చేకూరి గౌతమరాజు

చేకూరి గౌతమరాజు
Facebook

Friday, August 13, 2010

ఎవరప్పా అనొద్దు 'మర్యాద'గా ఉండదు

ఆయన టేబుల్ మీద ఒక క్యాలెండర్ ఉంది. దానిలో జూలై నెల పేజీలో చంద్రమండలం ఫొటో ఉంది. అక్కడున్న ఒక సైన్‌బోర్డును చూస్తుంటాడు ఆస్ట్రోనాట్. దాని మీద 'దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు నాగినీడు' అని ఉంటుంది. 'అరె వాళ్లకా విషయం ముందే ఎలా తెలిసింది సార్' అంటే నాగినీడు నవ్వేశారు. ఎవరీ నాగినీడు అని ఇప్పుడు మీరడిగితే ఏ మాత్రం 'మర్యాద'గా ఉండదు. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత తెలుగు సినిమా కనుగొన్న సరికొత్త విలన్ ఆయన. 'మర్యాదరామన్న'లో అప్పా అప్పా అంటూ గొంతులు రోసిన రామినీడు.

డజన్లకొద్దీ ఫాక్షన్ సినిమాలు వస్తున్నప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడబ్బా అనుకోకుండా ఉండలేం ఈ అచ్చమైన రాయలసీమ విలన్‌ను చూసినపుడు. నిజానికి ఆయన ఎక్కడో లేడు. సినిమా పనులన్నీ జరిగే ప్రసాద్ ల్యాబ్స్‌లోనే మేనేజర్ కుర్చీలో కూర్చుని ఉన్నాడు. మర్యాదరామన్న వచ్చాకే ఆయన పేరు అందరికీ తెలిసింది. ఇప్పుడు ఆయన డైలాగులు తెలియని వాళ్లు లేరు.

"రా అప్పా.. మా ఆతిథ్యం స్వీకరిద్దువుగానీ'' అనే పిలుపులో ఆప్యాయత. "ఇడిసిపెట్టను. ఆడు గడప దాటి అడుగు బయట పెట్టిన క్షణమే తలా మొండెం వేరవ్వాల... ఇరవై అయిదు సంవత్సరాలుగా ఎదురుచూస్తాండాం. ఇంకొక్క గడియ ఆగలేమా?'' ఆ మాటలో రగిలే పగ.

"రాత బాగుంటే కత్తుల్తో పొడిసినా బాంబులేసినా సావరప్పా. బాగోపోతే చిన్న బ్లేడు ముక్క సాలు మన ప్రాణాలు పోవడానికి'' అంటున్నప్పుడు ఆ కంఠంలో చిన్న విలన్'తత్వం'.

సినిమా చూసి థియేటర్ నుంచి బయటికి వస్తున్న ప్రేక్షకులు కూడా చాలామంది అచ్చు నాగినీడు యాసలోనే "ఏమప్పా! సినిమా ఎట్టాఉండాది?'' అని పలుకరించుకుంటున్నారంటే ఎంత ప్రభావమో చూడండి. ఏదో ఫ్రెష్‌లుక్. 'క్షణక్షణం'లో పరేష్ రావెల్.. 'అంత:పురం'లో ప్రకాష్‌రాజ్.. 'సై'లో ప్రకాష్ రావత్‌ని చూస్తున్న ఫీలింగ్.

కాదు కాదు.. అంతకు మించి ఏదో కొత్తదనం. ఫ్యాక్షన్ నేపథ్య సినిమాల్లో విలన్లుగా పరిచయమైన వారికి మించిన తెలుగుదనం. నుదుట కుంకుమబొట్టు, సగం నెరిసిన జుత్తు, బూడిద రంగు బూర మీసాలు, మెళ్లో బంగారు గొలుసు, పెద్ద రుద్రాక్షమాల, సీమ సంప్రదాయ దుస్తుల్లో కొత్తగా కనిపించారు నాగినీడు. అదంతా రమారాజమౌళి పుణ్యమట.

1967లో ఒకరోజు...
కృష్ణా జిల్లా కలవపాముల గ్రామంలో ఒక ఇంటి డాబాపైన పదిమంది పిల్లలు గుమికూడారు. అందులో ఒక అబ్బాయి అప్పుడే విడుదలైన శ్రీకృష్ణావతారం సినిమా డైలాగులు పొల్లుపోకుండా చెబుతున్నాడు. అది చూసిన మిగిలిన పిల్లలు గంతులేస్తూ చప్పట్లు కొడుతున్నారు. వంటగదిలోకి వినిపిస్తున్న ఆ చప్పుడుకు "ఒరేయ్! బడవల్లారా ఏంట్రా ఆ అల్లరి? వస్తున్నా ఉండండి'' అని ఒకావిడ అరిచింది. అది వినగానే వాళ్లు చెల్లాచెదురుగా పరుగు తీశారు.

ఎన్టీఆర్ డైలాగులు చెప్పిన పిల్లాడి చెవి దొరకబుచ్చుకుని "డైలాగులు బాగా చెబుతున్నావే. సినిమాలోకెళ్లు మంచి హీరో అవుతావు'' అంది. ఆవిడ ఆ పిల్లాడి తల్లి. అంటే నాగినీడు వాళ్ల అమ్మ. వారు ఎల్వీ ప్రసాద్‌కు దగ్గరి బంధువులు. సినిమాల్లోకి వెళ్లాలనుకుంటే ఈజీగా వెళ్లి ఉండొచ్చు. కాని వెళ్లలేదు.

సినిమా పాఠాలు
"నటనలో అనుభవం ఎలా వచ్చింది? ఏదైనా ఇనిస్టిట్యూట్‌లో నేర్చుకున్నారా'' అని అడిగితే నాగినీడు ఇలా చెప్పారు. ఎల్‌కేజి : చెన్నకేశవరెడ్డి సినిమాలో మొదటి వేషం. ఒక రాజకీయనాయకుని పాత్ర. దర్శకుడు వి.వి. వినాయక్ నాకు ఎల్‌కెజీ పాఠాలు నేర్పారు.

గ్రాడ్యుయేషన్ : తమిళ దర్శకుడు తంగర్ బచ్చన్ పల్లికూడం సినిమాలో ఒక కీలకపాత్ర ఇచ్చి నన్ను 'గ్రాడ్యుయేట్'ని చేశారు. ఆ సినిమాకు తమిళనాడు స్టేట్‌ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది.

ఉద్యోగం : 'పల్లికూడం'లో నా నటన చూసి మర్యాదరామన్నలో విలన్‌గా నాకు 'ఉద్యోగం' ఇచ్చారు రాజమౌళి. కొత్తరకం విలన్

షూటింగ్ మొదటిరోజే ఆ పాత్రకు మంచి స్పందన వస్తుందని అందరూ జోస్యం చెప్పారట. అదే నిజమైంది. స్క్రిప్టులో ఉన్న డైలాగులను తనే స్వయంగా సీమ యాసలోకి మార్చుకుని చెప్పి రామినీడు పాత్రకు జీవం పోశారు ఆయన. తెలంగాణా భాషలో డైలాగులు చెప్పడానికి రెడీ అంటున్నారు. భవిష్యత్తులో విలన్ పాత్రలే వేస్తారా అని అడిగినప్పుడు "చాలామంది పోలీసు అవ్వాలనుకుంటారు. కానీ రౌడీ కావాలని ఎవరూ కోరుకోరు.

అలాగే సినిమాల్లో రావాలనుకునేవారు హీరో అవ్వాలనే కోరుకుంటారు కానీ కేవలం విలన్ అవ్వాలని కోరుకోరు. ఒకప్పుడు విలన్లుగా పేరుపొందిన కోట శ్రీనివాసరావు, జయప్రకాశ్ రెడ్డి ఇప్పుడు విలన్లకంటే వేరే పాత్రలు ఎక్కువగా వేస్తున్నారు. హీరోయిన్లలాగ విలన్లు కూడా ఎక్కువకాలం కొనసాగలేరు. నటునికి ఏదైనా చేయగలననే నమ్మకం ఉండాలి కానీ, కేవలం అదే చే స్తాననే హద్దులు ఉండకూడదు.'' అని ముగించారు నాగినీడు.
జూ బీరెడ్డి నగేష్‌రెడ్డి
ఫొటో : జి. భాస్కర్

1 comment:

  1. అతని వాచికం అతని డైలాగ్ డెలివరి వినూత్నగా వుండి డైలాగ్ దేలివరీలో టైమింగ్ అద్భుతం . నాకు నచ్చిన నటుడు.నాగినీడు. ..నూతక్కి రాఘవేంద్ర రావు. (కనకాంబరం )

    ReplyDelete