
బ్రిటీష్ సైన్యంలో వైద్యాధికారిగా పనిచేసిన డాక్టర్ టి.సి. జోర్డాన్ ఈవింత పక్షిని తొలిసారిగా గుర్తించారు. వేలాది పక్షి జాతుల్లో ఒకే నమూనా పోలి కనిపించే కొన్ని రకాల పక్షులను కొర్సర్స్‌గా పిలుస్తుంటారు. అలాంటి పక్షుల్లో ఒకటిగా ఉండి అంతరించిపోయినట్లు కొంత కాలం ప్రపంచాన్ని నమ్మించిన ఈ పక్షిని తొలిసారి 1848లో జోర్డాన్స్‌కు సెంట్రల్ ఇండియాలో కనిపించింది. 1900 దాకా ఈ పక్షిని ఆయనే అక్కడక్కడా అరుదుగా చూస్తూ వచ్చారు. ఇక ఆ తరువాత అది ఎంత వెదికినా కనిపించలేదు. 86 ఏళ్ల తరువాత ఇది తిరిగి కడప జిల్లా లంకమల అడవుల్లో ప్రత్యక్షమై పక్షి ప్రపంచాన్నే అబ్బురపరిచింది. భూ ప్రపంచంలో ఇక పూర్తిగా అంతరించిపోయిందనుకున్న ఈ పక్షి ఇంకా బతికే ఉందని లోకానికి చాటి చెప్పిన టిసి జోర్డాన్ జ్ఞాపకార్ధం ఈ పక్షికి జోర్డాన్ కొర్రర్స్‌గా పేరు పెట్టారు.
సహజ కంఠాభరణం కలివికోడి సొంతం...

చిట్టడవులు, కలివిపొదలు ఆవాసం...
అన్ని పక్షుల్లాగే హాయిగా గగన తలంలో విహరించే శక్తి ఉన్నా ఈ పక్షి ఆవాసం చిట్టడవులు, చిరుపొదలే. కలివిచెట్ల మాటునే ఇది కోడిలా గెంతుతూ కనిపిస్తుంటుంది. అందుకే దీన్ని కలివికోడిగా పిలుస్తుంటారు. ఒకప్పుడు మహావృక్షాలతో అలరారిన అడవులస్థానంలో క్షీణదశకు చేరి చిట్టడవులుగా మిగిలిన పొదలు, అందులోనూ కలివి పొదలు కలివికోడికి ఆవాస నివాసాలు. ఈ పొదలే తనకు సురక్షితమైన నివాసాలుగా ఈ పక్షులు భావిస్తాయి. పగలంతా ఈ కలివి పొదల్లోనే విశ్రాంతి తీసుకుంటూ చీకటిపడగానే మెల్లమెల్లగా పొదల నుంచి అడుగులో అడుగు వేస్తూ పరిసరాలను పరికించి చూస్తూ బైటకొస్తుంటాయి.

కలివి పొదల్లో తిరుగాడే ఈపక్షికి చెద పురుగులే ప్రధాన ఆహారం. చీమలు, ఉసుర్లు వంటి చిన్న చిన్న పురుగులను ఎన్నింటిని తిన్నా చెదలు కనిపిస్తే పరమాన్నం దొరికినంత సంబరపడిపోతుంటుంది. కలివిపొదల కొమ్మలు, రెమ్మలు నేలకు తాకుతూ ఉండడంతో వీటిని చెదలు ఎక్కువగా ఆశ్రయిస్తుంటాయి. పైన మట్టి పూత వేసి లోన ఎంత దాక్కున్నా అవి కలివికోడి దృష్టి నుంచి తప్పించుకోలేవు. రాత్రి మాత్రమే ఇది ఆహారం తీసుకొని పగలంతా విశ్రాంతిగా ఉంటుంది. కలివికోడి మల విసర్జనను(రెట్ట)ను గుర్తించి పలుమార్లు పరిశోధకులు చేసిన పరీక్షల్లో ఈ విషయం బైటపడింది. కలివికోడి ‘విసర్జన’లో చెదలకు సంబంధించిన పెంకుల్లాంటి జీర్ణం కాని నోటి భాగాలు (మాండిబుల్స్) కనిపించాయి. అయితే ఈపక్షి దాహం ఎలా తీర్చుకుంటుంది, ఒక్కసారి నీరు తాగితే ఎంత సమయం ఉండగలదు అన్న వివరాలు ఇంకా తెలుసుకోలేకపో తున్నారు.
కూహు... కూహు... స్వరాల రాగాలు...
కూహూ... కూహూ... స్వరాల రాగాలతో కలివికోడి పక్షి ప్రపంచంలో తన ప్రత్యేకతను మరో మారు చాటుకుంటోంది. వేల రకాల పక్షుల కూతల్లో లివికోడి కూత ఇట్టే పట్టేయవచ్చు. కోయిలను మించి పోయి అరగంటైనా నిరంతరంగా కూత పెట్టే ఈ పక్షి నవంబరు నుంచి మార్చి మధ్య ఎక్కువగా కూత పెడుతూ ఉంటుంది. శీతాకాలం చలి ప్రభావమో ఏమో కానీ ఈ సమయంలోనే గుడ్లు పెట్టి పొదిగే కాలం కావచ్చన్నది పరిశోధకుల అభిప్రాయం. అయితే ఇది ఎప్పుడు గుడ్లు పెడుతుంది, ఎక్కడ పెడుతుంది, ఎన్ని గుడ్లు పెడుతుంది అన్నది ఇంకా ‘శోధన’ దశలోనే ఉంది. మగ, ఆడ పక్షుల లింగబేధాలు, అవి జత కట్టేందుకు వాతావరణ అనుకూలత తదితర కోణాల్లో పరిశోధనలు పురోగమించాల్సి ఉంది. ఈ పక్షుల ఈకలు గుర్తిస్తూ రాల్చిన ఈకలను పరీక్ష చేస్తున్నారు.

రెండు దశాబ్ధాల కిందటి ముచ్చట ఇది. 1986 జనవరి 5. చలికాలం. కడప జిల్లా అట్లూరు మండలం రెడ్డిపల్లె సమీపంలో లంకమల చిట్టడవులు అవి. రాత్రి 2గంటల సమయం. రెండు వింతైన పక్షులు వేటగాడి టార్చిలైట్ వెలుగులో తళుక్కున మెరిశాయి. పొడవాటి ర్రకు ఉచ్చు తగిలించిన వేటగాడు దగ్గరకుపోయి వాటి మెడకు ఉచ్చు తగిలించపోయాడు. ఓ పక్షి గిర్రున ఎగిరిపోయింది. అప్పటికే మంచులో తడిసి ముద్ద అయిన ఆ పక్షి ఎగిరేందుకు తడిసిన రెక్కలు సహకరించక, పరిగెత్తే శక్తి లేక వేటగాడి ఉచ్చుల గవాక్షం నుంచి జన ప్రపంచంలోకి తొంగి చూసింది. ఆనాటి వేటగాడు నేటి ఫారెస్ట్‌గార్డు. కలివికోడిని ఉచ్చులో పట్టి ఈ పక్షి ఇంకా బతికే ఉందని ప్రపంచానికి చాటిన ఆనాటి వేటగాడు ఐతన్నను అదే అడవికి ప్రభుత్వం నియమించిన ఫారెస్ట్‌గార్డ్.
పక్షిని పట్టిన తీరు ‘ఐతన్న’ మాటల్లోనే...
మాది రెడ్డిపల్లె. గొర్రెల కాసుకుంటూ అడవికి పోతుంటి. 20 ఏళ్ల కిందట భరత భూషణ్ అనే రేంజ్ ఆఫీసర్ ఈ ప్రాంతానికి వచ్చారు. నా దగ్గర ఒక ఫోటో చూపి ఇలాంటి పక్షిని చూశావా, చూస్తే కనిపిస్తే పట్టిస్తే రూ.1116లు బహుమానం, ఉద్యోగం ఇస్తా అని ప్రకటించారు. పక్షి గుర్తులు వివరించే ఫోటో ఇచ్చారు. ఇలాంటి పక్షులు చూశా అని గొర్లు, ఆవులు కాసేవారు అనుకుంటున్నారని చె ప్పాను. నేనే రాత్రి వేళల్లో 8 నెలలు తిరిగాను. నాకే 1986 జనవరి 5న కనిపించింది. ఉచ్చు వేసి పట్టి తువ్వాల్లో మూటగట్టి ఇంటికి తెచ్చాను. గంప కింద మూశా.

తెలుగుగంగను నిలేసిన కలివికోడి...
పిడికెడు దాటని ఈ పిట్ట వేల కోట్లతో ప్రభుత్వం చేపట్టిన తెలుగుగంగ పథకాన్నే నిలేసింది. దీని దెబ్బకు భారీ ప్రొక్లెయిన్లే తొండముడిచాయి. గంగ కాలువ దారి మళ్లించుకోక తప్పని పరిస్థితులు తలెత్తాయి. తన ఆవాసంలో తిప్పిన కాల్వను మళ్లీ పూడ్చి వేసేదాకా వదలలేదు. అందుకు బాధ్యులైన వారిని కోర్టుకీడ్చి దోషులుగా నిలబెట్టింది. తెలుగుగంగ పథకం కింద శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి రిజర్వాయరు దిగువన తెలుగుగంగ కుడి ప్రధాన కాల్వ 30 కిమీ నుంచి 40 కిమీ వరకు కలివికోడి ఆవాసమైన అభయారణ్యంలో తవ్వకాలు జరిపేందుకు గంగ అధికారులు సిద్ధమయ్యారు.
ప్రొక్లైన్లతో 400 మీటర్ల కాలువ కూడా తవ్వారు. అయితే అభయారణ్యంలోకి అనుమతి లేకుండా అక్రమంగా ప్రవేశించి తవ్వకాలు జరిపినట్లు గుర్తించిన కడప అటవీశాఖాధికారులు 2005 నవంబరు 23న కేసు నమోదు చేశారు. ఐవి ఆర్‌సి ఎల్ కంపెనీకి చెందిన ప్రొక్లైన్, జీపు సీజ్ చేశారు. సెక్షన్ 27-1, 29 ఐపిసి 141,149,వైల్డ్‌లైఫ్ ప్రొటె క్షన్ యాక్టు 1972ల కింద గంగ పనులు చేస్తున్న ఐవి ఆర్‌సి ఎల్ కంపెనీ అధికారులు తొమ్మిది మందిపై కేసులు నమోదు చేసి కోర్టుకు అప్పగించారు. బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ కూడా దీనిపై తీవ్రంగా స్పందించింది.

ఫలిస్తున్న పరిశోధనలు...
ప్రపంచ చిత్రపటం నుంచి కనుమరుగైందని భావించిన కలివికోడి కడప జిల్లా అడవుల్లో ప్రత్యక్షం కావడంతో దీనిపై మరిన్ని పరిశోధనలు జరిపేందుకు బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ రంగంలోకి దిగింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో జనవరి 2000 సంవత్సరం నుంచి ఇక్కడ బి ఎన్‌హెచ్ ఎస్ ప్రతినిధిగా జగన్నాధన్ పరిశోధనలు చేస్తున్నారు. పక్షిని ఎన్నోసార్లు చూసినా దాన్ని పట్టుకొనేందుకు అనుమతి లేకపోవడంతో పరిశోధనలు ఆశించిన రీతిలో ముందడుగు పడడంలేదు. అయితే ఇటీవలే ఈ పక్షిని పట్టుకొనేందుకు అనుమతి లభించింది.
రేడియో టెలిమీటర్ ప్రయోగం...
కలివికోడిని పట్టుకొని రేడియో టెలిమీటర్ ప్రయోగం చేస్తే ఈ పక్షి గుట్టుమట్టు బైట పడ్డట్టే అని పరిశోధకుల అభిప్రాయం. మూడు నెలల్లో దీని హోంరేంజ్ తెలిసిపోతుందంటున్నారు. ఈ పక్షి ఇతర పక్షులతో కలుస్తుందా, లేదా, సంతానోత్పత్తి, జీవితకాలం తదితర వివరాలు రేడియో టెలిమీటర్ ప్రయోగంతో కనిపెట్టవచ్చంటు న్నారు.
ఇప్పటి దాకా సాగిన పరిశోధనలు పరిశీలిస్తే.. తీతువుపిట్ట, పూరేలు, కంజులను పోలి ఉండే ఈ కలివికోడి కాళ్ల వేళ్లను కెమెరా ట్రాప్‌ల ద్వారా గుర్తించారు. తొలిసారి ఇండియాలో ఈ కెమెరాట్రాప్‌ను కలివికోడి కోసం కడప జిల్లాలో ఉపయోగిస్తున్నారు. ఇన్‌ఫ్రారెడ్ కట్ అయితే ఫ్లాష్ వెలిగే ఈ కెమెరాలను ఇక్కడ ఎనిమిదింటిని ఏర్పాటు చేశారు. కలివికోడి తిరుగాడే ఆవాసాలను గుర్తించి మెత్తటి ఇసుక మట్టిని పట్టిలుగా నేలపై పోసి కాలి వేళ్లను గమనిస్తున్నారు. ట్రాకింగ్ స్ట్రిప్‌లపై పడ్డ పాదం గుర్తులను ఒకే స్థలంలో నెలరోజులు పరిశీలన చేసి ట్రైల్ మాస్టర్ కెమెరాలు ఉపయోగిస్తున్నారు.
కూత రికార్డింగ్...
కలివికోడి కూతను టేప్‌రికార్డర్‌లలో రికార్డు చేయగలిగారు. ఈ కూతను చిన్న బాక్సుల్లో రీరికార్డు చేసి ప్రజలకు వినిపిస్తూ ఈ పక్షి ఆవాసం గుర్తించేందుకు ప్రకటనలు, బోర్డుల ద్వారా ప్రచారం చేస్తున్నారు.
ప్రజలే రక్షణ...
ప్రపంచంలోనే అరుదైన కలివికోడి సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చర్యలంటూ అందుకు సంబంధించిన నిధుల కేటాయింపులేవీ చేపట్టలేదు. 1986లో రెడ్డిపల్లె పరిసరాల్లో ఈ పక్షిని గుర్తించడం, పక్షి శాస్త్ర పితామహుడు సలీంఆలీ ఇక్కడికి రావడంతో ఈ పక్షి ప్రాముఖ్యతను గుర్తించి ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని లంకమల అభయారణ్యంగా ప్రకటించింది.
![]() | ![]() |
![]() |
No comments:
Post a Comment