్ట్రేలియన్లే. కొంత మంది చాలా బాగా మాట్లాడతారు. పార్టీలకు పిలుస్తుంటారు. కొంతమందైతే అసలు పట్టించుకోరు. వాళ్ల పద్ధతులను, అలవాట్లను మనవిగా చేసుకుంటే మనతో చాలా బాగా ఉంటారు. ఇక్కడ చిన్న వయసులోనే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఉండడం మామూలే. దాన్ని కామెంట్ చేసినా...విమర్శించినా...అసలు సహించరు.

చిన్నచూపు ఎక్కువే

పత్రిక చందాదారులను చేర్పించడానికి ఆస్ట్రేలియన్ల దగ్గరకి వెళ్తుంటానని చెప్పాను కదా.... రకరకాల అనుభవాలు ఎదురవుతుంటాయి. కొంతమంది చాలా సాదరంగా ఆహ్వానిస్తారు. ఇక్కడెలా ఉందని అడుగుతారు, ఉద్యోగ అవకాశాల గురించి ఆరా తీస్తారు. కాని కొన్ని చోట్ల, కొంత మంది దగ్గర తీవ్రమైన పరాభావం ఎదురవుతుంటుంది. ఇండియన్స్ అంటే చాలు..బతకడానికి ఇక్కడి దాకా వచ్చిన వాళ్లని చాలా చిన్న చూపు చూస్తారు. అవమానం అనిపిస్తుంటుంది. కొద్ది క్షణాలు బాధపడి తర్వాత మర్చిపోయి ఉద్యోగ నిర్వహణలో పడిపోతాం.

అవసరం అలాంటిది మరి. పర్మనెంట్ రెసిడెంట్స్‌గా ఉండాలని వచ్చేవారికి ఇలాంటి వాటిని సహించే ఓర్పు వచ్చేస్తుంది. అసలు ఈ జాత్యాహంకారం ఇక్కడి యూత్‌లోనే ఎక్కువ. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వాళ్లను చూస్తే వీళ్లు సహించలేరు. ప్రత్యేకించి కారణమేమీ కనపడదు. నేను పరిశీలించినంత వరకు...ఇక్కడ పధ్నాలుగేళ్లకే సంపాదన మొదలుపెడతారు. తల్లిదండ్రుల ఆలనాపాలనా ఉండదు.

పని చేసుకోవాలి..చదువుకోవాలి.. అంతే.ఇండియన్స్ వచ్చి చక్కగా చదువుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడుతుంటే.. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మంచి హోదాలు సంపాదించుకుంటున్నారనే అసూయలాంటిదేదో వాళ్లలో కలిగి జాత్యహంకారం చూపిస్తారేమోనని అనిపిస్తుంది. చైనీయుల్ని, లెబనీయుల్ని వీళ్లు ఏమీ అనరు. (చైనీయులు ఇక్కడ ఇన్వెస్టర్స్‌గా ఉంటారు కాబట్టనుకుంటా)ఇంకో విషయం ఏంటంటే..లెబనీయులు కూడా మన మీద పెత్తనం చూపిస్తుంటారు. అసలు ఆస్ట్రేలియన్లకన్నా వీళ్లే ఎక్కువ పెత్తనం చెలాయిస్తుంటారు. అయితే ఎన్ని దాడులు చేసినా భారతీయ స్త్రీల జోలికి మాత్రం వెళ్లినట్టు నేనెక్కడా నోటీస్ చేయలేదు.

క్రీడా ప్రియులు
మనం సంపాదించడానికే ఇక్కడికి వస్తుంటాం కాబట్టి లక్ష్యమంతా డబ్బు సంపాదన మీదే ఉంటుంది. వాళ్లకు సహజంగానే అలా ఉండదు. నేను చూసినంత వరకు ఆస్ట్రేలియన్లు రెండు గంటలు ఏకధాటిగా పని చేయలేరు. ప్రతి అరగంటకు వాళ్లకు కాఫీ బ్రేకో, స్మోక్ బ్రేకో..కావాల్సిందే. వీకెండ్ కోసమైతే అర్రులు చాస్తారు. శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి దాకా ఎంజాయ్ మూడ్‌లోనే ఉంటారు. ఆటలంటే వీళ్లకు అమిత ఆసక్తి, ఒక రకంగా చెప్పాలంటే ఆటలు వాళ్ల జీవితంలో భాగం, చదువుకంటే కూడా ఆటలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. క్రికెట్, ఫుటీ(రగ్బీలాంటి గేమ్) లాంటి ఆటల్ని ఎక్కువగా ఇష్టపడతారు. జాతీయభావం ఎక్కువ.

హిందు, పాక్ భాయి భాయి
ఆసియాలో ఇండియా, పాక్ అంటే బద్ధ శత్రువులు కాని ఇక్కడ మాత్రం భాయి..భాయిగా ఉంటారు. పాకిస్తానీ ఆర్గనైజేషన్స్, ఇన్స్‌స్టిట్యూట్‌లో ఇండియన్లకు తగిన ప్రాధాన్యం ఇస్తారు. ఫీజు చెల్లింపు విషయాల్లో కూడా వాయిదా పద్ధతుల్లో చెల్లించే వెసులుబాటును ఇస్తారు. అందరం ఒక్కటనే భావనే ఉంటుంది. పండగలు లాంటి సమయాల్లో తెలుగు వాళ్లే కాకుండా అందరం కలుసుకుంటాం. తెలుగు వాళ్లమైతే దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటాం. ఇక్కడ మురుగన్ గుడి, సాయిబాబా దేవాలయాలున్నాయి. నెలలో రెండు సార్లు వెళ్తుంటాం.

అనుకున్నంత గొప్పగా...
దూరపు కొండలు నునుపు అన్నట్టు ఇక్కడ అనుకున్నంత గొప్ప అవకాశాలైతే ఏమీ లేవు. మాస్టర్ డిగ్రీ కోర్సులైతే బాగానే ఉంటాయి కాని డిప్లమా కోర్సులను ఇక్కడి కంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ స్టాండర్డ్ చదువును ఇండియాలోనే పొందవచ్చు. అయితే ఇక్కడ పిఆర్(పర్మనెంట్ రెసిడెన్సీ) పొందడం కోసం చదువు వంకతో వస్తుంటాం. కాని చాలా కష్టం.

మాస్టర్స్ చేసిన వాళ్లకు కూడా చదువు అయిపోగానే ఉద్యోగాలు వచ్చి వాలడం లేదు. మనకు సంబంధించి ఎవరో ఒకరు లిఫ్ట్ ఇచ్చే వాళ్లు లేకుండా ఇక్కడ ఉండడం ఇబ్బందే. డబ్బుల్లేక, ఫీజు కట్టలేక వెనక్కి వెళ్లిపోయిన వాళ్లెందరో ఉన్నారు. పైగా డిప్లమాలాంటి కోర్సులు చేస్తున్న వాళ్లు జాత్యాహంకారానికి బలైతే భారత ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత లేదని విదేశాంగ మంత్రి ఎస్.ఎం. కృష్ణ కూడా ప్రకటించారు.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఎవరైనా ఆస్ట్రేలియా వైపు అడుగులు వేస్తే మంచిదని నా అభిప్రాయం. ఎవరినీ నిరుత్సాహ పరచాలని మాత్రం ఇదంతా చెప్పడం లేదు.
జూ సరస్వతి రమ

Friday, August 27, 2010

పల్లె వేత్తలు

సెల్ ఫోన్‌తో ఒక్క కాల్ చేస్తే చాలు... ఆ సౌండ్‌కే మోటర్ ఆన్ అవుతుంది...
చేనుకి నీళ్లు పెట్టాలంటే కరెంటు మోటర్ అవసరం లేదు... సైకిల్ ఉంటే చాలు...
లైట్ వెలగాలన్నా, ఫ్యాన్ తిరగాలన్నా స్విచ్ వేయాల్సిన పనిలేదు... రిమోట్ నొక్కితే చాలు...
ఐరన్ చేసుకోవడానికి కరెంటు, బొగ్గులు అవసరం లేదు... గ్యాస్ ఉంటే చాలు...
ఆ బైక్‌ని ఎంత దూరం నడిపితే దాన్లో ఉన్న బ్యాటరీ అంత ఎక్కువ చార్జ్ అవుతుంది... ఆ చార్జ్‌తో మళ్లీ అంత దూరం నడపొచ్చు... ఏంటి ! ఇవన్నీ నిజమే ! అని సందేహపడవద్దు. వీటిని కనిపెట్టిన వ్యక్తుల్ని కూడా ఈ పేజీల్లో మీరు చూడొచ్చు. వాళ్లెవరూ పెద్దగా చదువుకున్నవాళ్లు కాదు. వాటితో వ్యాపారాలు చేద్దామనుకుంటున్నవాళ్లూ కాదు. సాదాసీదా మనుషులు. Necessity is the mother of invention కి అచ్చమైన ఉదాహరణలుగా నిలిచే వ్యక్తులు. వారి పేర్లు రాంబాబు, బ్రహ్మం, మల్లేష్, జగదీశ్వర్ వగైరా వగైరా. అంటే మనవాళ్లే. తెలుగు వాళ్లే. పల్లెతల్లి బిడ్డలే.

కాల్ చేస్తే నీళ్లొస్తాయ్

ఖమ్మం జిల్లాలోని మారుమూల గ్రామం బొమ్మనపల్లికి చెందిన రాంబాబు వృత్తిరీత్యా మోటర్ మెకానిక్. బాగు చేయడమే తెలిసిన అతనికి ఏదైనా తయారు చేయాలనిపించేది. వానాకాలంలో తడిసిన మోటర్లు ఆన్ చేయడం వల్ల షాక్ కొట్టి రైతులు చనిపోవడం గమనించాడు రాంబాబు. మోటర్ స్విచ్‌ను అంటుకోకుండా దాన్ని ఆన్ చేయడమెలా అని ఆలోచించాడు. మోటర్ సర్క్యూట్‌లో సౌండ్ సెన్సర్ (శబ్దానికి స్పందించేది) వాడి చప్పట్లతో మోటర్‌ను ఆన్ చేయడం కనుగొన్నాడు. అక్కడితో ఆగలేదు. బైక్‌లకు, కార్లకు ఉపయోగించే రిమోట్‌ని కరెంటు మోటర్‌కి కూడా బిగించి దానితో ఆన్, ఆఫ్ చేయవచ్చని కనిపెట్టాడు. రిమోట్లు కొనాలంటే ఖర్చెక్కువ కాబట్టి దానికి ప్రత్యామ్నాయాలు ఆలోచించాడు. అప్పుడే రాంబాబు దృష్టి సెల్‌ఫోన్‌పై పడింది.

సెల్‌ఫోన్ రింగ్ ఇస్తే మోటర్ ఆన్ చేసే పద్ధతి కనుగొన్నాడు. నాలుగు సార్లు రింగ్ అయ్యే వరకు సెల్‌ఫోన్‌ను ఆన్‌లో ఉంచి వింటే మోటర్ తిరుగుతున్న శబ్దం, నీళ్లు పడే శబ్దం కూడా వినవచ్చు. రాంబాబు అక్కడితో కూడా ఆగలేదు... మోటర్ సర్క్యూట్‌కి మరో పరికరాన్ని అమర్చాడు. దానివల్ల మోటర్‌కి మూడు మీటర్ల దూరంలోకి ఎవరైనా వస్తే సైరెన్ మోగుతుంది. ఆ పరికరంలో ఫీడ్ చేసిన యజమాని నెంబర్‌కి వెంటనే కాల్ కూడా వస్తుంది. దీనివల్ల మోటర్‌ని దొంగలు ఎత్తుకెళ్లే అవకాశం కూడా ఉండదు. ఈ పరికరాన్ని మోటర్‌కి బిగించుకోవడానికి మూడువేల రూపాయలు ఖర్చు అవుతుంది. సహజంగానే రైతులకు ఇది బాగా నచ్చింది. ఇప్పుడు వాళ్ల ఊరు చుట్టుపక్కల గ్రామాల రైతులందరూ రాంబాబు సహాయంతో ఇళ్ల వద్దనుండే మోటర్లని సెల్‌ఫోన్‌తో ఆన్, ఆఫ్ చేసుకుంటున్నారు. వీటన్నిటినీ తయారు చేసిన రాంబాబు చదువుకున్నది రెండో తరగతే.

లైటెయ్యాలంటే రిమోట్ నొక్కితే చాలు...

బొమ్మగాని మల్లేష్ పదో తరగతి వరకూ చదువుకున్నాడు. పదహారేళ్ల వయసులో కుటుంబ పోషణకోసం బేకరీపని నుంచి క్లీనర్ పని వరకూ అన్ని రకాల పనులూ చేశాడు. అలా కష్టపడి ఇద్దరు అక్కల పెళ్లిళ్లు చేశాడు. చివరికి ఇంటి దగ్గరే ఎలక్ట్రిక్ షాపు పెట్టుకున్నాడు. ఉన్నట్టుండి తల్లికి పక్షవాతం వచ్చింది. దాంతో మంచానికే అతుక్కుపోయిన తల్లి పగలంతా ఒంటరిగా ఉండేది. ఫ్యాన్ వేసుకోవాలన్నా, లైట్ వేసుకోవాలన్నా మరొకరి సాయం అవసరమయ్యేది. దాంతో ఆ పనుల కోసం ఒక రిమోట్ తయారుచేసి తల్లి చేతిలో పెట్టాడు. ఆ రిమోట్‌తోటే ఇప్పుడు ఇంట్లో ఫ్యాన్, లైట్లు అన్నీ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. మల్లేష్ తల్లి చేతిలో ఆ రిమోట్‌ని చూసిన ప్రతివారూ తమకూ అలాంటిది తయారుచేసి పెట్టమని అతన్ని కోరారు. ప్రస్తుతం మల్లేష్ అదే పనిలో బిజీగా ఉన్నాడు.

ఆటోమేటిక్ స్టవ్ ఆఫ్

గద్వాల్‌లో ఉంటున్న ఇష్వాక్‌కు మిఠాయి దుకాణం ఉంది. తండ్రికి సహాయంగా షాపులోనే పనిచేస్తూ ఉంటాడు. ఓ రోజు ఇష్వాక్ ఒక దుర్వార్త విన్నాడు. గ్యాస్ స్టౌ పేలి ఇద్దరు చనిపోయారని. సిలిండర్ నుండి స్టౌకి ఉండే పైపులో నుంచి గ్యాస్ లీకవ్వడమే అందుకు కారణమని తెలుసుకొన్నాడు. స్టౌ కట్టేసినపుడు ఆటోమెటిక్‌గా సిలిండర్ కూడా ఆఫ్ అయ్యేలా ఓ పరికరాన్ని తయారు చేశాడు. ఇప్పుడు ఇష్వాక్ చాలామందికి ఈ ఆటోమెటిక్ పరికరాన్ని అమర్చిపెడుతున్నాడు. ఇష్వాక్ చెప్పేది ఒక్కటే..."చాలామంది స్టౌ కట్టేస్తారు కాని సిలిండర్ ఆఫ్ చెయ్యరు. పేలుళ్లకు ఆ అశ్రద్ధే కారణం. నేను కనిపెట్టిన ఈ పరికరం వల్ల కొందరైనా ప్రమాదం నుంచి తప్పించుకోగలిగితే నాకు అంతే చాలు.''

గ్యాస్ ఐరన్ బాక్స్

ఐరన్ బాక్స్ అనగానే మనకి గుర్తుకొచ్చేది బొగ్గులతో చేసేది, విద్యుత్‌తో నడిచేది. ఈ రెండింటికీ భిన్నంగా గ్యాస్‌తో వాడుకునే ఐరన్ బాక్స్‌ని తయారుచేశాడు వరంగల్ జిల్లా నర్సంపేట సమీపంలోని ఎల్లాయగూడెంకి చెందిన బ్రహ్మం. "బొగ్గు నింపి అంటించడం పెద్దపని. వర్షాకాలంలో అయితే ఇంకా తలనొప్పి. కరెంటు వాడకం ఖర్చుతో కూడుకున్న పని. పర్యావరణ రీత్యా కూడా గ్యాస్ మేలు. పైగా షాక్ కొడుతుందేమోనని భయపడాల్సిన అవసరం లేదు'' అంటాడు బ్రహ్మం. ఆ ఉద్దేశ్యంతోనే ఈ గ్యాస్ ఐరన్ బాక్స్‌ని కనిపెట్టానంటాడు. పైగా కరెంటు, బొగ్గు ఐరన్‌బాక్స్‌లతో పోలిస్తే గ్యాస్ బాక్స్‌కి అయ్యే ఖర్చు తక్కువని అంటాడు.

సైకిల్ తొక్కుతూ చేనుకు నీళ్లు పెట్టొచ్చు...

ఐదో తరగతి వరకు చదువుకున్న విక్రమ్‌ది ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు. తనకి, తన అన్నకి చెరో నాలుగెకరాల పొలం ఉంది. అన్నకి విద్యుత్ మోటార్ ఉంది కాని తమ్ముడు విక్రమ్ రాథోడ్‌కి లేదు. తన పొలంలో వ్యవసాయం చేసుకుంటూనే విక్రమ్ సైకిల్ రిపేర్లు చేసుకుంటూ బతుకుతున్నాడు. ఐదేళ్లక్రితం సంగతి... విక్రమ్ మూడెకరాల్లో పత్తిపంట వేశాడు, ఒక ఎకరంలో వరి వేద్దామనుకున్నాడు కాని మోటర్‌గాని కరెంటు సదుపాయం గాని లేకపోవడంతో ఆ పని చెయ్యలేకపోయాడు. కరెంటు లేకుండా మోటర్ నడపలేమా? అని ఆలోచించాడు. కరెంట్ మోటర్‌లో ఫ్యాన్ (నీటిని తోడే పుల్లీ) వేగంగా తిరగడం వల్లే నీరు పైకి వస్తుందని గుర్తించాడు. చేతితో కూడా ఆ ఫ్యాన్‌ని తిప్పవచ్చుకదా అని ఆలోచించాడు. ప్రయత్నిస్తే నీళ్లు కొద్ది కొద్దిగా వచ్చాయి. సైకిల్‌తో మోటర్‌ని అనుసంధానం చేస్తే ఎక్కువ నీళ్లు వస్తాయనుకున్నాడు. కాని విక్రమ్‌కు సొంత సైకిల్ కూడా లేదు. ఇంట్లో ఉన్న జొన్నలు అమ్మేసి పాత సైకిల్ ఒకటి కొన్నాడు. కావాల్సిన సామాగ్రి మొత్తం సమకూర్చుకుని మొత్తం మీద ప్రయత్నం మొదలెట్టాడు.

సైకిల్ చక్రం నిమిషానికి యాభై సార్లు తిరుగుతుంది. అదే మోటర్ అయితే మూడు వేల సార్లు తిరుగుంది. బెల్టుల సహాయంతో సైకిల్ రిమ్‌కు మోటర్ ఫ్యాన్‌ను కలిపాడు. సైకిల్ తొక్కుతుంటే మోటర్ నుంచి నీళ్లు వచ్చాయి. అలా సైకిల్ మోటార్‌తో ఒక సంవత్సరం వరి కూడా పండించాడు.

బైక్... బ్యాటరీ బైక్ !

వరంగల్ జిల్లా చెన్నారావుపేటకి చెందిన జగదీశ్వర్ బ్యాటరీతో నడిచే మోటర్ సైకిల్‌ని కనిపెట్టాడు. తొమ్మిదో తరగతి వరకు చదువుకొన్న జగదీశ్వర్ వృత్తి రీత్యా బైక్ మెకానిక్. బైక్ ఇంజన్లతో ఏవేవో ప్రయోగాలు చేయడం ఆయనకి అలవాటు. ఒకసారి తన స్నేహితుడి బండి తీసుకుని దానికొక బ్యాటరీ బిగించాడు. బైక్ నడుస్తుంటే దాన్లో ఉన్న బ్యాటరీ చార్జ్ అవడం గమనించాడు. ఆ చార్జ్ తోటే మళ్లీ బైక్‌ను నడిపి చూశాడు. అలా రెండు వందల కిలోమీటర్లు నడిపి చూపించాడు. ఎవరైనా ఆసక్తి చూపించి ఆర్థిక సహాయం చేస్తే ఈ బ్యాటరీలను తయారు చేస్తానని అంటున్నాడు జగదీశ్వర్.

ఆసు యంత్రం

తల్లి పడుతున్న కష్టం చూసి తట్టుకోలేపోయాడు మల్లేష్. ఏడేళ్లు కృషి చేసి ఆసుయంత్రం కనిపెట్టాడు. నల్గొండ జిల్లా ఆలేరు ప్రాంతానికి చెందిన చింతకింది మల్లేష్ ఏడవ తరగతితో చదువాపేసి చేనేత కార్మికుడిగా స్థిరపడ్డాడు. చీర నేతకు ముందు దారాలను ఆసుపోస్తారు. ఆ పనంతా తల్లిదే. ఒక చీరకు సరిపడా దారాలను చేత్తో ఆసు పోయడానికి ఆరు గంటల సమయం పడుతుంది. అదే మల్లేష్ కనిపెట్టిన ఆసుయంత్రంతో అయితే రెండు గంటల్లో ఆసు పోయవచ్చు. ఇప్పుడు చాలామంది మల్లేష్ నుండి ఈ యంత్రాల్ని కొనుగోలు చేస్తున్నారు.

దోమలకి చెక్...

దోమల బెడద గురించి వేరే చెప్పనవసరం లేదు. పల్లెల నుండి పట్టణాల దాకా అందరూ దోమల బెడద ఎదుర్కోక తప్పదు. పల్లెటూళ్లలో అయితే మనుషులు దోమతెరలతో వాటి బారినుంచి బయట పడినా గేదెలు, ఆవుల పరిస్థితి ఏమిటి? అందుకే ఈ సమస్యకి పరిష్కారం కనుగొనాలనుకున్నాడు చిత్తూరు జిల్లా కారకొల్లు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అనే రైతు. తెల్లజుమ్కి అనే చెట్టు రసం దోమల నివారణకి ఉపయోగపడుతుందని కనిపెట్టాడు. ఈ రసం నుంచి తయారుచేసిన తైలం కొద్దిగా మన ఒంటికి రాసుకుంటే దోమలు మనదరికి చేరవు. ఇంటి చుట్టుపక్కల నీళ్ల గుంటల్లో దీన్ని కొద్దిగా వేస్తే దోమగుడ్డు పూర్తిగా చనిపోతుందని కూడా తెలుసుకున్నాడు.

వీళ్లంతా తమకొచ్చిన ఆలోచనలని ఆచరణలో పెట్టి విజయం సాధించిన వారే. అయితే అలాంటి వారికి తగిన గుర్తింపు రావాలంటే ఏం చెయ్యాలి? వారి ప్రయోగాల గురించి, సాధించిన విజయాల గురించి బయటి ప్రపంచానికి తెలియజేయడమే కాకుండా వారు తయారు చేసిన వస్తువులకి పేటెంట్‌లు ఇ ప్పించే పనిలో ఉంది హనీబీ అనే స్వచ్ఛందసంస్థ. అంతేకాదు వీరి గురించి నలుగురికి తెలిపే పనిలో భాగంగా పల్లె సృజన పేరుతో ఒక మాసపత్రికని కూడా ప్రచురిస్తోంది.

హనీబీ ఎవరు?

హనీబీ అంటే తేనెటీగ. తేనెటీగ ఏం చేస్తుంది? పువ్వుల్లోని మకరందాన్ని తీసుకెళ్లి తేనెగా మారుస్తుంది. అదే ఉద్దేశంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్ అనిల్‌గుప్తా ఈ హనీబీ సంస్థని 1989లో స్థాపించారు. పల్లె ప్రజల్లో ఉండే విజ్ఞానం అందరికీ అందాలనే ఆలోచనే దీన్ని నెలకొల్పడం వెనక ఉద్దేశం. మారుమూల పల్లెల్లోని ఈ గ్రామీణ శాస్త్రవేత్తలని జాతీయ ఆవిష్కరణా సంస్థ (నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్-ఎన్.ఐ.ఎఫ్.)తో అనుసంధానం చేయడమే హనీబీ పని.

ప్రకృతికి దగ్గరగా ఉండే పల్లెవాసులు వారి అవసరాల కోసం రకరకాల ఔషధాలు, వస్తువులు తయారు చేసుకుంటారు. వారి విజ్ఞాన సంపద నలుగురికీ తెలిసే అవకాశం తక్కువ. ఎందరో పల్లెవాసుల విజ్ఞానాన్ని చూసిన ఆయన దేశంలోని అన్ని రాష్ట్రాలకు హనీబీ నెట్‌వర్క్‌ని విస్తరించారు. దీనిలో పనిచేసేవారంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చినవారే. పెద్దపెద్ద ఉద్యోగాలు చేసి పదవీ విరమణ చేసినవారు చాలామంది ఈ సంస్థలో చేరుతున్నారు. మన రాష్ట్రం విషయానికొస్తే... బ్రిగేడియర్ గణేశం, డా.కె.ఎల్ రావు, పి. చంద్రకాంత్ శర్మ అనే ముగ్గురు 2005లో ఈనెట్‌వర్క్‌లో చేరారు.

కొన్నాళ్లకు దీని విశిష్టత తెలుసుకుని ఇంకా చాలామంది వీరితో చేతులు కలిపారు.తమ దృష్టికి వచ్చిన పల్లె 'శాస్త్రవేత్తల' గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటుంది హనీబీ. ఆ వ్యక్తి కనిపెట్టిన వస్తువుని పరిశీలించి ముందుగా దాని వివరాలను రికార్డు చేస్తారు. ఇంకెక్కడైనా అలాంటి వస్తువు వాడకంలో ఉందో లేదో కనుక్కొంటారు. ఒకవేళ లేకపోతే దాని అవసరాన్ని గుర్తించి వారికి పేటెంట్ హక్కు ఇప్పిస్తారు. ఆ వస్తువు పట్ల ఆసక్తి చూపే సంస్థల్ని సంప్రదిస్తారు, పెద్ద ఎత్తున ఆ వస్తువు తయారుచేయడానికి ఆ వ్యక్తే సిద్ధమైతే వాటిని మార్కెట్‌లో అమ్ముకోడానికి తగిన సదుపాయాల్ని కూడా సమకూరుస్తారు.

దేశవ్యాప్తంగా లక్షానలభై వేల ఇన్నొవేటర్ల గురించి తెలుసుకొని వాళ్లు కనిపెట్టిన వస్తువుల గురించి రికార్డ్ చేసింది ఈ సంస్థ. వాటిలో డెభ్బైశాతం సంప్రదాయ జ్ఞానంతో తయారైనవైతే ముప్పైశాతం సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించి తయారు చేసినవి. మన రాష్ట్రంలో ఇప్పటివరకు 74 మంది ఇన్నొవేటర్లని వారు గుర్తించారు. వీరి ఆవిష్కరణలను ఎన్.ఐ.ఎఫ్‌లో రిజిష్టర్ చేశారు. వీరిలో నలుగురి ఆవిష్కరణలను పారిశ్రామికవేత్తలకు అందించి వారితో ఆర్థిక ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రం నుండి ఎన్.ఐ.ఎఫ్‌కి మొత్తం వెయ్యికి పైగా ఎంట్రీలు వచ్చాయట.

శోధ(న) యాత్రలు కూడా...

తమంతట తాము పంపేవాళ్ల సమాచారంతో ఆగిపోకుండా ఈ సంస్థ ప్రతినిధులు దేశమంతటా పర్యటించి జనం సృజనాత్మకంగా తయారు చేసుకున్న పరికరాలను గుర్తించే పనికూడా పెట్టుకున్నారు. హనీబీ అధ్యక్షుడు అనీల్‌గుప్తా సారధ్యంలో ఆర్నెల్లకొకసారి ఈ శోధ యాత్ర జరుగుతుంది. బ్రిగేడియర్ గణేశం మాటల్లో చెప్పాలంటే... శోధ యాత్ర అంటే 'మరుగున పడిన జ్ఞాన దేవాలయాలను సందర్శించే తీర్థ యాత్ర'. ఈ యాత్రలో పాల్గొన్నవాళ్లు మారుమూల గ్రామాలు, గిరిజన తండాల్లో తిరిగి వారి జీవనవిధానాల్ని పరిశీలించి వారిలోని ఇన్నొవేటర్లని గుర్తిస్తారు. యాత్రలో 60 నుంచి 70 మంది దాకా పాల్గొంటారు. వారిలో పలురాష్ట్రాలకు చెందిన రైతులు, పరిశోధకులు, విద్యార్థులు, నిపుణులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, విదేశీయులు ఉంటారు. దేశంలోని అన్ని ప్రదేశాల్లోనూ ఈ యాత్ర జరుగుతుంది. ఇప్పటివరకు మొత్తం 24 శోధ యాత్రలు చేశారు.

వందలో ఒక్కరికి గౌరవం దక్కినా చాలు...

"పల్లె శాస్త్రవేత్తల ఇన్నొవేషన్స్ పెద్ద ఖరీదు కూడా ఉండవు. పైగా కనిపెట్టిన ఏ వస్తువైనా పదిమందికి ఉపయోగపడితే చాలనుకుంటారు కాని వాటి వల్ల ఆర్థికంగా ఎదిగిపోవాలన్న అత్యాశ వారికి లేదు. అదే వారి గొప్పతనం. అలాంటి వారికి పూర్తిస్థాయిలో న్యాయం జరగకపోయినా కొంతలో కొంతైనా వారికి గుర్తింపు లభించేందుకు కృషి చేస్తున్నాం. దీనికి చింతకింద మల్లేషే పెద్ద ఉదాహరణ. తల్లి పడుతున్న కష్టం చూడలేక ఆసు యత్రం కనిపెట్టాడు. అది ఎందరో తల్లులకు వరమైంది. హనీబీ నెట్‌వర్క్ మల్లేష్‌కి జాతీయస్థాయిలో గుర్తింపుని తీసుకొచ్చింది. వందలో ఒక్కరికి ఇలాంటి గౌరవం దక్కినా చాలు. మేము చేస్తున్న పనికి సార్థకత చేకూరుతుంది'' అంటారు బ్రిగేడియర్ గణేశం.

గుర్తింపు అంతంత మాత్రమే!

ఈ ఆవిష్కరణలకి పరిశ్రమల నుండి వస్తున్న స్పందన మాత్రం అంతంత మాత్రమే. ఇష్వాక్ కనిపెట్టిన గ్యాస్ స్టౌని ఆపే యంత్రం గురించి హనీబీ వాళ్లు బెంగుళూరులోని గ్యాస్ కంపెనీ నిపుణులకు తెలియజేస్తే వాళ్లు చెప్పిన సమాధానం ఇదీ- ఇకముందు తయారు చేసే పైపుల్లో నుంచి గ్యాస్ లీకయ్యే ప్రమాదముండదు. ఆ రకమైన పైపులు తయారు చేశాం కాబట్టి ఇష్వాక్ ఇన్నొవేషన్‌తో పని లేదన్నారు. మంచిదే. కాని తాము కనిపెట్టలేని దాన్ని కనిపెట్టాడనైనా ప్రశంసించి ఉండవచ్చు.

బైక్ నడుస్తుంటే రీచార్జ్ అయ్యే బ్యాటరీ తయారు చేసిన జగదీశ్వర్ పరిస్థితి కూడా ఇంతే. అతని ఆవిష్కరణను స్వీకరించే సంస్థలేవైనా ముందుకు వస్తాయేమో కనుక్కునే ప్రయత్నం చేసింది హనీబీ. ఒక పేరున్న సంస్థని సంప్రదిస్తే వారు జగదీశ్వర్‌ని ఆ బ్యాటరీ తయారీ వివరాలు చెప్పమని అడిగారు. ఆ రహస్యాన్ని చెప్పడానికి ఇష్టపడని జగదీశ్వర్ వెనుదిరిగాడు.
సైకిల్-మోటర్ తయారు చేసిన విక్రమ్ గురించి తెలుసుకున్న హనీబీ సంస్థ వాటిని తయారు చేయడానికి ఆయనకి ఆర్థిక సహాయం చేసింది. ఆ సహాయంతో విక్రమ్ పది యంత్రాలను తయారు చేసి ఢిల్లీలో అమ్మాడు కూడా. అయితే స్థానికులు మాత్రం ఈ సైకిల్ మోటార్ పట్ల ఎలాంటి ఆసక్తి చూపలేదని అంటాడు విక్రమ్. ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తే ఈ పరికరాలు మరిన్ని తయారు చేస్తానని అంటున్నాడు.
చంద్రశేఖర్ తయారు చేసిన దోమల తైలాన్ని పూర్తిగా పరిశీలించి హనీబీ ఎన్.ఐ.ఎఫ్‌కి దాని వివరాలు పంపింది. వారు చంద్రశేఖర్‌కి 85 వేల రూపాయల వడ్డీ లేని రుణాన్ని ఇచ్చారు.

గ్యాస్ ఐరన్ బాక్స్‌ది మరోకథ. దాని గురించి తెలుసుకొన్న హనీబీ ఒక ప్రైవేటు సంస్థతో మాట్లాడి అక్కడ బ్రహ్మం ఆలోచనకి గుర్తింపునిచ్చే ప్రయత్నం చేసింది. కాని అది ఫలించలేదు. అయితే హనీబీ సంస్థ బ్రహ్మంకి పేటెంట్ హక్కుల్ని కూడా ఇప్పించింది. తనకి ఏదైనా మార్గం చూపమని ఆయన మళ్లీ హనీబీనే ఆశ్రయించాడు. ఆయనలాంటి వారి కోసమని హనీబీ నెలకొల్పిన 'క్రియేటివ్ మైండ్స్' కంపెనీలో ఈ గ్యాస్ ఐరన్ బాక్స్ తయారుచేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇన్నాళ్లకి తన కలకి గుర్తింపు వస్తున్నందుకు బ్రహ్మం చాలా సంతోషపడుతున్నాడు. ఈ సంస్థ విడుదల చేయబోయే మొట్టమొదటి ఉత్పత్తి కూడా ఇదే.

మల్లేష్ తయారు చేసిన ఆసు యంత్రం గురించి తెలుసుకున్న హీనీబీ ఆయనకి పేటెంట్ ఇప్పించడంతోపాటు ఇతర రాష్ట్రాల్లోని చేనేత కార్మికులకు ఈ యంత్రాలను అమ్ముకునే సదుపాయాల్ని కూడా కల్పించింది. మన రాష్ట్రంలోనే 500 వందల ఆసు యంత్రాల్ని మల్లేష్ అమ్ముకుని ఆర్థికంగా స్థిరపడ్డాడు. మల్లేష్ సృజనాత్మకతకి రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది.
మీకు కూడా ఇలాంటి ఆవిష్కరణల గురించి తెలిస్తే వాటి గురించి, వాటి ఆవిష్కర్తల గురించి హనీబీకి తెలియజేయవచ్చు. హనీబీ ఫోన్ నంబర్ 040-271185555.

'క్రియేటివ్ మైండ్స్' వచ్చేసింది...

ఎంతో శ్రమపడి తయారుచేసిన వస్తువులు, కనుగొన్న ఔషధాలకు గుర్తింపులేకుండా పోవడాన్ని హనీబీ కో ఆర్డినేటర్లు జీర్ణించుకోలేకపోయారు. వారికి తగిన గుర్తింపు తీసుకురావడానికి కంపెనీల చుట్టూ ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయారు. వీరికి ఒక ఉపాయం తట్టింది. 'ఇంత కష్టపడుతున్న మనం మన ఇన్నొవేటర్ల కోసం ప్రత్యేకంగా ఒక కంపెనీనే స్థాపించుకుంటే ఎలా ఉంటుంది' అనుకున్నారు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. మూడు నెలల క్రితం 'క్రియేటివ్ మైండ్స్' పేరుతో కంపెనీని స్థాపించారు. దీనికి వారే పెట్టుబడి పెట్టుకున్నారు. ఇప్పుడు ఎవరైనా ఇన్నొవేటర్ తను కనుగొన్న వస్తువుని ఈ కంపెనీ ద్వారా మార్కెట్‌లోకి తెచ్చుకోవచ్చు.
. * భువనేశ్వరి

Monday, August 23, 2010

నలందోదయం

nalanda
ఎన్నో దేశాలు కన్ను తెరవకముందే చదువుల్లో కీర్తి బావుటను నలంద ఎగరవేసింది. ప్రపంచానికి జ్ఞానజ్యోతులని పంచింది. భారత ఖ్యాతిని ్రపపంచవ్యాప్తంగా చాటిచెప్పింది. ఎన్నో ఏళ్ల చరిత్ర గల నలందా విశ్వవిద్యాలయం....మరికొన్ని రోజుల్లో కొత్త రూపురేఖను సంతరించుకోవటానికి ఓ అడుగు (బిల్లు) దూరంలో ఉంది. నలంద విశ్వవిద్యాలయం తిరిగి ప్రాచీన వైభవాన్ని సంతరించుకోవాలంటే లోక్‌సభ ఓటింగ్‌ కీలకం. నలంద విశ్వవిద్యాలయ బిల్లు 2010ని రాజ్యసభ ఆమోదించింది. యూనివర్సిటీ ఆఫ్‌ నలంద యాక్ట్‌ 2007లో బీహార్‌ అసెంబ్లీలో తొలిగా ప్రవేశెపెట్టింది. 2007లో జరిగిన దక్షిణాసియా సదస్సులో దీని మీద చర్చలు జరిగాయి. 2009 అక్టోబర్‌ 25న థాయ్‌లాండ్‌లో జరిగిన 4వ దక్షిణాసియా సదస్సులోను దీన్ని ప్రస్తావించారు.

నలంద ఖ్యాతి
nalaబీహార్‌ రాజధాని పాటా్ని ( పాటలీపుత్రం) 55 కిలోమీటర్ల దూరంలో నలంద విశ్వవిద్యాలయం ఉంది. గుప్తుల రాజైన కుమారగుప్త సమయంలో దీన్ని నిర్మించారు. బుద్ధులు సందర్శించే పవిత్ర స్థలాల్లో నలంద కూడా ఒకటి. 10వేల విద్యార్థులు, 2వేల ఉపాధ్యాయులు మరెంతో మంది సిబ్బందికి ఒకేసారి బోధనను అందించే సదుపాయం ఇక్కడ ఉండేది. ఖగోళ, వాస్తు ప్రకారం దీన్ని నిర్మించారు. ఇక్కడ 8 అద్భుత భవనాలు, ఓ సూర్యాలయంతో పాటూ పది ఇతర దేవాలయాలుండేవి. యోగా, ధ్యానం కోసం ప్రత్యేక గదులుండేవి. కొలనులు, సుందర ఉద్యానవనాలతో పరిసర ప్రాంతాలు కళకళలాడుతుండేవి. 9 అంతస్థుల భవనంలో గ్రంథాలయం ఉండేది. గణితం, సాహిత్యం, భాష, ఖగోళం ఇలా ఒకటేమిటి ప్రతి అంశం మీద బోధించటానికి సుశిక్షితులైన అధ్యాపకులుండేవారు.

కొరియా, జపాన్‌, చైనా, టిబెట్‌, ఇండోనేషియా, పర్షియా, టర్కీ విద్యార్థులు నలందలో చదువుకోవటానికి ఎక్కువగా వస్తుండేవారు. 427 బిసి నుంచి 1197 సంవత్సరం వరకు బౌద్ధులకి విద్యా బోధనా కేంద్రంగా ఉంది. చరిత్రలో మొట్టమొదటి విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందింది నలందనే. మౌర్య రాజులు, అశోకుడు, గుప్తులు ఇక్కడ చారిత్రక కట్టడాలను నిర్మించారు. భక్తయార్‌ ఖిల్జి (1193) పరిపాలనలో నలంద పతనం ప్రారంభమైంది. విశిష్టమైన కట్టడాలెన్నింటినో ధ్వంసం చేశారు. ఎంతోమందిని తరిమేశారు. ఎన్నో విలువైన గ్రంథాలను, సాహిత్యాలను తగులబెట్టారు. ఇక్కడ ఉన్న గ్రంథాలయాన్ని కాల్చితే.... అందులో ఉన్న పుస్తకాలు మూడు నెలల పాటూ కాలుతూనే ఉన్నాయంటే ..ఎన్ని కోట్ల సాహిత్యాన్ని నాశనం చేశారో అర్థం చేసుకోవచ్చు.

అమర్త్వసేన్‌ నాయకత్వంలో..
నలంద పునరుద్ధరణకు కొన్ని సంస్థలు, దేశాలు ముందుకొచ్చినా....ఆర్థికశాస్త్రంలో భారత్‌కి తొలి నోబెల్‌ని అందించిన అమర్త్వసేన్‌ ఆధ్వర్యంలో ఓ బృందం ఏర్పాటైంది. దేశానికి చెందిన ప్రముఖ ప్రొఫెసర్లు, మేఘనాథ్‌ దేశాయ్‌, సుగోత్‌ బోస్‌, నంద్‌ కిషోర్‌ సింగ్‌, చైనా ఫ్రొఫెసర్‌ వాంగ్‌ బెన్‌వాయి ( బీజింగ్‌ విశ్వవిద్యాలయం) సింగపూర్‌ విదేశాంగ మంత్రులు హిరయామ, జార్జి యో ఇందులో ఉన్నారు. వీరందరూ కలసి వివిధ పట్టణాల్లో నలంద పునరుద్ధరణ పైన ఆరు సమావేశాలను నిర్వహించారు.నలందలో ప్రవేశపెట్టబోయే కోర్సులు వాటి బోధనా విధానంపైన వీరు కసరత్తు చేస్తున్నారు.

ప్రపంచానికి కాంతులు
amartya-sen నలంద పునరుద్ధరణకు అంతర్జాతీయంగా 1951లోనే నవ నలందా మహావీరా పేరుతో ఓ సంస్థ ఏర్పాటైంది. పాట్నాకి 100 కిలోమీటర్ల దూరంలో ప్రధాన కేంద్రం ఉంది.దేశ తొలి రాష్టప్రతి బాబూ రాజేంద్రప్రసాద్‌ దీనికి పునాది రాయి వేశారు. 1956లో మొదటి భవనాన్ని సర్వేపల్లి రాధాకృష్ణనన్‌ ప్రారంభించారు. 1981లో రాష్టప్రతి నీలం సంజీవ రెడ్డి విదేశీ విద్యార్థుల కోసం అంతర్జాతీయ హస్టల్‌ భవన నిర్మాణానికి పునాది వేశారు. 2008 - 2009 సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం 397 విద్యార్థులు ఇక్కడ ఉన్నారు.

బర్మా, శ్రీలంక, థాయ్‌లాండ్‌, కాంబోడియా, బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన 95 మంది సన్యాసులున్నారు. 2006లో సింగపూర్‌, చైనా, భారత్‌, జపాన్‌తో పాటూ మరికొన్ని దేశాలు నలంద విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించటానికి ముందుకొచ్చాయి. ఇప్పటి వరకు లభించిన మనుస్క్రిప్ట్స్‌ను నలందా మ్యూజియంలో జనవరి 26, 2008న తొలిసారిగా 3డిలో ప్రదర్శించారు. నలంద కాంతి దశదిశలా మళ్లీ వ్యాపించాలి. అందరికి జ్యోతిని ( విద్య) పంచాలి. నలంద కిరణాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి.

Sunday, July 25, 2010

మారండి మహాప్రభో...

చెట్టు కింద ఒక టేబుల్ ఉంది. దాని మీద 'ఇక్కడ అన్ని రకాల పిటిషన్లూ స్వీకరించబడును' అని బోర్డు ఉంది. టేబుల్ మీద మూడు రంగుల ట్రేలు ఉన్నాయి. ఒకదాన్లో ఆపండి, ఒకదాన్లో చేయండి, ఒకదాన్లో మార్చండి పిటిషన్లను వేయమన్న సూచన ఉంది.


చేయండి ట్రేలో ఉన్నవన్నీ మరీ పాతగా ఉన్నాయి. నలిగిపోయి కొన్ని చోట్ల అక్షరాలు కూడా సరిగ్గా కనిపించడం లేదు.
మార్చండి ట్రేలో వన్నీ టైపు చేసిన పిటిషన్లే కాని ఎక్కువ లేవు.
ఆపండి ట్రేలో మాత్రం కట్టలు కట్టలు ఉన్నాయి. కాగితాలతో పాటు సిడిలు, డివిడిలు ఉన్న కవర్లు కూడా ఉన్నాయి.
ముందు పాతవే చూద్దామని చేయండి ట్రేలోని కాగితాలు బయటకు తీశారు. మా ఊరికి కరెంటు, రోడ్డు, స్కూలు, మంచినీరు, సాగునీరు, రేషన్ వగైరా సౌకర్యాలు కలగచేయండి వంటి దరఖాస్తులు ఉన్నాయందులో.
మార్చండి ట్రేలో తర్వాతి దశ సమస్యలు కనిపించాయి. ఫలానా ఎస్.పి మరీ కర్కోటకంగా ఉన్నాడు కాబట్టి మా జిల్లా నుంచి మార్చేయండి అని (వేరే జిల్లా వాళ్లు ఏమైపోవాలనో) ఒక పిటిషన్. లేదా ఫలానా డాక్టర్, టీచర్, హెల్పర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, విఎఒ, ఇంజనీర్, కాంట్రాక్టరు ఇలా ఎవరో ఒకర్ని బదిలీ చేయమన్న కోరికలే అవన్నీ. విద్యావిధానాన్ని మార్చండి, పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చండి లాంటి డిమాండ్లూ కొన్ని లేకపోలేదు.

ఆపండి ట్రేలో ఉన్నవి మాత్రం అన్నీ కొత్తవే. అవినీతిని ఆపండి, భూసేకరణలను ఆపండి, ధరల పెరుగుదలను ఆపండి, సెజ్‌లను ఆపండి, బాబ్లీని ఆపండి, ఓదార్పు యాత్రను ఆపండి, థర్మల్ ప్రాజెక్టులను ఆపండి, వలసలను ఆపండి, విస్థాపనలను ఆపండి, మతకలహాలను ఆపండి, మలేరియాను ఆపండి, అక్రమ మైనింగ్‌లను ఆపండి, యాసిడ్ దాడులను ఆపండి, కాలుష్యాన్ని ఆపండి, ఆత్మహత్యలను ఆపండి, అంతరాలను ఆపండి... ఇలా అసంఖ్యాక పిటీషన్‌లు ఉన్నాయి అందులో.
బంట్రోతు మరో కొత్త ట్రే పట్టుకొచ్చాడు. దానికి ఇంకా ఏ పేరూ పెట్టలేదు. కానీ అది ఖాళీగా వుండిపోతుందని అతనికి ఎందుకో గట్టిగా అనిపించింది.

Sunday, July 18, 2010

పిడికెడు పిట్ట.. ప్రపంచ వింత

అదో పిడికెడంత పిట్ట. ప్రపంచ పక్షి శాస్త్ర పరిశోధక లోకమంతా దాని కోసమే ఆసక్తిగా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోంది. వేల రకాల పక్షులెన్నో ఉన్నాయి. వాటన్నింటినీ కాదని ఆ పక్షి కోసమే ఎందుకంత ఆసక్తి.. ప్రపంచ పక్షి లోకంలో దానికంత పేరెందుకు.. దాని ప్రత్యేకతలేమున్నాయి.. సాధారణ జనావళి నుంచి పుట్టుకొచ్చే ప్రశ్నలు ఇవి. ప్రపంచంలో వందల ఏళ్ల కిందట ఆనవాళ్లే లేకుండా అంతరించిపోయిందని భావించిన పక్షి ఆకస్మికంగా మళ్లీ కనిపిస్తే.. ఆ అనుభూతే వర్ణణాతీతం. ఆ అరుదైన పక్షి మన రాష్ట్రంలోని కడప జిల్లా అడవుల్లోని కలివిపొదల్లో కనిపించింది. అందుకే దీన్ని ఇక్కడి వారంతా కలివికోడిగా పిలుస్తుంటారు. ఇంతకీ దీని అసలు పేరుకు మళ్లీ ఓ కథ ఉంది.

birdజోహారు జోర్డాన్‌!!
బ్రిటీష్‌ సైన్యంలో వైద్యాధికారిగా పనిచేసిన డాక్టర్‌ టి.సి. జోర్డాన్‌ ఈవింత పక్షిని తొలిసారిగా గుర్తించారు. వేలాది పక్షి జాతుల్లో ఒకే నమూనా పోలి కనిపించే కొన్ని రకాల పక్షులను కొర్సర్స్‌గా పిలుస్తుంటారు. అలాంటి పక్షుల్లో ఒకటిగా ఉండి అంతరించిపోయినట్లు కొంత కాలం ప్రపంచాన్ని నమ్మించిన ఈ పక్షిని తొలిసారి 1848లో జోర్డాన్స్‌కు సెంట్రల్‌ ఇండియాలో కనిపించింది. 1900 దాకా ఈ పక్షిని ఆయనే అక్కడక్కడా అరుదుగా చూస్తూ వచ్చారు. ఇక ఆ తరువాత అది ఎంత వెదికినా కనిపించలేదు. 86 ఏళ్ల తరువాత ఇది తిరిగి కడప జిల్లా లంకమల అడవుల్లో ప్రత్యక్షమై పక్షి ప్రపంచాన్నే అబ్బురపరిచింది. భూ ప్రపంచంలో ఇక పూర్తిగా అంతరించిపోయిందనుకున్న ఈ పక్షి ఇంకా బతికే ఉందని లోకానికి చాటి చెప్పిన టిసి జోర్డాన్‌ జ్ఞాపకార్ధం ఈ పక్షికి జోర్డాన్‌ కొర్రర్స్‌గా పేరు పెట్టారు.

సహజ కంఠాభరణం కలివికోడి సొంతం...
bird-lgsవేల రకాల పక్షుల్లో తాను ఒకటిగా ఇంకా బతికే ఉన్నానంటూ ప్రత్యేకత చాటుకున్న కలివికోడికి అందం ఒక ఆకర్షణే. చూపరులకు చిన్న గువ్వే అయినా సహజ సిద్ధమైన కంఠాభరణంతో తనకే పక్షి సాటి అన్నట్లు ఠీవి ఒలకబోస్తుంటుంది. తల కింది భాగాన నారింజ రంగు మెరుపులు, తెల్లటి కనుబొమ్మలు, గోధుమ వర్ణంలో ఉన్న రెక్కలు, చిన్నపాటి కొప్పును పోలిన తోక, వంచిన కాళ్లపై వయ్యారంగా నిలబడే ఈ పక్షికి ఎద పైభాగాన ఉన్న నలుపు తెలుపుల సమ్మేళనమైన వర్ణంతో కంఠాభరణంలా అలంకరించినట్లుండే మెడపట్టి కలివికోడికే సొంతం. తీర్చిదిద్దినట్లుండే కనుసొగలతో ఠీవిగా నిలుచుకొనే ఈ పక్షి ఎత్తు తక్కువే అయినా బరువు పావు కిలో లోపే. లేలేత గోధుమ రంగుతో తలుకు బెలుకులు చూపుతూ కనిపించి కనిపించనట్లు రెప్పపాటులో అదృశ్యం అవుతుంటుంది.

చిట్టడవులు, కలివిపొదలు ఆవాసం...
అన్ని పక్షుల్లాగే హాయిగా గగన తలంలో విహరించే శక్తి ఉన్నా ఈ పక్షి ఆవాసం చిట్టడవులు, చిరుపొదలే. కలివిచెట్ల మాటునే ఇది కోడిలా గెంతుతూ కనిపిస్తుంటుంది. అందుకే దీన్ని కలివికోడిగా పిలుస్తుంటారు. ఒకప్పుడు మహావృక్షాలతో అలరారిన అడవులస్థానంలో క్షీణదశకు చేరి చిట్టడవులుగా మిగిలిన పొదలు, అందులోనూ కలివి పొదలు కలివికోడికి ఆవాస నివాసాలు. ఈ పొదలే తనకు సురక్షితమైన నివాసాలుగా ఈ పక్షులు భావిస్తాయి. పగలంతా ఈ కలివి పొదల్లోనే విశ్రాంతి తీసుకుంటూ చీకటిపడగానే మెల్లమెల్లగా పొదల నుంచి అడుగులో అడుగు వేస్తూ పరిసరాలను పరికించి చూస్తూ బైటకొస్తుంటాయి.

PIC_21చెదలే ఆహారం...
కలివి పొదల్లో తిరుగాడే ఈపక్షికి చెద పురుగులే ప్రధాన ఆహారం. చీమలు, ఉసుర్లు వంటి చిన్న చిన్న పురుగులను ఎన్నింటిని తిన్నా చెదలు కనిపిస్తే పరమాన్నం దొరికినంత సంబరపడిపోతుంటుంది. కలివిపొదల కొమ్మలు, రెమ్మలు నేలకు తాకుతూ ఉండడంతో వీటిని చెదలు ఎక్కువగా ఆశ్రయిస్తుంటాయి. పైన మట్టి పూత వేసి లోన ఎంత దాక్కున్నా అవి కలివికోడి దృష్టి నుంచి తప్పించుకోలేవు. రాత్రి మాత్రమే ఇది ఆహారం తీసుకొని పగలంతా విశ్రాంతిగా ఉంటుంది. కలివికోడి మల విసర్జనను(రెట్ట)ను గుర్తించి పలుమార్లు పరిశోధకులు చేసిన పరీక్షల్లో ఈ విషయం బైటపడింది. కలివికోడి ‘విసర్జన’లో చెదలకు సంబంధించిన పెంకుల్లాంటి జీర్ణం కాని నోటి భాగాలు (మాండిబుల్స్‌) కనిపించాయి. అయితే ఈపక్షి దాహం ఎలా తీర్చుకుంటుంది, ఒక్కసారి నీరు తాగితే ఎంత సమయం ఉండగలదు అన్న వివరాలు ఇంకా తెలుసుకోలేకపో తున్నారు.

కూహు... కూహు... స్వరాల రాగాలు...
కూహూ... కూహూ... స్వరాల రాగాలతో కలివికోడి పక్షి ప్రపంచంలో తన ప్రత్యేకతను మరో మారు చాటుకుంటోంది. వేల రకాల పక్షుల కూతల్లో లివికోడి కూత ఇట్టే పట్టేయవచ్చు. కోయిలను మించి పోయి అరగంటైనా నిరంతరంగా కూత పెట్టే ఈ పక్షి నవంబరు నుంచి మార్చి మధ్య ఎక్కువగా కూత పెడుతూ ఉంటుంది. శీతాకాలం చలి ప్రభావమో ఏమో కానీ ఈ సమయంలోనే గుడ్లు పెట్టి పొదిగే కాలం కావచ్చన్నది పరిశోధకుల అభిప్రాయం. అయితే ఇది ఎప్పుడు గుడ్లు పెడుతుంది, ఎక్కడ పెడుతుంది, ఎన్ని గుడ్లు పెడుతుంది అన్నది ఇంకా ‘శోధన’ దశలోనే ఉంది. మగ, ఆడ పక్షుల లింగబేధాలు, అవి జత కట్టేందుకు వాతావరణ అనుకూలత తదితర కోణాల్లో పరిశోధనలు పురోగమించాల్సి ఉంది. ఈ పక్షుల ఈకలు గుర్తిస్తూ రాల్చిన ఈకలను పరీక్ష చేస్తున్నారు.

11bకలివికోడి కనుగొన్న తీరు...
రెండు దశాబ్ధాల కిందటి ముచ్చట ఇది. 1986 జనవరి 5. చలికాలం. కడప జిల్లా అట్లూరు మండలం రెడ్డిపల్లె సమీపంలో లంకమల చిట్టడవులు అవి. రాత్రి 2గంటల సమయం. రెండు వింతైన పక్షులు వేటగాడి టార్చిలైట్‌ వెలుగులో తళుక్కున మెరిశాయి. పొడవాటి ర్రకు ఉచ్చు తగిలించిన వేటగాడు దగ్గరకుపోయి వాటి మెడకు ఉచ్చు తగిలించపోయాడు. ఓ పక్షి గిర్రున ఎగిరిపోయింది. అప్పటికే మంచులో తడిసి ముద్ద అయిన ఆ పక్షి ఎగిరేందుకు తడిసిన రెక్కలు సహకరించక, పరిగెత్తే శక్తి లేక వేటగాడి ఉచ్చుల గవాక్షం నుంచి జన ప్రపంచంలోకి తొంగి చూసింది. ఆనాటి వేటగాడు నేటి ఫారెస్ట్‌గార్డు. కలివికోడిని ఉచ్చులో పట్టి ఈ పక్షి ఇంకా బతికే ఉందని ప్రపంచానికి చాటిన ఆనాటి వేటగాడు ఐతన్నను అదే అడవికి ప్రభుత్వం నియమించిన ఫారెస్ట్‌గార్డ్‌.

పక్షిని పట్టిన తీరు ‘ఐతన్న’ మాటల్లోనే...
మాది రెడ్డిపల్లె. గొర్రెల కాసుకుంటూ అడవికి పోతుంటి. 20 ఏళ్ల కిందట భరత భూషణ్‌ అనే రేంజ్‌ ఆఫీసర్‌ ఈ ప్రాంతానికి వచ్చారు. నా దగ్గర ఒక ఫోటో చూపి ఇలాంటి పక్షిని చూశావా, చూస్తే కనిపిస్తే పట్టిస్తే రూ.1116లు బహుమానం, ఉద్యోగం ఇస్తా అని ప్రకటించారు. పక్షి గుర్తులు వివరించే ఫోటో ఇచ్చారు. ఇలాంటి పక్షులు చూశా అని గొర్లు, ఆవులు కాసేవారు అనుకుంటున్నారని చె ప్పాను. నేనే రాత్రి వేళల్లో 8 నెలలు తిరిగాను. నాకే 1986 జనవరి 5న కనిపించింది. ఉచ్చు వేసి పట్టి తువ్వాల్లో మూటగట్టి ఇంటికి తెచ్చాను. గంప కింద మూశా.

joorతెల్లారాక సిద్దవటం రేంజర్‌ మద్దిలేటికి విషయం చెప్పాను. ఆయన చూసి డి ఎఫ్‌ఓకు చెప్పారు. మరోమారు భరతభూషణ్‌ వచ్చి ఆ పక్షి ఇదేనని నిర్ధారించారు. ఢిల్లీకి టెలిగ్రామ్‌ కొట్టారు. గంప కింద ఉన్న పక్షికి సొద్దలు, కొర్రలు, రాగి గింజలు వేశా. తినలేదది. అలాగే ఉంది. వారం అయింది. పక్షి శాస్తవ్రేత్త సలీంఅలీతో పాటు ఉన్నతాధికారులు వచ్చారు. గంప కింద ముడుచుకుపోయిన పక్షిని చూశారు. పక్షి దొరికిన ప్రాంతం చూపించాను. తిరిగి ఇంటికొచ్చే సరికి పక్షి చనిపోయింది. పొట్ట చీల్చి, పేగులు తీసి పొడి నింపి పక్షిని తీసుకుపోయారు. నాకు నెలకు 500 ఇచ్చి పక్షిని చూపేందుకు వెంట తిప్పే పని చూపారు. 1990లో వాచర్‌గా ఉద్యోగం రెగ్యులర్‌ చేశారు. ఇంక ఆ పక్షి పుణ్యమా అని నెలకు 7500 జీతం తీసుకుంటున్నా. మా కుటుంబం అంతటికీ ఆధారం ఆ పక్షే.

తెలుగుగంగను నిలేసిన కలివికోడి...
పిడికెడు దాటని ఈ పిట్ట వేల కోట్లతో ప్రభుత్వం చేపట్టిన తెలుగుగంగ పథకాన్నే నిలేసింది. దీని దెబ్బకు భారీ ప్రొక్లెయిన్లే తొండముడిచాయి. గంగ కాలువ దారి మళ్లించుకోక తప్పని పరిస్థితులు తలెత్తాయి. తన ఆవాసంలో తిప్పిన కాల్వను మళ్లీ పూడ్చి వేసేదాకా వదలలేదు. అందుకు బాధ్యులైన వారిని కోర్టుకీడ్చి దోషులుగా నిలబెట్టింది. తెలుగుగంగ పథకం కింద శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి రిజర్వాయరు దిగువన తెలుగుగంగ కుడి ప్రధాన కాల్వ 30 కిమీ నుంచి 40 కిమీ వరకు కలివికోడి ఆవాసమైన అభయారణ్యంలో తవ్వకాలు జరిపేందుకు గంగ అధికారులు సిద్ధమయ్యారు.

ప్రొక్లైన్లతో 400 మీటర్ల కాలువ కూడా తవ్వారు. అయితే అభయారణ్యంలోకి అనుమతి లేకుండా అక్రమంగా ప్రవేశించి తవ్వకాలు జరిపినట్లు గుర్తించిన కడప అటవీశాఖాధికారులు 2005 నవంబరు 23న కేసు నమోదు చేశారు. ఐవి ఆర్‌సి ఎల్‌ కంపెనీకి చెందిన ప్రొక్లైన్‌, జీపు సీజ్‌ చేశారు. సెక్షన్‌ 27-1, 29 ఐపిసి 141,149,వైల్డ్‌లైఫ్‌ ప్రొటె క్షన్‌ యాక్టు 1972ల కింద గంగ పనులు చేస్తున్న ఐవి ఆర్‌సి ఎల్‌ కంపెనీ అధికారులు తొమ్మిది మందిపై కేసులు నమోదు చేసి కోర్టుకు అప్పగించారు. బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీ కూడా దీనిపై తీవ్రంగా స్పందించింది.

aఅరుదైన కలివికోడి ఉనికినే ప్రశ్నార్ధకం చేస్తున్నారని ఆందోళన వెలిబుచ్చింది. 2006 మార్చిలో సుప్రీంకోర్టు సమస్య పరిష్కారం కోసం సాధికారిక కమిటిని వేసింది. ఈ కమిటిలో బి ఎన్‌హెచ్‌ ఎస్‌ డైరెక్టర్‌, ప్రభుత్వ కార్యదర్శి, నీటిపారుదల చీఫ్‌ ఇంజనీరులు సభ్యులుగా జాయింట్‌ మీటింగుల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటికే ప్రస్తుతం ఉన్న కాలువ తవ్వకం అలైన్‌మెంట్‌ను మార్చుకొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు నివేదిక సమర్పించింది. ఇదే జరిగితే బద్వేలు ప్రాంతంలో రెడ్డిపల్లె, వెంకటశెట్టిపల్లె, తిప్పనపల్లె తదితర గ్రామాలకు చెందిన 2వేల ఎకరాలకు గంగనీరు అందకుండా పోతుందని ఈ గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్లు ఏ పక్షినైతే సంరక్షించుకుంటూ వచ్చామో అదే పక్షి తమ నోటి కాడ కూడు లాగేస్తుందన్న ఆవేదన ఆ గ్రామస్తుల్లో గూడు కట్టుకుంది.

ఫలిస్తున్న పరిశోధనలు...
ప్రపంచ చిత్రపటం నుంచి కనుమరుగైందని భావించిన కలివికోడి కడప జిల్లా అడవుల్లో ప్రత్యక్షం కావడంతో దీనిపై మరిన్ని పరిశోధనలు జరిపేందుకు బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీ రంగంలోకి దిగింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో జనవరి 2000 సంవత్సరం నుంచి ఇక్కడ బి ఎన్‌హెచ్‌ ఎస్‌ ప్రతినిధిగా జగన్నాధన్‌ పరిశోధనలు చేస్తున్నారు. పక్షిని ఎన్నోసార్లు చూసినా దాన్ని పట్టుకొనేందుకు అనుమతి లేకపోవడంతో పరిశోధనలు ఆశించిన రీతిలో ముందడుగు పడడంలేదు. అయితే ఇటీవలే ఈ పక్షిని పట్టుకొనేందుకు అనుమతి లభించింది.

రేడియో టెలిమీటర్‌ ప్రయోగం...
కలివికోడిని పట్టుకొని రేడియో టెలిమీటర్‌ ప్రయోగం చేస్తే ఈ పక్షి గుట్టుమట్టు బైట పడ్డట్టే అని పరిశోధకుల అభిప్రాయం. మూడు నెలల్లో దీని హోంరేంజ్‌ తెలిసిపోతుందంటున్నారు. ఈ పక్షి ఇతర పక్షులతో కలుస్తుందా, లేదా, సంతానోత్పత్తి, జీవితకాలం తదితర వివరాలు రేడియో టెలిమీటర్‌ ప్రయోగంతో కనిపెట్టవచ్చంటు న్నారు.

ఇప్పటి దాకా సాగిన పరిశోధనలు పరిశీలిస్తే.. తీతువుపిట్ట, పూరేలు, కంజులను పోలి ఉండే ఈ కలివికోడి కాళ్ల వేళ్లను కెమెరా ట్రాప్‌ల ద్వారా గుర్తించారు. తొలిసారి ఇండియాలో ఈ కెమెరాట్రాప్‌ను కలివికోడి కోసం కడప జిల్లాలో ఉపయోగిస్తున్నారు. ఇన్‌ఫ్రారెడ్‌ కట్‌ అయితే ఫ్లాష్‌ వెలిగే ఈ కెమెరాలను ఇక్కడ ఎనిమిదింటిని ఏర్పాటు చేశారు. కలివికోడి తిరుగాడే ఆవాసాలను గుర్తించి మెత్తటి ఇసుక మట్టిని పట్టిలుగా నేలపై పోసి కాలి వేళ్లను గమనిస్తున్నారు. ట్రాకింగ్‌ స్ట్రిప్‌లపై పడ్డ పాదం గుర్తులను ఒకే స్థలంలో నెలరోజులు పరిశీలన చేసి ట్రైల్‌ మాస్టర్‌ కెమెరాలు ఉపయోగిస్తున్నారు.

కూత రికార్డింగ్‌...
కలివికోడి కూతను టేప్‌రికార్డర్‌లలో రికార్డు చేయగలిగారు. ఈ కూతను చిన్న బాక్సుల్లో రీరికార్డు చేసి ప్రజలకు వినిపిస్తూ ఈ పక్షి ఆవాసం గుర్తించేందుకు ప్రకటనలు, బోర్డుల ద్వారా ప్రచారం చేస్తున్నారు.

ప్రజలే రక్షణ...
ప్రపంచంలోనే అరుదైన కలివికోడి సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చర్యలంటూ అందుకు సంబంధించిన నిధుల కేటాయింపులేవీ చేపట్టలేదు. 1986లో రెడ్డిపల్లె పరిసరాల్లో ఈ పక్షిని గుర్తించడం, పక్షి శాస్త్ర పితామహుడు సలీంఆలీ ఇక్కడికి రావడంతో ఈ పక్షి ప్రాముఖ్యతను గుర్తించి ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని లంకమల అభయారణ్యంగా ప్రకటించింది.