చేకూరి గౌతమరాజు

చేకూరి గౌతమరాజు
Facebook

Wednesday, July 28, 2010

హీలింగ్ మొక్కలూ సుఖీభవ!

మొక్కలకూ భావాలుంటాయి. అవి మనలాగే ఆనందపడతాయి. బాధపడతాయి. ఏడుస్తాయి. నవ్వుతాయి.
ఇవి ఎవరో అన్న మాటలు కావు. జగదీష్ చంద్రబోస్ వంటి శాస్త్రవేత్తల పరిశోధనలలో నిగ్గు తేలిన నిజాలు.
అలాంటి పరిశోధనే మరొకటి మన హైదరాబాద్‌లో ఆచార్య రంగా విశ్వవిద్యాలయంలో ప్రారంభమయింది. దీని ఫలితాలు మనకు తెలిసిన శాస్త్ర విజ్ఞానంపైన, వ్యవసాయ పద్ధతుల మీద ప్రభావం చూపుతాయంటే అతిశయోక్తి కాదు.

"ఈ ప్రపంచమంతా శక్తిమయం. ఆ శక్తిని ఉపయోగించుకోవటం తెలిస్తే ప్రకృతి మీద మనం విజయం సాధించినట్లే'' అంటారు శాస్త్రవేత్తలు. మన భౌతిక అవసరాల కోసం నీరు, గాలి, భూమిలో ఉండే ఖనిజాలు- ఇలా అనేక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నాం. మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి మన చుట్టూ ఉండే శక్తిని ఉపయోగించుకోవచ్చని కొందరు నమ్ముతారు. ఈ శక్తిని సేకరించి ఒక క్రమపద్ధతిలో అందించే ప్రక్రియకు 'ప్రాణిక్ హీలింగ్' అని పేరు.

'ఎన్.జి. రంగా'లో ప్రయోగాలు
మన చుట్టూ అపారమైన శక్తి నిక్షేపాలు ఉన్నాయని, వాటిని మన శరీరంలోకి ప్రవేశపెట్టగలిగితే అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయని హీలింగ్‌ను నమ్మేవారు పేర్కొంటారు. ఈ శక్తికి వారు పెట్టిన పేరు 'ప్రాణ'. ఇవి మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. వీటిని శరీరంలోకి ప్రవేశపెట్టడం మొదలుపెడితే అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని ప్రాణిక్ హీలర్స్ గట్టి నమ్మకం. ఈ శాస్త్రం చాలా కాలం నుంచి ప్రచారంలో ఉన్నా- ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ మరో అడుగు ముందుకు వేసింది. కేవలం మానవుల్లోనే కాకుండా మొక్కలకు కూడా ఈ హీలింగ్ పనిచేస్తుందని నిరూపించాలని భావించింది.

"మేము ఆచార్య రంగా విశ్వవిద్యాలయంలో- మొక్కలపై ప్రాణిక్ హీలింగ్ ప్రభావాన్ని కనుగొనటానికి కొన్ని పరిశోధనలు చేశాం. టమోటా, కాప్సికం మొక్కలపై హీలింగ్ ఎటువంటి ప్రభావం చూపుతోందనే విషయాన్ని శాస్త్రీయంగా నమోదు చేశాం. దీనిలో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడ్డాయి. హీలింగ్ చేసిన మొక్కలకు, చేయని మొక్కలకు మధ్య చాలా తేడా కనిపించింది.

హీలింగ్ చేసిన మొక్కలు దిగుబడిలో మాత్రమే కాదు- అన్ని విధాలా ఆరోగ్యంగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ మొక్కలకు ఎటువంటి ఎరువులు కూడా వేయాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ పరిశోధనా ఫలితాలను విడుదల చేయలేకపోయాం. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ పరిశోధనలను మరోసారి చేయమని కోరింది. వీటి కోసం ప్రభుత్వానికి 4.5 లక్షల రూపాయలు చెల్లించి, మళ్లీ ఆచార్య రంగా విశ్వవిద్యాలయంలో పరిశోధనలు ప్రారంభించాం'' అని ఫౌండేషన్ ఛైర్ పర్సన్ డాక్టర్ శారదాంబ వెల్లడించారు.

పరిశోధన ఎలా చేశారు?
1) ఈ పరిశోధన ఆచార్య రంగా విశ్వవిద్యాలయంలోని ఇద్దరు శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో జరిగింది. వీరికి కొందరు హీలర్స్ సహాయపడ్డారు. 2) టమోటా, కాప్సికంలపై ఈ పరిశోధనలు జరిగాయి.
3) ప్రతి పంటను రెండు ప్లాట్లలో వేశారు. ప్రతి ప్లాట్‌లోను 42 మొక్కలు నాటారు. ఒక ప్లాట్‌లో ఉన్న మొక్కలకు హీలింగ్ చేశారు. మరో ప్లాట్‌లో ఉన్న మొక్కలకు హీలింగ్ చేయలేదు.
4) హీలింగ్ చేసిన మొక్కల దిగుబడి 71 శాతం పెరిగింది. కేవలం దిగుబడి పెరగటం మాత్రమే కాదు, మొక్కల ఎత్తులోను.. టమోటా, కాప్సికంల సైజులో కూడా గణనీయమైన మార్పు కనిపించింది.
5) హీలింగ్ చేసిన మొక్కలకు ఎరువులు వేయకపోయినా ఎక్కువ దిగుబడి లభించింది. అదే విధంగా చీడపీడలు కూడా సోకలేదు.

మొక్కలలో సాధ్యమేనా?
మొక్కలకు మనుషుల మాదిరిగా హీలింగ్ చేయటం సాధ్యమేనా? అనే ప్రశ్నకు కూడా తమ వద్ద కచ్చితమైన సమాధానాలు ఉన్నాయని హీలర్స్ అంటారు. "ఏ ప్రాణికైనా శక్తి అవసరం. ఈ శక్తిని అందించటమే ప్రాణిక్ హీలింగ్ ప్రధాన లక్ష్యం. దీనికి మొక్కలు, మనుషులు అనే తేడా లేదు'' అని సీనియర్ హీలర్ భగవాన్ పేర్కొంటారు.

ప్రాణిక్ హీలింగ్ పద్ధతిలో జీవులకు శక్తిని అందించటానికి హీలర్స్‌కు కొంత సాధన అవసరం. సాధన చేసిన హీలర్స్ శక్తిని గ్రహించి అందరికి అందచేయగలుగుతారు. మన చుట్టూ ఉన్న శక్తిని గ్రహించి, దానిని అవసరమైన చోట అందించటానికి రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మొదటి పద్ధతిలో హీలర్ ఒక మీడియంగా(మధ్యవర్తిగా) మారి శక్తిని స్వీకరించి- మళ్లీ దానిని అవసరమైన చోట అందిస్తాడు. ఇక రెండో పద్ధతిలో శక్తిని స్ఫటికం వంటి స్వచ్ఛమైన పదార్థంలోకి సేకరించి- దానిని అవసరమైన వారికి అందిస్తారు. మొక్కలపై చేసిన ప్రయోగంలో ఇద్దరు సీనియర్ హీలర్స్ ప్రతి రోజు ఉదయం, సాయంత్రం మొక్కలకు తామే మీడియంగా మారి శక్తిని అందించేవారు.

అన్ని మొక్కలకు అందించటానికి దాదాపు రెండు నుంచి మూడు గంటల సమయం పట్టేది. ఒక వేళ వారు రాలేని రోజుల్లో - డిస్టెన్స్ హీలింగ్ (ఆలోచనలు ఎక్కడికి వెళితే అక్కడకు శక్తి ప్రసారం చేయవచ్చనేది ప్రాణిక్ హీలింగ్‌లో ఒక ప్రధానమైన భావన) ద్వారా శక్తిని అందచేసేవారు. ఇదంతా చదివిన తర్వాత మొక్కలకు ఆ శక్తి అందిందో లేదో ఎలా తెలుస్తుందనే ప్రశ్న తలెల్తే అవకాశముంది. దీనికి కూడా హీలర్స్ వద్ద సమాధానముంది. "సాధన చేయటం ద్వారా ఎవరికి ఎంత శక్తిని ఇవ్వాలనే విషయం తెలుస్తుంది. దీనికి కచ్చితమైన కొలతలు ఉండవు'' అని భగవాన్ వెల్లడిస్తున్నారు.

ప్రాణిక్ హీలింగ్ అంటే..
ఈ ప్రపంచమంతా శక్తిమయం. ఈ శక్తిని సేకరించి మంచి కోసం ఉపయోగించే ప్రక్రియనే ప్రాణిక్ హీలింగ్ అంటారు. దీని ద్వారా ప్రాణుల జీవనాన్ని మెరుగుపరచవచ్చని హీలర్స్ భావిస్తారు. ఈ పద్ధతి చాలా కాలం నుంచి అందుబాటులో ఉన్నా- దీనిని అంతర్జాతీయంగా వ్యాప్తిలోకి తీసుకువచ్చిన ఘనత మాత్రం ఫిలిప్పీన్స్‌కి చెందిన వాణిజ్యవేత్త గ్రాండ్ మాస్టర్ చౌ కాక్ సూకి చెందుతుంది. మన రాష్ట్రంలో ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఈ పద్ధతిని వ్యాప్తి చేయటానికి కృషి చేస్తోంది. అయితే ప్రాణిక్ హీలింగ్ ఎలా పనిచేస్తుందనే అంశంపై కచ్చితమైన ఆధారాలు ఏమీ లేవు. కొన్ని ఇతర పద్ధతుల మాదిరిగానే దీనిని కూడా నమ్మకంపై ఆధారపడిన ఒక పద్ధతిగా మాత్రమే గుర్తించాలి.

ఈ పద్ధతి శాస్త్రీయమేనా?
దీనికి శాస్త్రీయమైన ఆధారాలు లేవనేది విమర్శకుల ప్రధాన అభ్యంతరం. అయితే కళ్లముందు జరుగుతున్న విషయాన్ని పట్టించుకోకుండా ఆధారాల కోసం వెంపర్లాడటం తగదనేది ప్రాణిక్ హీలర్స్ వాదన. "నేను గత ఇరవై ఏళ్లుగా ప్రాణిక్ హీలింగ్‌ను సాధన చేస్తున్నా. నా కళ్ల ముందు కనిపించిన అనేక అద్భుతాలను నేను చూశాను. మొక్కలపై పరిశోధనను రంగా విశ్వవిద్యాలయంలో ఇద్దరు శాస్త్రవేత్తలు నిర్వహించారు. మా ఫౌండేషన్ నుంచి అనేక మంది హీలర్స్ ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.

పరిశోధన చేసిన రెండు ప్లాట్లు పక్కపక్కనే ఉన్నాయి. వాటిలో ఉన్న మట్టి కూడా ఒకటేనని పరీక్షల్లో వెల్లడయింది. వాతావరణం కూడా ఒకటే. అటువంటప్పుడు కొన్ని మొక్కలు ఏపుగా ఎదిగి, మరికొన్ని ఎదగకపోవటం వెనకున్న కారణం ఏమిటి అనే విషయాన్ని మనం ఆలోచించాలి. దానికి ప్రాణిక్ హీలింగ్ ప్రధాన కారణమని మేం నమ్ముతున్నాం. ఒక్క హైదరాబాద్‌లో మాత్రమే కాదు. కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో అనేక చోట్ల రైతులు హీలింగ్‌ను సాధన చేసి ప్రయోజనాలు పొందుతున్నారు'' అంటారు సీనియర్ హీలర్ భగవాన్.

ఈ సృష్టిలో జరిగే ప్రతి పని వెనకున్న కారణాలను అన్వేషించే తత్వమే మానవుడిని ముందుకు నడిపిస్తోంది. ఈనాటికీ ప్రకృతిలో మనకు తెలియని అనేక విషయాలు ఉన్నాయి. తెలియని వాటిని విశ్వాసంగా (కొన్ని సందర్భాలలో మూఢ విశ్వాసాలుగా) తెలిసిన వాటిని శాస్త్రంగా మనం భావిస్తూ ఉంటాం. విశ్వాసమైనా, శాస్త్రమైనా- మానవ అభివృద్ధికి ఉపయోగపడితే అంతే చాలు. ఆ దిశగా మరో అడుగు ముందుకు వేయటానికి ఈ కొత్త పరిశోధన ఉపయోగపడాలని కోరుకుందాం.
-భావన

No comments:

Post a Comment