చేకూరి గౌతమరాజు

చేకూరి గౌతమరాజు
Facebook

Wednesday, September 8, 2010

ఆస్టేలియా .. కొంచెం అసూయ ... కొంచెం చిన్నచూపు ...

కంగారూ..క్రికెట్..ఈ రెండు పేర్లు చెప్పగానే ఎవరికైనా టక్కున గుర్తొచ్చేది ఆస్ట్రేలియా. ఇండియాకు కాస్త దగ్గరగా..అమెరికా తర్వాత మన యూత్‌కి గమ్య స్థానంగా మారిందీ దేశం. ఈ రెండు దేశాల మధ్య సంబంధం ఎలాంటిదంటే.. క్రికెట్‌లో ఈ దేశానికి ఆ దేశం గట్టి పోటీ. చదువుల్లో... ఉద్యోగాలు సంపాదించడంలో అక్కడి స్థానికులకు మన ఫారినర్లు మహా పోటీ. ఎంతంటే..దాన్ని అసూయగా మలచుకుని వీళ్లను వాళ్లు కొందరు కొట్టేంత. అయినా ఆస్ట్రేలియా ఆశ పెంచే దేశమే మనవాళ్లకు. 
అక్కడి వాళ్లలో కలిసిపోయే చిన్న కిటుకు తెలిస్తే చాలు ఇట్టే ఐస్ అయిపోతారు అని చెప్తున్నారు రెండేళ్లుగా మెల్‌బోర్న్‌లో ఉంటున్న మల్టీమీడియా స్టూడెంట్ తుమ్మల సునీల్ రెడ్డి.
నేను ఆస్ట్రేలియా వచ్చి రెండేళ్లవుతోంది. మెల్‌బోర్న్‌లో ఉంటున్నాను. ఇండియాలో డిగ్రీ చదివి మల్టీమీడియాలో డిప్లమా కోర్సు చేయడానికి ఇక్కడికి వచ్చాను. చదువుకుంటూనే రెండు ఉద్యోగాలు చేస్తున్నాను. ఒకటి వాలంటరీ జాబ్. ఇంటర్న్‌షిప్‌లాగా. టెంపరరీ రెసిడెంట్‌షిప్ పొందడానికి సంబంధిత రంగంలో ఆరునెలల ఇంటర్న్ షిప్ చేయడం చాలా అవసరం ఇక్కడ. అందుకే ఉదయం పూట ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో ఈ జాబ్ చేస్తున్నాను. ఇంకో ఉద్యోగమేమో 'ది ఏజ్' అనే న్యూస్ పేపర్‌లో మార్కెటింగ్ ఫీల్డ్‌లో. ఆ పత్రికకు చందాదారులను చేర్పించే పనన్న మాట.

వారానికి రెండు రోజులే
నేను ఫ్రెండ్స్‌తో కలిసుంటున్నాను. ప్రతి సోమ, శనివారాలు మాత్రమే కాలేజ్ ఉంటుంది మాకు. వారానికి రెండురోజులే. బ్యాచ్‌లను బట్టి ఇలా విభజిస్తారు. కాలేజ్ స్ట్రిక్ట్‌గా ఏమీ ఉండదు. ఉదయం ఏడింటికల్లా రెడీ అయిపోయి బయటపడతాను. రైళ్లు, ట్రామ్‌లు, బస్‌లు ఉంటాయి. ఇక్కడో విషయం చెప్పాలి.

విదేశాల్లో అన్నీ టైమ్ ప్రకారం జరుగుతాయి అనుకుంటారు కాని ఇక్కడ మాత్రం అంత పంక్చువాలిటీ ఏమీ ఉండదు. ఇవి చాలా వరకు ఆలస్యంగా నడుస్తుంటాయి. మరీ గంటలు గంటలు కాదు కాని ఐదు, పది నిమిషాలు లేట్ అవుతుంటాయి. ఒక్కోసారి రద్దవుతుంటాయి కూడా. మొత్తమ్మీద గంట ప్రయాణం చేసి ఎనిమిదికల్లా ఆఫీస్ చేరుకుంటాను. పదింటి దాకా అక్కడ పని చూసుకుని (కాలేజ్ ఉన్న రోజుల్లో ) కాలేజ్‌కి వెళ్తాను.

మూడింటి వరకు కాలేజ్. పొద్దున్న ఇంట్లో కార్న్‌ఫ్లేక్సే టిఫిన్. ఓపికుంటే వంట చేసుకోవడం లేదంటే బయట తినడం. కాలేజ్‌లో క్యాంటీన్ ఉండదు. మెక్‌డొనాల్డ్స్, కెఎఫ్‌సి లాంటి రెస్టారెంట్లు ఉంటాయి. నార్త్ ఇండియన్ రెస్టారెంట్లు కూడా ఉంటాయి. (ఇండియాలో దొరికే ప్రతి వస్తువు ఇండియన్ స్టోర్స్‌లో దొరుకుతుంది) ఆస్ట్రేలియన్లు మన ఫుడ్‌ని చాలా ఇష్టపడతారు. కాని కారాన్ని భరించలేరు. లంచ్ తర్వాత మూడింటికి 'ది ఏజ్' పత్రిక ఆఫీస్‌కి వెళ్తాను. ఇక్కడ నా పని..ఫోన్లో అప్పాయింట్‌మెంట్ ఫిక్స్ చేసుకోవడం..వాళ్లు ఇచ్చిన టైంకి వాళ్ల దగ్గరకి వెళ్లడం, చందా కట్టించుకోవడం. ఆ పని చూసుకుని ఇంటికి వెళ్లేసరికి రాత్రి పదకొండు అవుతుంది. రాత్రి మాత్రం వంట చేసుకుంటాం.

వాళ్ల పద్ధతుల్ని ఆచరిస్తే....
వీకెండ్స్ మామూలే. శనివారం మార్కెటింగ్ వాళ్లకు ఎక్కువ పనుంటుంది. అందుకే నాకు ఆదివారం ఒక్క రోజే సెలవు. ఆ ఒక్కరోజు బట్టలుతుక్కోవడం, ఇంకేమైనా చిన్న చిన్న పనులు చేసుకోవడంతోనే సరిపోతుంది. టైం ఉంటే సినిమాలు చూస్తాం. ఇక్కడ రెండు థియేటర్స్ ఉన్నాయి, వాటిల్లో హిందీ, తెలుగు సినిమాలు వస్తాయి కాని పెద్ద పెద్ద స్టార్స్‌వి మాత్రమే.

మా చుట్టుపక్కల వాళ్లంతా ఆస్ట్రేలియన్లే. కొంత మంది చాలా బాగా మాట్లాడతారు. పార్టీలకు పిలుస్తుంటారు. కొంతమందైతే అసలు పట్టించుకోరు. వాళ్ల పద్ధతులను, అలవాట్లను మనవిగా చేసుకుంటే మనతో చాలా బాగా ఉంటారు. ఇక్కడ చిన్న వయసులోనే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఉండడం మామూలే. దాన్ని కామెంట్ చేసినా...విమర్శించినా...అసలు సహించరు.

చిన్నచూపు ఎక్కువే

పత్రిక చందాదారులను చేర్పించడానికి ఆస్ట్రేలియన్ల దగ్గరకి వెళ్తుంటానని చెప్పాను కదా.... రకరకాల అనుభవాలు ఎదురవుతుంటాయి. కొంతమంది చాలా సాదరంగా ఆహ్వానిస్తారు. ఇక్కడెలా ఉందని అడుగుతారు, ఉద్యోగ అవకాశాల గురించి ఆరా తీస్తారు. కాని కొన్ని చోట్ల, కొంత మంది దగ్గర తీవ్రమైన పరాభావం ఎదురవుతుంటుంది. ఇండియన్స్ అంటే చాలు..బతకడానికి ఇక్కడి దాకా వచ్చిన వాళ్లని చాలా చిన్న చూపు చూస్తారు. అవమానం అనిపిస్తుంటుంది. కొద్ది క్షణాలు బాధపడి తర్వాత మర్చిపోయి ఉద్యోగ నిర్వహణలో పడిపోతాం.

అవసరం అలాంటిది మరి. పర్మనెంట్ రెసిడెంట్స్‌గా ఉండాలని వచ్చేవారికి ఇలాంటి వాటిని సహించే ఓర్పు వచ్చేస్తుంది. అసలు ఈ జాత్యాహంకారం ఇక్కడి యూత్‌లోనే ఎక్కువ. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వాళ్లను చూస్తే వీళ్లు సహించలేరు. ప్రత్యేకించి కారణమేమీ కనపడదు. నేను పరిశీలించినంత వరకు...ఇక్కడ పధ్నాలుగేళ్లకే సంపాదన మొదలుపెడతారు. తల్లిదండ్రుల ఆలనాపాలనా ఉండదు.

పని చేసుకోవాలి..చదువుకోవాలి.. అంతే.ఇండియన్స్ వచ్చి చక్కగా చదువుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడుతుంటే.. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మంచి హోదాలు సంపాదించుకుంటున్నారనే అసూయలాంటిదేదో వాళ్లలో కలిగి జాత్యహంకారం చూపిస్తారేమోనని అనిపిస్తుంది. చైనీయుల్ని, లెబనీయుల్ని వీళ్లు ఏమీ అనరు. (చైనీయులు ఇక్కడ ఇన్వెస్టర్స్‌గా ఉంటారు కాబట్టనుకుంటా)ఇంకో విషయం ఏంటంటే..లెబనీయులు కూడా మన మీద పెత్తనం చూపిస్తుంటారు. అసలు ఆస్ట్రేలియన్లకన్నా వీళ్లే ఎక్కువ పెత్తనం చెలాయిస్తుంటారు. అయితే ఎన్ని దాడులు చేసినా భారతీయ స్త్రీల జోలికి మాత్రం వెళ్లినట్టు నేనెక్కడా నోటీస్ చేయలేదు.

క్రీడా ప్రియులు
మనం సంపాదించడానికే ఇక్కడికి వస్తుంటాం కాబట్టి లక్ష్యమంతా డబ్బు సంపాదన మీదే ఉంటుంది. వాళ్లకు సహజంగానే అలా ఉండదు. నేను చూసినంత వరకు ఆస్ట్రేలియన్లు రెండు గంటలు ఏకధాటిగా పని చేయలేరు. ప్రతి అరగంటకు వాళ్లకు కాఫీ బ్రేకో, స్మోక్ బ్రేకో..కావాల్సిందే. వీకెండ్ కోసమైతే అర్రులు చాస్తారు. శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి దాకా ఎంజాయ్ మూడ్‌లోనే ఉంటారు. ఆటలంటే వీళ్లకు అమిత ఆసక్తి, ఒక రకంగా చెప్పాలంటే ఆటలు వాళ్ల జీవితంలో భాగం, చదువుకంటే కూడా ఆటలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. క్రికెట్, ఫుటీ(రగ్బీలాంటి గేమ్) లాంటి ఆటల్ని ఎక్కువగా ఇష్టపడతారు. జాతీయభావం ఎక్కువ.

హిందు, పాక్ భాయి భాయి
ఆసియాలో ఇండియా, పాక్ అంటే బద్ధ శత్రువులు కాని ఇక్కడ మాత్రం భాయి..భాయిగా ఉంటారు. పాకిస్తానీ ఆర్గనైజేషన్స్, ఇన్స్‌స్టిట్యూట్‌లో ఇండియన్లకు తగిన ప్రాధాన్యం ఇస్తారు. ఫీజు చెల్లింపు విషయాల్లో కూడా వాయిదా పద్ధతుల్లో చెల్లించే వెసులుబాటును ఇస్తారు. అందరం ఒక్కటనే భావనే ఉంటుంది. పండగలు లాంటి సమయాల్లో తెలుగు వాళ్లే కాకుండా అందరం కలుసుకుంటాం. తెలుగు వాళ్లమైతే దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటాం. ఇక్కడ మురుగన్ గుడి, సాయిబాబా దేవాలయాలున్నాయి. నెలలో రెండు సార్లు వెళ్తుంటాం.

అనుకున్నంత గొప్పగా...
దూరపు కొండలు నునుపు అన్నట్టు ఇక్కడ అనుకున్నంత గొప్ప అవకాశాలైతే ఏమీ లేవు. మాస్టర్ డిగ్రీ కోర్సులైతే బాగానే ఉంటాయి కాని డిప్లమా కోర్సులను ఇక్కడి కంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ స్టాండర్డ్ చదువును ఇండియాలోనే పొందవచ్చు. అయితే ఇక్కడ పిఆర్(పర్మనెంట్ రెసిడెన్సీ) పొందడం కోసం చదువు వంకతో వస్తుంటాం. కాని చాలా కష్టం.

మాస్టర్స్ చేసిన వాళ్లకు కూడా చదువు అయిపోగానే ఉద్యోగాలు వచ్చి వాలడం లేదు. మనకు సంబంధించి ఎవరో ఒకరు లిఫ్ట్ ఇచ్చే వాళ్లు లేకుండా ఇక్కడ ఉండడం ఇబ్బందే. డబ్బుల్లేక, ఫీజు కట్టలేక వెనక్కి వెళ్లిపోయిన వాళ్లెందరో ఉన్నారు. పైగా డిప్లమాలాంటి కోర్సులు చేస్తున్న వాళ్లు జాత్యాహంకారానికి బలైతే భారత ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత లేదని విదేశాంగ మంత్రి ఎస్.ఎం. కృష్ణ కూడా ప్రకటించారు.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఎవరైనా ఆస్ట్రేలియా వైపు అడుగులు వేస్తే మంచిదని నా అభిప్రాయం. ఎవరినీ నిరుత్సాహ పరచాలని మాత్రం ఇదంతా చెప్పడం లేదు.
జూ సరస్వతి రమ

No comments:

Post a Comment