చేకూరి గౌతమరాజు

చేకూరి గౌతమరాజు
Facebook

Tuesday, August 10, 2010

సమాజ హితుడు

చాలామంది 'ఈ సమాజం నాకేమిచ్చింది?' అని ఆలోచిస్తారు. కొద్దిమంది మాత్రమే 'ఈ సమాజానికి నేనేం చేశాను?' అని ఆలోచిస్తారు. అలాంటి కొద్దిమందిలో యువ ఇంజనీరు సుబ్రత దత్తా కూడా ఒకరు.

లేకపోతే ఇంత చిన్న వయస్సులోనే ఈయనకు ఇన్ని పెద్ద ఆలోచనలు ఎలా వస్తాయి? ఆ ఆలోచనలు ఆయన జీవితాన్ని మారుస్తాయో లేదోగాని మన జీవితాన్ని మాత్రం మరింత సౌఖ్యవంతం చేయగలవు. సుబ్రత రూపొందించిన వర్చువల్ ఇన్వర్టర్ అనే పరికరం కనుక అందరికీ అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో విద్యుత్తు కోత అనే పదం ఎక్కడా వినిపించదు మరి.

సాధారణంగా చాలామందికి వృత్తి, ప్రవృత్తి వేరు వేరుగా ఉంటాయి. కానీ సుబ్రత దత్తాకి వృత్తి, ప్రవృత్తి ఒక్కటే. అదే పరిశోధించడం, అందుకు అవసరమైన ఆలోచనలు చేయడం. ఆఫీసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా ఒకటే ఆలోచన ఎడతెగని విద్యుత్తు ప్రవాహం మాదిరిగా. కోల్‌కతాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చేసిన సుబ్రత దత్తా ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలోని రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగంలో పనిచేస్తున్నారు. ఇటీవల ఈయన వర్చువల్ ఇన్వర్టర్ అనే పరికరాన్ని రూపొందించారు. చూడటానికి అగ్గిపెట్టె పరిమాణంలో ఉన్నప్పటికీ పనితీరులో మాత్రం ఇది అగ్గిబరాటాయే! వర్చువల్ ఇన్వర్టర్ అంటే? సాధారణంగా బయట మార్కెట్‌లో లభించే ఇన్వర్టర్లు కరెంటు పోగానే అందుకు ప్రత్యామ్నాయంగా పని చేయడం ప్రారంభిస్తాయి. వీటిలో అమర్చబడి ఉండే బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి వచ్చే అవుట్‌పుట్ సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. కానీ ఈ వర్చువల్ ఇన్వర్టర్ అలా కాదు.

అగ్గిపెట్టె పరిమాణంలో ఉండే ఈ బాక్స్ విద్యుత్తు ప్రవాహంలోనే ఒక భాగంగా ఉండి పని చేస్తుంది. ప్రతి ఇంట్లో, కార్యాలయంలో విద్యుత్తు మీటరుకు పక్కనే ఈ వర్చువల్ ఇన్వర్టర్ అమర్చబడి ఉంటుంది. ఇవి ఆయా ప్రాంతాల్లోని విద్యుత్తు సబ్‌స్టేషన్లకు రేడియో ఫ్రీక్వెన్సీ లింక్ ద్వారా అనుసంధానమై ఉంటాయి.

ఎలా పని చేస్తుంది?
సాధారణంగా విద్యుత్తు కోత అనేది అన్ని ప్రాంతాలలో ఒకేసారి అమలు కాదు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో అమలవుతూ ఉంటుంది. దీనికి కారణం వినియోగానికి అవసరమైన మేరకు విద్యుదుత్పాదన లేకపోవడమే. సరిగ్గా ఇక్కడే వర్చువల్ ఇన్వర్టర్ రంగంలోకి దిగుతుంది. ఇది విద్యుత్తును ఉత్పత్తి చేయదుకానీ విద్యుత్తు లోడును నియంత్రిస్తూ ఉంటుంది.

ప్రధాన విద్యుత్తు లైను నుంచి వచ్చే విద్యుత్తును ఈ వర్చువల్ ఇన్వర్టర్ గ్రహించి దాన్ని హై, లో విద్యుత్తు లైన్లుగా విడగొడుతుంది. సాధారణంగా మనం ఇళ్లలో, కార్యాలయాలలో ఉపయోగించే ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు, టివి, సెట్‌టాప్ బాక్స్, మొబైల్ ఛార్జర్, ల్యాప్‌టాప్.. అన్నీ తక్కువ విద్యుత్తుతోనే పని చేస్తాయి. విండో ఏసి, ఫ్రిజ్, ఐరన్ బాక్స్, వాషింగ్ మెషిన్, మైక్రోవేవ్ ఓవెన్ విత్ గ్రిల్, సబ్‌మెర్సిబుల్ పంప్..

వీటికి మాత్రమే అధిక విద్యుత్తు అవసరం అవుతుంది. అయితే వాటిని మనం ప్రతి రోజూ, ఇరవై నాలుగు గంటలూ ఉపయోగించం. వీటిని వినియోగించే సమయంలో మాత్రమే విద్యుత్తు అధిక లోడు అవసరమవుతుంది. తక్కువ విద్యుత్తు లోడు ఉన్నట్లయితే ఈ పరికరాలు పని చేయవు. కాబట్టి విద్యుత్తు లోడుకు తగ్గట్లుగా వర్చువల్ ఇన్వర్టర్‌లో ఉండే ఒక స్విచ్ విద్యుత్తును నియంత్రిస్తూ ఉంటుంది.

ఉపయోగం ఏమిటి?
వర్చువల్ ఇన్వర్టర్ ఉండడం వల్ల రాత్రీ పగలు, ఇరవై నాలుగు గంటలూ అత్యవసరాలైన విద్యుత్తు లైట్లు వెలుగుతూనే ఉంటాయి. ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి. దీంతో వేసవి కాలంలో సైతం విద్యుత్తు కోత అన్నది ఉండదు. లాంతర ్ల వెలుగులో చదువులు, ఉక్కపోత, దోమల బెడద, కలత నిద్ర ఇలాంటివేమీ ఉండవు.

ఎప్పుడు కావాలంటే అప్పుడు కంప్యూటర్లూ, ల్యాప్‌టాప్‌లూ పనిచేస్తుంటాయి. సెల్‌ఫోన్ల ఛార్జింగ్‌కు కూడా ఎలాంటి ఆటంకం ఉండదు. దీంతో ఇంధన వినియోగం తగ్గుతుంది. ఫలితంగా వాతావరణ కాలుష్యం కూడా ఉండదు. భూతాపం కూడా తగ్గుతుంది. ఏ సమాజానికైనా ఇంతకంటే ఏం కావాలి చెప్పండి.

నా కర్తవ్యం నిర్వర్తించా..
అయితే దీనిమీద పేటెంట్‌కు దరఖాస్తు చేస్తున్నారా? అన్న ప్రశ్నకు.. నవ్వుతూ "ఈ వర్చువల్ ఇన్వర్టర్లను భారీ ఎత్తున ఉత్పత్తి చేసి, డబ్బు గడించాలనేది నా కోరిక కాదు. అలాగే ఈ ఆవిష్కరణతో నేనేదో గొప్ప శాస్త్రవేత్తను అయిపోదామనీ కాదు, నాకున్న తెలివిని ఉపయోగించి నేనొక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశాను.

దీనివల్ల మొత్తం సమాజానికే లాభం కలుగుతుంది. ఇలాంటి ఆవిష్కరణలను ప్రభుత్వాలు అందిపుచ్చుకోవాలి. అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. అప్పుడే వాటికి సార్థకత..'' అని వ్యాఖ్యానించారు దత్తా. మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? అన్న ప్రశ్నకు "ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాను.

విద్యుదుత్పత్తి, నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉండడంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు నా ఆవిష్కరణ గురించి, దాని వల్ల కలిగే మేలు గురించి లేఖలు రాస్తున్నాను. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మంచి స్పందన వచ్చింది. మరికొందరు పట్టించుకోలేదు.. చూద్దాం ఏం జరుగుతుందో..'' అని చెప్పారు.

ఇదే తొలి ఆవిష్కరణా?
కాదు.. సుబ్రత దత్తా ఇప్పటికే దాదాపు పది వినూత్న ఆవిష్కరణలు చేశారు. వాటిలో మంచినీటిని, విద్యుత్తును ఆదా చేసే పరికరాలు కూడా ఉన్నాయి. ఈయన రూపొందించిన అతి చిన్న ఫ్రిజ్ నిమిషం వ్యవధిలోనే ఐస్ తయారు చేస్తుంది. మధుమేహ రోగులు తీసుకునే ఇన్సులిన్‌లాంటి మందు ఎల్లప్పుడూ ఫ్రిజ్‌లోనే ఉండాలి.

అలాగే ప్రస్తుతం మార్కెట్‌లో లభించే మరికొన్ని రకాల మందులకు కూడా చల్లని వాతావరణం అవసరమవుతుంది. ఇలాంటి వారికి ఈ బుల్లి ఫ్రిజ్ బాగా ఉపయోగపడుతుంది. దూర ప్రయాణాలలోనూ దీనిని చెంతనే ఉంచుకోవచ్చు. "ఇలాంటివే మరికొన్ని ఆవిష్కరణలు.. సమాజం పట్ల నాకున్న బాధ్యతకు నిదర్శనాలు..'' అంటారాయన.

వ్యక్తిగా..
చివరగా మీ గురించి చెప్పండని అడిగితే.. "ఏముంటుంది నా గురించి చెప్పుకోడానికి? ఏదో సాధించేశాననే పబ్లిసిటీ కూడా నాకిష్టముండదు. నేనేమైనా ఐన్‌స్టీన్‌నా? డార్విన్‌నా? ఒక సాధారణ పరిశోధకుడిని- అంతే. భార్య, ఒక్కతే కూతురు.. మధ్యతరగతి కుటుంబం. మధ్యతరగతి కుటుంబాలలలో పుట్టిన చాలామందికి ఎదురయ్యే కష్టాలే నాకూ ఎదురయ్యాయి.

అయితే కష్టాలు పడడం వేరు, కష్టపడడం వేరు. ఈ భూమ్మీదకు మనం ఎలా వచ్చామో మనకు తెలుసు. కానీ ఎందుకొచ్చామో ఎవరికి వారు ఆలోచించుకోవాలి. వచ్చినందుకు తోటి వారికి, సమాజానికి ఉపయోగపడే పనేదైనా చేయాలి. అదీ నా ఆకాంక్ష.. అందుకే నా ఈ ఎడతెగని శోధన.. పరిశోధన..'' అంటూ ముగించారు దత్తా.
- వై.రమేష్‌బాబు
ఫోటోలు: లవకుమార్

No comments:

Post a Comment