పోలవరం ప్రాజెక్టుకు ఎట్టకేలకు కేంద్రం అనుమతి లభించింది.దీనికి ఎలాంటి షరతులూ లేకపోవడం విశేషం. గతంలో ఈ ప్రాజెక్టు కారణంగా పర్యా వరణానికి నష్టం కలుగుతుందని, దీని ద్వారా గిరిజనులు తమకు లభించే అటవీ లాభాన్ని కోల్పోతాయని విపక్షాలు వ్యతిరేకించాయి. దీంతో కేంద్రం ఈ అనుమతుల విషయంలో ఆచితూచి వ్యవహరిం చింది. పోలవరం వద్ద 301 శతకోటి ఘనపుటడుగుల నీటిని నిలువచేసే సామర్ధ్యంతో గోదావరిపై నిర్మించాలనుకుంటున్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖలు ఇప్పుడు పచ్చజెండా ఊపాయి.
గోదావరి నదీ జలాల ద్వారా ముంపునకు గురయ్యే అటవీ ప్రాంతం ఎంత అన్న దానిపై నివేదిక, డిజైన్లు, కాంటూర్లు పరిశీలించిన పర్యావరణ విభాగం ఎట్టకేలకు ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని అనుమతులు ఇచ్చింది. ఈ ప్రాజెక్టు ప్రాంతంలో నీటిని నిలువ చేయడం వల్ల జంతు జాలానికి కానీ, పర్యావరణ పరంగా ఇతరత్రా ఏ ఇబ్బందులూఉండవని స్పష్టం చేసింది. దీంతో ‘పోలవరం’ నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్లైంది.
ఈ ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే 3 వేల ఏడు వందల హెక్టార్ల విస్తీర్ణంలో 258 హెక్టార్లను అటవీ ప్రాంతంగా గతంలో గుర్తించారు. దీనితో పర్యావరణ అనుమతులకై రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రతిపా దనను పర్యావరణ మంత్రిత్వ శాఖ నియమించిన అటవీశాఖ సలహాదారుల సంఘం కొన్ని షరతులతో కూడిన అనుమతులు 2008 లో మొదటి దశకు ఇచ్చింది. పర్యావరణ శాఖ విధించిన అన్ని పరిమితులను పూర్తి చేసి రాష్ర్ట ప్రభుత్వం తన తుది నివేదికను గతేడాది సెప్టెంబరు మాసంలో పర్యావరణ శాఖకు అందజేసింది. ఈ నివేదికతో సంతృప్తి చెందిన పర్యావరణ శాఖ పోలవరం ప్రాజెక్టుకు పూర్తి అనుమతిని ఇచ్చింది.
సవరించిన అంచనాల ప్రకారం...
సవరించిన అంచనాల ప్రకారం రూ.10,286 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణంలో 30శాతం మేరకు పనులు పూర్తయ్యాయి. 2012-13 నాటికి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 7.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటితో పాటు 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయడం, కృష్ణానది పరీవాహక ఆయకట్టుకు 80 టీఎంసీల గోదావరి నీటిని అందించడం, విశాఖ పట్టణం పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు 23.44 టీఎంసీల నీటిని అందించడం పోలవరం ప్రాజెక్టు లక్ష్యాలుగా నిర్దేశించారు. ఇన్ని ప్రయోజనాలున్నాయి.
పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. విపక్ష నేతలు ప్రత్యేకించి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ ప్రాజెక్టుకోసం ఉద్యమాలు చేయడం తెలిసిందే. పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా లభిస్తే కేంద్రమే 90శాతం నిధులను సమకూరుస్తుంది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ‘సత్వర సాగునీటి పథకం’ (ఎఐబీపీ) కింద ఇచ్చిన రూ.300 కోట్లు అందాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వ పరంగా పోలవరానికి పర్యావరణ, అటవీ అనుమతులు కూడా లభించడంతో జాతీయ ప్రాజెక్టు హోదా కల్పనకు మార్గం సుగమం అవుతుందని సాగునీటిశాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
రైతాంగంలో పెల్లుబుకుతున్న ఆనందం
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అనుమతితో ఆరు జిల్లాల్లోని ఆయకట్టు రైతాంగంలో ఆనందం వెల్లివిరుస్తోంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి బతికుండగానే పోలవరానికి అవసరమైన చాలావరకు అనుమతులను కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి సాధించారు. ఆయన హఠాన్మరణం అనంతరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ స్థాయిల్లో వేల కోట్ల రూపాయలతో పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రధాన పంట కాల్వల పనులు కోసం, భూ సేకరణ పనులు కోసం సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల మేర ఖర్చు జరిగినట్లుగా తెలుస్తోంది.
No comments:
Post a Comment