చేకూరి గౌతమరాజు

చేకూరి గౌతమరాజు
Facebook

Friday, December 24, 2010

కసితోనే ఎదిగాను * నామొదటి జీతం రూపాయి * మా ఆవిడే నా లైఫ్‌కు 'పాస్‌వర్డ్'

 

కసితోనే ఎదిగాను
నామొదటి జీతం రూపాయి
అమ్మపెళ్లి చీర అమ్మి చదివించింది
అమెరికా నుంచి వచ్చి దొరల గడీనికొన్నా
నాతొలి రాజకీయ గురువు పీవీ
ఐదారేళ్లలో చేవెళ్ల-ప్రాణహిత పూర్తి
వైయస్‌తో రాసుకుపూసుకు తిరగలేదు
తెలంగాణపై అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం
మా ఆవిడే నా లైఫ్‌కు 'పాస్‌వర్డ్'
ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కేలో పొన్నాల లక్ష్మయ్య

మీ కుటుంబ నేపథ్యమేంటి?
నాలుగేళ్ల వయసులో మా తండ్రిగారు చనిపోయారు. అమ్మ వ్యవసాయ కూలీ. మేం నలుగురం. చిన్నప్పుడు నెలకు రూపాయి జీతానికి గ్రంథాలయంలో పనిచేశా. అర్ధరూపాయితో నెలకు కావల్సిన ఎండుమిరప కారం, నూనె వచ్చేవి.

దొరల గడీల్లో దొంగతనంగా రేడియో విని, దొరసానుల చివాట్లు తిన్నారా?
ఆ ఛాయలకు వెళ్లే పరిస్థితే ఉండేది కాదు. మా దొరవారి బావమరిది మాతో బాగుండేవారు. ఓరోజు ఆయన మమ్మల్ని తీసుకెళ్లారు. మేం హాల్లో ఉంటే వాళ్ల అక్క వచ్చి మందలించారు. దాంతో కసి పుట్టింది. 68లో అమెరికా వెళ్లాను. 71లో అదే దొరలు భూములన్నీ పోగొట్టుకుని, ఆ గడి ఒక్కటే మిగలగా.. నేను ఆ కసితో కొనేశాను. ఆవిడకు టూ ఇన్ వన్ తెచ్చాను.

ఉన్నత చదువులు ఎలా చదివారు?
నేను 8 వరకు మా ఊళ్లో చదివాను. 9వ తరగతి కోసం వరంగల్ మల్టీపర్పస్ స్కూలుకు వెళ్తే అడ్మిషన్ ఫీజు 14 రూపాయలు. దాని కోసం మా అమ్మ తన పెళ్లినాటి పట్టుచీర అమ్మింది. తర్వాత నేను లాయర్ అవుతానంటే మా టీచర్ లక్ష్మయ్యగారు కోప్పడి ఇంజనీరింగ్ చదవమన్నారు. స్కాలర్ షిప్‌లు తీసుకుని ఆర్ఈసీలో చేరాను. పాత రోజులు తలచుకుంటే కళ్లలో నీళ్లు వస్తాయి. జీన్స్ సినిమా డిటో మా చరిత్రే. 75లో నేను మా అమ్మను అమెరికా తీసుకెళ్లాను.

అమెరికా వెళ్లాలని మీకు ఎందుకు అనిపించింది?
ఇంజనీరింగ్ రెండో సంవత్సరం పూర్తికాగానే అమెరికా వర్సిటీలకు రాసి, నాలుగు వర్సిటీలలో అడ్మిషన్లు తెచ్చుకున్నాను. ఫైనలియర్‌లో దేశంలోని వంద పైచిలుకు ట్రస్టులకు దరఖాస్తు చేశాను. నిజాం ట్రస్టు వాళ్లు విమాన చార్జీలిచ్చారు. సిండికేట్ బ్యాంకు మేనేజర్ పురోహిత్.. నావద్ద రూ. 20 ఉన్నాయా అని అడిగారు. ఆ 20తో అకౌంట్ తెరిస్తే, దాంట్లో రుణంగా రూ. 5వేలు వేస్తామన్నారు. నేను షాకయ్యాను. అలా అమెరికా వెళ్లాను. తర్వాత సాయం చేసిన వారందరి రుణం తీర్చుకున్నాను.

రాజకీయాల్లో తొలి గురువు ఎవరు?
78లో అమెరికా నుంచి వచ్చాను. నేను వచ్చిన రోజే ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 85లో తొలిసారి టికెట్ వచ్చినా ఓడిపోయాను. తర్వాత పీవీని చూసి.. నాకు కోశాధికారి పదవి ఇచ్చారు. మావాళ్లంతా నన్ను డాలర్ లక్ష్మయ్య అనేవారు.

నీటిపారుదల శాఖ మంత్రి అయ్యాక ఎక్కువగా వార్తల్లో నిలిచారు కదా?
ఇందులో పనులు ఎక్కువ, బడ్జెట్ ఎక్కువ, విమర్శలూ ఎక్కువే. ఉభయగోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన కాటన్ అక్కడ హౌస్ ఆఫ్ కామన్స్‌లో దోషిగా నిలిచారు. జలయజ్ఞంపై ప్రస్తుతం చాలా అనుమానాలున్నాయి. కానీ ఇప్పుడు చేయలేకపోతే ఇంకెప్పుడూ చేయలేం. ప్రాణహిత-చేవెళ్లకు సమయం పడుతుంది. కానీ సాంకేతికంగా అవకాశం ఉన్నప్పుడు భవిష్యత్తు దృష్ట్యా ముందుకు వెళ్లాలి. ఐదారేళ్లలో పూర్తిచేసి, ప్రజల అవసరాలు తీరుస్తాం. జలయజ్ఞానికి ఇంతవరకు దాదాపు 50వేల కోట్లు ఖర్చయింది. దుర్వినియోగంపై ఎవరి అంచనాలు వారివి.

వైఎస్ వర్గంతో మీరిప్పుడు దూరంగా ఉంటున్నారా?
వైఎస్ ఉన్నప్పుడూ ఆయన్ను నేను కలిసేది తక్కువ. కలిసినా ఒకటి, రెండు నిముషాలు మాట్లాడి వెళ్లిపోయేవాడిని. రాసుకు పూసుకు తిరిగేవాడిని కాను. అదే విషయం నేను జగన్‌కూ చెప్పాను. గౌరవ మర్యాదలు, రాజకీయాలు వేరు.

మీరు సరదాగా కబడ్డీ ఆడతారు, లేదా బాగా సీరియస్ అవుతారు. ఎందుకలా?
నేను ఒక రోజు 98 కోట్ల ఆస్తులు పంచాను. దాని గురించి ఒక్క లైనే వచ్చింది. అదే రోజు కబడ్డీ ఆడితే దేశమంతా వచ్చింది. నేను ఆ పనీ చేస్తున్నా, ఈ పనీ చేస్తున్నా. మొదట్లో అవాస్తవాలు చూసి బీపీ పెరిగేది. తర్వాత కాస్త నియంత్రించుకున్నాను.

మీరు తెలంగాణకు అనుకూలమా?
మేం పార్టీకి కట్టుబడి ఉన్నాం. పార్టీ దాన్ని గుర్తించింది. పార్టీ నిర్ణయమే శిరోధార్యం. పార్టీ ఆ దిశగా అడుగులేస్తుందని భావిస్తున్నాం. పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకున్నాక పదేపదే బయట మాట్లాడక్కర్లేదు.

తెలంగాణ రాష్ట్రంలో పొన్నాలను సీఎంగా చూడొచ్చా?
అది పార్టీ, నాయకులు, ప్రజాప్రతినిధుల ఇష్టం. పదవుల కోసం ఎప్పుడూ ప్రయత్నాలు చేయలేదు. నోరెత్తి ఏమీ అడగలేదు. సమయం, సందర్భం, అన్నీ కలిసిరావాలి. వ్యక్తిగత జీవితం అంతా బాగుంది. ఇంటికి ఎక్కువ రావట్లేదని మా భార్య అంటుంది. నువ్వే నా జీవితానికి పాస్‌వర్డ్ అని చెబుతుంటాను. నిజంగానే నా మెయిల్ ఐడీకి ఆమె పేరే పాస్‌వర్డ్.

No comments:

Post a Comment