చేయండి ట్రేలో ఉన్నవన్నీ మరీ పాతగా ఉన్నాయి. నలిగిపోయి కొన్ని చోట్ల అక్షరాలు కూడా సరిగ్గా కనిపించడం లేదు.
మార్చండి ట్రేలో వన్నీ టైపు చేసిన పిటిషన్లే కాని ఎక్కువ లేవు.
ఆపండి ట్రేలో మాత్రం కట్టలు కట్టలు ఉన్నాయి. కాగితాలతో పాటు సిడిలు, డివిడిలు ఉన్న కవర్లు కూడా ఉన్నాయి.
ముందు పాతవే చూద్దామని చేయండి ట్రేలోని కాగితాలు బయటకు తీశారు. మా ఊరికి కరెంటు, రోడ్డు, స్కూలు, మంచినీరు, సాగునీరు, రేషన్ వగైరా సౌకర్యాలు కలగచేయండి వంటి దరఖాస్తులు ఉన్నాయందులో.
మార్చండి ట్రేలో తర్వాతి దశ సమస్యలు కనిపించాయి. ఫలానా ఎస్.పి మరీ కర్కోటకంగా ఉన్నాడు కాబట్టి మా జిల్లా నుంచి మార్చేయండి అని (వేరే జిల్లా వాళ్లు ఏమైపోవాలనో) ఒక పిటిషన్. లేదా ఫలానా డాక్టర్, టీచర్, హెల్పర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, విఎఒ, ఇంజనీర్, కాంట్రాక్టరు ఇలా ఎవరో ఒకర్ని బదిలీ చేయమన్న కోరికలే అవన్నీ. విద్యావిధానాన్ని మార్చండి, పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చండి లాంటి డిమాండ్లూ కొన్ని లేకపోలేదు.
ఆపండి ట్రేలో ఉన్నవి మాత్రం అన్నీ కొత్తవే. అవినీతిని ఆపండి, భూసేకరణలను ఆపండి, ధరల పెరుగుదలను ఆపండి, సెజ్‌లను ఆపండి, బాబ్లీని ఆపండి, ఓదార్పు యాత్రను ఆపండి, థర్మల్ ప్రాజెక్టులను ఆపండి, వలసలను ఆపండి, విస్థాపనలను ఆపండి, మతకలహాలను ఆపండి, మలేరియాను ఆపండి, అక్రమ మైనింగ్‌లను ఆపండి, యాసిడ్ దాడులను ఆపండి, కాలుష్యాన్ని ఆపండి, ఆత్మహత్యలను ఆపండి, అంతరాలను ఆపండి... ఇలా అసంఖ్యాక పిటీషన్‌లు ఉన్నాయి అందులో.
బంట్రోతు మరో కొత్త ట్రే పట్టుకొచ్చాడు. దానికి ఇంకా ఏ పేరూ పెట్టలేదు. కానీ అది ఖాళీగా వుండిపోతుందని అతనికి ఎందుకో గట్టిగా అనిపించింది.
No comments:
Post a Comment