చేకూరి గౌతమరాజు

చేకూరి గౌతమరాజు
Facebook

Sunday, September 5, 2010

వెన్నెల మళ్లీ వచ్చేసింది కానీ....

"చాంద్ ఫిర్ నిక్‌లా- మగర్ తుమ్ న ఆయే
జలా ఫిర్ మెరా దిల్- కరూ క్యా మై హాయ్''
(మళ్లీ వెన్నెల వచ్చేసింది. కానీ, నువ్వే రాలేదు
మనసంతా కాలిపోతోంది. నేనిప్పుడు ఏం చేయాలో తెలియటం లేదు.)

ఎప్పుడో 1957లో విడుదలైన 'పేయింగ్ గెస్ట్' సినిమాలోని ఈ పాట దేశంలోని కోట్లాది గుండెల్ని పిండేసింది?
దూరంగా ఎక్కడో కొండ గుహల్లో ప్రతిధ్వనిస్తున్నట్లు లతామంగేష్కర్ స్వరం వినిపిస్తోంది. నిజమే మరి! ఆ ప్రియతముడు ఆలస్యంగానైనా వస్తాడో లేదో తెలియదు గానీ, చంద్రుడు మాత్రం వేళకే వేంచేస్తాడు. ప్రియతముడికి ఉన్నన్ని బాధలు చంద్రుడికి కూడా ఉండి ఉంటే అతడు కూడా అందరిలాగే కారణాలు చెప్పేవాడు.

అయినా, తెలియక అడుగుతాను? వేళాపాళా లేనిది మీకేనని మనుషుల్ని వెక్కిరించడానికి కాకపోతే సూర్యచంద్రులూ, నక్షత్రాలూ అంత కచ్చితమైన వేళల్ని పాటించడం ఏమిటండీ?తమవైనవన్నీ తమ చేతుల్లోనే ఉండిపోవడం వల్లే కదా ఆ టెక్కు! అన్నింటి మీదా నియంత్రణ ఉంది కాబట్టి అన్నీ తామనుకున్నట్టే జరిగిపోతే జరిగిపోవచ్చు.

కానీ, మనిషి పరిస్థితి వేరు కదా! అతడేమైనా గ్రహమా? నిర్ణీత కక్ష్యలో పరిభ్రమించడానికి, గోడ గడియారమా? నిర్ణీత క్రమంలో లోలకంలా ఊగడానికి. మనిషి జీవితమేమైనా పుస్తకమా? పేజీ తరువాత పేజీ క్రమం తప్పకుండా రావడానికి. అతనికో జీవితం ఉండి ఏడ్చింది కదా! ఇక్కడ అనుకున్నదొకటైతే జరిగేది మరొకటి. జీవితంలో నవ్వించే క్షణాల కన్నా ఏడ్పించేవే ఎక్కువాయె. అర్థం చేసుకోరు? సమయం మించి పోయిందీ అంటే సంజాయిషీ ఇచ్చుకోవలసిందే కదా!

జీవన స్పృహ ఏ క్షణాన ఆత్మలోకి చొరబడుతుందో ఏమో కానీ, నిలువెత్తు నిప్పురవ్వలా ఉన్నవారు సైతం క్షణాల్లో నీరైపోతారు. మందహాసం కనుమరుగై కళ్లల్లో ఆ విషాదం కదలాడుతుంది. ఎవరో ఎందుకు? నాకైతే ఆ ఎదురింటి అమ్మాయిని చూస్తుంటే ఎంతలో ఎంత మార్పు వచ్చేసిందా అనిపిస్తుంది. ఎప్పుడూ తూనీగలా తారాడే ఆ అమ్మాయి ఇటీవలి కాలంలో ఎప్పుడు చూసినా ఒక శోకమూర్తిలా కనిపిస్తోంది. అనుకున్నవి అనుకున్నట్లే జరిగిన న్ని రోజులు ఎవరైనా తూనీగలే.

వికటించినప్పుడు కదా సమస్య. పరిస్థితులు ఎంతో కొంత తన అధీనంలోనే ఉన్నట్టు మనిషి అనుకుంటాడే కానీ, అంత నియంత్రణలో ఎప్పుడుంది కనుక! కాకపోతే ఆ ప్రతికూల పరిస్థితుల్లోనూ తనను తాను సంభాళించుకునే శక్తి మాత్రం అతనికి ఉంటుంది. నిజానికి గ్రహాల గమనంలో ఏ కాస్త తేడా వచ్చినా విశ్వాంతరాళమంతా క్షణాల్లో తునాతునకలైపోవచ్చేమో కానీ, ఎన్ని తేడాలు వచ్చినా మనిషి చాలా సార్లు ఆ విధ్వంసాన్ని నిలువరించే ప్రయత్నం చేయగలడు. కాకపోతే తన ప్రతి ప్రయత్నమూ ఫలించకపోవచ్చు. ఆ విషాదాన్ని ఆపలేకపోవచ్చు. లేదా మన ప్రయత్నానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండానే కొన్ని విషాదాలు జరిగిపోవచ్చు.

అలాంటి సంఘటనేదో జరిగిపోవడం వల్లే కదా ఆ అమ్మాయి ఒక శోకమూర్తిలా మారిపోయింది. అప్పటి నుంచే కదా సూర్యుడు అస్తమించగానే డాబా మీదికి వచ్చి అదేపనిగా ఆకాశాన్నీ, నేలనూ తేరిపార చూస్తూ ఉంటుంది.

తమలో భాగమై తమ చుట్టే పరిభ్రమిస్తూ తమను ఆవరించుకుని తమ మధ్య తిరగాడిన ఆ వెన్నెలను తలుచుకుంటూ ఎంత సేపు అలా ఉండిపోతుందో తెలియదు. ఆమె డాబా మీదికి వచ్చి అలా ఆకాశంలోకి తదేకంగా చూస్తున్నప్పుడు ఎంత కాదనుకున్నా మనసులో ఆ పాటే వినిపిస్తూ ఉంటుంది. నిజంగా ఆ పాటలోని ఏ పాదం విన్నా మనసు ఇట్టే కరిగి నీరైపోతుంది.

ఈ రోజులింక ముగిసినట్లేనని ఈ రేయి అంటోంది.
నువ్వు నాకింక లేవని నా మనసుకు కూడా తెలిసిపోయింది.
అయినా నా చూపులు పరిచి నీకోసం ఇక్కడే నిలుచున్నాను.
అయ్యో నేనింకేం చేయగలను? నువ్వేమో జ్ఞాపకం వస్తున్నావాయె!
ఎక్కడైతే మాటలు ఆగిపోతాయో అక్కడ పాటలు మొదలవుతాయి అంటారు. అంత భావోద్వేగాన్ని వ్యక్తం చేయడానికి మామూలు మాటలేం సరిపోతాయి. అందుకే పాట ప్రవేశించింది.

మండుతున్న నా ఎదలోంచి పొగలేవో లేస్తున్నాయి
ఇకనన్నా వచ్చేసేయ్ నా శ్వాస విలవిల్లాడుతోంది.
వసంతాల నీడలే నా దేహాన్ని కాల్చేశాయి
అయ్యో నేనింకేం చేయగలను? నువ్వేమో జ్ఞాపకం వస్తున్నావాయె!
గుండె మండిపోతున్నప్పుడు గ్రీష్మరుతువే కానక్కర లేదు. ఒకోసారి వసంతాలు కూడా అగ్నికురుస్తాయి. ఆ భావమే ఈ పాటలో ధ్వనిస్తోంది. జీవితం అక్షర బద్ధమై ఇలా ప్రవహిస్తుంది.
- బమ్మెర

No comments:

Post a Comment