చేకూరి గౌతమరాజు

చేకూరి గౌతమరాజు
Facebook

Friday, August 27, 2010

పల్లె వేత్తలు

సెల్ ఫోన్‌తో ఒక్క కాల్ చేస్తే చాలు... ఆ సౌండ్‌కే మోటర్ ఆన్ అవుతుంది...
చేనుకి నీళ్లు పెట్టాలంటే కరెంటు మోటర్ అవసరం లేదు... సైకిల్ ఉంటే చాలు...
లైట్ వెలగాలన్నా, ఫ్యాన్ తిరగాలన్నా స్విచ్ వేయాల్సిన పనిలేదు... రిమోట్ నొక్కితే చాలు...
ఐరన్ చేసుకోవడానికి కరెంటు, బొగ్గులు అవసరం లేదు... గ్యాస్ ఉంటే చాలు...
ఆ బైక్‌ని ఎంత దూరం నడిపితే దాన్లో ఉన్న బ్యాటరీ అంత ఎక్కువ చార్జ్ అవుతుంది... ఆ చార్జ్‌తో మళ్లీ అంత దూరం నడపొచ్చు... ఏంటి ! ఇవన్నీ నిజమే ! అని సందేహపడవద్దు. వీటిని కనిపెట్టిన వ్యక్తుల్ని కూడా ఈ పేజీల్లో మీరు చూడొచ్చు. వాళ్లెవరూ పెద్దగా చదువుకున్నవాళ్లు కాదు. వాటితో వ్యాపారాలు చేద్దామనుకుంటున్నవాళ్లూ కాదు. సాదాసీదా మనుషులు. Necessity is the mother of invention కి అచ్చమైన ఉదాహరణలుగా నిలిచే వ్యక్తులు. వారి పేర్లు రాంబాబు, బ్రహ్మం, మల్లేష్, జగదీశ్వర్ వగైరా వగైరా. అంటే మనవాళ్లే. తెలుగు వాళ్లే. పల్లెతల్లి బిడ్డలే.

కాల్ చేస్తే నీళ్లొస్తాయ్

ఖమ్మం జిల్లాలోని మారుమూల గ్రామం బొమ్మనపల్లికి చెందిన రాంబాబు వృత్తిరీత్యా మోటర్ మెకానిక్. బాగు చేయడమే తెలిసిన అతనికి ఏదైనా తయారు చేయాలనిపించేది. వానాకాలంలో తడిసిన మోటర్లు ఆన్ చేయడం వల్ల షాక్ కొట్టి రైతులు చనిపోవడం గమనించాడు రాంబాబు. మోటర్ స్విచ్‌ను అంటుకోకుండా దాన్ని ఆన్ చేయడమెలా అని ఆలోచించాడు. మోటర్ సర్క్యూట్‌లో సౌండ్ సెన్సర్ (శబ్దానికి స్పందించేది) వాడి చప్పట్లతో మోటర్‌ను ఆన్ చేయడం కనుగొన్నాడు. అక్కడితో ఆగలేదు. బైక్‌లకు, కార్లకు ఉపయోగించే రిమోట్‌ని కరెంటు మోటర్‌కి కూడా బిగించి దానితో ఆన్, ఆఫ్ చేయవచ్చని కనిపెట్టాడు. రిమోట్లు కొనాలంటే ఖర్చెక్కువ కాబట్టి దానికి ప్రత్యామ్నాయాలు ఆలోచించాడు. అప్పుడే రాంబాబు దృష్టి సెల్‌ఫోన్‌పై పడింది.

సెల్‌ఫోన్ రింగ్ ఇస్తే మోటర్ ఆన్ చేసే పద్ధతి కనుగొన్నాడు. నాలుగు సార్లు రింగ్ అయ్యే వరకు సెల్‌ఫోన్‌ను ఆన్‌లో ఉంచి వింటే మోటర్ తిరుగుతున్న శబ్దం, నీళ్లు పడే శబ్దం కూడా వినవచ్చు. రాంబాబు అక్కడితో కూడా ఆగలేదు... మోటర్ సర్క్యూట్‌కి మరో పరికరాన్ని అమర్చాడు. దానివల్ల మోటర్‌కి మూడు మీటర్ల దూరంలోకి ఎవరైనా వస్తే సైరెన్ మోగుతుంది. ఆ పరికరంలో ఫీడ్ చేసిన యజమాని నెంబర్‌కి వెంటనే కాల్ కూడా వస్తుంది. దీనివల్ల మోటర్‌ని దొంగలు ఎత్తుకెళ్లే అవకాశం కూడా ఉండదు. ఈ పరికరాన్ని మోటర్‌కి బిగించుకోవడానికి మూడువేల రూపాయలు ఖర్చు అవుతుంది. సహజంగానే రైతులకు ఇది బాగా నచ్చింది. ఇప్పుడు వాళ్ల ఊరు చుట్టుపక్కల గ్రామాల రైతులందరూ రాంబాబు సహాయంతో ఇళ్ల వద్దనుండే మోటర్లని సెల్‌ఫోన్‌తో ఆన్, ఆఫ్ చేసుకుంటున్నారు. వీటన్నిటినీ తయారు చేసిన రాంబాబు చదువుకున్నది రెండో తరగతే.

లైటెయ్యాలంటే రిమోట్ నొక్కితే చాలు...

బొమ్మగాని మల్లేష్ పదో తరగతి వరకూ చదువుకున్నాడు. పదహారేళ్ల వయసులో కుటుంబ పోషణకోసం బేకరీపని నుంచి క్లీనర్ పని వరకూ అన్ని రకాల పనులూ చేశాడు. అలా కష్టపడి ఇద్దరు అక్కల పెళ్లిళ్లు చేశాడు. చివరికి ఇంటి దగ్గరే ఎలక్ట్రిక్ షాపు పెట్టుకున్నాడు. ఉన్నట్టుండి తల్లికి పక్షవాతం వచ్చింది. దాంతో మంచానికే అతుక్కుపోయిన తల్లి పగలంతా ఒంటరిగా ఉండేది. ఫ్యాన్ వేసుకోవాలన్నా, లైట్ వేసుకోవాలన్నా మరొకరి సాయం అవసరమయ్యేది. దాంతో ఆ పనుల కోసం ఒక రిమోట్ తయారుచేసి తల్లి చేతిలో పెట్టాడు. ఆ రిమోట్‌తోటే ఇప్పుడు ఇంట్లో ఫ్యాన్, లైట్లు అన్నీ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. మల్లేష్ తల్లి చేతిలో ఆ రిమోట్‌ని చూసిన ప్రతివారూ తమకూ అలాంటిది తయారుచేసి పెట్టమని అతన్ని కోరారు. ప్రస్తుతం మల్లేష్ అదే పనిలో బిజీగా ఉన్నాడు.

ఆటోమేటిక్ స్టవ్ ఆఫ్

గద్వాల్‌లో ఉంటున్న ఇష్వాక్‌కు మిఠాయి దుకాణం ఉంది. తండ్రికి సహాయంగా షాపులోనే పనిచేస్తూ ఉంటాడు. ఓ రోజు ఇష్వాక్ ఒక దుర్వార్త విన్నాడు. గ్యాస్ స్టౌ పేలి ఇద్దరు చనిపోయారని. సిలిండర్ నుండి స్టౌకి ఉండే పైపులో నుంచి గ్యాస్ లీకవ్వడమే అందుకు కారణమని తెలుసుకొన్నాడు. స్టౌ కట్టేసినపుడు ఆటోమెటిక్‌గా సిలిండర్ కూడా ఆఫ్ అయ్యేలా ఓ పరికరాన్ని తయారు చేశాడు. ఇప్పుడు ఇష్వాక్ చాలామందికి ఈ ఆటోమెటిక్ పరికరాన్ని అమర్చిపెడుతున్నాడు. ఇష్వాక్ చెప్పేది ఒక్కటే..."చాలామంది స్టౌ కట్టేస్తారు కాని సిలిండర్ ఆఫ్ చెయ్యరు. పేలుళ్లకు ఆ అశ్రద్ధే కారణం. నేను కనిపెట్టిన ఈ పరికరం వల్ల కొందరైనా ప్రమాదం నుంచి తప్పించుకోగలిగితే నాకు అంతే చాలు.''

గ్యాస్ ఐరన్ బాక్స్

ఐరన్ బాక్స్ అనగానే మనకి గుర్తుకొచ్చేది బొగ్గులతో చేసేది, విద్యుత్‌తో నడిచేది. ఈ రెండింటికీ భిన్నంగా గ్యాస్‌తో వాడుకునే ఐరన్ బాక్స్‌ని తయారుచేశాడు వరంగల్ జిల్లా నర్సంపేట సమీపంలోని ఎల్లాయగూడెంకి చెందిన బ్రహ్మం. "బొగ్గు నింపి అంటించడం పెద్దపని. వర్షాకాలంలో అయితే ఇంకా తలనొప్పి. కరెంటు వాడకం ఖర్చుతో కూడుకున్న పని. పర్యావరణ రీత్యా కూడా గ్యాస్ మేలు. పైగా షాక్ కొడుతుందేమోనని భయపడాల్సిన అవసరం లేదు'' అంటాడు బ్రహ్మం. ఆ ఉద్దేశ్యంతోనే ఈ గ్యాస్ ఐరన్ బాక్స్‌ని కనిపెట్టానంటాడు. పైగా కరెంటు, బొగ్గు ఐరన్‌బాక్స్‌లతో పోలిస్తే గ్యాస్ బాక్స్‌కి అయ్యే ఖర్చు తక్కువని అంటాడు.

సైకిల్ తొక్కుతూ చేనుకు నీళ్లు పెట్టొచ్చు...

ఐదో తరగతి వరకు చదువుకున్న విక్రమ్‌ది ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు. తనకి, తన అన్నకి చెరో నాలుగెకరాల పొలం ఉంది. అన్నకి విద్యుత్ మోటార్ ఉంది కాని తమ్ముడు విక్రమ్ రాథోడ్‌కి లేదు. తన పొలంలో వ్యవసాయం చేసుకుంటూనే విక్రమ్ సైకిల్ రిపేర్లు చేసుకుంటూ బతుకుతున్నాడు. ఐదేళ్లక్రితం సంగతి... విక్రమ్ మూడెకరాల్లో పత్తిపంట వేశాడు, ఒక ఎకరంలో వరి వేద్దామనుకున్నాడు కాని మోటర్‌గాని కరెంటు సదుపాయం గాని లేకపోవడంతో ఆ పని చెయ్యలేకపోయాడు. కరెంటు లేకుండా మోటర్ నడపలేమా? అని ఆలోచించాడు. కరెంట్ మోటర్‌లో ఫ్యాన్ (నీటిని తోడే పుల్లీ) వేగంగా తిరగడం వల్లే నీరు పైకి వస్తుందని గుర్తించాడు. చేతితో కూడా ఆ ఫ్యాన్‌ని తిప్పవచ్చుకదా అని ఆలోచించాడు. ప్రయత్నిస్తే నీళ్లు కొద్ది కొద్దిగా వచ్చాయి. సైకిల్‌తో మోటర్‌ని అనుసంధానం చేస్తే ఎక్కువ నీళ్లు వస్తాయనుకున్నాడు. కాని విక్రమ్‌కు సొంత సైకిల్ కూడా లేదు. ఇంట్లో ఉన్న జొన్నలు అమ్మేసి పాత సైకిల్ ఒకటి కొన్నాడు. కావాల్సిన సామాగ్రి మొత్తం సమకూర్చుకుని మొత్తం మీద ప్రయత్నం మొదలెట్టాడు.

సైకిల్ చక్రం నిమిషానికి యాభై సార్లు తిరుగుతుంది. అదే మోటర్ అయితే మూడు వేల సార్లు తిరుగుంది. బెల్టుల సహాయంతో సైకిల్ రిమ్‌కు మోటర్ ఫ్యాన్‌ను కలిపాడు. సైకిల్ తొక్కుతుంటే మోటర్ నుంచి నీళ్లు వచ్చాయి. అలా సైకిల్ మోటార్‌తో ఒక సంవత్సరం వరి కూడా పండించాడు.

బైక్... బ్యాటరీ బైక్ !

వరంగల్ జిల్లా చెన్నారావుపేటకి చెందిన జగదీశ్వర్ బ్యాటరీతో నడిచే మోటర్ సైకిల్‌ని కనిపెట్టాడు. తొమ్మిదో తరగతి వరకు చదువుకొన్న జగదీశ్వర్ వృత్తి రీత్యా బైక్ మెకానిక్. బైక్ ఇంజన్లతో ఏవేవో ప్రయోగాలు చేయడం ఆయనకి అలవాటు. ఒకసారి తన స్నేహితుడి బండి తీసుకుని దానికొక బ్యాటరీ బిగించాడు. బైక్ నడుస్తుంటే దాన్లో ఉన్న బ్యాటరీ చార్జ్ అవడం గమనించాడు. ఆ చార్జ్ తోటే మళ్లీ బైక్‌ను నడిపి చూశాడు. అలా రెండు వందల కిలోమీటర్లు నడిపి చూపించాడు. ఎవరైనా ఆసక్తి చూపించి ఆర్థిక సహాయం చేస్తే ఈ బ్యాటరీలను తయారు చేస్తానని అంటున్నాడు జగదీశ్వర్.

ఆసు యంత్రం

తల్లి పడుతున్న కష్టం చూసి తట్టుకోలేపోయాడు మల్లేష్. ఏడేళ్లు కృషి చేసి ఆసుయంత్రం కనిపెట్టాడు. నల్గొండ జిల్లా ఆలేరు ప్రాంతానికి చెందిన చింతకింది మల్లేష్ ఏడవ తరగతితో చదువాపేసి చేనేత కార్మికుడిగా స్థిరపడ్డాడు. చీర నేతకు ముందు దారాలను ఆసుపోస్తారు. ఆ పనంతా తల్లిదే. ఒక చీరకు సరిపడా దారాలను చేత్తో ఆసు పోయడానికి ఆరు గంటల సమయం పడుతుంది. అదే మల్లేష్ కనిపెట్టిన ఆసుయంత్రంతో అయితే రెండు గంటల్లో ఆసు పోయవచ్చు. ఇప్పుడు చాలామంది మల్లేష్ నుండి ఈ యంత్రాల్ని కొనుగోలు చేస్తున్నారు.

దోమలకి చెక్...

దోమల బెడద గురించి వేరే చెప్పనవసరం లేదు. పల్లెల నుండి పట్టణాల దాకా అందరూ దోమల బెడద ఎదుర్కోక తప్పదు. పల్లెటూళ్లలో అయితే మనుషులు దోమతెరలతో వాటి బారినుంచి బయట పడినా గేదెలు, ఆవుల పరిస్థితి ఏమిటి? అందుకే ఈ సమస్యకి పరిష్కారం కనుగొనాలనుకున్నాడు చిత్తూరు జిల్లా కారకొల్లు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అనే రైతు. తెల్లజుమ్కి అనే చెట్టు రసం దోమల నివారణకి ఉపయోగపడుతుందని కనిపెట్టాడు. ఈ రసం నుంచి తయారుచేసిన తైలం కొద్దిగా మన ఒంటికి రాసుకుంటే దోమలు మనదరికి చేరవు. ఇంటి చుట్టుపక్కల నీళ్ల గుంటల్లో దీన్ని కొద్దిగా వేస్తే దోమగుడ్డు పూర్తిగా చనిపోతుందని కూడా తెలుసుకున్నాడు.

వీళ్లంతా తమకొచ్చిన ఆలోచనలని ఆచరణలో పెట్టి విజయం సాధించిన వారే. అయితే అలాంటి వారికి తగిన గుర్తింపు రావాలంటే ఏం చెయ్యాలి? వారి ప్రయోగాల గురించి, సాధించిన విజయాల గురించి బయటి ప్రపంచానికి తెలియజేయడమే కాకుండా వారు తయారు చేసిన వస్తువులకి పేటెంట్‌లు ఇ ప్పించే పనిలో ఉంది హనీబీ అనే స్వచ్ఛందసంస్థ. అంతేకాదు వీరి గురించి నలుగురికి తెలిపే పనిలో భాగంగా పల్లె సృజన పేరుతో ఒక మాసపత్రికని కూడా ప్రచురిస్తోంది.

హనీబీ ఎవరు?

హనీబీ అంటే తేనెటీగ. తేనెటీగ ఏం చేస్తుంది? పువ్వుల్లోని మకరందాన్ని తీసుకెళ్లి తేనెగా మారుస్తుంది. అదే ఉద్దేశంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్ అనిల్‌గుప్తా ఈ హనీబీ సంస్థని 1989లో స్థాపించారు. పల్లె ప్రజల్లో ఉండే విజ్ఞానం అందరికీ అందాలనే ఆలోచనే దీన్ని నెలకొల్పడం వెనక ఉద్దేశం. మారుమూల పల్లెల్లోని ఈ గ్రామీణ శాస్త్రవేత్తలని జాతీయ ఆవిష్కరణా సంస్థ (నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్-ఎన్.ఐ.ఎఫ్.)తో అనుసంధానం చేయడమే హనీబీ పని.

ప్రకృతికి దగ్గరగా ఉండే పల్లెవాసులు వారి అవసరాల కోసం రకరకాల ఔషధాలు, వస్తువులు తయారు చేసుకుంటారు. వారి విజ్ఞాన సంపద నలుగురికీ తెలిసే అవకాశం తక్కువ. ఎందరో పల్లెవాసుల విజ్ఞానాన్ని చూసిన ఆయన దేశంలోని అన్ని రాష్ట్రాలకు హనీబీ నెట్‌వర్క్‌ని విస్తరించారు. దీనిలో పనిచేసేవారంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చినవారే. పెద్దపెద్ద ఉద్యోగాలు చేసి పదవీ విరమణ చేసినవారు చాలామంది ఈ సంస్థలో చేరుతున్నారు. మన రాష్ట్రం విషయానికొస్తే... బ్రిగేడియర్ గణేశం, డా.కె.ఎల్ రావు, పి. చంద్రకాంత్ శర్మ అనే ముగ్గురు 2005లో ఈనెట్‌వర్క్‌లో చేరారు.

కొన్నాళ్లకు దీని విశిష్టత తెలుసుకుని ఇంకా చాలామంది వీరితో చేతులు కలిపారు.తమ దృష్టికి వచ్చిన పల్లె 'శాస్త్రవేత్తల' గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటుంది హనీబీ. ఆ వ్యక్తి కనిపెట్టిన వస్తువుని పరిశీలించి ముందుగా దాని వివరాలను రికార్డు చేస్తారు. ఇంకెక్కడైనా అలాంటి వస్తువు వాడకంలో ఉందో లేదో కనుక్కొంటారు. ఒకవేళ లేకపోతే దాని అవసరాన్ని గుర్తించి వారికి పేటెంట్ హక్కు ఇప్పిస్తారు. ఆ వస్తువు పట్ల ఆసక్తి చూపే సంస్థల్ని సంప్రదిస్తారు, పెద్ద ఎత్తున ఆ వస్తువు తయారుచేయడానికి ఆ వ్యక్తే సిద్ధమైతే వాటిని మార్కెట్‌లో అమ్ముకోడానికి తగిన సదుపాయాల్ని కూడా సమకూరుస్తారు.

దేశవ్యాప్తంగా లక్షానలభై వేల ఇన్నొవేటర్ల గురించి తెలుసుకొని వాళ్లు కనిపెట్టిన వస్తువుల గురించి రికార్డ్ చేసింది ఈ సంస్థ. వాటిలో డెభ్బైశాతం సంప్రదాయ జ్ఞానంతో తయారైనవైతే ముప్పైశాతం సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించి తయారు చేసినవి. మన రాష్ట్రంలో ఇప్పటివరకు 74 మంది ఇన్నొవేటర్లని వారు గుర్తించారు. వీరి ఆవిష్కరణలను ఎన్.ఐ.ఎఫ్‌లో రిజిష్టర్ చేశారు. వీరిలో నలుగురి ఆవిష్కరణలను పారిశ్రామికవేత్తలకు అందించి వారితో ఆర్థిక ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రం నుండి ఎన్.ఐ.ఎఫ్‌కి మొత్తం వెయ్యికి పైగా ఎంట్రీలు వచ్చాయట.

శోధ(న) యాత్రలు కూడా...

తమంతట తాము పంపేవాళ్ల సమాచారంతో ఆగిపోకుండా ఈ సంస్థ ప్రతినిధులు దేశమంతటా పర్యటించి జనం సృజనాత్మకంగా తయారు చేసుకున్న పరికరాలను గుర్తించే పనికూడా పెట్టుకున్నారు. హనీబీ అధ్యక్షుడు అనీల్‌గుప్తా సారధ్యంలో ఆర్నెల్లకొకసారి ఈ శోధ యాత్ర జరుగుతుంది. బ్రిగేడియర్ గణేశం మాటల్లో చెప్పాలంటే... శోధ యాత్ర అంటే 'మరుగున పడిన జ్ఞాన దేవాలయాలను సందర్శించే తీర్థ యాత్ర'. ఈ యాత్రలో పాల్గొన్నవాళ్లు మారుమూల గ్రామాలు, గిరిజన తండాల్లో తిరిగి వారి జీవనవిధానాల్ని పరిశీలించి వారిలోని ఇన్నొవేటర్లని గుర్తిస్తారు. యాత్రలో 60 నుంచి 70 మంది దాకా పాల్గొంటారు. వారిలో పలురాష్ట్రాలకు చెందిన రైతులు, పరిశోధకులు, విద్యార్థులు, నిపుణులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, విదేశీయులు ఉంటారు. దేశంలోని అన్ని ప్రదేశాల్లోనూ ఈ యాత్ర జరుగుతుంది. ఇప్పటివరకు మొత్తం 24 శోధ యాత్రలు చేశారు.

వందలో ఒక్కరికి గౌరవం దక్కినా చాలు...

"పల్లె శాస్త్రవేత్తల ఇన్నొవేషన్స్ పెద్ద ఖరీదు కూడా ఉండవు. పైగా కనిపెట్టిన ఏ వస్తువైనా పదిమందికి ఉపయోగపడితే చాలనుకుంటారు కాని వాటి వల్ల ఆర్థికంగా ఎదిగిపోవాలన్న అత్యాశ వారికి లేదు. అదే వారి గొప్పతనం. అలాంటి వారికి పూర్తిస్థాయిలో న్యాయం జరగకపోయినా కొంతలో కొంతైనా వారికి గుర్తింపు లభించేందుకు కృషి చేస్తున్నాం. దీనికి చింతకింద మల్లేషే పెద్ద ఉదాహరణ. తల్లి పడుతున్న కష్టం చూడలేక ఆసు యత్రం కనిపెట్టాడు. అది ఎందరో తల్లులకు వరమైంది. హనీబీ నెట్‌వర్క్ మల్లేష్‌కి జాతీయస్థాయిలో గుర్తింపుని తీసుకొచ్చింది. వందలో ఒక్కరికి ఇలాంటి గౌరవం దక్కినా చాలు. మేము చేస్తున్న పనికి సార్థకత చేకూరుతుంది'' అంటారు బ్రిగేడియర్ గణేశం.

గుర్తింపు అంతంత మాత్రమే!

ఈ ఆవిష్కరణలకి పరిశ్రమల నుండి వస్తున్న స్పందన మాత్రం అంతంత మాత్రమే. ఇష్వాక్ కనిపెట్టిన గ్యాస్ స్టౌని ఆపే యంత్రం గురించి హనీబీ వాళ్లు బెంగుళూరులోని గ్యాస్ కంపెనీ నిపుణులకు తెలియజేస్తే వాళ్లు చెప్పిన సమాధానం ఇదీ- ఇకముందు తయారు చేసే పైపుల్లో నుంచి గ్యాస్ లీకయ్యే ప్రమాదముండదు. ఆ రకమైన పైపులు తయారు చేశాం కాబట్టి ఇష్వాక్ ఇన్నొవేషన్‌తో పని లేదన్నారు. మంచిదే. కాని తాము కనిపెట్టలేని దాన్ని కనిపెట్టాడనైనా ప్రశంసించి ఉండవచ్చు.

బైక్ నడుస్తుంటే రీచార్జ్ అయ్యే బ్యాటరీ తయారు చేసిన జగదీశ్వర్ పరిస్థితి కూడా ఇంతే. అతని ఆవిష్కరణను స్వీకరించే సంస్థలేవైనా ముందుకు వస్తాయేమో కనుక్కునే ప్రయత్నం చేసింది హనీబీ. ఒక పేరున్న సంస్థని సంప్రదిస్తే వారు జగదీశ్వర్‌ని ఆ బ్యాటరీ తయారీ వివరాలు చెప్పమని అడిగారు. ఆ రహస్యాన్ని చెప్పడానికి ఇష్టపడని జగదీశ్వర్ వెనుదిరిగాడు.
సైకిల్-మోటర్ తయారు చేసిన విక్రమ్ గురించి తెలుసుకున్న హనీబీ సంస్థ వాటిని తయారు చేయడానికి ఆయనకి ఆర్థిక సహాయం చేసింది. ఆ సహాయంతో విక్రమ్ పది యంత్రాలను తయారు చేసి ఢిల్లీలో అమ్మాడు కూడా. అయితే స్థానికులు మాత్రం ఈ సైకిల్ మోటార్ పట్ల ఎలాంటి ఆసక్తి చూపలేదని అంటాడు విక్రమ్. ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తే ఈ పరికరాలు మరిన్ని తయారు చేస్తానని అంటున్నాడు.
చంద్రశేఖర్ తయారు చేసిన దోమల తైలాన్ని పూర్తిగా పరిశీలించి హనీబీ ఎన్.ఐ.ఎఫ్‌కి దాని వివరాలు పంపింది. వారు చంద్రశేఖర్‌కి 85 వేల రూపాయల వడ్డీ లేని రుణాన్ని ఇచ్చారు.

గ్యాస్ ఐరన్ బాక్స్‌ది మరోకథ. దాని గురించి తెలుసుకొన్న హనీబీ ఒక ప్రైవేటు సంస్థతో మాట్లాడి అక్కడ బ్రహ్మం ఆలోచనకి గుర్తింపునిచ్చే ప్రయత్నం చేసింది. కాని అది ఫలించలేదు. అయితే హనీబీ సంస్థ బ్రహ్మంకి పేటెంట్ హక్కుల్ని కూడా ఇప్పించింది. తనకి ఏదైనా మార్గం చూపమని ఆయన మళ్లీ హనీబీనే ఆశ్రయించాడు. ఆయనలాంటి వారి కోసమని హనీబీ నెలకొల్పిన 'క్రియేటివ్ మైండ్స్' కంపెనీలో ఈ గ్యాస్ ఐరన్ బాక్స్ తయారుచేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇన్నాళ్లకి తన కలకి గుర్తింపు వస్తున్నందుకు బ్రహ్మం చాలా సంతోషపడుతున్నాడు. ఈ సంస్థ విడుదల చేయబోయే మొట్టమొదటి ఉత్పత్తి కూడా ఇదే.

మల్లేష్ తయారు చేసిన ఆసు యంత్రం గురించి తెలుసుకున్న హీనీబీ ఆయనకి పేటెంట్ ఇప్పించడంతోపాటు ఇతర రాష్ట్రాల్లోని చేనేత కార్మికులకు ఈ యంత్రాలను అమ్ముకునే సదుపాయాల్ని కూడా కల్పించింది. మన రాష్ట్రంలోనే 500 వందల ఆసు యంత్రాల్ని మల్లేష్ అమ్ముకుని ఆర్థికంగా స్థిరపడ్డాడు. మల్లేష్ సృజనాత్మకతకి రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది.
మీకు కూడా ఇలాంటి ఆవిష్కరణల గురించి తెలిస్తే వాటి గురించి, వాటి ఆవిష్కర్తల గురించి హనీబీకి తెలియజేయవచ్చు. హనీబీ ఫోన్ నంబర్ 040-271185555.

'క్రియేటివ్ మైండ్స్' వచ్చేసింది...

ఎంతో శ్రమపడి తయారుచేసిన వస్తువులు, కనుగొన్న ఔషధాలకు గుర్తింపులేకుండా పోవడాన్ని హనీబీ కో ఆర్డినేటర్లు జీర్ణించుకోలేకపోయారు. వారికి తగిన గుర్తింపు తీసుకురావడానికి కంపెనీల చుట్టూ ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయారు. వీరికి ఒక ఉపాయం తట్టింది. 'ఇంత కష్టపడుతున్న మనం మన ఇన్నొవేటర్ల కోసం ప్రత్యేకంగా ఒక కంపెనీనే స్థాపించుకుంటే ఎలా ఉంటుంది' అనుకున్నారు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. మూడు నెలల క్రితం 'క్రియేటివ్ మైండ్స్' పేరుతో కంపెనీని స్థాపించారు. దీనికి వారే పెట్టుబడి పెట్టుకున్నారు. ఇప్పుడు ఎవరైనా ఇన్నొవేటర్ తను కనుగొన్న వస్తువుని ఈ కంపెనీ ద్వారా మార్కెట్‌లోకి తెచ్చుకోవచ్చు.
. * భువనేశ్వరి

Wednesday, August 25, 2010

హాయ్ చెప్పకపొతే అనాగరికులమే

ఆల్ప్స్ పర్వతాల ఒడిలో చల్లగా ప్రశాంతంగా టూరిస్టులను ఊరిస్తూ ఉంటుందా దేశం. అక్కడ అద్దెకు ఇల్లు కావాలంటే యాభైవేలు కట్టాలి. ఎవరితోనైనా మర్యాదగా మసులుకోవాలి. మూడు రకాలుగా చెత్తను కూడా వేరు చేసి చెత్తకుండీలో పడేయాలి. లేదంటే బోలెడంత ఫైన్. ఇంగ్లీషు వస్తే చాలు అన్నీ మేనేజ్ చెయ్యొచ్చు అనుకోడానికి అస్సల్లేదండీ బాబూ.. ఎందుకంటే అది అక్కడ అస్సలు పనిచేయదు. ఏ ప్రపంచ యుద్ధంలోనూ పాల్గొనని తటస్థ దేశంగా చిన్నప్పుడు చరిత్రలో చదువుకున్న స్విట్జర్లాండ్ గురించే ఇదంతా. ప్రవాస భారతీయుల జీవన శైలిని పరిచయం చేయడంలో భాగంగా స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్న అడుసుమల్లి రమేశ్ లైఫ్ స్టైల్ విశేషాలు.

'నేను యూరప్ వెళ్లి తొమ్మిదేళ్లు అవుతోంది. జర్మనీ, ఆస్ట్రియాల్లో ఏడేళ్లు ఉండి రెండేళ్ల కిందటే స్విట్జర్లాండులోని తున్‌కు వచ్చాను. ఇక్కడి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎంప(ఉక్కఅ ఫెడరల్ రీసెర్చ్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ)లో సైంటిస్ట్‌గా పనిచేస్తున్నాను.


ఉదయం ఆరున్నరకే ట్రాఫిక్
మాకు వారానికి ఐదు రోజులే వర్కింగ్ డేస్. ఉదయం తొమ్మిది నుంచి సాయం కాలం ఐదు వరకు ఆఫీస్ టైమింగ్స్. నేను ఏడున్నర కల్లా ఆఫీస్‌కి స్టార్ట్ అవుతాను. మా ఇల్లు ఆఫీస్‌కి చాలా దగ్గర. అందుకని సైకిల్ మీదే ఆఫీస్‌కి వెళ్తాను. ఇక్కడ సైకిల్ మీద వెళ్లడం సర్వసాధారణం. (ఈ దేశంలో బస్‌లు, రైళ్లు, ట్రామ్స్ అని మూడు రకాల పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటుంది. చాలా సౌకర్యంగా ఉంటాయి)ఇండియాలో ఉదయం తొమ్మిది నుంచి పదకొండు దాకా ఎంత హెవీ ట్రాఫిక్ ఉంటుందో ఇక్కడ ఉదయం ఆరున్నర నుంచి ఎనిమిది వరకు అంత హెవీ ట్రాఫిక్ ఉంటుంది. వెళ్లగానే అందరినీ విష్ చేయాలి.


పలకరించడమనేది తప్పనిసరి. లేకపోతే అనాగరికులుగా చూస్తారు. ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర మధ్య అందరూ వస్తారు. అరగంట బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. వారానికి రెండు సార్లు మాత్రమే మన టిఫిన్స్(ఇడ్లీ, దోస). మిగిలిన రోజుల్లో పాలు, కార్న్‌ఫ్లేక్సే. బ్రేక్‌ఫాస్ట్ అవగానే తొమ్మిదికల్లా ఆఫీస్ పని స్టార్టయి పోతుంది. నేను టెక్నీషియన్స్‌ని డీల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బాస్, సబ్ ఆర్డినేట్ అంటూ ఏమీ ఉండదు. అందరూ కొలీగ్స్‌లాగే ఉంటారు.


మాల్ సైట్ పని విషయంలో ఎలాంటి ఒత్తిడి ఉండదు. అయినా ఎవరికి వాళ్లే చాలా బాధ్యతగా ఉంటారు. ప్రణాళికా బద్ధంగా కూడ ఉంటారు. చివరి నిమిషంలోహాడావుడి పడడం లాంటివి ఉండవు. వారానికి ఒకటో, రెండో సెమినార్లు, ప్రెజెంటేషన్లు ఉంటాయి. వాటికి ఒకటి, రెండు రోజుల ముందే ప్లాన్ చేసుకుని ఉంటాం కాబట్టి ఎలాంటి కంగారు లేకుండా ముగుస్తాయి. చాట భారతాల్ని ఇష్టపడరు. ఏదైనా షార్ట్ అండ్ స్వీట్‌గా ఉండాలి. టీం వర్క్ బాగుంటుంది. లంచ్ టైం పన్నెండు నుంచి ఒంటి గంట మధ్య ఉంటుంది.


అందరూ ఒకే సమయానికి తినాలనేమీ ఉండదు. కాకపోతే లంచ్‌కి వెళ్లేప్పుడు 'మాల్ సైట్ 'అని చెప్పి వెళ్లాలి. అంటే మన కొలీగ్స్‌కి మనం లంచ్‌కి వెళ్తున్నామని తెలియజెప్పడం అన్నమాట. వీలైతే వాళ్లూ వస్తారు లేకపోతే లేదు. కాని అలా చెప్పి వెళ్లడం మాత్రం తప్పనిసరి. ఆఫీస్ క్యాంటీన్‌లోనే లంచ్ ఉంటుంది. లంచ్‌లో గ్రిల్డ్ మీట్, ఫ్రైడ్ మీట్ తోపాటు ఉడకబెట్టిన బంగాళదుంప, సలాడ్ ఉంటాయి. వీళ్లకు ఉడికించిన బంగాళదుంప అన్నం లాంటిదన్నమాట. వీటితోపాటు నూడల్స్, పాస్తాలాంటివి కూడా ఉంటాయి. తప్పకుండా స్పూన్‌తోనే తినాలి.


లంచ్ అయిన వెంటనే ఖచ్చితంగా కాఫీ తాగుతారు. మామూలుగానే గంటకు ఒకసారి కాఫీ తాగుతూ ఉంటారు. చలి ప్రదేశం కదా. అందరూ ఒకే టైంకేమీ వెళ్లరు. ఉదయం త్వరగా వచ్చిన వాళ్లు (ఎనిమిది గంటల పని వేళల లెక్కన) సాయంకాలం త్వరగా వెళ్తారు. లేట్‌గా వచ్చిని వాళ్లు లేట్‌గా వెళ్తారు. చెప్పాను కదా ఇక్కడ పని ఒత్తిడే కాదు వర్క్ లోడ్ కూడా చాలా తక్కువ. లీవులు కూడా 25 దాకా ఉంటాయి. ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇప్పుడెందుకు తీసుకున్నావ్? అప్పుడే తీసుకోలేకపోయావా? లాంటి ప్రశ్నలేమీ ఉండవు.

వైన్, బీర్లు సంస్కృతిలో భాగం
మన బర్త్‌డే, మ్యారేజ్ డేలాంటి అకేషన్స్‌కి ఓ కేక్ తెచ్చి కొలీగ్స్ అందరికీ మెయిల్ పెట్టాలి. ఈ రోజు మన బర్త్‌డే అని, ఫలానా టైంలో పార్టీఅని. ఆ టైంలో కేక్ కట్ చేసి డ్రింక్స్‌తో చిన్న సైజు పార్టీ చేసుకుంటాం. ఇలాంటివన్నీ కంపల్సరీ . వైన్, బీర్‌లు ఇక్కడ సంస్కృతిలో భాగం. ఇక్కడ గాసిప్స్, టైం పాస్ వ్యవహారాలు ఉండవు.


పర్సనల్ వ్యవహారాలు, వివరాల్లో ఇతరులు ఉత్సుకత ప్రదర్శించకూడదు. పంక్చువాలిటీ, డిసిప్లిన్‌లకి ప్రాణం ఇస్తారు. అలాగని ప్రత్యేక నియమనిబంధనలేమీ ఉండవు. ఎవరికి వాళ్లే ఇక్కడి సిస్టమ్‌ను అర్థం చేసుకుంటూ ఆచరించటమే. ఆఫీస్‌కి కూడా ప్రత్యేక డ్రెస్ కోడంటూ ఏమీ ఉండదు. టక్ చేసుకుని వచ్చావా?టై కట్టుకున్నావా? బెల్ట్ పెట్టుకున్నావా? షూ వేసుకున్నావా? అని పరికించి చూడరు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉన్నావా లేదా అన్నదే ముఖ్యం ఇక్కడ. ఖర్చు మాత్రం ఎక్కువే
ఇక్కడ జీవనం ఖరీదైన వ్యవహారం. ఇల్లు అద్దె 1200 ఫ్రాంక్స్ అంటే మన రూపాయల్లో 50 వేలు. ఇంట్లో చెత్తను దేనికి అదే అంటే ఆహార వ్యర్థాలను ఒక టిన్‌లో, ప్లాస్టిక్‌ను మరొకదాంట్లో, పాతబట్టలు, షూస్ ఒకదాంట్లో, ఇలా వేటికవే వేరు చేసి వీథిలో ఉన్న సపరేట్ డబ్బాల్లో వేయాలి. ఒకవేళ అన్నీ కలిపి ఒకేదాంట్లో వేస్తే దాన్ని రస్ట్ అంటారు.


దానికి ఎక్కువ డబ్బులు తీసుకుంటారు మున్సిపాలిటి వాళ్లు, వీటన్నిటినీ రీసైక్లింగ్ చేస్తారు. పాత బట్టలు, షూస్ లాంటివి రెడ్ క్రాస్ సొసైటీకి వెళ్తాయి. ఇంటి పనులకు గంటలు గంటలు వెచ్చించాల్సిన పని ఉండదు. రాత్రి భోజనం అయ్యాక నెట్ ముందర కూర్చోవడం, ఇండియాకి ఫోన్లు చేసుకోవడంతో సరిపోతుంది. అయితే నేనున్న ఏరియాలో ఇండియన్స్ చాలా తక్కువగా ఉంటారు.


ఇంగ్లీషు పని చేయదు
యూరప్‌లో యుకె తప్పించి ఏ దేశానికి వెళ్లాలన్నా ఆ దేశం అధికార భాష తప్పకుండా వచ్చుండాలి. నేనున్న చోట జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్, రొమేనియన్‌లు అధికార భాషలు. వీటిల్లో ఏదో ఒకటి కచ్చితంగా వచ్చుండాలి. ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ ఉపయోగం చాలా చాలా తక్కువ. నేమ్ ప్లేట్లు, సైన్ బోర్డులు ఒక్కటేమిటి అన్నీ ఆ భాషల్లోనే ఉంటాయి. ఇంగ్లీష్ ఎక్కడా కనిపించదు. వాళ్ల భాషను తప్పకుండా ఎలా నేర్చుకుని ఉండాలో వాళ్ల సంస్కృతిని కూడా అంతే ఇదిగా అడాప్ట్ చేసుకోవాలి.


ఇక్కడి వాళ్లు సంస్కృతికి ప్రాణమిస్తారు. వాళ్ల అలవాట్లు, వాళ్ల పద్ధతిని గమనించి అనుసరించాలి. ఏ దేశం వాళ్లయినా సరే ఇక్కడ మాత్రం స్థానికుల్లా ఉండాలని వీరు కోరుకుంటారు. అడిగితేనే సాయం చేస్తారు. లేకపోతే లేదు. అమెరికాతో పోల్చుకుంటే ఇండియన్ రెస్టారెంట్లు, హోటల్స్ తక్కువ. ఇండియన్ షాపులుంటాయి. ఎక్కువగా శ్రీలంక వాళ్లు వీటిని నడుపుతుంటారు. మన వస్తువులన్నీ దొరుకుతాయి.


అయితే ఇండియన్ ఫుడ్ అంటే యూరోపియన్లందరూ చెవి కోసుకుంటారు. మన రెస్టారెంట్లలో వాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. వాళ్ల సూపర్ మార్కెట్లలో కూడా ఎమ్‌టిఆర్, ప్రియా వాళ్ల ఉత్పత్తులు దొరుకుతాయి. జర్మనీలోని హామ్(జ్చిఝ)లో ఇండియాలో కూడా లేనంత పెద్ద గుడి ఉంది. దీన్ని శ్రీలంక వాళ్లు కట్టారు. ఎన్నో అనుభూతుల్ని, అనుభవాలను ఇచ్చిన ఈ దేశం వదిలి బిట్స్ పిలానీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా జాయిన్ అవడానికి ఈ నెలాఖరున ఇండియా వచ్చేస్తున్నాను.' జూ సరస్వతి రమ

Tuesday, August 24, 2010

రాజీవ్ అసలు నాయకుడే కాదు!

కుష్వంత్‌సింగ్ ఎప్పట్లాగే మసాలాలతో దట్టించిన మరో కొత్త పుస్తకం తీసుకొచ్చారు. దాని పేరు 'ఆబ్సెల్యూట్ కుష్వంత్'. తిట్టినా, మెచ్చుకున్నా ఏ మాత్రం మొహమాటాలూ లేవు. 'నేను ఎవర్నీ సీరియస్‌గా తీసుకోలేదు నాతో సహా' అంటారొక చోట. 'అరవై ఏళ్లకు పైగా కలిసి ఉన్నా నేనూ, నా భార్యా సంతోషంగా కాపురం చేయలేదెప్పుడూ' అని కూడా చెప్పుకున్నారాయన. ఒంటరితనం, నిరంతర రచన.. ఈ రెండూ తనకిచ్చిన ఆనందం మరేదీ ఇవ్వలేదని చెప్పుకున్న 95 ఏళ్ల కుష్వంత్ సింగ్ పుస్తకంలోంచి కొన్ని భాగాలు...

అన్నింట్లోకి నాకు ఎక్కువ ఇష్టమైంది ఒంటరితనం. అది నాకు విరివిగా లభించడం నా అదృష్టం. ఒంటరితనం ఎన్నో రకాలుగా ప్రయోజనకరం. మెదడుకు బోలెడు విశ్రాంతి దొరుకుతుంది. ఒక రోజంతా మౌనంగా ఉంటే ఎంతో శక్తి చేకూరుతుంది. మెదడును కాసేపు ఖాళీగా ఉంచగలిగితే- ధ్యానం ఉద్దేశం అదే ఒంటరితనాన్ని ఎంజాయ్ చేయొచ్చు.

శృంగారం వైపే నేను..
పురుషులు వృద్ధులవుతున్న కొద్దీ శృంగార వాంఛలు శరీరం కింది భాగాల నుంచి పైకి పాకి మెదడులోకి చేరతాయి. యుక్త వయస్సులో ఏం చేయాలనుకుని చేయలేకపోయారో- వాటిని ఊహించుకొని తృప్తిపడుతూ ఉంటారు. శృంగారం, రొమాన్స్‌లలో ఏది ముఖ్యం అని నన్ను అడిగితే- శృంగారమే అని చెబుతాను. రొమాన్స్ పైపూతలాంటిది. కొద్ది కాలం పోయిన తర్వాత తొలగిపోతుంది.

దానికి ఉండే ఆకర్షణ కూడా పోతుంది. రొమాన్స్ చేయటానికి అవసరమైన సమయం కానీ అభిరుచి కానీ నాకు ఎప్పుడూ లేవు. రొమాన్స్ చేయాలంటే చాలా సమయం కావాలి. అపారమైన శక్తియుక్తులను ఖర్చుపెట్టాలి. దాని వల్ల ఫలితం కూడా పెద్దగా ఉండదు. అందుకే శృంగారం వైపే నేను మొగ్గుచూపుతాను. పురుషులు మాత్రమే మహిళల వెనకపడి ఆకర్షించటానికి ప్రయత్నిస్తారనే ప్రచారం నిజం కాదు.

మహిళలే ఈ కళలో ఆరితేరిన వారని నా గట్టినమ్మకం. నా జీవితంలో- నేను ఆకర్షించటానికి ప్రయత్నించిన మహిళల కన్నా- నన్ను ఆకర్షించటానికి ప్రయత్నించిన మహిళలే ఎక్కువ. నాకు ఎవరి పట్ల అయినా ఆకర్షణ కలిగితే- ఆ విషయం వాళ్లకు చెప్పటానికి చాలా బెరుకుగా అనిపించేది. ఆత్మవిశ్వాసం చాలేది కాదు. కాని చాలా కాలం తర్వాత కలిసినప్పుడు- సందర్భం కుదిరితే చెప్పేవాడిని. అప్పుడు వాళ్లు- "అరే.. ఆ విషయం అప్పుడే ఎందుకు చెప్పలేదు?'' అనేవారు.

నెహ్రూ ముచ్చట్లు..
సరుకుల్ని రవాణా చేసే బృందాల నాయకుడికి ఉండాల్సిన లక్షణాలను ప్రముఖ కవి అలం ఇక్బాల్ ఒకచోట ఇలా చెబుతాడు. "నిగాహ్ బులంద్, సుఖాః దిల్‌నవాజ్, జాన్ పర్ సోజ్- యహీ హై రక్త్ ఎ సఫర్ మీర్ ఎ కార్వాన్ కే లియే'' (విశాల దృక్పథం, అందరినీ ఆకట్టుకొనే మాటతీరు, ఆకర్షించే వ్యక్తిత్వం- కార్వాన్‌ను ముందుకు నడిపించే నేతకు ఉండాల్సిన లక్షణాలు ఇవే).

నెహ్రూకు ఈ మాటలు అతికినట్లు సరిపోతాయి..
నేను నెహ్రూను తొలిసారి లండన్‌లో కలుసుకున్నా. అప్పుడు నేను భారత ఎంబసీలో సమాచార శాఖ అధికారిగా ఉండేవాడిని. నెహ్రూను దగ్గరగా చూసిన తర్వాత ఆయనకు కోపం ముక్కుమీదే ఉంటుందని అర్థమయింది. ఒక్క కోపమే కాదు చాలా అమర్యాదగా కూడా ప్రవర్తిస్తాడని తర్వాత తెలిసింది. బ్రిటన్‌లో ఉన్న ముఖ్యమైన పత్రికల ఎడిటర్లు నెహ్రూను కలవాలనుకున్నారు.

దాంతో నేను ఒక విందు సమావేశం ఏర్పాటు చేశాను. అందరూ భోజనాలు చేస్తున్నారు. ఇంతలో నెహ్రూ హఠాత్తుగా మౌనముద్ర దాల్చాడు. ఎడిటర్లు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా పైకప్పు వైపు చూడటం మొదలుపెట్టాడు. అందరి భోజనాలూ పూర్తికాక ముందే సిగరెట్టు తీసి వెలిగించాడు. గోరుచుట్టుపై రోకలిపోటు అన్నట్లు - మరోపక్క కృష్ణమీనన్ నిద్రపోయాడు.

పబ్లిక్ రిలేషన్స్ ఇంతకన్నా పెద్ద ఉత్పాతం ఏముంటుంది చెప్పండి! మరోసారి నెహ్రూ లండన్‌లో దిగేసరికి అర్థరాత్రి అయింది. నేను ఆయనకు స్వాగతం చెప్పటానికి ఎయిర్‌పోర్టుకు వెళ్లాను. మర్యాదకు- "నన్ను కూడా మీతో పాటు హోటల్‌కు రమ్మంటారా?'' అని అడిగాను. "డోన్ట్ బీ సిల్లీ.. ఇంటికి వెళ్లి పడుకో'' అని నెహ్రూ కసురుకున్నాడు. ఆ మర్నాడు పేపర్లలో- నెహ్రూ, లేడీ మౌంట్‌బాటెన్‌ల ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి.

ఆ ఫోటోలో- కురచ దుస్తులు వేసుకొని ఉన్న లేడీ మౌంట్‌బాటెన్ తలుపుతీస్తోంది. నెహ్రూ తలుపు దగ్గర ఉన్నాడు. ఒక పత్రికలో ఆ ఫోటో పైన- "లేడీ మౌంట్‌బాటెన్ ఇంటికి అర్థరాత్రి అతిథి'' అనే శీర్షిక పెట్టారు. నెహ్రూకు తీవ్రమైన ఆగ్రహం వచ్చింది. మరోసారి నెహ్రూ, లేడీ మౌంట్‌బాటెన్‌లు కలిసి ఒక గ్రీకు రెస్టారెంట్‌కు వెళ్లారు. ఆ మర్నాడు కూడా వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలను పత్రికలు ప్రచురించాయి.

నెహ్రూ దగ్గరకు వెళ్లమని నన్ను నా పైఅ«ధికారులు ఆదేశించారు. నేను నెహ్రూ దగ్గరకు వెళ్లాను. ఆయన మూడ్ బావులేదు. "ఎవరు నువ్వు?'' అని నెహ్రూ నన్ను ప్రశ్నించాడు. "సర్.. నేను లండన్‌లో మీ పీఆర్ఓను..'' అని సమాధానమిచ్చాను. "పబ్లిసిటీ ఎలా ఇవ్వాలనే విషయంలో నీకు విచిత్రమైన ఆలోచనలు ఉన్నాయి'' అన్నాడు. అలాంటి సమయాల్లో మౌనమే మంచిదనుకున్నా. నేనేమీ మాట్లాడలేదు.

రాజీవ్ నేత కాదు..
రాజీవ్ గాంధీని కీర్తిస్తూ, అతనిని ఒక ఉన్నత శిఖరాలమీద నిలబెట్టటానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ రాజీవ్ కూడా అనేక తప్పులు చేశాడు. వాటిలో కొన్ని తీవ్రమైన తప్పులు కూడా. రాజీవ్‌ను బలవంతంగా రాజకీయాల్లోకి దింపారు. వాటిని అతను సరిగ్గా నిర్వహించలేకపోయాడు. నిజానికి రాజీవ్ చాలా ఆహ్లాదకరమైన వ్యక్తి. కొన్ని మంచి ఆలోచనలు కూడా ఉన్నాయి. కానీ అవి చరిత్రను మార్చేసేటంత గొప్పవైతే కావు.

అసలు అతను ఒక మంచి నాయకుడే కాదు. తన తల్లి అడుగుజాడల్లో నడిచి ఆమె చేసిన తప్పులే అతనూ చేశాడు. టెలికాం, కంప్యూటర్స్ వంటి ఆలోచనలు కూడా ఇందిరాగాంధీ సమయంలో మొదలుపెట్టినవే. శ్రీలంక వ్యవహారాన్ని పూర్తిగా చెడగొట్టాడు. ఒక బహిరంగ సమావేశంలో ఒక మంత్రిని పదవి నుంచి తొలగించాడు. బాబ్రీమసీదు, షాబానో కేసుల్లో అతని పాత్రను మనం తక్కువగా తీసేయలేం.

ఈ రెండు కేసులు మనకు దీర్ఘకాల హాని చేశాయి. ఇందిరాగాంధీ మరణించిన తర్వాత రాజీవ్ ప్రవర్తించిన తీరును చరిత్ర ఎన్నటికీ క్షమించదు. సిక్కులను ఢిల్లీలో సజీవంగా తగలబెట్టేస్తుంటే-"ఒక మహావృక్షం కుప్పకూలినప్పుడు.. చుట్టుపక్కల ఉన్న భూమి కూడా కంపిస్తుంది..'' అన్నాడు. ఆ హత్యలను అతను ఆపి ఉండాల్సింది. ఒక్కసారి బయటకు వెళ్లి- "ఈ హత్యాకాండ ఆపాలి.. రండి..'' అని సైన్యాన్ని పిలిచి ఉంటే సరిపోయేది. కానీ రాజీవ్ అలా చేయలేదు. అంతేకాకుండా తన వ్యాఖ్యల ద్వారా ఆ హత్యాకాండను సమర్థించాడు కూడా.

ఆ పరిస్థితుల్లో నెహ్రూ ఉంటే- ఆ విధంగా చేసి ఉండేవాడు కాదని నేను కచ్చితంగా చెప్పగలను. నెహ్రూకు ధైర్యం ఉంది. బయటకు వెళ్లి అల్లరిమూకలను చెదరగొట్టి ఉండేవాడు. దేశ విభజన సమయంలో నెహ్రూ ఆ విధంగా చేశాడు కూడా. ఒక నేతకు, ఔత్సాహికుడికి మధ్య ఉండే తేడా అదే. అయితే రాజీవ్ సోదరుడు సంజయ్‌గాంధీ చురుకైనవాడు. రాజీవ్ స్కౌట్‌లాంటివాడు.

రాహుల్ శభాష్!
నా దృష్టిలో రాజీవ్ కంటే రాహుల్ చాలా సమర్థుడు. అతనికి ఒక విశాల దృష్టి ఉంది. అది చాలా ముఖ్యమైన విషయం. అతను ప్రవర్తిస్తున్న తీరు కూడా చాలా బావుంది. సరైన దృక్పథమూ ఉంది. అతను చేస్తున్నది పెద్ద పెద్ద పనులు కాకపోయినా- ఆ పనుల వెనకున్న ఆలోచనలు మాత్రం మంచివే. రాహుల్ పరిణతి చెందిన నాయకుడుగా అభివృద్ధి చెందుతున్నాడు.

2014 ఎన్నికలలో- కాంగ్రెస్ గెలిస్తే- రాహుల్ ప్రధాని కావటానికి ఒప్పుకోవచ్చు.. ఒప్పుకోకపోవచ్చు కూడా. అయితే అతని ప్రాధమ్యాలు సరిగ్గానే ఉన్నాయి. అతను కుర్చీల గురించి, పదవుల గురించి పట్టించుకోవటం లేదు. కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలా అని మాత్రమే ఆలోచిస్తున్నాడు. గత ఏడాది రాహుల్ నాకు ఫోన్ చేశాడు. ఒకసారి వచ్చి కలుస్తాన న్నాడు.

ముందుగా అనుకున్నటు ్ల సాయంత్రం పూట సరిగ్గా నాలుగు గంటలకు వచ్చాడు. ఒక గంటసేపు నాతో కూర్చుని కబుర్లు చెప్పాడు. మేము రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం. కాని మా మధ్య జరిగిన మాటల్లో అతని నాయనమ్మ గురించి కానీ, ముత్తాత గురించి కానీ ఎటువంటి ప్రస్తావన రాలేదు.

అనుబంధానికి ‘రాఖీ’

rakhi
అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి... కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నదీ అని ఓ చెల్లెలు తన అన్నయ్య అనురాగం గురించి పాడడంలో ఎంతో అర్థముంది... తనను ప్రాణంకన్నా మిన్నగా ప్రేమించే అన్నయ్యలంటే ఈ ప్రపంచంలో ప్రతి చెల్లెలికీ అభిమానం, అనురాగం, ఆప్యాయత. ఇంతటి ఆత్మీయతను పంచే అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక ‘రక్షాబంధన్‌’ పండుగ. దుర్బలులను దుర్మార్గులనుంచి కాపాడాలన్న సంస్కృతికి నాగరకతకు ప్రతీక రాఖీ. ప్రతి యేటా శ్రావణమాసంలో వచ్చేపౌర్ణమినే శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పౌర్ణమి అంటారు. ఉత్తర భారతంలో ఈ పండుగను కజ్రీ పూర్ణిమ అని కూడా అంటారు. అక్కడ ఈ సమయంలోనే రైతులు గోధుమ, బార్లీ నాట్లు వేయటం విశేషం.

rakhi3
ఒక కుటుంబంలోనే కాక యావత్‌ సమాజంలో సోదర ప్రేమకు, సుహృద్భావానికి రాఖీ ప్రతీక నిలుస్తుంది. సమాజంలో సామరస్యానికి పునాది వేస్తుంది. శాంతియుత సహజీవనానికి రాజమార్గం రాఖీ. గురుదేవులు విశ్వకవి రవీంద్రుడు రాఖీ ఉత్సవాలను భారీ ఎత్తున జరిపించేవారు. ఈ రోజు ‘ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌’గా ప్రచారంలో వున్నది ఒక విధంగా రాఖీ సంప్రదాయానికి కొనసాగింపేనంటే అతిశయోక్తి కాదు. ఒక పురుషుడు సాటియువతిపై హద్దుమీరిన మమకారం పెంచుకున్న సందర్భంలో ఆ సదరు యువతికి అతనిపై ఇష్టం లేనట్లయితే... ఆ మక్కువను స్నేహానికే పరిమితమని అది సోదర ప్రేమగా మాత్రమే ఉంటే బాగుంటుందని సున్నితంగా సూక్షంగా రాఖీ ద్వారా తెలియజేస్తుంది. అలాంటి పవిత్ర సోదర ప్రేమకు ప్రతీక అయిన రాఖీ పండుగ మూలాలు ఇప్పటివి కావు. చరిత్రలో ఎందరో ప్రముఖులు రాఖీ ద్వారా తమ సోదరప్రేమను చాటుకున్నారు.

అలెగ్జాండర్‌కు రాణీ సంయుక్త రాఖీ
rakhi2పురుషోత్తమ మహారాజుకు అలెగ్జాండర్‌కు మధ్య జరిగిన యుద్ధంలో పురుషోత్తముడు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. తన చేతిలో పరాజితుడైన పురుషోత్తముడిని అలెగ్జాండర్‌ బందీని చేసి తీసుకువెళ్తున్న సమయంలో ఆ విషయం తెలుసుకున్న పురుషోత్తముని భార్య రాణీ సంయుక్త వెంటనే అలెగ్జాండర్‌ వద్దకు వెళ్లి అతని చేతికి రాఖీ కడుతుంది. దాంతో సంయుక్తను చెల్లెలిగా అంగీకరించిన అలెగ్జాండర్‌ ఏమి కావాలో కోరుకోమంటాడు. యుద్ధంలో పరాజితుడై బందీగా పట్టుకున్న తన భర్త పురుషోత్తముడిని బంధ విముక్తుడిని చేయాలని ఆమె వేడుకుంటుంది. దీనికి అలెగ్జాండర్‌ ఒప్పుకొని పురుషోత్తముని విడిచి పెట్టడంతోపాటు అతని రాజ్యాన్ని కూడా తిరిగి ఇచ్చేస్తాడు. రాఖీ కట్టి సోదరి అయిన రాణీ సంయుక్తను విలువైన కానుకలతో సత్కరించి తిరిగి వెళతాడు.

బలి చక్రవర్తి కాలంలో...
దానవుల రాజుగా వాసికెక్కిన బలి చక్రవర్తి కాలంలో అతనికి బందీలైన వారంతా
‘‘యేన బద్ధో బలీరాజా... దానవేంద్రో మహాబలః...
తేనత్వాం అభిబద్ధామి... రక్షేమాచల మాచల’’... ఆయన చేతికి రాఖీ కట్టి తమను తాము కాపాడుకున్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.
సుదూర ప్రాంతాల్లోని సోదరులకు సైతం ‘రాఖీ’లు
‚అయితే ఈ రాఖీ పండుగను వివిధ ప్రాంతాల వారు వివిధ పేర్లతో పిలిచినా ఎక్కువగా ‘రక్షాబంధన్‌’ పేరుతో వ్యవహరిస్తారు. పెళ్లై అత్తవారింట్లో ఉన్న సోదరీ మణులు సైతం పండుగ రోజున తమ పుట్టింటికి వచ్చి సోదరులకు రాఖీ కడుతుంటారు. ప్రస్తుత ఆధునిక కాలంలో రాఖీలను దూర ప్రాంతాల్లో ఉన్న తమ అన్నదమ్ములకు ప్రత్యేకంగా రాఖీలను పంపుతుంటారు అక్కా చెల్లెళ్లు.

క్రిష్ణుడి చేతికి ద్రౌపది రాఖీ..
rakhi4ద్వాపరయుగం కాలంలో సైతం రాఖీ పండుగ అత్యంత విశిష్టతను చాటుకుంది... శ్రీకృష్ణుని చేతికి ద్రౌపది రాఖీ కట్టి తనను రక్షించా లని కోరుతుంది. ఇదే క్రమంలో ఆమెకు కష్టం వచ్చిన ప్రతిసారి శ్రీకృష్ణుడు వచ్చి ఆదుకునేవాడు. ఇలా చెప్పుకుం టూ వెళితే మన పురాణాల్లో మరెన్నో సంఘటనలు అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తాయి.

‘రాఖీ కేరాఫ్‌ ధూల్‌పేట్‌‌‌’
నగరంలోని ధూల్‌పేట్‌ రాఖీల తయారీకి పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో ఏ సీజన్‌కు ఆ వస్తువులను తయారుచేయడం ప్రత్యేకత. అయితే రాఖీ పండు గకు రెండు నెలల ముందునుంచే పెద్ద ఎత్తున, రకరకాల రాఖీలను తయా రు చేస్తూ వందలాది కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. గతంలో పెద్ద సైజులో మెరుపు కాగితాలతో వీరు రాఖీలను తయారు చేసేవారు అయితే మారుతున్న కాలంతో పాటే వీరు కూడా రాఖీలను అందంగా అర్థవంతంగా తయారుచేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. నగరంలోనేగాక రాష్ట్రంలోని ఇతర ప్రాం తాలకు, దేశ, విదేశాలకు సైతం వీరు తయారుచేసిన రాఖీలే వెళుతుండడం విశేషం. రాఖీ పండుగ దగ్గరపడడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే రంగురంగుల, అందమైన రాఖీలు మార్కెట్‌లో కొలువుదీరాయి.

rakhi1రాఖీ రాజ్యాల మధ్య బాంధవ్యం నెలకొల్పిందనేదది చారిత్రక సత్యం. రాజ్‌పుట్‌, మరాఠా రాణులు మొగలాయి చక్రవర్తులకు రాఖీలు పంపి సామరస్య బాంధవ్యాలు నెలకొల్పిన ఉదంతాలు చరిత్రలో కోకొల్లలు. రాఖీ పౌర్ణమి నాడు అక్కా చెల్లెళ్లు తమ సోదరులకు కట్టే రాఖీ కేవలం దారానికి పూలు, మెరుపు కాగితాలు అలంకరించిన ఒక ఆభర ణంగా మాత్రమే భావించడానికి వీలులేదు. ఇది అన్నా చెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ముడిపడి ఉన్న బలమైన ప్రతీక. తమ సోదరులు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని చెల్లెళ్లు కోరుకుంటే, తమ అక్కా చెల్లెళ్లు సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలని అన్నద మ్ములు కోరుకుంటారు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ రాఖీ పండుగను దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలు ప్రత్యేకంగా జరుపుకొంటారు. రాఖీ పండుగ ఈనాటిది కాదని తరతరాలుగా ఈ సంప్రదాయం వుంద నడానికి ఎన్నో గాథలు మనకు పురాణాల్లో కనిపిస్తాయి.

కేవలం స్వగ్రామంలోనే ఉన్న సోదరులకేగాక దేశ, విదేశాల్లో స్థిరపడ్డ అన్నదమ్ములకు సైతం రాఖీలు పంపే సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో పండుగలు సైతం ఆ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుం టున్నాయి. నేడు విదేశాల్లో ఉన్న తమ సోదరులకు చాలామంది యువతలు ఇంటర్‌నెట్‌ కేవలం ఒక మౌస్‌ క్లిక్‌తో రాఖీ కట్టేస్తున్నారు. కొన్ని సంస్థలు ఇంటర్నెట్‌ ద్వారా ఆర్డర్లు తీసుకొని రాఖీలను చేరవేస్తున్నాయి. వారు వెబ్‌సైట్లలో ముందే పొందు పరిచిన రాఖీ నమూనాల నుండి మనకు ఇష్టమైన రాఖీని ఎంచుకొని విదేశాల్లో ఉన్న సోదరులకు పంపవచ్చు.


ఎంత దూరమైనా ఒక్కరోజులోనే సోదరులకు ‘రాఖీ’
ఇతర ప్రాంతాల్లో ముఖ్యంగా విదేశాల్లో ఉన్న సోదరులకు ఇప్పటివరకు పోస్టు ద్వారా రాఖీలను పంపేవారు. దీనివలన షిప్‌లలో వెళ్లే మెయిల్‌కయితే అమెరికా, యుకె వంటి సుదూర దేశాలకు రాఖీ అందడానికి కనీసం పక్షం రోజులైనా పట్టేది. ఒకవేళ విమానంలో పంపినా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే కొన్ని సంస్థలు ఈ సమస్యకు పరిష్కారంగా ప్రత్యేక వెబ్‌సైట్‌లను ప్రారంభించాయి. ఈ వెబ్‌సైట్‌లలో లాగిన్‌ అయి ఆర్డర్‌ చేస్తే తాము కోరుకున్న ప్రాంతంలోని చిరునామాకు అదే రోజున రాఖీ అందే ఏర్పాటు చేస్తూ కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. ఇందులో భాగంగా మంగళవారం ఓ ప్రైవేట్‌ సంస్థ నెలకొల్పిన ఠీఠీఠీ.జీజ్టట2టజీ.ఛిౌఝ ప్రత్యేక వెబ్‌సైట్‌ను హీరో వరుణ్‌ సందేశ్‌, వర్ధమాన నటి శరణ్య మోహన్‌లు ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా ఆర్డర్‌చేసిన రోజునే అమెరికా, యు.కె, కెనడా వంటి దేశాల్లో ఉన్నవారికి రాఖీలు అందే ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
- ఏముల ఈశ్వర్‌బాబు,

ప్రేమను బంధాం రాఖీ బంధాం

బలహీనమైన దారాలే బలమైన అనుబంధాలకు ఆలంబన కావడం మన సంస్కృతిలోని ఒక వైచిత్రి. భార్యాభర్తల బంధానికి మంగళ సూత్రం ఒక చిహ్నమయితే సోదరీసోదరుల అనుబంధానికి రాఖీ అందమైన ప్రతీకగా మారింది. సారంలోనే కాదు రూపంలోనూ ఇది ఏటా కొత్త అందాన్ని సంతరించుకుంటోంది. మార్కెట్‌లో ఉన్న కొన్ని కొత్త రాఖీల గురించి తెలుసుకుందాం.

రాఖీ అంటే ఇప్పుడు కేవలం ఒక ఎర్రదారం కడితే సరిపోదు. మీ సోదరుల పట్ల మీ ప్రేమ ప్రత్యేకమైనదని తెలియజెప్పాలంటే మీరు ఎంచుకునే రాఖీకి అలాంటి ప్రత్యేకత ఏదో ఉండాలి మరి. స్టోన్ వర్క్, కుందన్, ముత్యాలు, రుద్రాక్ష, చమ్కీ, బటన్ హోల్, వెల్‌వెట్, త్రిజోన్, సింగిల్ పీస్, ఫ్యాన్సీ మెటల్, జరీ, డోరీలు, చందన్, రేషం, కోల్‌కత్తా పర్ని, పంజాబి, లుంబ, క్రిస్టల్ బీడ్స్, జర్దోసీ వర్క్ ఇన్ని రకాల రాఖీలున్నాయి కాబట్టి వాటిల్లోంచి మీకూ మీ సోదరుడికీ ఏది నచ్చుతుందో ఆలోచించి ఎంపిక చేసుకోవచ్చు.

కాస్త కాస్ట్‌లీ
ఒక రూపాయి నుంచి 300 రూపాయల వరకు రాఖీలు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. ఇంకా కాస్త కాస్ట్‌లీవి కావాలంటే విలువైన రుద్రాక్షలు, రాళ్లు అద్దినవి, మోతీ, వెండి, డైమండ్ రాఖీలను మీ స్థోమతని బట్టి ఎంచుకోవచ్చు. పది, వంద, ఐదు వందల రూపాయల నోటు పెట్టి అల్లిన రాఖీలు కూడా మార్కెట్‌లో దొరుకుతున్నాయి.

పిల్లలకు ప్రత్యేకం
పిల్లల రాఖీలంటేనే స్పెషల్‌గా ఉంటాయి. వారి ఆల్‌టైమ్ ఫేవరెట్ స్పైడర్ మ్యాన్ రాఖీలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మగధీర, బాల హనుమాన్ , జూజూ రాఖీలు ఇప్పుడు కొత్తగా వచ్చాయి. బైక్స్, మిక్కీ మౌస్, టామ్ అండ్ జెర్రీ, పవర్ రేంజర్స్, జంతువులు, పక్షుల బొమ్మలున్న రాఖీలు కూడా పిల్లల కోసం ప్రత్యేకంగా అమ్ముతున్నారు.

భయ్యా బాబీ రాఖీలు
కేవలం సోదరుల కోసమే కాదు అన్నా వదిన, తమ్ముడు మరదలు కోసం ప్రత్యేకమైన రాఖీ సెట్లు భయ్యా బాబీ రాఖీల పేరుతో దొరుకుతున్నాయి. అంతేకాదు వేరే ఊర్లో ఉండి స్వయంగా వెళ్లి రాఖీ కట్టలేని వారు కొరియర్ చేసేందుకు వీలుగా కుంకుమ, గంధం, అంక్షింతలు ఉన్న ప్యాకేజీలు కూడా ఉన్నాయి.

ఫోటో రాఖీలు
ఈ రక్షాబంధన్‌కి 'సువా గిఫ్ట్స్' వాళ్లు ప్రత్యేక రాఖీలు తయారుచేశారు. ఇప్పటి వరకు ఎవరూ చేయని ప్రయోగాన్ని వాళ్లు చేశారు. చుట్టూ మెటల్ బీడ్స్, స్టోన్స్, జరీ మధ్యలో రాఖీ కట్టించుకునే అన్న ఫోటో లేదా వాళ్ల పక్కన మీరున్న ఫోటో ఉండటమే ఈ రాఖీ ప్రత్యేకత. పది రోజుల కిందట మార్కెట్లోకి వచ్చిన ఈ రాఖీలు ఇప్పటికే వెయ్యికి పైగా అమ్ముడయ్యాయి.

మీకు కావాల్సిన ఫోటో ఇస్తే అరగంట వ్యవధిలో చేసి ఇస్తారు. ఈ రాఖీలకు రాష్ట్రం నుంచే కాదు దేశం నలుమూలల నుంచి మంచి డిమాండు వస్తోందని చెప్పారు వీటి రూపకర్తలు సిద్ధార్థ జైన్, పవన్ రాజ్ జైన్‌లు. కుంకుమ, అక్షింతలు, ఒక డైరీ మిల్క్ చాక్‌లెట్ మధ్యన ఈ రాఖీ ఒదిగి అందమైన ప్యాక్‌లో లభిస్తుంది. కాబట్టి రాఖీ కట్టగానే కుంకుమ, అక్షింతలు, స్వీట్ కోసం వెతుక్కునే పనికూడా ఉండదు. బావుంది కదూ ఈ ఏర్పాటు.

రేటు కాస్త ఎక్కువే 225 రూ. ఇవీ, ధూల్‌పేటలో తయారయ్యే కొన్ని రకాల రాఖీలు మినహా ఎక్కువ రాఖీలు మనకు ఢిల్లీ, ముంబై, కోల్‌కతాల నుండి వస్తాయి. వీటిలో కోల్‌కతా ఫ్యాన్సీ రాఖీలకు ఎక్కువ డిమాండ్ ఉందని చెప్పారు. హోల్‌సేల్ డీలరు సురేష్ యాదవ్.

ఇంటర్ నెట్ రాఖీలు
విదేశాల్లో ఉండేవారు ఇక్కడ తమ వారికి రాఖీని, కానుకలను పంపేందుకు కొన్ని వెబ్‌సైట్లు సహకరిస్తున్నాయి. అందులో మనం ఎంచుకున్న రాఖీని, కానుకలను మనం ఇచ్చిన చిరునామాకు ఆ పోర్టల్స్ పంపుతాయి. అందుకోసం కొంత ఛార్జి తీసుకుంటున్నాయి. అలాంటి కొన్ని వెబ్‌సైట్లు ఇవి.

www.sendrakhigiftstoindia.com
rakhi.rediff.com
rakhi.indiangiftsportal.com
www.virtualrakhi.com
www.rakhiindia.com

Monday, August 23, 2010

నలందోదయం

nalanda
ఎన్నో దేశాలు కన్ను తెరవకముందే చదువుల్లో కీర్తి బావుటను నలంద ఎగరవేసింది. ప్రపంచానికి జ్ఞానజ్యోతులని పంచింది. భారత ఖ్యాతిని ్రపపంచవ్యాప్తంగా చాటిచెప్పింది. ఎన్నో ఏళ్ల చరిత్ర గల నలందా విశ్వవిద్యాలయం....మరికొన్ని రోజుల్లో కొత్త రూపురేఖను సంతరించుకోవటానికి ఓ అడుగు (బిల్లు) దూరంలో ఉంది. నలంద విశ్వవిద్యాలయం తిరిగి ప్రాచీన వైభవాన్ని సంతరించుకోవాలంటే లోక్‌సభ ఓటింగ్‌ కీలకం. నలంద విశ్వవిద్యాలయ బిల్లు 2010ని రాజ్యసభ ఆమోదించింది. యూనివర్సిటీ ఆఫ్‌ నలంద యాక్ట్‌ 2007లో బీహార్‌ అసెంబ్లీలో తొలిగా ప్రవేశెపెట్టింది. 2007లో జరిగిన దక్షిణాసియా సదస్సులో దీని మీద చర్చలు జరిగాయి. 2009 అక్టోబర్‌ 25న థాయ్‌లాండ్‌లో జరిగిన 4వ దక్షిణాసియా సదస్సులోను దీన్ని ప్రస్తావించారు.

నలంద ఖ్యాతి
nalaబీహార్‌ రాజధాని పాటా్ని ( పాటలీపుత్రం) 55 కిలోమీటర్ల దూరంలో నలంద విశ్వవిద్యాలయం ఉంది. గుప్తుల రాజైన కుమారగుప్త సమయంలో దీన్ని నిర్మించారు. బుద్ధులు సందర్శించే పవిత్ర స్థలాల్లో నలంద కూడా ఒకటి. 10వేల విద్యార్థులు, 2వేల ఉపాధ్యాయులు మరెంతో మంది సిబ్బందికి ఒకేసారి బోధనను అందించే సదుపాయం ఇక్కడ ఉండేది. ఖగోళ, వాస్తు ప్రకారం దీన్ని నిర్మించారు. ఇక్కడ 8 అద్భుత భవనాలు, ఓ సూర్యాలయంతో పాటూ పది ఇతర దేవాలయాలుండేవి. యోగా, ధ్యానం కోసం ప్రత్యేక గదులుండేవి. కొలనులు, సుందర ఉద్యానవనాలతో పరిసర ప్రాంతాలు కళకళలాడుతుండేవి. 9 అంతస్థుల భవనంలో గ్రంథాలయం ఉండేది. గణితం, సాహిత్యం, భాష, ఖగోళం ఇలా ఒకటేమిటి ప్రతి అంశం మీద బోధించటానికి సుశిక్షితులైన అధ్యాపకులుండేవారు.

కొరియా, జపాన్‌, చైనా, టిబెట్‌, ఇండోనేషియా, పర్షియా, టర్కీ విద్యార్థులు నలందలో చదువుకోవటానికి ఎక్కువగా వస్తుండేవారు. 427 బిసి నుంచి 1197 సంవత్సరం వరకు బౌద్ధులకి విద్యా బోధనా కేంద్రంగా ఉంది. చరిత్రలో మొట్టమొదటి విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందింది నలందనే. మౌర్య రాజులు, అశోకుడు, గుప్తులు ఇక్కడ చారిత్రక కట్టడాలను నిర్మించారు. భక్తయార్‌ ఖిల్జి (1193) పరిపాలనలో నలంద పతనం ప్రారంభమైంది. విశిష్టమైన కట్టడాలెన్నింటినో ధ్వంసం చేశారు. ఎంతోమందిని తరిమేశారు. ఎన్నో విలువైన గ్రంథాలను, సాహిత్యాలను తగులబెట్టారు. ఇక్కడ ఉన్న గ్రంథాలయాన్ని కాల్చితే.... అందులో ఉన్న పుస్తకాలు మూడు నెలల పాటూ కాలుతూనే ఉన్నాయంటే ..ఎన్ని కోట్ల సాహిత్యాన్ని నాశనం చేశారో అర్థం చేసుకోవచ్చు.

అమర్త్వసేన్‌ నాయకత్వంలో..
నలంద పునరుద్ధరణకు కొన్ని సంస్థలు, దేశాలు ముందుకొచ్చినా....ఆర్థికశాస్త్రంలో భారత్‌కి తొలి నోబెల్‌ని అందించిన అమర్త్వసేన్‌ ఆధ్వర్యంలో ఓ బృందం ఏర్పాటైంది. దేశానికి చెందిన ప్రముఖ ప్రొఫెసర్లు, మేఘనాథ్‌ దేశాయ్‌, సుగోత్‌ బోస్‌, నంద్‌ కిషోర్‌ సింగ్‌, చైనా ఫ్రొఫెసర్‌ వాంగ్‌ బెన్‌వాయి ( బీజింగ్‌ విశ్వవిద్యాలయం) సింగపూర్‌ విదేశాంగ మంత్రులు హిరయామ, జార్జి యో ఇందులో ఉన్నారు. వీరందరూ కలసి వివిధ పట్టణాల్లో నలంద పునరుద్ధరణ పైన ఆరు సమావేశాలను నిర్వహించారు.నలందలో ప్రవేశపెట్టబోయే కోర్సులు వాటి బోధనా విధానంపైన వీరు కసరత్తు చేస్తున్నారు.

ప్రపంచానికి కాంతులు
amartya-sen నలంద పునరుద్ధరణకు అంతర్జాతీయంగా 1951లోనే నవ నలందా మహావీరా పేరుతో ఓ సంస్థ ఏర్పాటైంది. పాట్నాకి 100 కిలోమీటర్ల దూరంలో ప్రధాన కేంద్రం ఉంది.దేశ తొలి రాష్టప్రతి బాబూ రాజేంద్రప్రసాద్‌ దీనికి పునాది రాయి వేశారు. 1956లో మొదటి భవనాన్ని సర్వేపల్లి రాధాకృష్ణనన్‌ ప్రారంభించారు. 1981లో రాష్టప్రతి నీలం సంజీవ రెడ్డి విదేశీ విద్యార్థుల కోసం అంతర్జాతీయ హస్టల్‌ భవన నిర్మాణానికి పునాది వేశారు. 2008 - 2009 సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం 397 విద్యార్థులు ఇక్కడ ఉన్నారు.

బర్మా, శ్రీలంక, థాయ్‌లాండ్‌, కాంబోడియా, బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన 95 మంది సన్యాసులున్నారు. 2006లో సింగపూర్‌, చైనా, భారత్‌, జపాన్‌తో పాటూ మరికొన్ని దేశాలు నలంద విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించటానికి ముందుకొచ్చాయి. ఇప్పటి వరకు లభించిన మనుస్క్రిప్ట్స్‌ను నలందా మ్యూజియంలో జనవరి 26, 2008న తొలిసారిగా 3డిలో ప్రదర్శించారు. నలంద కాంతి దశదిశలా మళ్లీ వ్యాపించాలి. అందరికి జ్యోతిని ( విద్య) పంచాలి. నలంద కిరణాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి.

కొత్తదనంతో రూ. కోట్లకు పడగెత్తిన ఆ నలుగురు !


కొత్తదనం అందరినీ ఆకట్టుకుంటుంది. వ్యాపారంలో ఇది మరింతగా వర్తిస్తుంది.విశిష్ట బ్రాండ్‌లను రూపొందించి, వైవిధ్యభరిత వాణిజ్య విధానాలను అనుసరిస్తున్న 30 మంది పారిశ్రామికవేత్తల జాబితాను ఇంక్‌ మంత్లీ బిజినెస్‌ మ్యాగజైన్‌ రూపొందించింది. వీరంతా అమెరికాకు చెందిన వారే. వీరిలో నలుగురు భారతీయులు ఉండడం విశేషం. నూతన తరం పారిశ్రామికవేత్తలు ఒంటరిగా వ్యాపారం చేయదలచుకోలేదు.భాగస్వాములతో కలసి వారు ఈ వ్యాపారాలను ఆరంభిస్తున్నారు. వారికి ఈ వ్యాపారం అనేది తమ సామాజిక జీవనాన్ని విస్తరించుకునే సాధనంగా ఉపకరిస్తోందని ఇంక్‌ పత్రిక పేర్కొంది.

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ అప్లికేషన్‌తో...
navin 
నవీన్‌ సెల్వదురై (28) ఫోర్‌స్క్వేర్‌ అనే సోషల్‌ నెట్‌వర్కింగ్‌ అప్లికేషన్‌కు సహవ్యవస్థాపకుడు. వికాస్‌ రెడ్డి (26) ఆక్సిపిటల్‌ అనే టెక్నాలజీ ఆధారిత సంస్థకు సహవ్యవస్థాపకుడు. సచిన్‌ అగర్వాల్‌ (30) పోస్టరస్‌ సంస్థను స్థాపించాడు. స్టాన్‌ఫోర్డ్‌ గ్రాడ్యుయేట్‌ ఒశామా గార్జ్‌ (22) కూడా ఈ జాబితాలో స్థానం సాధించాడు. వీరంతా కూడా మార్కెట్‌లో ఎంతో వినూత్నతను ప్రదర్శించారని ఇంక్‌ పత్రిక పేర్కొంది. నవీన్‌ సెల్వదురై మొన్నటి వరకూ సాఫ్ట్‌వేర్‌ అర్కిటెక్ట్‌గా ఉండేవారు.

2009లో ఆయన ఫోర్‌స్క్వేర్‌ను మరికొందరితో కలసి ఏర్పాటు చేశారు. ఫోర్‌స్క్వేర్‌ అనేది ఓ మొబైల్‌ అప్లికేషన్‌. ఇది ఫ్రెండ్‌ఫైండర్గా, సోషల్‌ సిటీ గైడ్‌గా మాత్రమే గాకుండా ఓ గేమ్‌గా కూడా పని చేస్తుంది.దీన్ని సుమారు 20 లక్షల మంది ఉపయోగిస్తున్నారు. దీని ప్రస్తుత వ్యాపార విలువ 100 మిలియన్‌ డాలర్లు అని అంచనా. ఈ సంస్థ నిలకడగా దినదినాభివృద్ధి చెందుతోంది. వారానికి లక్ష మంది కొత్త సభ్యులు ఇందులో చేరుతున్నారు. త్వరలో దీన్ని భారీగా రీడిజైన్‌ చేయనున్నారు.

కమర్షియల్‌ అప్లికేషన్‌

vikas-reddy 
వికాస్‌ రెడ్డి 2008లో ఆక్సిపిటాల్‌ అనే టెక్నాలజీ సంస్థను నెలకొల్పాడు. ఈ సంస్థ రెడ్‌ లేజర్‌ అనే బెస్ట్‌ సెల్లింగ్‌ ఐఫోన్‌ అప్లికేషన్‌ను రూపొందించింది. దీంతో యూజర్లు బార్‌కోడ్‌లను స్కాన్‌ చేసుకోగలరు. 2009 మేలో ఆరంభ మైంది మొదలు దీన్ని 20 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. మార్కెట్లోని అత్యుత్తమ పెయిడ్‌ ఐఫోన్‌ అప్లికేషన్‌గా ఇది మంచి గుర్తింపు పొందింది. ఈ సంస్థ ఇటీవలే ఈ ఉత్పాదనను ఇ-బే సంస్థకు విక్రయించింది వచ్చిన మొత్తం ద్వారా మరిన్ని వినూత్న ఉత్పాదనలను రూపొందించనుంది. 2009లో ఆక్సిపిటల్‌ ఒక మిలియన్‌ డాలర్లను ఆర్జించింది. ఈ ఏడాది 2.5 మిలియన్లను ఆర్జించాలన్నది దీని లక్ష్యం.


sachin-agarwal 
బ్లాగింగ్‌ ఎంతో సులభం యాలన్నది దీని లక్ష్యం. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ఈ కంపెనీ ఇప్పటికే 5 మిలియన్‌ డాలర్లను ఆర్జించగలిగింది. వై కాంబి నేటర్‌ అనే అమెరికన్‌ ప్రోత్సాహక సంస్థ దీనికి అండగా నిలిచింది. ఫోటోలు పోస్ట్‌ చేసేందుకు ఫేస్‌బుక్‌లోకి లాగిన్‌ అయ్యే బదులుగా లేదా బ్లాగింగ్‌ సైట్‌లో మీ ఆలోచనలు వెల్లడించేందుకు ఆ సైట్‌లోకి ప్రవేశించేందుకు బదులుగా ఇలాంటి వాటిని అన్నింటినీ ఇ-మెయిల్‌ అకౌంట్‌లోనుంచే చేసే సదుపాయాన్ని ఈ ఉత్పాదన అందిస్తుంది. ప్రస్తుతం ఈ సేవను ఉచితంగానే అందిస్తు న్నప్పటికీ, దీన్ని ప్రీమియం సర్వీస్‌గా మార్చే యోచనలో సంస్థ ఉంది. దీని వల్ల యూజర్లకు మరింత స్పేస్‌ అందించవచ్చన్నది సంస్థ భావన.

రిక్రూట్‌మెంట్‌ ఎంతో తేలిక
ooshma-garg 
స్టాన్‌ఫోర్డ్‌ గ్రాడ్యుయేట్‌ గార్గ్‌ (22) అనాపటా అనే ఆన్‌లైన్‌ రిక్రూట్‌మెంట్‌ సైట్‌ను ఆరంభించింది. వివిధ న్యాయవిద్యాసంస్థల నుంచి గ్రాడ్యుయేట్లను ఎంచుకోవడంలో లా ఫర్మ్‌లకు ఉపయుక్తంగా ఉంటుంది. దీన్ని బిజినెస్‌ స్కూల్‌ రిక్రూటర్లకు కూడా విస్తరింపజేయాలన్న యోచనలో గార్గ్‌ ఉంది.

Sunday, August 22, 2010

పుల్ల ఐసు - బొంబాయి మిఠాయి * పాప్‌కార్న్‌

Popsicle
చల్లగా, తియ్యగా, పుల్లగా రకరకాల రుచులలో ఉండే పుల్ల ఐసు అంటే ఎవరికి ఇష్టం ఉండదు? స్కూలుకు వెళ్ళేప్పుడో, వచ్చేటప్పుడో బండి వాడు అమ్ముతున్న ఐస్‌ను కొనుక్కోకుండా ఎవరు ఉంటారు? పాలైసు, ద్రాక్షా ఐసు, ఆరెంజ్‌ ఐసు, సేమ్యా ఐసు, డబుల్‌ ఐసు... అబ్బా ఎంత బాగుంటాయో. మరి ఈ పుల్ల ఐసు ఎలా వచ్చింది అనంటే అనుకోకుండా వచ్చిందని చెప్పాలి.

అమెరికాలో శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ‘ఫ్రాంక్‌ ఎవర్సన్‌’ తన 11 ఏళ్ళ వయసులో 1905లో అనుకోకుండా దీనిని కనిపెట్టాడు. ఫ్రూట్‌ జ్యూస్‌ను డీప్‌ఫ్రిజ్‌లో పెట్టి మర్చిపోయిన ఎవర్సన్‌ మరుసటిరోజు ఉదయం దానిని తీసి చూస్తే గడ్డ కట్టి కనిపించింది. టేస్ట్‌ చూస్తే చాలా బాగుందనిపించింది. అప్పటి నుంచి అతడు ఫ్రూట్‌ జ్యూస్‌లో పుల్ల గుచ్చి, డీప్‌ ఫ్రీజర్‌లో పెట్టి పుల్ల ఐసు తయారుచేయడం మొదలెట్టాడు. దానికి ‘పాప్సికల్‌’ అనే పేరు పెట్టాడు. అలా అలా అది ఆ దేశం నుంచి అన్ని దేశాలకు చేరింది. అలాగే ఎగ్జిబిషన్‌లోనో, షాపింగ్‌ మాల్స్‌లోనో కనిపించే పింక్‌ కలర్‌ బొంబాయి మిఠాయి (కాటన్‌ కాండీ) ని 1897లో ‘విలియం మొరిసన్‌’, ‘జాన్‌ సి వార్టన్‌’ అనే అమెరికా వ్యక్తులు తయారు చేశారు. కలర్‌ చక్కెరను మిషన్‌ తిరగలిలో వేసి దూది పొరల్లాంటి బొంబాయి మిఠాయిని వాళ్ళు తయారు చేశారు.


పాప్‌కార్న్‌
Popcorn1 
బస్‌స్టేషన్లలో, సినిమా హాళ్లలో, రైల్వే స్టేషన్లలో, షాపింగ్‌ మాల్స్‌, ప్రధాన కూడళ్ళు ఒకటేమిటి..మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కువగా కనిపించే తినుబండారం పాప్‌కార్న్‌. ఇప్పుడు అసలే వర్షకా లం. సాయంత్రం పూట... వర్షం పడుతుంటే... వేడివేడిగా పాప్‌కార్న్‌ రుచి చూడాలని ఎవరికుండదు. అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ పాప్‌కార్న్‌ ఎలా పుట్టిందో తెలుసుకుందామా...

అందరికీ ఇష్టమైన మొక్కజొన్న పుట్టింది మెక్సికోలోనట. క్రీ.పూ. 2500లోనే అక్కడ నివసించిన కాచైజ్‌ ఇండియన్లు మొక్కజొన్నను పండించి ఆహారంగా తీసుకొనేవారని అం టారు. కొంతకాలం క్రితం పెరూ దేశంలో తూర్పు తీరంలో దాదాపు వెయ్యేళ్ళ క్రితం నాటి మొక్కజొన్న గింజలు దొరికాయి. అన్నేళ్ళ తరువాత కూడా అవి వేయించి తినే స్థాయిలో ఉండటం విశేషం. మెక్సికో నుంచి బ్రిటన్‌కు చేరిన మొక్కజొన్నకు పంచదార జోడించి బ్రేక్‌ఫాస్ట్‌ తినడాన్ని ఇంగ్లీషువారు మొదలుపెట్టా రు.18వ శతాబ్దం తరువాతనే ఇప్పుడు మనం తింటున్న పేలాలు లేదా పాప్‌కార్న్‌ వాడుకలోకి వచ్చా యి. గింజల నుంచి పాప్‌ కార్న్‌ ఎలా వస్తుందంటే ప్రతి మొక్కజొన్న గింజలోనూ చిన్న నీటి బిందువు ఉంటుంది. ఇది గింజలో ఉన్న మెత్తటి పిండిపదార్థంలో నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడైతే గింజల్ని వేడి చేస్తామో అప్పుడు ఆ నీరు వ్యాకోచిస్తుంది. దాంతో పీడ నం పెరిగి గింజ టప్‌మని పేలి పొరలుగా విచ్చుకుంటుంది. పూర్వం ఈ ప్రక్రియ ను చూసి అమెరికన్‌ తెగలు చాలా భయపడేవి. గింజలో ఆత్మ ఉంటుందనీ దానిని వేడి చేస్తే బయటకు వచ్చి చిటపటమని గోల చేస్తుందని నమ్మేవారు.

Wednesday, August 18, 2010

ఫోన్ పాడితే జేబు నిండుతుంది!

"అనిత అని టైప్ చేసి 56263 నెంబరుకు ఎస్ఎంఎస్ చేయండి. మీరు కోరుకున్న పాట క్షణాల్లో డౌన్‌లోడ్ అయిపోతుంది..'' ఒక చిన్న సమాచారం విద్యుత్ వేగంతో జనాల్లోకి వెళ్లిపోయింది. ఒకటి.. రెండు.. మూడు.. వెయ్యి.. పదివేలు.. యాభైవేలు.. లక్ష.. పది లక్షలు.. ఇరవై నాలుగు లక్షల మంది స్పందించారు.

వామ్మో! ఈ అంకెలను చూసి మీకే కాదు, పంపన త్రినాథ్‌కూ దిమ్మతిరిగింది. 'అనితా ఓ అనితా' అనే ప్రైవేటు ఆల్బమ్‌లోని పాటను డౌన్‌లోడ్ చేసుకున్న వాళ్ల సంఖ్య అది. అక్షరాలా ఇరవై నాలుగు లక్షల మంది. ఒకర్ని చూసి మరొకరు. వాళ్లను చూసి ఇంకొందరు. ఏ కుర్రాడి జేబులో సెల్‌మోగినా ఇదే పాట. ఇంతకూ ఆ పాటలో ఏముంది..? ఎన్నో మధురమైన సినీ గీతాలుండగా, ఈ పాటంటేనే జనాలకు ఎందుకంత పిచ్చి..? అని మీరు కొట్టిపారేయవచ్చు.

అంటే ఆ పిచ్చినే వ్యాపారం చేసుకుంటే ఎలాగుంటుంది..? అనే ఆలోచన మీ బుర్రకు రాలేదన్న మాట. త్రినాథ్ బుర్రకు వచ్చింది. 'కాలర్‌ట్యూన్ల' వ్యాపారంలో అది కేక పుట్టించింది. "ఎప్పుడు ఏ గాలి వీస్తుందో ఎవ్వరికీ తెలీదు. గాలి వీసినప్పుడే తూర్పారబట్టుకోవాలి...'' పంట నూర్పిడి సూత్రాన్నే వ్యాపారానికి అన్వయించిన ఈ కుర్రాడు చదువుకుంది మళ్లీ ఐఐటీనో, ఐఐఎంనో కూడా కాదు. బీఏకంటే వీసమెత్తు మెరుగైన బీకాం అయిందనిపించాడు.
సినిమాల నుంచి వెనక్కి..

అందరి కుర్రాళ్లలాగే త్రినాథ్‌కూ సినిమాల పిచ్చి. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలోని దుర్గాడ నుంచి చెన్నై చెక్కేశాడు. అమ్మానాన్నలది సాధారణ రైతు కుటుంబం. "నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే యమక్రేజ్. నా సినిమా కలలు సాధ్యం కావాలంటే నా వయసు, అనుభవం సరిపోవని చెన్నై వెళ్లాక తెలిసింది..'' అంటున్న త్రినాథ్ ఒట్టి చేతులతో వెనక్కి రాలేక అక్కడే డీఎఫ్‌టెక్ డిప్లమో చేశాడు.

తర్వాత పెట్టేబేడా సర్దుకుని మన హైదరాబాద్ వచ్చేశాడు. అక్కడక్కడ అసిస్టెంట్ డైరెక్టర్‌గా చక్కర్లు కొట్టాడు. ఉప్పలపాటి నారాయణరావు దగ్గర కొంతకాలం పనిచేశాడు. ఎంతకాలం ఇలా...? తనే సొంతంగా వ్యాపారంలోకి దిగితే, ఆ మాటే తమిళ స్నేహితులతో చెబుతుండేవాడు.

దేశమంతా తిరిగి..

అప్పటికే వాళ్లు యాడ్ఏజెన్సీలు పెట్టి సక్సెస్ అయ్యారు. "నీ ఆలోచనల్లో కొత్తదనం, తపన ఉన్నాయి. చురుగ్గా స్పందించే గుణం ఉంది. నువ్వు కూడా సృజనాత్మకరంగంలోకి అడుగుపెట్టు'' అని ఎప్పుడూ ఉచిత సలహాలు ఇచ్చే స్నేహితులు ఈసారి ఖరీదు సలహా ఇచ్చారు. కానీ, తన దగ్గర పెద్దగా పెట్టుబడి లేదు. ఉన్నది ఒక్క ఆత్మవిశ్వాసమే.

అదే తన పెట్టుబడి అనుకున్నాడు. నేరుగా హైదరాబాద్‌లోని చందనాబ్రదర్స్ యజమాని దగ్గరికి వెళ్లి, 'సార్, ఒట్టి అడ్వర్‌టైజ్‌మెంట్లు ఇస్తే తక్కువ మందే చూస్తారు. ప్రజలకు ఉపయోగపడే సమాచారంతో సీడీలు తయారుచేసి, అందులో ప్రకటనలు ఇస్తే మీ సంస్థ గురించి చాలా కుటుంబాలకు తెలుస్తుంది..' అన్నాడు. ఆయన 'సరే, ఒక్కసారి చేసివ్వు చూద్దాం' అన్నారు.

ఒక వీడియో కెమెరా భుజాన తగిలించుకొని ఇండియా మొత్తం చుట్టేసి 'ద్వాదశ జ్యోతిర్లింగాలు' సీడీని ఆయన చేతుల్లో పెట్టాడు త్రినాథ్. అది ఆయనకు తెగ నచ్చింది. ఇంకేముంది..? ఏటా రెండు లక్షల సీడీలు రికార్డు చేసి చందనా వాళ్లకిచ్చే ఆర్డర్ దక్కించుకున్నాడు త్రినాథ్. అక్కడి నుంచి మరికొన్ని మన రాష్ట్రంలోని 'పంచారామక్షేత్రాలు', 'గోదావరి' సీడీలను ప్రమోషన్ కింద కొన్ని సంస్థలకు తయారుచేసిచ్చాడు. అవి కూడా ఏటా కనీసం రెండు లక్షల సీడీలు చేసివ్వాలి. ఈసారి సొంతంగా సీడీ మానుఫాక్చరింగ్ యూనిట్ పెట్టాడు. పట్టుదల+ఆత్మవిశ్వాసం కలిశాక జీవితంలో కొత్తరుచి దొరికింది త్రినాథ్‌కు. 'మై3 ఆడియో అండ్ వీడియో'సంస్థ ప్రాణం పోసుకుంది.

కాలర్‌ట్యూన్‌ల నాడి పట్టుకొని..

ఇరవైఏడేళ్ల ఈ కుర్రాడికి తోటి కుర్రాళ్ల మనస్తత్వాన్ని పసిగట్టడం చాలా సులువు. తన చిన్న వ్యాపారాన్ని ట్రెండుకు తగ్గట్టు నడపాలనుకున్నాడు. అప్పటికే ప్రముఖ మ్యూజిక్ కంపెనీలు కాలర్‌ట్యూన్, రింగ్‌టోన్‌ల బిజినెస్ చేస్తున్నాయి. రిలీజైన కొత్త సినిమాల ఆడియో హక్కులు ఎంత ఖరీదైనా వారే కొనుక్కుంటున్నారు. 'అంత పోటీలో నువ్వు ఎలా నిలబడదామని అందులోకి దిగావ్..?' అంటే- "నాక్కూడా మొదట్లో అదే భయం కలిగింది.

సంగీతమంటే సినిమాలే కాదు కదా, బయట దొరికే ప్రైవేటు సాంగ్స్, జానపదగేయాలు, పద్యాలు, భక్తి గీతాలు.. వీటి హక్కులు కొని, కాలర్‌ట్యూన్స్ పెడితే ఎలాగుంటుంది..? అన్న ఆలోచన వచ్చింది.

ఏ రాష్ట్రంలో ఎలాంటి కాలర్‌ట్యూన్లు క్లిక్ అవుతున్నాయో తెలుసుకొనేందుకు దక్షణాది ప్రాంతాలన్నీ తిరిగాను. వ్యాపారసంస్థలతో మాట్లాడాను..'' అని చెప్పిన త్రినాథ్ తెలుగులో అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న రెండువేల భక్తిగీతాల డిజిటల్ హక్కులను కొనేశాడు. ఈ పాటలు రాష్ట్రంలోని అన్ని దేవుళ్లపై ఉన్నాయి. మరో 40 చిన్న సినిమాల పాటల డిజిటల్ హక్కులను కూడా కొన్నాడు.

కిటుకు కునుక్కొని..

డౌన్‌లోడ్ చేసుకున్న వినియోగదారుడి నుంచి 10 నుంచి 15 రూపాయల దాకా టెలిఫోన్ ఆపరేటర్లకు వెళుతుంది. అందులో డిజిటల్ హక్కులు తీసుకున్న త్రినాథ్ ఖాతాకూ కొంత మొత్తం వెళుతుంది. ఆ కిటుకులన్నీ తెలుసుకున్న త్రినాథ్ ఇప్పటి వరకూ 2,400 కాలర్‌ట్యూన్స్, రింగ్‌టోన్స్‌ను అప్‌లోడ్ చేశాడు. ఇందులో కొన్నే క్లిక్ అయ్యాయి.

"మొదట్లో ఆశించినంత ఫలితం రాలేదు. మన రాష్ట్రంలోని యూత్‌కు వారానికి రెండుసార్లు కాలర్‌ట్యూన్స్ మార్చే అలవాటుంది. వాళ్లకు ఏ పాట నచ్చుతుందో అంచనా వేయడం చాలా కష్టం. "అనితా, ఓ అనితా' ప్రైవేటు ఆల్బమ్‌లోని పాటల్ని విన్నప్పుడు వీటిని కాలర్‌ట్యూన్స్‌గా పెడితే కచ్చితంగా హిట్ అవుతుందనుకున్నా. వెంటనే ఆల్బమ్ చేసిన యువకుడి నుంచి రైట్స్ కొనుక్కున్నా..'' అదే తన దశ తిరిగేలా చేస్తుందని త్రినాథ్ కలలో కూడా ఊహించలేదు.

ఇప్పటివరకు 24 లక్షల మంది ఆ పాటను డౌన్‌లోడ్ చేసుకొని కాలర్‌ట్యూన్‌గా పెట్టుకున్నారు. ఇదొక రికార్డు. టాప్-5 ట్యూన్లలో ఈ పాట చేరిపోయింది. "ఏటా మన రాష్ట్రంలో కాలర్‌ట్యూన్ల వ్యాపారం సుమారు 10 నుంచి 15 కోట్ల రూపాయలు. ట్యూన్లు పెట్టుకుంటున్న వాళ్లు ఎంతమందో తెలుసా రెండు కోట్ల మంది..! ఒకప్పుడు భక్తిపాటలు, సినిమా పాటలు పెట్టుకొనేవారు. ఇప్పుడు తెలంగాణ, బోనాలు, జానపదగేయాలు, తెలుగుతల్లి పాటలు పెట్టుకుంటున్నారు.

తమ వ్యక్తిత్వాన్ని కాలర్‌ట్యూన్స్ ద్వారా అవతలివాళ్లకు వ్యక్తీకరించుకొనే ట్రెండ్ మొదలైంది. మనుషులందరికీ సెల్‌ఫోన్లున్నాయి. వాటికంటే ముందు వారికి ఒక కల్చర్ ఉంది. ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉంది. సెంటిమెంట్లున్నాయి. ఎమోషన్లున్నాయి. నా బిజినెస్‌కు ఇవే ముడిసరుకు. ఇన్ని రకాల మనుషులకు ఎన్ని రకాల కాలర్‌ట్యూన్లు కావాలో కనుక్కునే శక్తి మనకున్నంత కాలం.. ఈ బిజినెస్ ఎప్పటికీ ఏదో ఒక కొత్త ట్యూన్‌తో మోగుతూనే ఉంటుంది..'' అంటున్న త్రినాథ్, తన సెల్‌ఫోన్‌కు మాత్రం ఎలాంటి కాలర్‌ట్యూనూ పెట్టుకోలేదు. పక్కా బిజినెస్‌మ్యాన్.

చైనా చాప్‌స్టిక్స్‌తో అడవులు కనుమరుగు

farest
ప్రపంచజనాభాలో చైనాది మొదటిస్థానం. పొలాలు, అడవులు, లోయలు, జలపాతాలతో ఆ ప్రదేశం పచ్చగా ఉంటుంది. అయితే ఇది గత కాలపు వైభవంగా మిగిలిపోయే ప్రమాదం ముంచుకొస్తున్నది. చైనాలోని అడవులు మరికొద్దీ రోజుల్లో కనుమరుగయ్యే ప్రమాద మున్నదని పర్యావరణ శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. సాంకేతికంగా అభివృద్ధిదిశగా దూసుకెళుతున్న ఎర్రదే శంలోని అడవులు త్వరలోనే అంతరించిపోతు న్నాయం టూ.... పత్రికల్లోనూ, మీడియాల్లోనూ.. పుంఖానుపుంఖా లుగా కథనాలు, చర్చా కార్యక్రమాలు వస్తున్నాయి. చైనాలో ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలన్నా....చాప్‌స్టిక్స్‌ తప్పనిసరి. అంతేకాదు అక్కడ అడవులు తరిగిపోవటానికి ఇవి మూలస్థంభాలుగా నిలుస్తున్నాయి.

రోజుకి వంద ఎకరాలు కావాలి
ెసాంప్రదాయబద్ధంగా వస్తున్న చాప్‌స్టిక్స్‌ వాడకం వల్ల చైనాలో వరదలు, బురదోత్పాతాలు, అకాల వర్షాలు ఏర్పడుతున్నాయి. దేశంలో ఉన్న జనాభాలో ఒక బిలియన్‌ ( వందకోట్లు) మంది ఓ సంవత్సరంలో 45 బిలియన్ల చాప్‌స్ట్టిక్స్‌ని వాడి పారేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఒక రోజులో 130 మిలియన్ల చాప్‌స్ట్టిక్స్‌ని వృథా చేస్తున్నారు.

ఇంతమందికి చాిప్‌స్టక్స్‌ని అందించాలంటే....అక్కడ ఒకరోజులో వంద ఎకరాల చెట్లు పడగొట్టాలి. దీన్ని బట్టి చూస్తే.... ఓ ఏడాదిలో 16నుంచి 25 మిలియన్ల చెట్లు పెంచాలి. దాని కంటే ముందు చాప్‌స్ట్టిక్స్‌ కోసం వాడే చెట్ల నరికివేత వల్ల... అడవులనాశనం, భూసారం క్షీణించడం, మృత్తిక నేలలు కనుమరుగ వ్వటం, ఉత్పాతాలు, వరద, బొగ్గుపులుసు వాయువు ఎక్కువకావడం, జీవవైరుధ్యం లేకపోవటం జరుగుతున్నది. అంతేకాదు వీటి మూలంగా ఆయా ప్రాంతాలు ఎడారిలా మారిపోయే ప్రమాదం ఉంది. ఈ ఘోరకలిని ఆపేందుకు 2006లో చైనా పర్యావరణ ప్రేమికులు మీ చాప్‌స్టిక్స్‌ని మీరే తయారుచేసుకోండి అనే నినాదాన్ని ఇచ్చారు.

పచ్చని చైనా ముంపు...
chapstcksచైనా చాప్‌స్టిక్స్‌ వ్యాపారం మీద లక్షలమంది ప్రజలు ఆధారపడ్డారు. వీటిని తయారుచేసే పరిశ్రమలు అక్కడ 300కు పైగానే ఉన్నాయి. అలాంటి వ్యాపారాన్ని ఒకవేళ అర్థాంతరంగా మూసేస్తే....ముందు వీరందరికీ ఉపాధిని చూపించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దీంతో అంతమందికి ఒకేసారి ఉద్యోగమంటే కానిపని అంటూ ప్రభుత్వం చేతులేత్తిసింది. దేశంలోని కొన్ని రెస్టారెంట్లు చాప్‌స్ట్టిక్స్‌ని వినియోగించిన తరవాత స్టెరిలైజ్‌ చేస్తున్నాయి. వాటిని ప్లేట్లు, గ్లాసులు, కత్తులు, ఫోర్క్‌లా మారుస్తున్నాయి. అయితే వాటిని అలా తయారుచేయటం చాలా ఖర్చుతో కూడుకున్న పని. చిన్న హోటళ్లు స్టిక్స్‌ని ఇలా మార్చాలంటే వాటి వల్ల అయ్యే పనికాదు.

చైనా ఆర్థికమంత్రిత్వ శాఖ ఈ సంవత్సరం జూన్‌లో ఓ అత్యవసర సమావేశాన్ని ఏర్పరచింది. దేశంలో ఉన్న చాప్‌స్టిక్స్‌ తయారీ కంపెనీలన్నింటితో ముఖాముఖి చర్చలు జరిపింది. ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో దేశంలో ఉన్న అటవీ సంపద నాశనమవు తున్నదని..దీనికి చాప్‌స్టిక్స్‌ వాడకం పెరిగిపోవటమే కారణమని వారితో చర్చించింది. సాధ్యమైనంత త్వరగా వీటి వాడకాన్ని నిరోధించాల్సిందిగా పిలుపునిచ్చింది. చైనాలో అడవుల్ని కాపాడాలంటే... ప్రభుత్వమే తొందరగా ఏదో ఓ నిర్ణయాన్ని తీసుకోవాలి. లేదంటే పచ్చనిచైనా ప్రాంతాలు చాప్‌స్టిక్స్‌ పుణ్యమా అంటూ శాశ్వతంగా కనుమరగయ్యే ప్రమాదముంది.

చాప్‌ చాప్‌....
chapstcks1చాప్‌స్టిక్స్‌ వ్యాపారం చైనాలో మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగుతోంటుంది. దక్షిణాసియా దేశాల్లో వీటి వినియోగం సాంప్రదాయంగా వస్తున్నది. చైనా, జపాన్‌, ఉత్తర,దక్షిణ కొరియా, వియత్నాం దేశాల్లో తప్పకుండా చాప్‌స్టిక్స్‌ని వాడతారు. చైనా నుంచే ఈ సంస్కృతి మిగతా దేశాలకు పాకింది. భారత్‌ పక్క దేశాలైన నేపాల్‌, భూటాన్‌, టిబెట్‌లోనూ చాప్‌స్టిక్స్‌ని వినియోగిస్తారు. ఈ స్టిక్స్‌ని గడ్డి జాతికి చెందిన వృక్షాల నుండి చేస్తారు. ప్లాస్టిక్‌, మెటల్‌ ( లోహం ) ఎముకలు, దంతాలతో పాటూ... కొన్ని రకాల కొయ్యలతోనూ వీటిని చేసి మార్కెట్‌లో అమ్ముతారు. చాప్‌ చాప్‌ అనే చైనా పదం మారి మారి ఇంగ్లీషులో చాప్‌స్టిక్స్‌ అయింది. చాప్‌ చాప్‌ అంటే చైనాలో తొందరగా అని అర్థం. షాంగ్‌ రాజవంశీయుల కాలం (1766 - 1122) నుంచేి ఇవి వాడుకలో ఉన్నట్లుగా చెబుతారు.

ఒకప్పుడు దక్షిణాసియాలోని చాలా దేశాల ప్రజలు చేతితోనే ఆహారాన్ని తీసుకునేవారు. చైనా సంస్కృతి ప్రభావం వల్ల కొన్ని దేశాలు చాప్‌స్టిక్స్‌కి అలవాటుపడా ్డయి. ప్రత్యేకించి నూడిల్స్‌తో తయారుచేసిన పదార్థాలకు వీటిని తప్పనిసరిగా వాడుతున్నారు. చాప్‌స్టిక్స్‌ని వాడాలం టే అనుభవం ఉండాలి. నేర్పు, ఓర్పు కావాలి. చైనా ప్రాచీన సంప్రదాయం ప్రకారం వీటిని కుడి చేతితోనే వాడాలి. అయితే ఆ సంప్రదాయం కనుమరుగై ఎడమ, కుడిచేతులతో ఎడాపెడా వాడేస్తున్నారు. చైనా స్టిక్స్‌కి ఇతరదేశాల్లో వాడే చాప్‌స్టిక్స్‌కి చాలా తేడా ఉంది.

Tuesday, August 17, 2010

"ఒక విలువ..ఒక విశ్వాసం''

పరిశ్రమ అంటే చాలా మందికి టాటానే గుర్తుకొస్తుంది. మనం వాడే వాహనాల దగ్గర నుంచి వేసుకునే మందుల దాకా- ప్రతి విషయంలోను టాటా కంపెనీలు తమ ఉత్పత్తుల ద్వారా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటాయి. అలాంటి గ్రూపుకు రతన్ టాటా తర్వాత వారసుడు ఎవరు? అతను మళ్లీ పార్సీనే అవుతాడా? మరెవరన్నానా? ఇలాంటి అనేక ప్రశ్నలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రచురణ సంస్థ పెంగ్విన్ - "టాటా- ద ఇవల్యూషన్ ఆఫ్ ఏ కార్పొరేట్ బ్రాండ్' అనే పుస్తకాన్ని విడుదల చేసింది. ప్రముఖ రచయిత మోర్జిన్ విట్‌జెల్ రాసిన ఈ పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన అంశాలు మీ కోసం...

"నేను ఆఫీసులో కూర్చుని అకౌంట్స్ చూసుకుంటున్నా. ఇంతలో తలుపు తెరుచుకుంది. విచిత్రమైన వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. నా టేబుల్ దగ్గర నిలబడి ఒక నిమిషం నావైపు చూశాడు. ఆ తర్వాత- ' నేను ఇండియాలో ఒక స్టీల్ మిల్లు నిర్మించాలనుకుంటున్నా. మీరు వచ్చి స్థలాన్ని చూడండి. డిజైన్ చేయండి. దీనికి అయ్యే ఖర్చు అంతా నేనే భరిస్తా' అన్నాడు. నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు. కాని అతను మాత్రం గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిలా కనబడ్డాడు...''

ఈ వాక్యాలు రాసింది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మైనింగ్ ఇంజినీర్ చార్లెస్ పేజీ పిరిన్. అతని ఆఫీసుకి వెళ్లింది జమ్‌షెడ్‌జీ ఎన్ టాటా. టాటా గ్రూపు చరిత్ర ప్రారంభమయ్యేది ఈయనతోనే. ముంబాయిలో టాటా గ్రూపు ప్రధాన కార్యాలయం 'బోంబే హౌస్'కు వెళితే పాలరాతితో చేసిన జమ్‌షెడ్‌జీ టాటా విగ్రహమే ముందు కనిపిస్తుంది.

జెమ్‌షెడ్‌జీ చనిపోయి వందేళ్లు పూర్తయిన తర్వాత కూడా- ఆ గ్రూపు కార్యకలాపాలపై ఆయన ప్రభావం స్పష్టంగా మనకు తెలుస్తూనే ఉంటుంది. 'నమ్మకం..సేవ' ఈ రెండు విలువలను జెమ్‌షెడ్‌జీ గాఢంగా నమ్మారు. ఆయన చేసిన వ్యాపారాలన్నింటిలోను వీటిని చొప్పించటానికి ప్రయత్నించారు.

జెమ్‌షెడ్‌జీ నసీర్‌వాన్‌జీ టాటా గుజరాత్‌లోని నవసారి అనే పట్టణంలో 1839, మార్చి 3వ తేదీన జన్మించారు. జెమ్‌షెడ్‌జీ తండ్రి పేరు నసీర్‌వాన్‌జీ. ముంబాయిలో పేరు ప్రఖ్యాతులుగాంచిన బ్యాంకింగ్ వ్యాపారస్తుడు. అతని పూర్వీకులందరూ పర్షియాకు చెందినవారు. మతపరమైన ఇబ్బందుల నుంచి తప్పించుకోవటానికి భారత్‌కు పారిపోయి వచ్చినవారు. అందుకే వారికి పార్సీలనే పేరువచ్చింది. పర్షియా నుంచి వచ్చిన తర్వాత కూడా వీరందరూ జొరాస్ట్రియన్ మతాన్నే గాఢంగా నమ్మేవారు.

వ్యాపారంలో వీరు గణనీయంగా రాణించటానికి వెనకున్న కారణాలను టాటా కుటుంబ చరిత్రపై కొన్ని పుస్తకాలు రాసిన ఆర్.ఎం.లాల్ విశ్లేషించారు. దీని ప్రకారం హిందు మత వ్యవస్థలో ఉన్న నిబంధనలు పార్సీలకు లేవు. ముఖ్యంగా విదేశీయానం చేయకూడదనే నిబంధన హిందూ మతస్థులపై తీవ్ర ప్రభావం చూపింది. కానీ పార్సీలకు ఆ పరిమితి లేకపోవడంతో విదేశాలలో విస్తృతంగా పర్యటించేవారు. బహుశా జెమ్‌షెడ్‌జీ ప్రపంచవ్యాప్తంగా పర్యటించటానికి, అక్కడ ఉన్న కొత్త అంశాలను భారత్‌లో ప్రవేశపెట్టడానికి కారణం ఇదే కావచ్చు..

(అందరి కన్నా భిన్నంగా ఆలోచించటం జెమ్‌షెడ్‌జీ ప్రత్యేకత. 90 శాతం భారతీయులకు కరెంట్ అంటే తెలియని రోజుల్లో జలవిద్యుత్ గురించి ఆలోచించటం.. కంపెనీలు పెట్టి లాభసాటిగా విక్రయించటం వంటి అనేక విషయాలకు ఆ రోజుల్లోనే జెమ్‌షెడ్‌జీ తెరతీశారు) తొలిసారిగా..

1868లో టాటా ముంబాయి సమీపంలో ఉన్న చించ్‌పోకిలి అనే ప్రాంతంలో అలగ్జాండ్రియా అనే కాటన్ మిల్లును ప్రారంభించారు. రెండేళ ్లపాటు లాభాలతో నడిపిన తర్వాత ఆ కంపెనీని విక్రయించారు. ఆ తర్వాత విదేశాలలో ఉన్న అత్యాధునిక పరిజ్ఞానాన్ని తీసుకురావటానికి ఇంగ్లాండ్‌కు వెళ్లారు. మళ్లీ 1877లో మహారాణి విక్టోరియా పేరిట ఎంప్రస్ మిల్స్‌ను స్థాపించారు. ఆ సమయంలో మన దేశంలో స్వదేశీ ఉద్యమం ప్రారంభ దశలో ఉంది. 'స్వదేశీ' అనే పదం భారతీయుల్లో ఒక నూతన ఉత్సాహాన్ని నింపుతోంది.

అందుకే 1877లో స్థాపించిన మరొక మిల్లుకు టాటా స్వదేశీ మిల్లు అని పేరుపెట్టారు. జెమ్‌షెడ్‌జీకి ఆ సమయంలో మన గొప్ప నాయకుల్లో ఒకరైన దాదాభాయ్ నౌరోజీ సన్నిహిత మిత్రుడు. దాదాభాయ్ ప్రభావం వల్లనే 1885లో ప్రారంభమైన భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశాల్లో జెమ్‌షెడ్‌జీ కూడా పాల్గొన్నారు. అయితే పార్టీ వ్యవస్థాపకుల్లో టాటా పేరు ఎక్కడా కనిపించదు. కానీ ఆయన పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారని, జీవితాంతం పార్టీ సభ్యుడిగా కొనసాగారని అనడానికి ఆధారాలు ఉన్నాయి.

వారసత్వం మొదలు..
జెమ్‌షెడ్‌జీ టాటా చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు దోరబ్ -టాటా సన్స్‌కు ఛైర్మన్ అయ్యాడు. పారిశ్రామిక రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం 1910లో ' నైట్‌హుడ్' బిరుదును కూడా ప్రసాదించింది. మొదటి ప్రపంచ యుద్ధం, ఆ తర్వాత ఆర్థిక మాంద్యం వంటి క్లిష్ట సమయాల్లో టాటా కంపెనీలను ఆయన సమర్థంగా నడిపించాడు.

దోరబ్ మరణానంతరం ఆయన సమీప బంధువు సర్ నౌరోజీ సక్‌లత్‌వాలా ఛైర్మన్ అయ్యాడు. ఆయన తర్వాత జేఆర్‌డీ టాటా కంపెనీ ఛైర్మన్‌గా 1938లో బాధ్యతలు స్వీకరించాడు. జేఆర్‌డీ టాటా తండ్రి ఆర్.డి. టాటా- ఈ గ్రూపును స్థాపించిన జెమ్‌షెడ్‌జీకి సమీప బంధువు. ఆర్.డి. టాటా కూడా టాటా సన్స్‌లో డైరక్టర్‌గా వ్యవహరించేవాడు. యూరప్‌లో టాటా గ్రూపు వ్యవహారాలను చూసేవాడు. అతని భార్య సుజాన్ బ్రిరీ ఫ్రెంచ్ దేశస్థురాలు. వీరిద్దరికి పుట్టిన జేఆర్‌డీ చిన్నతనం అంతా ఫ్రాన్స్‌లోనే గడిచింది.

1926లో ఆర్.డి. టాటా మరణించాడు. అతని స్థానాన్ని భర్తీ చేయటానికి జే.ఆర్.డీ.టాటా ఫ్రాన్స్ నుంచి ఇండియాకు వచ్చాడు. ఎటువంటి వ్యాపారానుభవం లేని జేఆర్‌డీని టాటా గ్రూపు ఛైర్మన్‌గా చేయటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. జేఆర్‌డీ కూడా- కొద్దిసేపు మానసికంగా తప్పుదోవ పట్టడం వల్ల డైరక్టర్లు అటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారని వ్యాఖ్యానించాడు. కాని జేఆర్‌డీని ఛైర్మన్ చేయటం వెనక రెండు కారణాలు ఉండి ఉంటాయని విశ్లేషకులు భావిస్తూ ఉంటారు. మొదటిది- జేఆర్‌డీ టాటా కుటుంబానికి చెందినవాడు కావటం.

రెండోది- డైరక్టర్లు అతనిలోని శక్తియుక్తులను ముందే గ్రహించటం. జేఆర్‌డీ 53 ఏళ్ల పాటు టాటా సన్స్ ఛైర్మన్‌గా వ్యవహరించాడు. ఆయన ఆధ్వర్యంలో గ్రూపు గణనీయంగా ఎదిగింది. 1939లో టాటా సన్స్‌లో మొత్తం 13 కంపెనీలు ఉండేవి. ఈ కంపెనీలు 290 కోట్ల విక్రయాలు జరిపేవి. 1993నాటికి (జేఆర్‌డీ పదవిని త్యజించిన రెండేళ్ల తర్వాత) ఈ గ్రూపులో 50కి పైగా కంపెనీలు ఉన్నాయి. విక్రయాల విలువ పదిహేను వేల కోట్ల రూపాయలు ఉంది. ఈ లెక్కల ఆధారంగా చూస్తే- జేఆర్‌డీ ఎంత విజయవంతమయిన నాయకుడో అర్థమవుతుంది.

ఎన్నో సమస్యలు..
1991లో టాటాసన్స్ ఛైర్మన్‌గా జేఆర్‌డీ వైదొలగాడు. రతన్‌టాటా పదవిని చేపట్టాడు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 1991 దాకా ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వమే నియంత్రిస్తూ ఉండేది. 1991లో ఆర్థిక సంస్కరణల తర్వాత అనేక మార్పులు రావటం మొదలుపెట్టాయి. ఇన్ఫోసిస్, విప్రో, ర్యాన్‌బాక్సీ వంటి కంపెనీలు మార్కెట్లోకి ప్రవేశించాయి.

వాటి వృద్ధి రేటు ఎక్కువగా ఉండేది. ఈ సమయంలో కొందరు టాటా గ్రూపు చరిత్రలో భాగమైపోయిందని కూడా భావించారు. టాటా గ్రూపును అందరూ నమ్ముతారు. ఆరా«ధిస్తారు. గౌరవిస్తారు. దేశాభివృద్ధిలో ఈ గ్రూపు పోషించిన పాత్రను అందరూ గుర్తుకుతెచ్చుకుంటూ ఉంటారు. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గ్రూపు కూడా మారాల్సిన అవసరం లేదా? గత వైభవాన్ని తలుచుకుంటూ ఉండిపోవాల్సిందేనా? ఈ ప్రశ్నలతో పాటు- టాటా గ్రూపులో ఉన్న కొన్ని మౌలిక సమస్యలు తీవ్రమయ్యాయి.

1980ల నాటికి టాటా గ్రూపులో ఉన్న డైరక్టర్లు కంపెనీలపై తమ ఆధిపత్యాన్ని చలాయించటం మొదలుపెట్టారు. కంపెనీలో పనిచేసే సిబ్బంది వారికి మాత్రమే విశ్వాసపాత్రులుగా ఉండటం మొదలయింది. అనేక కంపెనీలు కాంట్రాక్టుల కోసం ఒక దానితో మరొకటి పోటీ పడటం మొదలయింది. "కొన్ని సామంత రాజ్యాలు ఉండేవి. అందరూ తమకు నచ్చిన దారిలో వెళ్లటం మొదలుపెట్టారు. ఒకే బిజినెస్‌లో ఉన్న కంపెనీలు ఒక దానితో మరొకటి పోటీ పడటం మొదలుపెట్టాయి.

ఎవరికి తోచిన విధంగా వారు కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టడం మొదలుపెట్టారు..'' అని రతన్ టాటా ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. కంపెనీ బ్రాండ్ విషయంలో కూడా తీవ్రమైన అసందిగ్ధత ఉండేది. "మా కంపెనీ పదిహేను నుంచి ఇరవై భిన్నమైన బ్రాండులుగా ప్రజలలోకి వెళ్లేది..'' అని రతన్‌టాటా చేసిన వ్యాఖ ్యలు దీనికి నిదర్శనం. 1981లో, టాటా సన్స్ బోర్డులో సభ్యుడిగా ఉన్నప్పుడు- రతన్‌టాటా గ్రూపు మొత్తానికి ఒక వ్యూహం ఉండాలని..

దీని కోసం ఒక ప్రత్యేకమైన ఫోరం ఉండాలని ప్రతిపాదించాడు. దీనిని వివిధ కంపెనీల డైరక్టర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. తమపై అధిపత్యం కోసమే ఇలాంటి ఫోరంను ఏర్పాటు చేస్తున్నారని కంపెనీ డైరక్టర్లు భావించారు. జేఆర్‌డీ నుంచి బాధ్యతలు తీసుకున్న తర్వాత రతన్‌టాటా గ్రూపులో ఉన్న కంపెనీలకు టాటా సన్స్‌కు మధ్య సమన్వయాన్ని పెంచే చర్యలు చేపట్టారు. రతన్‌టాటా బాధ్యతలు చేపట్టే సమయానికి టాటాసన్స్‌కు- గ్రూపులో ఉన్న వివిధ కంపెనీలలో ఉన్న వాటా గణనీయంగా తగ్గిపోయింది. ఒక దశలో స్టీలును తయారుచేసే కంపెనీ టిస్కోలో టాటా సన్స్ వాటా కన్నా బిర్లాల వాటా ఎక్కువగా ఉండేది.

అంతే కాకుండా టాటా కుటుంబానికి టాటాసన్స్‌లో ఉన్న వాటా కూడా 1.5 శాతానికి పడిపోయింది. టాటాసన్స్‌లో ప్రముఖ వాణిజ్యవేత్త పలోంజి మిస్త్రీీ వాటా 17.5 శాతం ఉండేది. "ప్రస్తుతం మాకు ఈ కంపెనీలను న డిపే నైతికమైన హక్కు ఉండొచ్చు. కానీ చట్టపరమైన హక్కు మాత్రం లేదు'' అని రతన్‌టాటా చేసిన వ్యాఖ్యలు ఈ పరిస్థితికి అద్దం పడతాయి. రతన్‌టాటా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని కంపెనీలలోను టాటా సన్స్ వాటాను 26 శాతానికి పెంచటానికి చర్యలు తీసుకున్నాడు.

Friday, August 13, 2010

ఎవరప్పా అనొద్దు 'మర్యాద'గా ఉండదు

ఆయన టేబుల్ మీద ఒక క్యాలెండర్ ఉంది. దానిలో జూలై నెల పేజీలో చంద్రమండలం ఫొటో ఉంది. అక్కడున్న ఒక సైన్‌బోర్డును చూస్తుంటాడు ఆస్ట్రోనాట్. దాని మీద 'దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు నాగినీడు' అని ఉంటుంది. 'అరె వాళ్లకా విషయం ముందే ఎలా తెలిసింది సార్' అంటే నాగినీడు నవ్వేశారు. ఎవరీ నాగినీడు అని ఇప్పుడు మీరడిగితే ఏ మాత్రం 'మర్యాద'గా ఉండదు. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత తెలుగు సినిమా కనుగొన్న సరికొత్త విలన్ ఆయన. 'మర్యాదరామన్న'లో అప్పా అప్పా అంటూ గొంతులు రోసిన రామినీడు.

డజన్లకొద్దీ ఫాక్షన్ సినిమాలు వస్తున్నప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడబ్బా అనుకోకుండా ఉండలేం ఈ అచ్చమైన రాయలసీమ విలన్‌ను చూసినపుడు. నిజానికి ఆయన ఎక్కడో లేడు. సినిమా పనులన్నీ జరిగే ప్రసాద్ ల్యాబ్స్‌లోనే మేనేజర్ కుర్చీలో కూర్చుని ఉన్నాడు. మర్యాదరామన్న వచ్చాకే ఆయన పేరు అందరికీ తెలిసింది. ఇప్పుడు ఆయన డైలాగులు తెలియని వాళ్లు లేరు.

"రా అప్పా.. మా ఆతిథ్యం స్వీకరిద్దువుగానీ'' అనే పిలుపులో ఆప్యాయత. "ఇడిసిపెట్టను. ఆడు గడప దాటి అడుగు బయట పెట్టిన క్షణమే తలా మొండెం వేరవ్వాల... ఇరవై అయిదు సంవత్సరాలుగా ఎదురుచూస్తాండాం. ఇంకొక్క గడియ ఆగలేమా?'' ఆ మాటలో రగిలే పగ.

"రాత బాగుంటే కత్తుల్తో పొడిసినా బాంబులేసినా సావరప్పా. బాగోపోతే చిన్న బ్లేడు ముక్క సాలు మన ప్రాణాలు పోవడానికి'' అంటున్నప్పుడు ఆ కంఠంలో చిన్న విలన్'తత్వం'.

సినిమా చూసి థియేటర్ నుంచి బయటికి వస్తున్న ప్రేక్షకులు కూడా చాలామంది అచ్చు నాగినీడు యాసలోనే "ఏమప్పా! సినిమా ఎట్టాఉండాది?'' అని పలుకరించుకుంటున్నారంటే ఎంత ప్రభావమో చూడండి. ఏదో ఫ్రెష్‌లుక్. 'క్షణక్షణం'లో పరేష్ రావెల్.. 'అంత:పురం'లో ప్రకాష్‌రాజ్.. 'సై'లో ప్రకాష్ రావత్‌ని చూస్తున్న ఫీలింగ్.

కాదు కాదు.. అంతకు మించి ఏదో కొత్తదనం. ఫ్యాక్షన్ నేపథ్య సినిమాల్లో విలన్లుగా పరిచయమైన వారికి మించిన తెలుగుదనం. నుదుట కుంకుమబొట్టు, సగం నెరిసిన జుత్తు, బూడిద రంగు బూర మీసాలు, మెళ్లో బంగారు గొలుసు, పెద్ద రుద్రాక్షమాల, సీమ సంప్రదాయ దుస్తుల్లో కొత్తగా కనిపించారు నాగినీడు. అదంతా రమారాజమౌళి పుణ్యమట.

1967లో ఒకరోజు...
కృష్ణా జిల్లా కలవపాముల గ్రామంలో ఒక ఇంటి డాబాపైన పదిమంది పిల్లలు గుమికూడారు. అందులో ఒక అబ్బాయి అప్పుడే విడుదలైన శ్రీకృష్ణావతారం సినిమా డైలాగులు పొల్లుపోకుండా చెబుతున్నాడు. అది చూసిన మిగిలిన పిల్లలు గంతులేస్తూ చప్పట్లు కొడుతున్నారు. వంటగదిలోకి వినిపిస్తున్న ఆ చప్పుడుకు "ఒరేయ్! బడవల్లారా ఏంట్రా ఆ అల్లరి? వస్తున్నా ఉండండి'' అని ఒకావిడ అరిచింది. అది వినగానే వాళ్లు చెల్లాచెదురుగా పరుగు తీశారు.

ఎన్టీఆర్ డైలాగులు చెప్పిన పిల్లాడి చెవి దొరకబుచ్చుకుని "డైలాగులు బాగా చెబుతున్నావే. సినిమాలోకెళ్లు మంచి హీరో అవుతావు'' అంది. ఆవిడ ఆ పిల్లాడి తల్లి. అంటే నాగినీడు వాళ్ల అమ్మ. వారు ఎల్వీ ప్రసాద్‌కు దగ్గరి బంధువులు. సినిమాల్లోకి వెళ్లాలనుకుంటే ఈజీగా వెళ్లి ఉండొచ్చు. కాని వెళ్లలేదు.

సినిమా పాఠాలు
"నటనలో అనుభవం ఎలా వచ్చింది? ఏదైనా ఇనిస్టిట్యూట్‌లో నేర్చుకున్నారా'' అని అడిగితే నాగినీడు ఇలా చెప్పారు. ఎల్‌కేజి : చెన్నకేశవరెడ్డి సినిమాలో మొదటి వేషం. ఒక రాజకీయనాయకుని పాత్ర. దర్శకుడు వి.వి. వినాయక్ నాకు ఎల్‌కెజీ పాఠాలు నేర్పారు.

గ్రాడ్యుయేషన్ : తమిళ దర్శకుడు తంగర్ బచ్చన్ పల్లికూడం సినిమాలో ఒక కీలకపాత్ర ఇచ్చి నన్ను 'గ్రాడ్యుయేట్'ని చేశారు. ఆ సినిమాకు తమిళనాడు స్టేట్‌ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది.

ఉద్యోగం : 'పల్లికూడం'లో నా నటన చూసి మర్యాదరామన్నలో విలన్‌గా నాకు 'ఉద్యోగం' ఇచ్చారు రాజమౌళి. కొత్తరకం విలన్

షూటింగ్ మొదటిరోజే ఆ పాత్రకు మంచి స్పందన వస్తుందని అందరూ జోస్యం చెప్పారట. అదే నిజమైంది. స్క్రిప్టులో ఉన్న డైలాగులను తనే స్వయంగా సీమ యాసలోకి మార్చుకుని చెప్పి రామినీడు పాత్రకు జీవం పోశారు ఆయన. తెలంగాణా భాషలో డైలాగులు చెప్పడానికి రెడీ అంటున్నారు. భవిష్యత్తులో విలన్ పాత్రలే వేస్తారా అని అడిగినప్పుడు "చాలామంది పోలీసు అవ్వాలనుకుంటారు. కానీ రౌడీ కావాలని ఎవరూ కోరుకోరు.

అలాగే సినిమాల్లో రావాలనుకునేవారు హీరో అవ్వాలనే కోరుకుంటారు కానీ కేవలం విలన్ అవ్వాలని కోరుకోరు. ఒకప్పుడు విలన్లుగా పేరుపొందిన కోట శ్రీనివాసరావు, జయప్రకాశ్ రెడ్డి ఇప్పుడు విలన్లకంటే వేరే పాత్రలు ఎక్కువగా వేస్తున్నారు. హీరోయిన్లలాగ విలన్లు కూడా ఎక్కువకాలం కొనసాగలేరు. నటునికి ఏదైనా చేయగలననే నమ్మకం ఉండాలి కానీ, కేవలం అదే చే స్తాననే హద్దులు ఉండకూడదు.'' అని ముగించారు నాగినీడు.
జూ బీరెడ్డి నగేష్‌రెడ్డి
ఫొటో : జి. భాస్కర్

Thursday, August 12, 2010

పెట్స్ కోసం లండన్ టు ఢిల్లీ బైరోడ్

ఒక జీపు..
ఇద్దరు వ్యక్తులు..
15 దేశాలు..
51 రోజులు..
13,500 కిలోమీటర్లు..
లండన్ నుంచి న్యూఢిల్లీ వరకు..
అంతా రోడ్డు ప్రయాణమే.

పెంపుడు జంతువుల కోసం ఒక జంట జరిపిన అవగాహన యాత్ర ఇది. లండన్‌లో నివసిస్తున్న తుషార్, పూజ దంపతులు ఈ వినూత్న ప్రయాణం చేసి ఎన్నో అనుభవాలు మూటగట్టుకున్నారు. ఆ మహాయాత్రలోని కొన్ని మైలురాళ్లను ఇమెయిల్ ద్వారా ఇలా పంచుకున్నారు.

ప్లాన్ ఎ
లాంగ్ డ్రైవ్ అందరికీ ఒక కల. ఆ కలకు ఒక ప్రతిఫలం ఉండాలి. అది చరిత్రలో నిలిచిపోవాలి. అప్పుడే మనస్సుకు తృప్తి. పడ్డ కష్టానికి ప్రయోజనం. పెంపుడు జంతువుల పట్ల అవగాహన కల్పించడంతో పాటు ఢిల్లీకి చెందిన ఫ్రెండికోస్ స్వచ్ఛంద సంస్థ కోసం నిధులు సేకరించటం మా యాత్ర ఉద్దేశ్యం. పదిహేను దేశాల మీదుగా ప్రయాణం అంటే అంత సులువు కాదు.

రూట్ మ్యాప్ సరిగ్గా ఉండాలి. వీసాలు, పర్మిట్లు, వెహికిల్, ఇన్సూరెన్స్, వసతి, వనరులు, ఆహారం.. ఇన్ని చూసుకోవాలి. ఆరునెలల పాటు ఇంటర్‌నెట్‌లో సర్చ్‌చేసి ఒక ప్లాన్ రూపొందించాం. వీసాలు, పర్మిట్లు, ఇన్సూరెన్స్‌లు, కార్నెట్లు, స్పాన్సర్లను రెడీ చేసుకోవడానికి తలప్రాణం తోకకొచ్చింది.

ప్లాన్ బి
మాకు అన్ని సదుపాయాలూ ఉండే ఒక వాహనం కావాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది దాని ధర. ఎందుకంటే ఫారిన్ వెహికిల్ ఇండియాలో తిరగాలంటే కార్నెట్ డి ప్యాసెజ్ డాక్యుమెంట్ ఉండాలి. అందుకోసం వాహనం ధరలో 15శాతం సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. చాలా వాహనాలు పరిశీలించిన తర్వాత చెరోకీ 2.5 లీటర్ స్పోర్ట్ జీప్‌ని ఎంపికచేశాం.

దానికి గూఫీ అని పేరు పెట్టాం. అది ఢిల్లీలోని మా కుక్క పేరు. ఆహారం, మందులు, ఎంపీ3 సీడీలు, జెర్రీ క్యాన్లు, పోర్టబుల్ కిచెన్, పోర్టబుల్ టాయ్‌లెట్, ల్యాప్‌ట్యాప్, డిజిటల్ కెమెరా, వీడియోక్యామ్, ఛార్జర్లు అన్నీ జీపులో ఎక్కించేందుకు 12 బ్యాగులు రెడీ చేసుకున్నాం.

డే1 : ఏప్రిల్ 17, 2010 ఉ. 7.15, మెహు యానిమల్ సెంటర్, లండన్
ఇండియన్ హై కమిషన్ ఫస్ట్ సెక్రటరీ జితేందర్‌కుమార్ జెండా ఊపి మా జర్నీని ప్రారంభించారు. డోవర్ మీదుగా ఫ్రాన్స్‌లోని డన్‌కిర్క్‌లో ల్యాండ్ అయ్యాం. ఆదిలోనే హంసపాదు అన్నట్లు జిపిఎస్ పనిచేయడం మానేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. మేం తప్పుగా వెళ్తున్నట్లు అర్థమౌతోంది. అట్లస్ వెతుకుదామంటే అది వెనక ఏ బ్యాగ్‌లో ఉందో తెలియదు.

ఎలాగోలా బెల్జియం చేరుకున్నాం. యాంట్‌వర్ప్‌లో జంతువుల కోసం పనిచేస్తున్న ఆస్త సంస్థని కలిశాం. వారు మాకు రెండు బస్తాల జంతువుల ఆహారం ఇచ్చారు. మా జిపిఎస్ పనిచేయడం మొదలెట్టింది. నైస్ పీపుల్. ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్ మీదుగా రాత్రి 11.30కి ఫ్రాంక్‌ఫర్ట్ చేరుకున్నాం. రాత్రి అక్కడే బసచే శాం.

డే 13 : ఏప్రిల్ 29, 2010
ఉక్రెయిన్‌లో ఉన్నాం. ఇది ఇంత పెద్ద దేశం అనుకోలే దు. ఇప్పటివరకు ఈ దేశంలో 1600 కిలోమీటర్లు ప్రయాణించాం. కీవ్ నుంచి ఖార్కివ్ వెళ్తున్నప్పుడు మధ్యలో లంచ్ కోసం ఆగాం. ఆ కేఫ్‌లో ఎవరూ ఇంగ్లిష్‌లో మాట్లాడడం లేదు. మెనూ కూడా రష్యన్ భాషలో ఉంది. రష్యన్ టు ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ బుక్ చూసి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం. డిమిత్రో మా ఉక్రెయినీ ఫ్రెండ్.

రాత్రికి వాళ్లింటికి డిన్నర్‌కి తీసుకెళ్లాడు. డిమ్ మంచి యానిమల్ లవర్. ఉక్రెయినియన్లు కూడా జంతువులను చాలా ఇష్టపడతారని డిమ్ చెప్పాడు. మేం ఇప్పుడు ఉక్రెయిన్ - రష్యా బార్డర్ దాటుతున్నాం. ఉదయాన్నే ఓల్గోగ్రాడ్ చేరుకుంటాం. మాకు చాలాసంతోషంగా ఉంది. ఎందుకంటే అక్కడ మా అమ్మనాన్నలుంటారు. రష్యా నుంచి కజఖస్తాన్ వరకు మాతో వస్తారు. ఓహ్ మళ్లీ ఇంటిభోజనం తినబోతున్నాం.

డే 28 : మే 14, 2010
ఉజ్బెకిస్తాన్ గుండా వెళ్తూ ఖివా, బుఖారా, సమర్కండ్ లాంటి చరిత్రాత్మక ప్రదేశాలు చాలా చూశాం. సమర్కండ్‌లో బాబర్ తాత అమీర్ తైమూర్ విగ్రహాలు చాలా ఉన్నాయి. ఢిల్లీని, ఆ చుట్టుపక్కల ప్రాంతాలను కొల్లగొట్టిన ఆయన ఉజ్బెకిస్తాన్‌లో మాత్రం హీరో. ఆయన ధైర్యసాహసాల గురించి కథలు కథలుగా చెబుతుంటారు.

బుఖారాలో మేం కేథరిన్‌ని కలిశాం. ఆమె అజర్‌బైజాన్ బ్రిటిష్ ఎంబసీలో పనిచేస్తోంది. ముంబాయి బ్రిటిష్ ఎంబసీలో పనిచేస్తున్నప్పుడు దత్తత తీసుకున్న 'స్పైక్' అనే పిల్లిని అజర్‌బైజాన్‌కు తెచ్చుకుంది. ఇక్కడ ఎవరైనా సారీ చెప్పేటప్పుడు కుడిచేయిని గుండెలపై పెట్టుకుని చెబుతారు.

ఉజ్బె కిస్తాన్ మర్యాదలు.. కజఖస్తాన్ ఒంటెపాలు
'లండన్ టు ఢిల్లీ భై రోడ్' కంటే ముందు విషయాలు చెప్పండి.
'లండన్ టు ఢిల్లీ బై రోడ్' కల ఎప్పటి నుంచో ఉంది. దీనికోసం మేం ఒక సంవత్సరం పాటు రీసెర్చ్ చేశాం. ముందు ప్లాన్ చేసుకున్నదానికి, బయలుదేరే ముందు ప్లాన్‌కి చాలా మార్పులు జరిగాయి.

ఫ్రెండికోస్ గురించి రెండు మాటలు?
పెంపుడు జంతువుల కోసం 1979 నుంచి పనిచేస్తున్న నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అది. ఈ జర్నీ ద్వారా మేం ఆరు వేల డాలర్ల ఫండ్స్ కలెక్ట్ చేశాం. దక్షిణ దేశాల వారితో పోల్చుకుంటే మన దేశంలో పెంపుడు జంతువుల పట్ల అంతగా అవేర్‌నెస్ లేదు.

రకరకాల దేశాల్లో రకరకాల మనుషుల్ని చూశారు కదా. మీకేం అనిపించింది? ఎన్నో ప్రతికూలతలున్నా చాలామంది ఎంత సంతోషంగా జీవిస్తున్నారో చూశాం. టిబెట్ లాంటి ప్రాంతంలో టాయ్‌లెట్స్‌లాంటి కనీస సదుపాయలు లేకపోయినా వారంతా ఎంతో ఆనందంగా బతుకుతున్నారు.

మీకు ఎప్పటికీ గుర్తుండి పోయే ఒక ఐదు విషయాలు చెప్పండి.
1. ఉజ్బెకిస్తాన్ వారి అతిథి మర్యాదలు మరువలేనివి.
2. టిబెట్‌లో 16,400 అడుగుల ఎత్తయిన కొండమీది నుంచి ప్రయాణిస్తున్నప్పుడు పూజకు ఊపిరాడలేదు. కిందికి వచ్చాక ఆక్సిజన్ మాస్క్ పెట్టుకునే వరకు ఇబ్బంది పడింది. రాత్రి మూడు గంటలప్పుడు కారు ఆగిపోయింది. ఏం చేయాలో అర్థంకాలేదు. లక్కీగా వెంటనే స్టార్ట్ అయిందనుకోండి. కానీ అది ఓ భయంకరమైన రాత్రి.
3. కజఖస్తాన్‌లో గుర్రం, ఒంటె పాలు తాగడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
4. ప్రతిదేశంలోనూ పోలీసులు, కస్టమ్స్ అధికారులు ఆపడం మాకు రొటీన్ అయిపోయింది. అఫ్‌కోర్స్ ఒకదశలో దాన్ని కూడా ఎంజాయ్ చేశామనుకోండి.
5. నేపాల్ ఇండియా బార్డర్‌లో 'వెల్‌కమ్ టు ఇండియా' అనే సైన్ బోర్డు చూసిన క్షణం.

డే 35 : మే 21, 2010
చైనాలో ఉన్నాం. ఇప్పటికి 8000 కిలోమీటర్లు ప్రయాణించాం. మ్యాప్ చూస్తూ "వుయ్ ఆర్ హియర్'' అని గర్వంగా ఫీలయ్యాం. కానీ అసలైన ఛాలెంజ్ అప్పుడే మొదలైంది. మీరు ఊహించగలరా? జీపులో అంత ఎత్తయిన పర్వతాన్ని ఎక్కడం! బయటి ఉష్ణోగత్ర 15 డిగ్రీలుంది. ప్రకృతి అందాలను చూస్తూ సరదాగా ఫొటోలు తీస్తూ వెళ్తున్నాం.

సడన్‌గా ఎవరో స్విచ్ఛాప్ చేసినట్లు ఉష్ణోగ్రత ఒక్కసారిగా సున్నా డిగ్రీలకు పడిపోయింది. సూర్యుడి స్థానంలో నల్లని మేఘాలొచ్చాయి. మంచు కురవడం మొదలైంది. రోడ్డు కనిపించడం లేదు. జారే బురదలో జీపు నడపడం కష్టంగా ఉంది. ఇప్పుడు మేం 10,500 అడుగుల ఎత్తయిన కొండపైన ఉన్నాం. ఓష్ నుంచి సారిటాష్‌కు వెళ్తున్నాం. సాహసం చేస్తున్నట్లుగా ఉంది.

డే 45 : మే 31, 2010
నేను పూజని. నిన్ననే నేపాల్ చేరుకున్నాం. మొన్న సగాలో చైనీస్ టీవీలో చూశాను. ఒక డాక్టర్ పాములతో మసాజ్ చేస్తారట. అది వింటేనే ఒళ్లు జలదరిస్తుంటే ఇక స్నేక్ వైన్ గురించి? పెద్ద వైన్ బ్యారెల్‌లో రెండు మూడు పాముల్ని వేస్తారట.

40 రోజుల తర్వాత తీస్తే స్నేక్ వైన్ రెడీ. మరి పాములు బతికుంటాయో లేదో తెలియదు. సరే.. ఆ విషయం వద్దుగానీ మేం చైనా బార్డర్ దాటుతున్నప్పుడు ఆర్మీవాళ్లు మా కెమెరాలోని ప్రతి ఫొటోని చూశారు. మా ప్రతి బ్యాగ్‌ని చెక్‌చేశారు. త్వరలో మేం ఢిల్లీ చేరుకోబోతున్నాం. ప్రతి రోజూ (బ్లాగ్) మమ్మల్ని ఫాలో అవుతూ ప్రోత్సహిస్తున్నందుకు మీకందరికీ థ్యాంక్స్.

డే 51 : జూన్ 6, 2010
మళ్లీ నేనే పూజను. యస్... మేం సాధించాం. మా కల నెరవేరింది. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని కుతుబ్‌మినార్ దగ్గరికి చేరుకున్నాం. 15 వందల లీటర్ల పెట్రోలు, 9 టైమ్‌జోన్లు, లెక్కలేనన్ని అనుభవాల తర్వాత 51వ రోజు ఇక్కడున్నాం. ఈ ఆనందాన్ని ఎలా పంచుకోవాలో అర్థం కావడం లేదు. మీడియా వాళ్లు చుట్టుముట్టారు.

కెమెరా ఫ్లాష్‌లైట్లు టకటకా వెలుగుతున్నాయి. నాకైతే తుషార్‌ని మళ్లీ పెళ్లి చేసుకుంటున్నట్లుగా ఉంది. ఫ్రెండికోస్ కోఫౌండర్ గౌతమ్ భరత్ మాతో ఉన్నాడు. ఈ జర్నీ ఇంతటితో అయిపోలేదు. మా అనుభవాలన్నీ పుస్తకంగా రాయబోతున్నాం. 

-బీరెడ్డి నగేష్ రెడ్డి

Tuesday, August 10, 2010

సమాజ హితుడు

చాలామంది 'ఈ సమాజం నాకేమిచ్చింది?' అని ఆలోచిస్తారు. కొద్దిమంది మాత్రమే 'ఈ సమాజానికి నేనేం చేశాను?' అని ఆలోచిస్తారు. అలాంటి కొద్దిమందిలో యువ ఇంజనీరు సుబ్రత దత్తా కూడా ఒకరు.

లేకపోతే ఇంత చిన్న వయస్సులోనే ఈయనకు ఇన్ని పెద్ద ఆలోచనలు ఎలా వస్తాయి? ఆ ఆలోచనలు ఆయన జీవితాన్ని మారుస్తాయో లేదోగాని మన జీవితాన్ని మాత్రం మరింత సౌఖ్యవంతం చేయగలవు. సుబ్రత రూపొందించిన వర్చువల్ ఇన్వర్టర్ అనే పరికరం కనుక అందరికీ అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో విద్యుత్తు కోత అనే పదం ఎక్కడా వినిపించదు మరి.

సాధారణంగా చాలామందికి వృత్తి, ప్రవృత్తి వేరు వేరుగా ఉంటాయి. కానీ సుబ్రత దత్తాకి వృత్తి, ప్రవృత్తి ఒక్కటే. అదే పరిశోధించడం, అందుకు అవసరమైన ఆలోచనలు చేయడం. ఆఫీసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా ఒకటే ఆలోచన ఎడతెగని విద్యుత్తు ప్రవాహం మాదిరిగా. కోల్‌కతాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చేసిన సుబ్రత దత్తా ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలోని రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగంలో పనిచేస్తున్నారు. ఇటీవల ఈయన వర్చువల్ ఇన్వర్టర్ అనే పరికరాన్ని రూపొందించారు. చూడటానికి అగ్గిపెట్టె పరిమాణంలో ఉన్నప్పటికీ పనితీరులో మాత్రం ఇది అగ్గిబరాటాయే! వర్చువల్ ఇన్వర్టర్ అంటే? సాధారణంగా బయట మార్కెట్‌లో లభించే ఇన్వర్టర్లు కరెంటు పోగానే అందుకు ప్రత్యామ్నాయంగా పని చేయడం ప్రారంభిస్తాయి. వీటిలో అమర్చబడి ఉండే బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి వచ్చే అవుట్‌పుట్ సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. కానీ ఈ వర్చువల్ ఇన్వర్టర్ అలా కాదు.

అగ్గిపెట్టె పరిమాణంలో ఉండే ఈ బాక్స్ విద్యుత్తు ప్రవాహంలోనే ఒక భాగంగా ఉండి పని చేస్తుంది. ప్రతి ఇంట్లో, కార్యాలయంలో విద్యుత్తు మీటరుకు పక్కనే ఈ వర్చువల్ ఇన్వర్టర్ అమర్చబడి ఉంటుంది. ఇవి ఆయా ప్రాంతాల్లోని విద్యుత్తు సబ్‌స్టేషన్లకు రేడియో ఫ్రీక్వెన్సీ లింక్ ద్వారా అనుసంధానమై ఉంటాయి.

ఎలా పని చేస్తుంది?
సాధారణంగా విద్యుత్తు కోత అనేది అన్ని ప్రాంతాలలో ఒకేసారి అమలు కాదు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో అమలవుతూ ఉంటుంది. దీనికి కారణం వినియోగానికి అవసరమైన మేరకు విద్యుదుత్పాదన లేకపోవడమే. సరిగ్గా ఇక్కడే వర్చువల్ ఇన్వర్టర్ రంగంలోకి దిగుతుంది. ఇది విద్యుత్తును ఉత్పత్తి చేయదుకానీ విద్యుత్తు లోడును నియంత్రిస్తూ ఉంటుంది.

ప్రధాన విద్యుత్తు లైను నుంచి వచ్చే విద్యుత్తును ఈ వర్చువల్ ఇన్వర్టర్ గ్రహించి దాన్ని హై, లో విద్యుత్తు లైన్లుగా విడగొడుతుంది. సాధారణంగా మనం ఇళ్లలో, కార్యాలయాలలో ఉపయోగించే ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు, టివి, సెట్‌టాప్ బాక్స్, మొబైల్ ఛార్జర్, ల్యాప్‌టాప్.. అన్నీ తక్కువ విద్యుత్తుతోనే పని చేస్తాయి. విండో ఏసి, ఫ్రిజ్, ఐరన్ బాక్స్, వాషింగ్ మెషిన్, మైక్రోవేవ్ ఓవెన్ విత్ గ్రిల్, సబ్‌మెర్సిబుల్ పంప్..

వీటికి మాత్రమే అధిక విద్యుత్తు అవసరం అవుతుంది. అయితే వాటిని మనం ప్రతి రోజూ, ఇరవై నాలుగు గంటలూ ఉపయోగించం. వీటిని వినియోగించే సమయంలో మాత్రమే విద్యుత్తు అధిక లోడు అవసరమవుతుంది. తక్కువ విద్యుత్తు లోడు ఉన్నట్లయితే ఈ పరికరాలు పని చేయవు. కాబట్టి విద్యుత్తు లోడుకు తగ్గట్లుగా వర్చువల్ ఇన్వర్టర్‌లో ఉండే ఒక స్విచ్ విద్యుత్తును నియంత్రిస్తూ ఉంటుంది.

ఉపయోగం ఏమిటి?
వర్చువల్ ఇన్వర్టర్ ఉండడం వల్ల రాత్రీ పగలు, ఇరవై నాలుగు గంటలూ అత్యవసరాలైన విద్యుత్తు లైట్లు వెలుగుతూనే ఉంటాయి. ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి. దీంతో వేసవి కాలంలో సైతం విద్యుత్తు కోత అన్నది ఉండదు. లాంతర ్ల వెలుగులో చదువులు, ఉక్కపోత, దోమల బెడద, కలత నిద్ర ఇలాంటివేమీ ఉండవు.

ఎప్పుడు కావాలంటే అప్పుడు కంప్యూటర్లూ, ల్యాప్‌టాప్‌లూ పనిచేస్తుంటాయి. సెల్‌ఫోన్ల ఛార్జింగ్‌కు కూడా ఎలాంటి ఆటంకం ఉండదు. దీంతో ఇంధన వినియోగం తగ్గుతుంది. ఫలితంగా వాతావరణ కాలుష్యం కూడా ఉండదు. భూతాపం కూడా తగ్గుతుంది. ఏ సమాజానికైనా ఇంతకంటే ఏం కావాలి చెప్పండి.

నా కర్తవ్యం నిర్వర్తించా..
అయితే దీనిమీద పేటెంట్‌కు దరఖాస్తు చేస్తున్నారా? అన్న ప్రశ్నకు.. నవ్వుతూ "ఈ వర్చువల్ ఇన్వర్టర్లను భారీ ఎత్తున ఉత్పత్తి చేసి, డబ్బు గడించాలనేది నా కోరిక కాదు. అలాగే ఈ ఆవిష్కరణతో నేనేదో గొప్ప శాస్త్రవేత్తను అయిపోదామనీ కాదు, నాకున్న తెలివిని ఉపయోగించి నేనొక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశాను.

దీనివల్ల మొత్తం సమాజానికే లాభం కలుగుతుంది. ఇలాంటి ఆవిష్కరణలను ప్రభుత్వాలు అందిపుచ్చుకోవాలి. అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. అప్పుడే వాటికి సార్థకత..'' అని వ్యాఖ్యానించారు దత్తా. మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? అన్న ప్రశ్నకు "ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాను.

విద్యుదుత్పత్తి, నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉండడంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు నా ఆవిష్కరణ గురించి, దాని వల్ల కలిగే మేలు గురించి లేఖలు రాస్తున్నాను. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మంచి స్పందన వచ్చింది. మరికొందరు పట్టించుకోలేదు.. చూద్దాం ఏం జరుగుతుందో..'' అని చెప్పారు.

ఇదే తొలి ఆవిష్కరణా?
కాదు.. సుబ్రత దత్తా ఇప్పటికే దాదాపు పది వినూత్న ఆవిష్కరణలు చేశారు. వాటిలో మంచినీటిని, విద్యుత్తును ఆదా చేసే పరికరాలు కూడా ఉన్నాయి. ఈయన రూపొందించిన అతి చిన్న ఫ్రిజ్ నిమిషం వ్యవధిలోనే ఐస్ తయారు చేస్తుంది. మధుమేహ రోగులు తీసుకునే ఇన్సులిన్‌లాంటి మందు ఎల్లప్పుడూ ఫ్రిజ్‌లోనే ఉండాలి.

అలాగే ప్రస్తుతం మార్కెట్‌లో లభించే మరికొన్ని రకాల మందులకు కూడా చల్లని వాతావరణం అవసరమవుతుంది. ఇలాంటి వారికి ఈ బుల్లి ఫ్రిజ్ బాగా ఉపయోగపడుతుంది. దూర ప్రయాణాలలోనూ దీనిని చెంతనే ఉంచుకోవచ్చు. "ఇలాంటివే మరికొన్ని ఆవిష్కరణలు.. సమాజం పట్ల నాకున్న బాధ్యతకు నిదర్శనాలు..'' అంటారాయన.

వ్యక్తిగా..
చివరగా మీ గురించి చెప్పండని అడిగితే.. "ఏముంటుంది నా గురించి చెప్పుకోడానికి? ఏదో సాధించేశాననే పబ్లిసిటీ కూడా నాకిష్టముండదు. నేనేమైనా ఐన్‌స్టీన్‌నా? డార్విన్‌నా? ఒక సాధారణ పరిశోధకుడిని- అంతే. భార్య, ఒక్కతే కూతురు.. మధ్యతరగతి కుటుంబం. మధ్యతరగతి కుటుంబాలలలో పుట్టిన చాలామందికి ఎదురయ్యే కష్టాలే నాకూ ఎదురయ్యాయి.

అయితే కష్టాలు పడడం వేరు, కష్టపడడం వేరు. ఈ భూమ్మీదకు మనం ఎలా వచ్చామో మనకు తెలుసు. కానీ ఎందుకొచ్చామో ఎవరికి వారు ఆలోచించుకోవాలి. వచ్చినందుకు తోటి వారికి, సమాజానికి ఉపయోగపడే పనేదైనా చేయాలి. అదీ నా ఆకాంక్ష.. అందుకే నా ఈ ఎడతెగని శోధన.. పరిశోధన..'' అంటూ ముగించారు దత్తా.
- వై.రమేష్‌బాబు
ఫోటోలు: లవకుమార్

Monday, August 9, 2010

తుపాన్లు వస్తే సూరిని పిలవండి...!

బంగాళాఖాతం నడి సముద్రంలో చిక్కుకున్న ఒక పెద్ద నౌకను, హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని ఓ పాత అండర్‌గ్రౌండ్ సెల్లార్‌లో కూర్చుని కాపాడగలమా..?

మన రాష్ట్రం నుంచి ఒక బృందం వెళ్లాకే, తుపానులో చిక్కుకున్న ఒరిస్సా ముఖ్యమంత్రి బయటి ప్రపంచంతో మాట్లాడి ఊపిరి పీల్చుకున్నారంటే ఆశ్చర్యం వేయదా..?

దివిసీమ తుపాను వల్ల భారీ ప్రాణనష్టం కలిగిందని కలెక్టర్ చెప్పకముందే, ఢిల్లీ నుంచి ఇందిరాగాంధీయే నేరుగా వరద బాధితులతో మాట్లాడటం సాధ్యమేనా..?

తుపానుతో అన్ని సంబంధాలు తెగిపోయినప్పుడు ఇదెలా సాధ్యం! మీలాగే మాక్కూడా ఆసక్తి కలిగింది ఎస్.సూరి మాట్లాడుతున్నంత సేపూ. అరవై ఏళ్లు దాటిన ఆయన ఒక్కో అనుభవాన్ని విప్పుతుంటే, గంటలు నిమిషాల్లా దొర్లిపోయాయి. ఖైరతాబాద్ రాజ్‌భవన్ రోడ్డులో ఎకరా విస్తీర్ణంలో ఉంది 'ద నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో'. దానికి జన్మనిచ్చి, ప్రాణంపోసి మన దేశం తలెత్తుకొనేలా చేశారు ఎస్.సూరి. వర్షాకాలంలో ఆయన అవసరం మనకు చాలా ఉంటుంది.

"మాకప్పుడు ఆఫీసు కూడా లేదు. మాసబ్‌ట్యాంకు దగ్గర ఓ చిన్న సెల్లార్‌లో హ్యామ్ రేడియో క్లబ్ ఉండేది. 'నౌక చెడిపోయి బంగాళాఖాతంలో ఇరుక్కుపోయాం. కమ్యూనికేషన్ తెగిపోయింది. మాకున్న ఏకైక ఆధారం ఈ హ్యామ్ రేడియోనే. మీ సిగ్నల్ తగిలింది. దయచేసి మా ప్రమాదాన్ని ప్రపంచానికి చెప్పి, రక్షించండి..' అన్నారు నౌకలోని బాధితులు.

క్షణాల్లో నేను డిఫెన్స్ మినిస్టర్‌కు సమాచారం పంపించాను. విశాఖ కలెక్టర్‌కూ చెప్పేశాను. మరుసటి రోజుకు కూడా సముద్రంలో బతికే ఉన్నారు వాళ్లు. ఆలస్యంగానైనా స్పందించిన ప్రభుత్వం.. అండమాన్ నుంచి షిప్పులను పంపించి నౌకలోని వ్యక్తులను కాపాడింది. ఇదొక సంఘటన. ఆ మధ్య అండమాన్ దీవులను సునామీ ముంచెత్తింది. హైదరాబాద్ నుంచి వెళ్లిన భారతి హ్యామ్ రేడియో ద్వారా అన్ని దేశాలకు చెబుతోంది.

నాతో కూడా మాట్లాడుతున్న సమయంలోనే వాళ్ల గది కూలిపోయింది. కరెంటు పోయింది. ఫోన్‌లైన్లు, సెల్‌టవర్లు ధ్వంసమయ్యాయి. నేను మళ్లీ ట్రై చేస్తే హ్యామ్‌రేడియోకు మాత్రం సిగ్నల్ తగిలింది. కొద్దిసేపటికి దాని బ్యాటరీ కూడా అయిపోయింది. అక్కడే ఉన్న ఓ కారు బ్యాటరీకి, రేడియోకు కనెక్షన్ ఇచ్చి, సునామీ తీవ్రతను నాకు చెప్పిందామె.

నేను ప్రభుత్వ అధికారులను అప్రమత్తం చేశాను. కమ్యూనికేషన్‌లేని దీవులకు హెలికాప్టర్‌లో మా బృందాన్ని పంపించి, ఎంతోమంది ప్రాణాలను కాపాడాం. ఇంత చేసింది, ఇదిగో చేతిలో పట్టుకున్న ఈ చిన్న హ్యామ్ రేడియోతోనే.

ఎయిర్‌ఫోర్స్ నుంచి..
కృష్ణా జిల్లా ఉయ్యూరు మా సొంత ఊరు. అయితే అక్కడున్నది తక్కువ రోజులే. ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం రావడంతో దేశమంతా చుట్టొచ్చాను. ఢిల్లీ చేరాక, ప్రఖ్యాత శాస్త్రవేత్త సూరి భగవంతం ఇంటికి తరచూ వెళ్లే వాణ్ణి. 'హ్యామ్ రేడియోకు భవిష్యత్తు ఉంది. అందులో వర్క్ చెయ్!' అన్నారాయన ఓ రోజున. రాజగోపాల్ అనే ఆయన పరిచయంతో తెలియని విషయాలు ఎన్నో తెలుసుకున్నాను.

అమెచ్యూర్ రేడియో లైసెన్స్ సంపాదించా. ఎయిర్‌ఫోర్స్‌లో లీడింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్‌మన్‌గా పనిచేస్తూనే, హ్యామ్ రేడియోలో అన్ని దేశాల వాళ్లతో మాట్లాడేవాణ్ణి. అప్పటికి మన దేశంలో ఓ వందమంది వీఐపీల దగ్గర మాత్రమే హ్యామ్‌రేడియో ఉండేది. కొన్నాళ్లకు హైదరాబాద్‌లోని హిందుస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)లో చేరాను.

కార్మిక నాయకుడిగా..
మేడే రోజున ముఖ్యమంత్రి వెంగళరావును హెచ్ఏఎల్‌కు ఆహ్వానించాం. అందరూ వాడివేడిగా ప్రసంగిస్తున్నారు. నా వంతురాగానే, 'ఈ దేశానికి హ్యామ్ రేడియో ఎంతో అవసరం' అన్నాను. వేదిక మీద కూర్చున్న అంజయ్య (అప్పటి కార్మిక శాఖా మంత్రి) నా వద్దకు వచ్చి.. 'ఏందయ్యా, కార్మికుల కష్టాల గురించి మాట్లాడకుండా, టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నావ్..! హ్యామ్ రేడియో ఏంది..? తమాషాగ అనిపిస్తుందే.

నాక్కూడా చెప్పు' అన్నాడు. ఆ రోజు నుంచి ఆయనే స్వయంగా మా ఇంటికి పదిసార్లు వచ్చి దీని గురించి తెలుసుకున్నాడు. నేను ఎక్కడ కనిపించినా 'హాకీ టాకీ సూరి' అని పిలిచేవాడు. కొన్ని నిధులను కూడా అందించాడు. ఓ రోజు మా ఇంటికొచ్చిన ఆయనతో హ్యామ్‌రేడియోలో జోర్డాన్ రాజు కింగ్ హుస్సేన్‌తో మాట్లాడిస్తే, చాలా ఆశ్చర్యపోయాడు.

'టెలిఫోన్ కనెక్షన్ లేకున్నా హ్యామ్ రేడియోతో మాట్లాడొచ్చా.. భలే బాగుంది. మన రాష్ట్రంలో తుపానొచ్చినప్పుడు ఈ రేడియో బాగా పనికొస్తుంద'న్నాడు. వెంటనే ఒక కమిటీ వేశాడు.

రాజీవ్‌గాంధీతో..
ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఫ్లయింగ్ క్లబ్‌లో హ్యామ్ రేడియో క్లబ్ ఉండేది. రాజీవ్‌గాంధీ అందులో సభ్యుడు. నేను అక్కడికి వెళ్లినప్పుడల్లా ఆయనను కలిసేవాన్ని. రాజీవ్ పార్లమెంటు సభ్యుడయ్యాక క్లబ్ సభ్యులమంతా సన్మాన సభ పెట్టాం. అందులో నేను 'మా రాష్ట్రంలో చదువురాని మంత్రి అంజయ్య హ్యామ్ రేడియోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి టెక్నాలజీని అభివృద్ధి చేస్తే ప్రజలకు ఎంతో ఉపయోగం' అన్నాను. కొన్నాళ్లకు రాజీవ్ కూడా హ్యామ్‌రేడియోను తన ఇంట్లో అమర్చుకున్నారు.

దివిసీమను తుపాను కుదిపేస్తున్నప్పుడు మూడు హ్యామ్ రేడియో సెట్లను తీసుకెళ్లి సమాచార వ్యవస్థ ధ్వంసమైన ఊళ్లలో పెట్టించా. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఆ సెట్ల ద్వారానే బాధితులతో నేరుగా మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. అదే రోజు జరిగిన టెలీకాన్ఫరెన్సులో ఏ ఊరు ఎక్కువగా దెబ్బతినిందో కలెక్టర్ల కంటే ముందుగా ఇందిరాగాంధీనే టకటకా చెప్పేస్తుంటే, కలెక్టర్లు నోరెళ్లబెట్టారు.

'మీ హ్యామ్‌రేడియోతో మా మదర్ చాలా సంతోషించారు..' అన్నారు రాజీవ్‌గాంధీ. ఆయన ప్రోత్సాహంతో- హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంకు దగ్గరున్న ఓ చిన్న సెల్లార్‌లో రేడియోక్లబ్ పెట్టాను. స్వయంగా రాజీవ్‌గాంధీనే హైదరాబాద్ వచ్చి మా క్లబ్‌ను ప్రారంభించడం నాకు ఒక అపురూప జ్ఞాపకం.

ఉద్యోగం వదులుకొని..
"ప్రభుత్వం మీద ఆధారపడితే ఏ పనీ చేయలేవు. నువ్వు బయటికి రావాలి. హ్యామ్‌రేడియోను కొత్త భారతదేశం కోసం మెరుగుపరచాలి..'' అన్న రాజీవ్ మాటలను విశ్వసించి.. ఉద్యోగాన్ని వదిలేశా. యూరప్, అమెరికా, జపాన్, సింగపూర్, హాంకాంగ్, ఇలా చాలా దేశాలకు వెళ్లి..

అక్కడ హ్యామ్‌రేడియోను దేశం కోసం ఎలా ఉపయోగిస్తున్నారు..? కొత్త టెక్నాలజీని ఎలా కనుగొంటున్నారు..? అని ఆయన కోరికపై ఓ నివేదికను రాసి కేంద్రానికి సమర్పించాను. (ఇప్పటికీ అపురూపంగా దాచుకున్న ఆ కాపీని చూపించారు) అంతలో ఇందిరాగాంధీ చనిపోయారు. రాజీవ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే నాకు పిలుపొచ్చింది. నివేదికను ఆమోదిస్తూ ఫైల్‌పైన సంతకం చేశారాయన. 'మీరు సహకరిస్తే, దేశంలోనే తొలి హ్యామ్‌రేడియో కేంద్రం హైదరాబాద్‌లో ప్రాణం పోసుకుంటుంది..' అన్నాను రాజీవ్‌తో.

వెంటనే ఆయన అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుకు ఫోన్ కొట్టారు. 'ఇది రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిన విషయం. మీ రాష్ట్రానికే కాదు. దేశానికే ఉపయోగం. మా మిత్రుడు సూరి రేడియో కేంద్రం పెడుతున్నాడు. మీరు దయచేసి స్థలాన్ని కేటాయించండి..'' అన్నారు.

కొన్నాళ్లకు ఖైరతాబాద్ రాజ్‌భవన్‌రోడ్డులో ఎకరా స్థలాన్ని ఇచ్చింది ప్రభుత్వం. అలా వెలిసింది 'ద నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో'. ప్రస్తుతం ఈ సంస్థకు ఛైర్మన్ అండ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాను.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు సూరి.

టెలిఫోన్‌కు హ్యామ్ రేడియో ప్రత్యామ్నాయం కాదు. ఏ సిగ్నలూ లేని చోట హ్యామ్ రేడియో పనిచేస్తుంది. ఎలక్ట్రోమాగ్నటిక్ వేవ్స్ రూపంలో ఉన్న సిగ్నల్స్ ద్వారా ప్రపంచంలో ఏ మూలనున్న వారితోనైనా మాట్లాడవచ్చు. అమెరికాలో 6 లక్షలమంది హ్యామ్‌రేడియో ఆపరేటర్లుంటే, మన దేశంలో 30 వేల మంది ఉన్నారు. కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, శాటిలైట్, బ్రాడ్‌కాస్టింగ్‌లలోకి వెళ్లాలనుకొనే వారికి హ్యామ్‌రేడియో అభిరుచి ఎంతో ఉపయోగపడుతుంది.

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ సంస్థ ఔత్సాహికులకు ట్రైనింగ్ ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే చిన్నపాటి పరీక్ష పాసైతే, రేడియోకు పర్మిషన్ ఇస్తారు. రేడియోసెట్ సొంతంగా పెట్టుకోవాలంటే రూ.5 వేలు ఖర్చు అవుతుంది. అభిరుచితోపాటు సేవాభావం ఉన్న వాళ్లకు హ్యామ్ రేడియో కొత్త జీవితాన్ని ఇస్తుందనేందుకు ఎస్.సూరి విజయగాథే నిదర్శనం.
జూ మల్లెంపూటి ఆదినారాయణ,
ఫొటోలు : జి.భాస్కర్

Sunday, August 8, 2010

ఆ ఆలోచన.. నాన్న ప్రోత్సాహమే... నన్ను ఐఏఎస్‌ను చేసింది - డాక్టర్‌ ఐవీ సుబ్బారావు

I.V.-Subba-Rao3రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా రెండు ఉప ఎన్నికలతో పాటు, 2009 సాధారణ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించి సక్సెస్‌ ఫుల్‌ సీఈఓగా అందరి మన్ననలు పొందిన డాక్టర్‌ ఐవీ సుబ్బారావు పూర్తి పేరు ఇలపావులూరి వేంకట సుబ్బారావు. పుట్టిన ఊరు బాపట్ల (గుంటూరు జిల్లా). తండ్రి ఉద్యోగరీత్యా ఢిల్లీలో ఉండడంతో అక్కడే ఉన్నతాభ్యాసం చేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ ఆనర్స్‌ (ఇంగ్లీష్‌), ఎంఏ (ఇంగ్లీష్‌), బి.ఇడి చదివారు. అనంతరం జేఎన్‌యూలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేశారు. ఆ సమయంలోనే ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేయాలన్న అభి లాషతో సివిల్స్‌ రాయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆయన ఆలోచనకు తండ్రి ప్రోత్సాహం లభించడంతో 1979లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. పదిహేడేళ్లపాటు ఐఏఎస్‌ అధికారి గా పనిచేశాక దీర్ఘకాలిక సెలవుపై అమెరికా వెళ్లి అక్కడ పెన్సిల్వేనియా యూనివర్సిటీలో పిహెచ్‌డీ పూర్తి చేశా రు. అమెరికాలో పిహెచ్‌డీ అడ్మిషన్‌ కోసం జీఆర్‌ఇ, టోఫెల్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందడమేగాక, ఐదేళ్లలో పూర్తి చేయాల్సిన పిహెచ్‌డీ డిగ్రీని కేవలం 2 సంవత్సరాల మూడు నెలల్లోనే పూర్తిచేసి ఘనత సాధించారు. డాక్టరేట్‌ పట్టా సాధించి తిరిగొచ్చాక ప్రభుత్వం ఆయనను టీటీడీ ఈవో గా నియమించింది.

I.V.-Subba-Rao1 అంతకుముందే పలు కేంద్ర, రాష్ట్ర విభాగాలలో కీల క బాధ్యతలు నిర్వహించిన డాక్టర్‌ ఐవీ ఈఓగా చేసిన తర్వాత పాఠశాల విద్య, హెల్త్‌, రెవెన్యూ విభాగాలలో ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 2008 మార్చి 31 నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత కొద్ది కాలంలోనే ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన ఓటర్ల జాబితాను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేశారు. అర్హులైన వారందరికీ ఫోటో ఓటరు గుర్తింపు కార్డులుండేలా సంస్కరణలు చేపట్టారు. 18 ఏళ్లు దాటిన యువతీ యువకులు అందరికీ ఓటు హక్కు కల్పించేందుకు విశేషంగా కృషి చేశారు. ఇందుకోసం పోస్టాఫీసులు, విశ్వవిద్యాలయాలు, కాలేజీలు తది తర సంస్థలు పాలుపంచుకునేలా చేశారు. ఓటర్ల నమోదు కోసం ‘యువతరంగ్‌’ వంటి పలు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలో నూటికి నూరు శాతం అర్హులైన పౌరు లందరి పేర్లూ ఓటర్ల జాబితా లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. అలాగే వారందరికీ ఓటరు గుర్తింపు కార్డు లు అందేలా చర్యలు చేపట్టారు.

ప్రతి ఎన్నికల కు ముందు ఓటర్ల జాబి తాను అన్ని రాజకీయ పక్షాలతో సమీక్షించి అప్‌డేట్‌ చేయడం వంటి కీలకమైన కార్యక్రమాలను సమర్ధ వం తంగా నిర్వహించారు. అంతేగాక అత్యంత పారద ర్శకంగా ఎన్నికలను నిర్వ హించడంలో ఐవీ సుబ్బా రావు తనదైన శైలిని ప్రద ర్శించారు. 2008 మేలో జరిగిన ఉప ఎన్నికలు, 2009 సాధారణ ఎన్ని కలను విజయవంతంగా నిర్వహించారు. తాజాగా తెలంగాణాలోని 12 నియోజకవర్గాలలో జరిగి న ఎన్నికలను ప్రశాంతం గా, అత్యంత పారదర్శకం గా, ఎలాంటి ఫిర్యాదులు లేకుండా నిర్వహించి తనదైన పరిపాలనా ముద్రను నిరూపించుకున్నా రు. ప్రతి ఎన్నికల్లోనూ ఎన్నికల కోడ్‌ని తు.చ. తప్పకుండా పాటించేలా చర్యలు చేపట్టారు. నియమావళి ఉల్లం‘ఘను’లెవరైనా చర్యలు ఒకే విధంగా ఉంటాయని నిరూపించారు. తాజా ఎన్నికలలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల విశ్వసనీయతను కొందరు అనుమానించినా వాటి లో వాస్తవం లేదని నిరూపించిన ఘనత ఐవీకే దక్కుతుంది. ఈ నేప థ్యంలో డాక్టర్‌ ఐవీ సుబ్బారావు ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన అంశాలు.. అనుభూతులు.. ‘సూర్య ప్రతినిధి’తో ఇలా పంచుకున్నారు.

జీవితంలో తొలి టర్నింగ్‌ పాయింట్‌...
I.V.-Subba-Rao ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యు)లో అసిస్టెం ట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నపుడు ప్రజలకు సేవ చేయాలన్న అభిలాష కలిగింది. దాంతో సివిల్‌ సర్వీసెస్‌ రాయలన్న ఆలోచన వచ్చింది. అందుకు నాన్నగారు డాక్టర్‌ ఐవీ పాండురంగారావు పూర్తిస్థాయిలో ప్రోత్సాహమందించారు. ఆయన సంపూర్ణ సహాయ, సహకారాలతో ప్రిపేరయ్యాను 1979లో ఐఏఎస్‌కు ఎంపికయ్యాను. ఇది నా జీవితం లో తొలి టర్నింగ్‌ పాయింట్‌.

నచ్చిన చోటే అవకాశం మరో మలుపే...
1992లో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖామంత్రి చింతామోహన్‌ తనవద్ద ప్రైవేట్‌ కార్యదర్శిగా నియమించుకున్నారు. అయితే అనుకో కుండా మంత్రివర్గం నుంచి ఆయనను తప్పించారు. అప్పుడు ఏ విభా గంలోకెళ్లాలో తెలియని తరుణంలో ఎడ్యుకేషన్‌ సెక్రెటరీ నన్ను పిలిచి, నా విద్యార్హతలను బట్టి నన్ను విద్యా విభాగంలో పనిచేయమన్నారు. నాకు నచ్చిన విభాగంలో అవకాశం రావడం గొప్పగా అనిపించింది.

ప్రొఫెసర్‌ దవేతో గొప్ప అనుభవం...
ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్‌ దవే ఛైర్మన్‌గా విద్యావిధానానికి సంబం ధించి కేంద్రం నియమించిన నేషనల్‌ కమిటీలో సభ్యుడిగా పనిచేశా ను. నాలుగేళ్లపాటు ప్రొఫెసర్‌ దవేతో కలిసి పనిచేసిన రోజులు ఎప్పటికీ మరిచిపోలేను. ఆయనతో పనిచేయడం గొప్ప అనుభవం.

అమెరికాలో పిహెచ్‌డి...
దాదాపు 20 సంవత్సరాలు పనిచేసిన తర్వాత స్టడీ లీవు తీసుకుని జీఆర్‌ఈ, టోఫెల్‌ పరీక్షలలో ఉత్తీర్ణత పొంది అమెరికాలోని పెన్సిల్వే నియా యూనివర్సిటీలో ఎడ్యుకేషన్‌ విభాగంలో పిహెచ్‌డి అడ్మిషన్‌ పొంది రెండున్నరేళ్ల లోపే పిహెచ్‌డి పూర్తిచేసి డాక్టరేటు పొందాను.

టీటీడీలో సంస్కరణలు...
అమెరికాలో పిహెచ్‌డి పూర్తి చేసి ఇండియాకు రాగానే తిరుమల తిరు పతి దేవస్థానంలో ఈఓగా పోస్టింగ్‌ ఇచ్చారు. ఏడాదిన్నరపాటు అక్కడ పనిచేశాను. దైవ దర్శనానికి భక్తులు పడే ఇక్కట్లను గమనించాను. వారి ఇబ్బందులను తగ్గించేందుకు గాను ‘సుదర్శనం’ పద్ధతిని ప్రవేశపెట్టాం. కంప్యూటర్‌ ద్వారా భక్తులకు టోకెన్‌లను ఇచ్చి.. వారు గంటల తరబడి క్యూ లైన్లలో నిల బడకుండా వారికి కేటాయించిన సమయంలో వస్తే దైవదర్శనం లభించేలా చర్యలు తీసుకున్నాం. అమెరికా నుంచి రాగానే టీటీడీ ఈఓగా పనిచేసే అవకాశం రావడం ఆ శ్రీవేంకటేశ్వరుడే తనకు కల్పించిన అద్భుత అవకాశంగా భావిస్తాను.

చెన్నారెడ్డి హయాంలో...
మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఆయనకు సం యుక్త కార్యదర్శిగా పనిచేశాను. రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకుని ప్రాం తాలు, ప్రజల అభివృద్ధి కోసమని అప్పట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక కార్యక్రమానికి డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించాను. ఈ కాలం లో అభివృద్ధికి దూరంగా ఉన్న మారుమూల, గిరిజన ప్రాంతాలను అభివృద్ది చేయడంలో నా శాయాశక్తులా కృషిచేశాను.

ఈసీ ధ్యేయమదే...
- ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక పరి జ్ఞానాన్ని వినియోగించుకుంటూ ఎన్నికల ను ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చూడడమేగాక ప్రజలకు సులభతరమైన విధానాలను అందుబాటులోకి తీసుకువ చ్చేందుకు ఎన్నికల సంఘం ఎప్పుడూ కృషి చేస్తుంది.

- ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్లంతా ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా, ప్రభావాలకు లొంగకుండా స్వేచ్ఛగా, స్వతంత్రంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నదే ఈసీ ధ్యేయం.
- డాక్టర్‌ ఐవీ సుబ్బారావు

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా డాక్టర్‌ ఐవీ చేపట్టిన సంస్కరణలు... తీసుకున్న చర్యలు...
I.V.-Subba-Rao2-ఈవీఎంలపై అవగాహనకు రాష్టవ్య్రాప్తంగా గ్రామగ్రామాన విస్తృత ప్రచారం.

-మారుమూల పల్లెలు, గ్రామాలలోనూ పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు.

-ఈ సేవా కేంద్రాల ద్వారా ఓటర్ల జాబితాలోని తప్పులను సరిదిద్దు కునే అవకాశం.

-ఎన్నికల కోడ్‌ను పటిష్టంగా అమలయ్యేలా చర్యలు.

-రాజకీయ పార్టీల అడ్డగోలు ప్రచారానికి, ప్రసంగాలకు చెక్‌.

-సమస్యాత్మక ప్రాంతాలనుగుర్తించి ముందస్తు చర్యల చేపట్టడం ద్వారా ఎన్నికల ప్రశాంత నిర్వహణ.

-వృద్ధులు, మహిళలు, వికలాంగులకు పోలింగ్‌ కేంద్రంలో గంటల తరబడి నిలబడే ఇబ్బంది లేకుండా నేరుగా లోపలికి వెళ్లి ఓటేసే అవకాశం.

-అంధులు సైతం స్వతంత్రంగా ఓటేసేలా బ్రెయిలీ లిపితో కూడిన ఈవీఎంలను ఏర్పాటు చేయించిన ఘనత ఐవీకే దక్కుతుంది.

-ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేసే మద్యం, నల్లధనం పంపిణీని కట్టడి.

- అక్రమ మద్యం దుకాణాల భరతం పట్టారు.

-ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన వారినెవరినీ వదిలిపెట్టలేదు.

-రాజకీయ నాయకులతోపాటు నియమాలను ఉల్లంఘిస్తే రాష్ట్ర డిజిపిని సైతం ఉపేక్షించలేదు.

-తాజా ఉప ఎన్నికల్లో మోడల్‌ కోడ్‌ను ఉల్లంఘించినందుకు పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌తో సహా టీఆర్‌ఎస్‌ నేత కె.చంద్రశేఖర్‌రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ విజయశాంతి, ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీలపై చర్యలు చేపట్టిన ఐవీ గత సాధారణ ఎన్నికల్లో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌కు సైతం ఈసీ తరపున నోటీసులందించారు.
ప్రొఫైల్‌
అందరికీ తెలిసిన పేరు : డాక్టర్‌ ఐవీ సుబ్బారావు

పూర్తిపేరు : డాక్టర్‌ ఇలపావులూరి వెంకట సుబ్బారావు

పుట్టిన రోజు : ఆగస్టు 12, 1955

పుట్టింది : బాపట్ల, గుంటూరు జిల్లా

విద్యార్హతలు : బీఏ ఆనర్స్‌ (ఇంగ్లీష్‌), ఎంఏ (ఇంగ్లీష్‌), బిఇడి, ఢిల్లీ యూనివర్సిటీ పిహెచ్‌డి (ఎడ్యుకేషన్‌), యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా, అమెరికా

తండ్రి : డాక్టర్‌ ఇలపావులూరి పాండురంగారావు (ఎంఏ, హిందీలో గోల్డ్‌ మెడలిస్టు,1955లో నాగ్‌పూర్‌ యూనివర్సిటీ నుంచి పిహెచ్‌డి చేసి హిందీ విభాగంలో డాక్టరేటు అందుకున్న తొలి ఆంధ్రుడుగా చరిత్రకెక్కారు), యూపీఎస్‌సిలో భాషా విభాగ డైరెక్టర్‌గా, భారతీయ జ్ఞానపీఠ్‌ అవార్డ్‌‌స డైరెక్టర్‌గా పనిచేశారు.
తల్లి : రాధాదేవి
భార్య : రేఖారావు
సంతానం : సమీరజ్‌ (కొడుకు), మానస (కుమార్తె)
తమ్ముడు : రఘు
చెల్లెల్లు : వాంగ్మయి, అనూప, సువర్ణ

ఐఏఎస్‌ కంటే ముందు...
జె.ఎన్‌.యూ(ఢిల్లీ)లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(ఇంగ్లీష్‌)గా పనిచేశారు.
ఐఏఎస్‌ బ్యాచ్‌ : 1979

శిక్షణ : మస్సోరిలో అకాడమీ ట్రైనింగ్‌, కరీంనగర్‌లో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా శిక్షణ (1979-81)

తొలి పోస్టింగ్‌: వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా (1981-83)

కలెక్టర్‌గా తొలి పోస్టింగ్‌: అనంతపురం జిల్లా (1986-87)

ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా: పాఠశాల విద్య (2000-2004), ఆరోగ్య శాఖ (2004-06), రెవెన్యూ విభాగం (2006-08)

ప్రస్తుతం: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (మార్చి 31,2008 నుంచి)

- ఉదయ్‌,