చేకూరి గౌతమరాజు

చేకూరి గౌతమరాజు
Facebook

Tuesday, September 21, 2010

చేతబడుల మార్కెట్!

ప్రపంచ సాహిత్యానికి మన దేశం అందించిన గొప్ప రచయితలలో వి.ఎస్. నైపాల్ ఒకరు. సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన నైపాల్ రచనలు చాలా నిశితంగా ఉంటాయి. అనేక ఆలోచనలను రేకెత్తిస్తాయి. ఏడాది క్రితం ఆఫ్రికాలోని వివిధ దేశాల్లో పర్యటించిన నైపాల్- తన అనుభవాలను "ద మేస్క్యూ(మాస్క్) ఆఫ్ ఆఫ్రికా'' అనే పుస్తక రూపంలో వెలువరించారు. మన దేశంలో ప్రముఖ ప్రచురణ సంస్థ పికడోర్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. అతి త్వరలో మార్కెట్‌లోకి విడుదల కానున్న ఈ పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు .............

దక్షిణాఫ్రికాలో అది శీతాకాలం. జొహ్నస్‌బర్గ్ ఎయిర్‌పోర్టు బయట వాతావరణం చాలా పొడిగా ఉంది. గడ్డి ఎండిపోయింది. రోడ్డుకు అటూ ఇటూ ఉన్న చెట్ల ఆకులు వాడిపోయి ఉన్నాయి. జొహ్నస్‌బర్గ్ నగరానికి వెళ్లే దారిలో - రోడ్డు పక్కన అనేక మంది నల్లజాతీయులు పనిచేస్తున్నారు.. నగరానికి మధ్యలో ఉన్న ఒక ప్రాంతానికి వెళ్లాను. జాత్యహంకార పాలన కుప్పకూలిన తర్వాత - భవిష్యత్తుపై భయంతో తెల్లజాతివారందరూ ఆ ప్రాంతాన్ని వదిలివెళ్లిపోయారు. దానిని ఆఫ్రికన్లు ఆక్రమించుకున్నారు. అయితే ఆ ప్రాంతానికి వచ్చి నివాసమేర్పరుచుకున్నవారు స్థానికులు కాదు.

మొజాంబిక్, సొమాలియా, కాంగో, జింబాబ్వే వంటి దేశాల నుంచి వచ్చిన నల్లవారు. ఆఫ్రికన్లపై ఉన్న అవ్యాజమైన అనురాగం వల్ల దక్షిణాఫ్రికా ప్రభుత్వం వారు ఇక్కడ స్థిరపడటానికి అనుమతి ఇచ్చింది. పెద్ద పెద్ద భవంతులను, పెద్ద పెద్ద రోడ్లను వీరందరూ కలిసి మురికివాడలుగా మార్చేశారు. ఆ భవంతుల గత చరిత్రను ఇప్పుడు ఊహించలేం కూడా. అలా కొత్తగా ఏర్పడిన ఈ మురికివాడలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు కనిపించాయి. ఒక పాత గోదాములో- ఒకప్పడు ఈ ప్రాంతంలో విక్రయించే వస్తువులను హేళన చేయటానికా అన్నట్లు- చేతబడులు చేయటానికి అవసరమైన సామగ్రిని అమ్ముతున్నారు. వీటిలో కొన్ని ఔషధాలు కూడా ఉన్నాయి.

ఎవరికైనా చేతబడి జరిగినట్లు అనుమానం వస్తే వారు మాంత్రికుడి దగ్గరకు వెళ్తారు కదా. అప్పుడు ఆ మాంత్రికుడు వారిచేత ఈ ఔషధాలను కొనిపిస్తాడు. ఆ గోదాములో అడవుల్లో దొరికే అనేక రకాల ఔషధ మొక్కలు కుప్పగా పోసి ఉన్నాయి. వాటి వాసన భరించలేక ఎంత మొండి దెయ్యమైనా పారిపోతుందనిపిస్తుంది. ఆ పక్కనే ఎత్తుగా ఉన్న ఒక వేదిక మీద అనేక రకాల జంతువుల శరీర భాగాలు అమర్చిఉన్నాయి. వాటిని విక్రయించే వ్యాపారి ఆ పక్కనే చిన్న స్టూల్ వేసుకొని కూర్చుని ఉన్నాడు. ఒక జంతువు కాలు, దాని పక్కనే తల - ఈ విధంగా అందరికీ కనిపించే విధంగా ఆ భాగాలను అతను అమర్చాడు. ప్రతి రోజు అతను ఈ భాగాలను ఇంటికి తీసుకువెళ్లి మళ్లీ పట్టుకు రావాల్సిన అవసరం లేదు.

ఆ ప్రాంతం మున్సిపల్ అధికారులు అక్కడి వ్యాపారులు తమ వస్తువులను షాపుల్లో వదిలి వెళ్లే వెసులుబాటు కల్పించారు. వేదికకు ఒక వైపున మూడు గుర్రం తలకాయలు కనిపించాయి. వాటిపై జుట్టు ఇంకా మెరుస్తూనే ఉంది. అంటే ఆ మూడు తలకాయలు తలారి నుంచి అప్పుడే తాజాగా వచ్చినట్లున్నాయి. ఆఫ్రికాలో చేసే చేతబడుల్లో గుర్రం తలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అది చాలా ఖరీదు (బహుశా తెల్లజాతి మహిళ స్థనాల కన్నా ఖరీదు కాకపోవచ్చు. దక్షిణాఫ్రికా పోలీసులు అందించిన సమాచారం ప్రకారం గతంలో వీటిని చేతబడికి వాడేవారు).

గుర్రం తల ఖరీదు ఎంతో ఆ వ్యాపారిని అడిగి తెలుసుకుందామనుకున్నా కాని ఆ ప్రశ్న అడగటానికి ఎందుకో చాలా ఇబ్బందిగా అనిపించింది. అప్పటికే ఆ వ్యాపారిని నేను అనేక ప్రశ్నలు వేశాను. అతను తన వ్యాపారం గురించి చాలా గొప్పగా చెప్పాడు. ప్రతి రోజు అతని దగ్గరకు నాలాంటి వారు అనేక మంది వస్తుంటారు. వారెవ్వరికీ ఆ భాగాల్ని కొనే ఉద్దేశం ఉండదు. కాని అది ఎందుకు పనికొస్తుంది? ఇదెందుకు పనికొస్తుంది? వంటి ప్రశ్నలు అనేకం వేస్తారు. దీని వల్ల ఆ వ్యాపారికి సమయం వృథా కావటం తప్ప వేరే ప్రయోజనం ఏమీ ఉండదు. గుర్రపు తలల పక్కనే అనేక లేడి తలకాయలను కూడా పెట్టాడు వ్యాపారి. వీటిని కోకా కాయలను సగానికి ఎలా పగలకొడతారో- ఆ విధంగా పదునైన కత్తితో లేదా గొడ్డలితో ఈ లేడి తలలను పగలకొట్టినట్లున్నారు. ఆ విధంగా కొట్టకపోయుంటే - లేడి మెదడు దెబ్బతినకుండా బయటకు తీయలేరు....

అక్కడ కంపు భరించలేకుండా ఉంది. ఆ ప్రాంతంలో కేవలం జంతువుల శరీర భాగాలు మాత్రమే కాదు. కడుపు లోపల ఉండే భాగాలను - బట్టలను వేళ్లాడదీసినట్లు తాళ్లకు వేలాడగట్టారు. దీని వల్ల చేతబడి విరుగుడు నిపుణులు తమకు కావాల్సిన భాగాలను సులభంగా ఎంచుకోవటానికి వీలుంటుంది. అయితే వాటికి దుమ్ము పట్టడం వల్ల అన్నీ తెల్లగానే కనిపిస్తున్నాయి..

నేను చూసిన దృశ్యాలు నాకు చాలా నిరాశ కలిగించాయి. దక్షిణాఫ్రికా ప్రజలు జాత్యహంకారానికి వ్యతిరేకంగా గొప్ప పోరాటం చేశారు. ఆ పోరాటం గొప్ప వ్యక్తులను సృష్టిస్తుందని నేను భావించాను. చేతబడులను వదిలిపెట్టి గొప్ప లక్ష్యాలను సాధిస్తారనుకున్నాను. ఈ మార్కెట్‌లోకి ప్రవేశించే ముందు- జాత్యహంకార మ్యూజియానికి వెళ్లాను. అక్కడ నాకు కలిగిన భావన వేరుగా ఉంది. ఈ మార్కెట్‌ను చూసిన తర్వాత నాకు రెండు ఆఫ్రికాలు కనిపించాయి. ఈ రెండూ వేర్వేరు ఆఫ్రికాలు. వీటిని ఒక చోట చేర్చటం చాలా కష్టం. అందుకే రాజకీయాలు, చరిత్ర- ఈ రెండూ దక్షిణాఫ్రికా ప్రజలపై కుట్ర పన్నాయనిపించింది.

బయటకు వచ్చేసరికి పోలీసు కార్లు చాలా కనిపించాయి. మా డ్రైవర్ వెళ్లి పోలీసులతో మాట్లాడాడు. తిరిగి వచ్చిన తర్వాత- పోలీసులు చాలా ప్రమాదకరమైన క్రిమినల్స్ వేటలో ఉన్నారని, వారిని పట్టుకోవటానికి అవసరమైన శక్తిని పొందటానికి వారు కూడా ఈ మార్కెట్‌కు వచ్చారని చెప్పాడు.

మండేలా దేనికి చిహ్నం?
స్వెటోలో ఉన్న మండేలా ఇంటిని నేను ముందే చూశాను. కానీ లోపలికి వెళ్లింది మాత్రం ఓ సోమవారం నాడు. విన్నీ మండేలాతో అపాయింట్‌మెంట్ తీసుకున్న తర్వాత ఇంటిలోపలికి ప్రవేశించగలిగాం. గేటులో ఐదారుగురు సెక్యూరిటీ గార్డ్స్ సూటులు వేసుకొని ఉన్నారు. ఇంటి ముందు భాగంలోనే అనేక ఫొటోగ్రాఫ్‌లు, అలంకరణ కోసం పెట్టే ప్రతిమలు ఉన్నాయి. ఫొటోగ్రాఫ్‌లన్నీ ఫ్యామిలీకి సంబంధించినవి. మిగిలినవాటిలో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే ప్రతిమలు, దేవుళ్ల బొమ్మలు చాలా ఉన్నాయి... మిసెస్ మండేలా గదిలోకి వచ్చింది.

నల్లటి సూట్ వేసుకుని, తన ట్రేడ్ మార్క్ అయిన విగ్గుతోను, మెడలో, చేతిలో పూసలతోను ఉంది. రాజకీయాల పట్ల అభినివేశం ఆమెలో ఏ మాత్రం తగ్గలేదు. "మండేలా అంటే ఏమిటో మీరు ఊహించలేరు. మండేలా అంటే ఖైదు. మండేలా అంటే విచారణ. ఒకప్పుడు ఏఎన్‌సీ(ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్) సభ్యులయితే చాలు.. పోలీసులు చంపేసేవారు. నాయకులందరూ జైళ్లలోనే చచ్చిపోతారనే భయం అందరిలోను ఉండేది. అలా జరిగితే ప్రజల్లో ఆశలు అడుగంటిపోతాయి. అందుకే నేను బయటకు వచ్చి పోరాటం చేశాను.

అప్పుడే నాలో భయమనేది పోయింది. అన్ని రకాల అవమానాలు, చిత్రహింసలు ఎదుర్కొన్నప్పుడు- ఇక భయపడటానికి ఏం మిగులుతుంది? భయమంటే ఏమిటో తెలియకుండా పోతుంది. ఒక రోజు రాత్రి పోలీసులు వచ్చి నా వస్తువులన్నీ ఒక వ్యాన్‌లో పడేశారు. నన్ను, నా వస్తువులను తీసుకువెళ్లి ఒక రహస్య ప్రదేశంలో వదిలేశారు. తొమ్మిదేళ్లు అక్కడే బతకాల్సి వచ్చింది''...

ఆమె జొహ్నస్‌బర్గ్‌లో ఉన్న మండేలా విగ్రహం గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. "మీరు ఒక విషయాన్ని గుర్తించాలి. తన ప్రజల కోసం జైలుకు వెళ్లిన మండేలా ఒక విప్లవ వీరుడు. అతను శాంతి మంత్రం జపిస్తూ బయటకు వచ్చాడు. జాత్యహంకారులతో సయోధ్య కుదుర్చుకున్నాడు... నా దృష్టిలో మాకు లభించింది "రాజీ స్వాతంత్య్రం''. రాజీల ద్వారా, సయోధ్యల ద్వారా మేము స్వాతంత్య్రం సాధించుకున్నాం. మండేలా కూడా దానికి అంగీకరించాడు. నల్లవారికి ఆర్థిక స్వావలంబన అనేది పెద్ద జోక్. తెల్ల పెట్టుబడిదారులు తమ జాతివారి కోసం చేసిన ఒక ఏర్పాటు. వారు కొందరు నల్లజాతివారిని తమ వ్యాపారాల్లో భాగస్వాములుగా చేసుకున్నారు. ఎవరైతే స్వాతంత్య్రం కోసం రక్తమోడ్చి పోరాడారో వారికి ఏమీ దక్కకుండా పోయింది. వారు ఇప్పటికీ మురికివాడల్లో నివసిస్తున్నారు. పారిశుద్ధ్యం లేదు. కరెంటు లేదు. విద్య లేదు..'

' అమె మండేలా గురించి మాట్లాడేటప్పుడు- 'నెల్సన్ ' అనే ముద్దుపేరును ఉపయోగించలేదు. మండేలాను ఆమె రెండు విధాలుగా చూస్తోంది. విప్లవవీరుడు మండేలా ఒకరు. ఆ తర్వాత శాంతి కోసం రాజీపడిన మండేలా ఒకరు. వీరిద్దరి మధ్య తేడా ఆమెకు తెలుసు. మండేలా నోబెల్ బహుమతిని స్వీకరించటంపై కూడా ఆమెకు అభ్యంతరాలున్నాయి. "తనను జైలులో పెట్టిన డీ క్లార్క్‌తో కలిపి మండేలా నోబెల్ బహుమతిని స్వీకరించాడు.

తనను బంధించిన వారితో కలిసి బహుమతి ఎందుకు స్వీకరించాలి? మండేలాను జైలు నుంచి విడుదల చేయటానికి డీ క్లార్క్ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. కాలం ప్రభావం వల్ల మండేలాను ప్రభుత్వం విడుదల చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో- దక్షిణాఫ్రికాలో ఇంకా జాత్యహంకార పరిస్థితులే కొనసాగితే తీవ్ర హింస చెలరేగేది. అందువల్లే మండేలాను విడుదల చేయాల్సి వచ్చింది'' అని చెప్పారు విన్నీ.

Wednesday, September 8, 2010

ఆస్టేలియా .. కొంచెం అసూయ ... కొంచెం చిన్నచూపు ...

కంగారూ..క్రికెట్..ఈ రెండు పేర్లు చెప్పగానే ఎవరికైనా టక్కున గుర్తొచ్చేది ఆస్ట్రేలియా. ఇండియాకు కాస్త దగ్గరగా..అమెరికా తర్వాత మన యూత్‌కి గమ్య స్థానంగా మారిందీ దేశం. ఈ రెండు దేశాల మధ్య సంబంధం ఎలాంటిదంటే.. క్రికెట్‌లో ఈ దేశానికి ఆ దేశం గట్టి పోటీ. చదువుల్లో... ఉద్యోగాలు సంపాదించడంలో అక్కడి స్థానికులకు మన ఫారినర్లు మహా పోటీ. ఎంతంటే..దాన్ని అసూయగా మలచుకుని వీళ్లను వాళ్లు కొందరు కొట్టేంత. అయినా ఆస్ట్రేలియా ఆశ పెంచే దేశమే మనవాళ్లకు. 
అక్కడి వాళ్లలో కలిసిపోయే చిన్న కిటుకు తెలిస్తే చాలు ఇట్టే ఐస్ అయిపోతారు అని చెప్తున్నారు రెండేళ్లుగా మెల్‌బోర్న్‌లో ఉంటున్న మల్టీమీడియా స్టూడెంట్ తుమ్మల సునీల్ రెడ్డి.
నేను ఆస్ట్రేలియా వచ్చి రెండేళ్లవుతోంది. మెల్‌బోర్న్‌లో ఉంటున్నాను. ఇండియాలో డిగ్రీ చదివి మల్టీమీడియాలో డిప్లమా కోర్సు చేయడానికి ఇక్కడికి వచ్చాను. చదువుకుంటూనే రెండు ఉద్యోగాలు చేస్తున్నాను. ఒకటి వాలంటరీ జాబ్. ఇంటర్న్‌షిప్‌లాగా. టెంపరరీ రెసిడెంట్‌షిప్ పొందడానికి సంబంధిత రంగంలో ఆరునెలల ఇంటర్న్ షిప్ చేయడం చాలా అవసరం ఇక్కడ. అందుకే ఉదయం పూట ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో ఈ జాబ్ చేస్తున్నాను. ఇంకో ఉద్యోగమేమో 'ది ఏజ్' అనే న్యూస్ పేపర్‌లో మార్కెటింగ్ ఫీల్డ్‌లో. ఆ పత్రికకు చందాదారులను చేర్పించే పనన్న మాట.

వారానికి రెండు రోజులే
నేను ఫ్రెండ్స్‌తో కలిసుంటున్నాను. ప్రతి సోమ, శనివారాలు మాత్రమే కాలేజ్ ఉంటుంది మాకు. వారానికి రెండురోజులే. బ్యాచ్‌లను బట్టి ఇలా విభజిస్తారు. కాలేజ్ స్ట్రిక్ట్‌గా ఏమీ ఉండదు. ఉదయం ఏడింటికల్లా రెడీ అయిపోయి బయటపడతాను. రైళ్లు, ట్రామ్‌లు, బస్‌లు ఉంటాయి. ఇక్కడో విషయం చెప్పాలి.

విదేశాల్లో అన్నీ టైమ్ ప్రకారం జరుగుతాయి అనుకుంటారు కాని ఇక్కడ మాత్రం అంత పంక్చువాలిటీ ఏమీ ఉండదు. ఇవి చాలా వరకు ఆలస్యంగా నడుస్తుంటాయి. మరీ గంటలు గంటలు కాదు కాని ఐదు, పది నిమిషాలు లేట్ అవుతుంటాయి. ఒక్కోసారి రద్దవుతుంటాయి కూడా. మొత్తమ్మీద గంట ప్రయాణం చేసి ఎనిమిదికల్లా ఆఫీస్ చేరుకుంటాను. పదింటి దాకా అక్కడ పని చూసుకుని (కాలేజ్ ఉన్న రోజుల్లో ) కాలేజ్‌కి వెళ్తాను.

మూడింటి వరకు కాలేజ్. పొద్దున్న ఇంట్లో కార్న్‌ఫ్లేక్సే టిఫిన్. ఓపికుంటే వంట చేసుకోవడం లేదంటే బయట తినడం. కాలేజ్‌లో క్యాంటీన్ ఉండదు. మెక్‌డొనాల్డ్స్, కెఎఫ్‌సి లాంటి రెస్టారెంట్లు ఉంటాయి. నార్త్ ఇండియన్ రెస్టారెంట్లు కూడా ఉంటాయి. (ఇండియాలో దొరికే ప్రతి వస్తువు ఇండియన్ స్టోర్స్‌లో దొరుకుతుంది) ఆస్ట్రేలియన్లు మన ఫుడ్‌ని చాలా ఇష్టపడతారు. కాని కారాన్ని భరించలేరు. లంచ్ తర్వాత మూడింటికి 'ది ఏజ్' పత్రిక ఆఫీస్‌కి వెళ్తాను. ఇక్కడ నా పని..ఫోన్లో అప్పాయింట్‌మెంట్ ఫిక్స్ చేసుకోవడం..వాళ్లు ఇచ్చిన టైంకి వాళ్ల దగ్గరకి వెళ్లడం, చందా కట్టించుకోవడం. ఆ పని చూసుకుని ఇంటికి వెళ్లేసరికి రాత్రి పదకొండు అవుతుంది. రాత్రి మాత్రం వంట చేసుకుంటాం.

వాళ్ల పద్ధతుల్ని ఆచరిస్తే....
వీకెండ్స్ మామూలే. శనివారం మార్కెటింగ్ వాళ్లకు ఎక్కువ పనుంటుంది. అందుకే నాకు ఆదివారం ఒక్క రోజే సెలవు. ఆ ఒక్కరోజు బట్టలుతుక్కోవడం, ఇంకేమైనా చిన్న చిన్న పనులు చేసుకోవడంతోనే సరిపోతుంది. టైం ఉంటే సినిమాలు చూస్తాం. ఇక్కడ రెండు థియేటర్స్ ఉన్నాయి, వాటిల్లో హిందీ, తెలుగు సినిమాలు వస్తాయి కాని పెద్ద పెద్ద స్టార్స్‌వి మాత్రమే.

మా చుట్టుపక్కల వాళ్లంతా ఆస్ట్రేలియన్లే. కొంత మంది చాలా బాగా మాట్లాడతారు. పార్టీలకు పిలుస్తుంటారు. కొంతమందైతే అసలు పట్టించుకోరు. వాళ్ల పద్ధతులను, అలవాట్లను మనవిగా చేసుకుంటే మనతో చాలా బాగా ఉంటారు. ఇక్కడ చిన్న వయసులోనే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఉండడం మామూలే. దాన్ని కామెంట్ చేసినా...విమర్శించినా...అసలు సహించరు.

చిన్నచూపు ఎక్కువే

పత్రిక చందాదారులను చేర్పించడానికి ఆస్ట్రేలియన్ల దగ్గరకి వెళ్తుంటానని చెప్పాను కదా.... రకరకాల అనుభవాలు ఎదురవుతుంటాయి. కొంతమంది చాలా సాదరంగా ఆహ్వానిస్తారు. ఇక్కడెలా ఉందని అడుగుతారు, ఉద్యోగ అవకాశాల గురించి ఆరా తీస్తారు. కాని కొన్ని చోట్ల, కొంత మంది దగ్గర తీవ్రమైన పరాభావం ఎదురవుతుంటుంది. ఇండియన్స్ అంటే చాలు..బతకడానికి ఇక్కడి దాకా వచ్చిన వాళ్లని చాలా చిన్న చూపు చూస్తారు. అవమానం అనిపిస్తుంటుంది. కొద్ది క్షణాలు బాధపడి తర్వాత మర్చిపోయి ఉద్యోగ నిర్వహణలో పడిపోతాం.

అవసరం అలాంటిది మరి. పర్మనెంట్ రెసిడెంట్స్‌గా ఉండాలని వచ్చేవారికి ఇలాంటి వాటిని సహించే ఓర్పు వచ్చేస్తుంది. అసలు ఈ జాత్యాహంకారం ఇక్కడి యూత్‌లోనే ఎక్కువ. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వాళ్లను చూస్తే వీళ్లు సహించలేరు. ప్రత్యేకించి కారణమేమీ కనపడదు. నేను పరిశీలించినంత వరకు...ఇక్కడ పధ్నాలుగేళ్లకే సంపాదన మొదలుపెడతారు. తల్లిదండ్రుల ఆలనాపాలనా ఉండదు.

పని చేసుకోవాలి..చదువుకోవాలి.. అంతే.ఇండియన్స్ వచ్చి చక్కగా చదువుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడుతుంటే.. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మంచి హోదాలు సంపాదించుకుంటున్నారనే అసూయలాంటిదేదో వాళ్లలో కలిగి జాత్యహంకారం చూపిస్తారేమోనని అనిపిస్తుంది. చైనీయుల్ని, లెబనీయుల్ని వీళ్లు ఏమీ అనరు. (చైనీయులు ఇక్కడ ఇన్వెస్టర్స్‌గా ఉంటారు కాబట్టనుకుంటా)ఇంకో విషయం ఏంటంటే..లెబనీయులు కూడా మన మీద పెత్తనం చూపిస్తుంటారు. అసలు ఆస్ట్రేలియన్లకన్నా వీళ్లే ఎక్కువ పెత్తనం చెలాయిస్తుంటారు. అయితే ఎన్ని దాడులు చేసినా భారతీయ స్త్రీల జోలికి మాత్రం వెళ్లినట్టు నేనెక్కడా నోటీస్ చేయలేదు.

క్రీడా ప్రియులు
మనం సంపాదించడానికే ఇక్కడికి వస్తుంటాం కాబట్టి లక్ష్యమంతా డబ్బు సంపాదన మీదే ఉంటుంది. వాళ్లకు సహజంగానే అలా ఉండదు. నేను చూసినంత వరకు ఆస్ట్రేలియన్లు రెండు గంటలు ఏకధాటిగా పని చేయలేరు. ప్రతి అరగంటకు వాళ్లకు కాఫీ బ్రేకో, స్మోక్ బ్రేకో..కావాల్సిందే. వీకెండ్ కోసమైతే అర్రులు చాస్తారు. శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి దాకా ఎంజాయ్ మూడ్‌లోనే ఉంటారు. ఆటలంటే వీళ్లకు అమిత ఆసక్తి, ఒక రకంగా చెప్పాలంటే ఆటలు వాళ్ల జీవితంలో భాగం, చదువుకంటే కూడా ఆటలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. క్రికెట్, ఫుటీ(రగ్బీలాంటి గేమ్) లాంటి ఆటల్ని ఎక్కువగా ఇష్టపడతారు. జాతీయభావం ఎక్కువ.

హిందు, పాక్ భాయి భాయి
ఆసియాలో ఇండియా, పాక్ అంటే బద్ధ శత్రువులు కాని ఇక్కడ మాత్రం భాయి..భాయిగా ఉంటారు. పాకిస్తానీ ఆర్గనైజేషన్స్, ఇన్స్‌స్టిట్యూట్‌లో ఇండియన్లకు తగిన ప్రాధాన్యం ఇస్తారు. ఫీజు చెల్లింపు విషయాల్లో కూడా వాయిదా పద్ధతుల్లో చెల్లించే వెసులుబాటును ఇస్తారు. అందరం ఒక్కటనే భావనే ఉంటుంది. పండగలు లాంటి సమయాల్లో తెలుగు వాళ్లే కాకుండా అందరం కలుసుకుంటాం. తెలుగు వాళ్లమైతే దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటాం. ఇక్కడ మురుగన్ గుడి, సాయిబాబా దేవాలయాలున్నాయి. నెలలో రెండు సార్లు వెళ్తుంటాం.

అనుకున్నంత గొప్పగా...
దూరపు కొండలు నునుపు అన్నట్టు ఇక్కడ అనుకున్నంత గొప్ప అవకాశాలైతే ఏమీ లేవు. మాస్టర్ డిగ్రీ కోర్సులైతే బాగానే ఉంటాయి కాని డిప్లమా కోర్సులను ఇక్కడి కంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ స్టాండర్డ్ చదువును ఇండియాలోనే పొందవచ్చు. అయితే ఇక్కడ పిఆర్(పర్మనెంట్ రెసిడెన్సీ) పొందడం కోసం చదువు వంకతో వస్తుంటాం. కాని చాలా కష్టం.

మాస్టర్స్ చేసిన వాళ్లకు కూడా చదువు అయిపోగానే ఉద్యోగాలు వచ్చి వాలడం లేదు. మనకు సంబంధించి ఎవరో ఒకరు లిఫ్ట్ ఇచ్చే వాళ్లు లేకుండా ఇక్కడ ఉండడం ఇబ్బందే. డబ్బుల్లేక, ఫీజు కట్టలేక వెనక్కి వెళ్లిపోయిన వాళ్లెందరో ఉన్నారు. పైగా డిప్లమాలాంటి కోర్సులు చేస్తున్న వాళ్లు జాత్యాహంకారానికి బలైతే భారత ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత లేదని విదేశాంగ మంత్రి ఎస్.ఎం. కృష్ణ కూడా ప్రకటించారు.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఎవరైనా ఆస్ట్రేలియా వైపు అడుగులు వేస్తే మంచిదని నా అభిప్రాయం. ఎవరినీ నిరుత్సాహ పరచాలని మాత్రం ఇదంతా చెప్పడం లేదు.
జూ సరస్వతి రమ

Sunday, September 5, 2010

వెన్నెల మళ్లీ వచ్చేసింది కానీ....

"చాంద్ ఫిర్ నిక్‌లా- మగర్ తుమ్ న ఆయే
జలా ఫిర్ మెరా దిల్- కరూ క్యా మై హాయ్''
(మళ్లీ వెన్నెల వచ్చేసింది. కానీ, నువ్వే రాలేదు
మనసంతా కాలిపోతోంది. నేనిప్పుడు ఏం చేయాలో తెలియటం లేదు.)

ఎప్పుడో 1957లో విడుదలైన 'పేయింగ్ గెస్ట్' సినిమాలోని ఈ పాట దేశంలోని కోట్లాది గుండెల్ని పిండేసింది?
దూరంగా ఎక్కడో కొండ గుహల్లో ప్రతిధ్వనిస్తున్నట్లు లతామంగేష్కర్ స్వరం వినిపిస్తోంది. నిజమే మరి! ఆ ప్రియతముడు ఆలస్యంగానైనా వస్తాడో లేదో తెలియదు గానీ, చంద్రుడు మాత్రం వేళకే వేంచేస్తాడు. ప్రియతముడికి ఉన్నన్ని బాధలు చంద్రుడికి కూడా ఉండి ఉంటే అతడు కూడా అందరిలాగే కారణాలు చెప్పేవాడు.

అయినా, తెలియక అడుగుతాను? వేళాపాళా లేనిది మీకేనని మనుషుల్ని వెక్కిరించడానికి కాకపోతే సూర్యచంద్రులూ, నక్షత్రాలూ అంత కచ్చితమైన వేళల్ని పాటించడం ఏమిటండీ?తమవైనవన్నీ తమ చేతుల్లోనే ఉండిపోవడం వల్లే కదా ఆ టెక్కు! అన్నింటి మీదా నియంత్రణ ఉంది కాబట్టి అన్నీ తామనుకున్నట్టే జరిగిపోతే జరిగిపోవచ్చు.

కానీ, మనిషి పరిస్థితి వేరు కదా! అతడేమైనా గ్రహమా? నిర్ణీత కక్ష్యలో పరిభ్రమించడానికి, గోడ గడియారమా? నిర్ణీత క్రమంలో లోలకంలా ఊగడానికి. మనిషి జీవితమేమైనా పుస్తకమా? పేజీ తరువాత పేజీ క్రమం తప్పకుండా రావడానికి. అతనికో జీవితం ఉండి ఏడ్చింది కదా! ఇక్కడ అనుకున్నదొకటైతే జరిగేది మరొకటి. జీవితంలో నవ్వించే క్షణాల కన్నా ఏడ్పించేవే ఎక్కువాయె. అర్థం చేసుకోరు? సమయం మించి పోయిందీ అంటే సంజాయిషీ ఇచ్చుకోవలసిందే కదా!

జీవన స్పృహ ఏ క్షణాన ఆత్మలోకి చొరబడుతుందో ఏమో కానీ, నిలువెత్తు నిప్పురవ్వలా ఉన్నవారు సైతం క్షణాల్లో నీరైపోతారు. మందహాసం కనుమరుగై కళ్లల్లో ఆ విషాదం కదలాడుతుంది. ఎవరో ఎందుకు? నాకైతే ఆ ఎదురింటి అమ్మాయిని చూస్తుంటే ఎంతలో ఎంత మార్పు వచ్చేసిందా అనిపిస్తుంది. ఎప్పుడూ తూనీగలా తారాడే ఆ అమ్మాయి ఇటీవలి కాలంలో ఎప్పుడు చూసినా ఒక శోకమూర్తిలా కనిపిస్తోంది. అనుకున్నవి అనుకున్నట్లే జరిగిన న్ని రోజులు ఎవరైనా తూనీగలే.

వికటించినప్పుడు కదా సమస్య. పరిస్థితులు ఎంతో కొంత తన అధీనంలోనే ఉన్నట్టు మనిషి అనుకుంటాడే కానీ, అంత నియంత్రణలో ఎప్పుడుంది కనుక! కాకపోతే ఆ ప్రతికూల పరిస్థితుల్లోనూ తనను తాను సంభాళించుకునే శక్తి మాత్రం అతనికి ఉంటుంది. నిజానికి గ్రహాల గమనంలో ఏ కాస్త తేడా వచ్చినా విశ్వాంతరాళమంతా క్షణాల్లో తునాతునకలైపోవచ్చేమో కానీ, ఎన్ని తేడాలు వచ్చినా మనిషి చాలా సార్లు ఆ విధ్వంసాన్ని నిలువరించే ప్రయత్నం చేయగలడు. కాకపోతే తన ప్రతి ప్రయత్నమూ ఫలించకపోవచ్చు. ఆ విషాదాన్ని ఆపలేకపోవచ్చు. లేదా మన ప్రయత్నానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండానే కొన్ని విషాదాలు జరిగిపోవచ్చు.

అలాంటి సంఘటనేదో జరిగిపోవడం వల్లే కదా ఆ అమ్మాయి ఒక శోకమూర్తిలా మారిపోయింది. అప్పటి నుంచే కదా సూర్యుడు అస్తమించగానే డాబా మీదికి వచ్చి అదేపనిగా ఆకాశాన్నీ, నేలనూ తేరిపార చూస్తూ ఉంటుంది.

తమలో భాగమై తమ చుట్టే పరిభ్రమిస్తూ తమను ఆవరించుకుని తమ మధ్య తిరగాడిన ఆ వెన్నెలను తలుచుకుంటూ ఎంత సేపు అలా ఉండిపోతుందో తెలియదు. ఆమె డాబా మీదికి వచ్చి అలా ఆకాశంలోకి తదేకంగా చూస్తున్నప్పుడు ఎంత కాదనుకున్నా మనసులో ఆ పాటే వినిపిస్తూ ఉంటుంది. నిజంగా ఆ పాటలోని ఏ పాదం విన్నా మనసు ఇట్టే కరిగి నీరైపోతుంది.

ఈ రోజులింక ముగిసినట్లేనని ఈ రేయి అంటోంది.
నువ్వు నాకింక లేవని నా మనసుకు కూడా తెలిసిపోయింది.
అయినా నా చూపులు పరిచి నీకోసం ఇక్కడే నిలుచున్నాను.
అయ్యో నేనింకేం చేయగలను? నువ్వేమో జ్ఞాపకం వస్తున్నావాయె!
ఎక్కడైతే మాటలు ఆగిపోతాయో అక్కడ పాటలు మొదలవుతాయి అంటారు. అంత భావోద్వేగాన్ని వ్యక్తం చేయడానికి మామూలు మాటలేం సరిపోతాయి. అందుకే పాట ప్రవేశించింది.

మండుతున్న నా ఎదలోంచి పొగలేవో లేస్తున్నాయి
ఇకనన్నా వచ్చేసేయ్ నా శ్వాస విలవిల్లాడుతోంది.
వసంతాల నీడలే నా దేహాన్ని కాల్చేశాయి
అయ్యో నేనింకేం చేయగలను? నువ్వేమో జ్ఞాపకం వస్తున్నావాయె!
గుండె మండిపోతున్నప్పుడు గ్రీష్మరుతువే కానక్కర లేదు. ఒకోసారి వసంతాలు కూడా అగ్నికురుస్తాయి. ఆ భావమే ఈ పాటలో ధ్వనిస్తోంది. జీవితం అక్షర బద్ధమై ఇలా ప్రవహిస్తుంది.
- బమ్మెర

Saturday, September 4, 2010

త్వరలో భూ విద్యుత్‌

Geo-Thermal
ఇప్పటిదాకా బొగ్గు, జలం, గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తిని చూశాం! కాస్తో, కూస్తో సౌర, పవన విద్యుత్‌ కూడా మనకు అందుబాటులో ఉంది. వాటన్నింటికీ భిన్నంగా, కొంచెం కొత్తగా..భూ ఉష్ణం తెరపైకి వచ్చింది. భూ అంతర్భాగంలోని పొరల్లో నుంచి ఉష్ణాన్ని వెలికితీసి, దాని ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే కొత్త ప్రక్రియ మొదలైంది. ఖమ్మంజిల్లా అశ్వారా వుపేటలో 25 మెగావాట్ల జియో థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకానుంది. ఈ కేంద్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి వరంగల్‌ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న నార్తర్న్‌ డిస్కమ్‌ (ఎన్పీడిసిఎల్‌) ఒప్పందం కుదుర్చుకుంది.

ఒప్పంద పత్రాలు త్వరలోనే విద్యుత్‌ నియం త్రణ మండలి (ఇఆర్‌సి) సమక్షంలోకి రానున్నాయి. దీనిపై ఇఆర్‌సి ఆమోదముద్ర పడగానే విద్యుత్‌ ఉత్పత్తి మొదలవుతుంది. ఈ తరహా విద్యుత్‌ ఉత్పాదక కేంద్రం ఏర్పాటు కావడం దేశంలో ఇదే తొలిసారి. ముంబాయికి చెందిన జియో థర్మల్‌ సిండికేట్‌ పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఐఐటి-బొంబాయికి చెందిన డి చంద్రశేఖరం అనే జియో ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌ ఈ సంస్థకు సాంకేతిక సహకారాలు అందిస్తున్నారు.

Geo-Thermal-model
ఈ సంస్థను నెలకొల్పినట్లు సమాచారం. భూ ఉష్ణంతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసే కేంద్రాలు అమెరికా, ఫిలిప్పీన్స్‌, ఇండోనేషియా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అమల్లో ఉంది. మనదేశానికి చెందిన టాటా పవర్స్‌ సంస్థ రూ.3 వేల కోట్లతో 1500 మెగావాట్ల ఇండోనేషియాలో జియోథర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని సైతం నెలకొల్పడం దీనికి ఉన్న డిమాండ్‌ను సూచిస్తోంది. వంటి కొన్ని దేశాల్లో ఉన్నాయని, వాటిని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తరువాత..అలాంటి కేంద్రాలనే రాష్ట్రంలో నెలకొల్పడానికి ఆ సంస్థ ఆసక్తి చూపిందని ఎన్పీడిసిఎల్‌ వర్గాలు ‘మేజర్‌న్యూస్‌’కు తెలిపాయి.

మాగ్మా కీలకం..
భూ అంతర్భాగంలో నిరంతరం సెగలు గక్కే మాగ్మాను చల్లార్చడం ద్వారా వెలువడయ్యే ఆవిరిని వెలికి తీయడమే ఇందులో కీలకం. మాగ్మా నుంచి వెలువడే ఉష్ణోగ్రత కనీసం 250 డిగ్రీల ఉష్ణోగ్రతతో కూడుకుని ఉంటుంది. అయితే మరీ అంత లోతుల్లోకి వెళ్లకుండా మాగ్మా ఉపరితలంలో అంటే...70 నుంచి 80 డిగ్రీల ఉష్ణోగ్రత వరకే గొట్టాలను అమర్చుతారు.

ఉష్ణం ఇలా వెలికి తీస్తారు
విద్యుత్‌ కేంద్రం ఆవరణ నుంచి భూ అంతఃపొరల్లో ఉన్న ఉష్ణాన్ని వెలికితీయడానికి 4-7 కిలోమీటర్ల మేర లోతుల్లో నాలుగు గొట్టాలను వేస్తారు. రెండు గొట్టాల ద్వారా చల్లటి నీటిని, మాగ్మాపైకి ధారగా పోస్తారు. సెగలు కక్కే మాగ్మా ఒక్కసారిగా చల్లబడటం ద్వారా ఉబికి వచ్చే వేడి ఆవిరిని మరో రెండు గొట్టాల ద్వారా నేరుగా... విద్యు త్‌ను ఉత్పత్తి చేసే టర్బయిన్‌ ఉండే గదిలోకి వదులుతారు. వేడి ఆవిరితో టర్బయిన్‌ తిరిగి విద్యుదుత్పత్తి అవుతుంది.

అశ్వారావు పేట ఎందుకంటే..?
ఖమ్మంజిల్లా అశ్వారావు పేటను ఆనుకునే గోదావరి ప్రవహిస్తోంది. ఈ ప్రాంతం కృష్ణా-గోదావరి బేసిన్‌ పరిధి లో ఉండటం వల్ల భూగర్భ జల వనరులు అపారం. దీనివల్ల మాగ్మాను చల్లారబెట్టడానికి నీటిని పెద్దగా వినియోగించాల్సిన పని ఉండదు.

త్వరలో ప్రతిపాదనలు
దీనికి సంబంధించిన ప్రతిపాదనలు త్వరలోనే ఇఆర్‌సి వద్దకు వెళ్లనున్నాయి. దీనిపై విచారణ నిర్వహించిన అనం తరం ఇఆర్‌సి ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేస్తుంది. ఇఆర్‌సి ఆమోదం లభించగానే ఉత్పత్తి మొదలవుతుంది. ఈ కేంద్రం విజయవంతమైతే దేశంలో మరిన్ని భూ ఉష్ణ విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటవుతాయనడంలో సందేహాలు అనవసరం. ఇండోనేషియాలో ఈ తరహా కేంద్రాన్ని నెల కొల్పిన టాటా పవర్‌ సంస్థ మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Thursday, September 2, 2010

పాజిటివ్‌ ధికింగ్‌..

ప్రస్తుతం మహిళలే కాదు పురుషులు కూడా అందం అంటే కేవలం ఎర్రని మేనిఛాయగా భావించడం లేదు. సంప్ర దాయ సౌందర్య పట్టికలో ఇప్పుడు ముఖం, కళ, ఫిగర్‌, హెయిర్‌ స్టయిల్‌, నడకతీరు, వ్యక్తిత్వం అన్నిటినీ చేర్చారు. ఎరుపు రంగు స్థానాన్ని ఇప్పుడు ఆత్మవిశ్వాసం, బోల్డ్‌నెస్‌,గ్లామరస్‌ లుక్‌, పాజిటివ్‌ ఆలోచనలు ఆక్రమించుకున్నాయి. మహిళల్లోని సహజమైన తెలివితేటలు, ఆత్మ విశ్వాసంతో కూడిన స్వభావం, పాజిటివ్‌ థింకింగ్‌, సహకరించే మనస్తత్వం లాంటివి ఎరుపు రంగును పక్కన పెట్టేస్తున్నాయి ప్రస్తుతం సౌందర్య కొలమానంలో, సౌందర్య పోటీల్లో కళ్ళు, ఫిగర్‌, చిరునవ్వు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

వ్యాయామమే బెస్ట్‌...

positiveఆకర్షణీయంగా కనిపించడానికి ఒంటి ఛాయ ఎరుపుగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ శరీరాన్ని చురుగ్గా కదిలేలా తయారు చేసుకోవాలి. దినచర్యలో భాగంగా ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం, జాగింగ్‌ తప్పకుంగా చేయాలి, టెన్నిస్‌, బ్యాడ్‌మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌లాంటి ఆటలు ఆడాలి. ఇలా చేస్తే హెల్దీగా,చురుగ్గా ఉంటారు.

చామనఛాయ..
ఒక వేళ శరీరం చామన చామనఛాయ కల్గి ఉంటే ఎప్పుడూ సాధారణ మేకప్‌ చేసుకోరాదు. కాలానికి అనుగుణంగా మేకప్‌ చేసుకోవాలి. అప్పుడు చామన ఛాయలో కూడా ఆకర్ష ణీయంగా కనబడతారు.చర్మం కోమలంగా, మెరిసేలా ఉండటం కోసం నెలలో ఒకసారి ఫేషియల్‌,15 రోజుల కొకసారి బ్లీచ్‌ చేయించాలి. కాళ్ళు, చేతులకి వారానికి ఒకసారి మేనిక్యూర్‌, పెడిక్యూర్‌ చేయించాలి. అవాంఛిత ప్రదేశాలలో వెంట్రుకలను రిమూవ్‌ చేసుకోడానికి వాక్సింగ్‌ లేదా హెయిర్‌ రిమూవర్‌ క్రీమ్‌ ఉపయోగించడం మంచిది. వారంలో రెండుసార్లు ముఖం పై ఫేస్‌ స్కృబ్‌ ఉపయోగించాలి. ఇలా చేస్తే చామనఛాయ చర్మం కూడా మెరుస్తూ అందంగా కనిపిస్తుంది. దీనితో ఆకర్షణీయమైన శరీరం మీసొంత మవుతుంది.

పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌
badypఅయితే అందమైన శరీరమే కాదు, చురుకైన మెదడు కూడా ఉండాలి. దీనికోసంమీలోని క్రియేటివిటీని అభివృద్ధి చేసుకోవాలి. పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ పుస్తకాలు చదవడం ఎంతో ఉపయోగకరం. అల్లికలు, వంటలు, కుట్టుపనులు మొదలైన అంశాల్లో సొంతంగా ప్రావీణ్యం సంపాదించండి. అందాల పోటీలకే కాదు, ఉద్యోగాలకైనా ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, ఆకట్టుకునే కనుముక్కు తీరు వుండడం ముఖ్యం. అంతే కానీ శరీరఛాయ నలుపు లేదా ఎరుపు రంగులో వున్నదా అన్నది ముఖ్యం కాదు. దీనితో బాటు పాజిటివ్‌ బాడీ లాంగ్వేజ్‌ కూడా అవసరం. అసభ్యత, ఓవర్‌ బోల్డ్‌నెస్‌ ెరీర్‌ను ముందు నడిపించలేవు. ఆఫీసులో పనిచేయ డానికి అందమైన ముఖంతో బాటు పనిలో నిర్దేశిత లక్ష్యాలను సాధించే నేర్పు కూడా ఎంతో అవసరం.

డ్రెస్సు.. సెన్సు...

thinkingబైటికి వెళుతునప్పుడు మనం ధరించే దుస్తులు కూడా మన వ్యక్తిత్వాన్ని ప్రకటిస్తాయి. దుస్తుల్ని సెలక్ట్‌ చేసుకునేటప్పుడు వాటి రంగు, డిజైన్‌ మీకు సూట్‌ అవుతుందా లేదా అని గమనించండి. చామనఛాయ రంగు ఉన్న అమ్మాయిలు ఆకర్షణీయంగా కనబడే రంగుల దుస్తుల్ని వేసుకోవాలి.బ్రైట్‌ కలర్స్‌ నీలి, రస్ట్‌, గులాబీ, ఆరంజ్‌ రంగులన్నీ చామన ఛాయ రంగున్న వారికి సందర్భోచితంగా సరిపోతాయి. గులాబి రంగు మేని ఛాయ గలవారు వాడవలసిన రంగుల గురించి వివరంగా వర్ణించనవసరం లేదు. వారికి ముదురు రంగులతో పాటుగా, లేత రంగులు కూడా నప్పుతాయి. ఎరుపైనా నలుపైనా తమలో వున్న పాజిటివ్‌ అంశాల వైపు దృిష్టిసారించాలి.