చేకూరి గౌతమరాజు

చేకూరి గౌతమరాజు
Facebook

Monday, August 9, 2010

తుపాన్లు వస్తే సూరిని పిలవండి...!

బంగాళాఖాతం నడి సముద్రంలో చిక్కుకున్న ఒక పెద్ద నౌకను, హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని ఓ పాత అండర్‌గ్రౌండ్ సెల్లార్‌లో కూర్చుని కాపాడగలమా..?

మన రాష్ట్రం నుంచి ఒక బృందం వెళ్లాకే, తుపానులో చిక్కుకున్న ఒరిస్సా ముఖ్యమంత్రి బయటి ప్రపంచంతో మాట్లాడి ఊపిరి పీల్చుకున్నారంటే ఆశ్చర్యం వేయదా..?

దివిసీమ తుపాను వల్ల భారీ ప్రాణనష్టం కలిగిందని కలెక్టర్ చెప్పకముందే, ఢిల్లీ నుంచి ఇందిరాగాంధీయే నేరుగా వరద బాధితులతో మాట్లాడటం సాధ్యమేనా..?

తుపానుతో అన్ని సంబంధాలు తెగిపోయినప్పుడు ఇదెలా సాధ్యం! మీలాగే మాక్కూడా ఆసక్తి కలిగింది ఎస్.సూరి మాట్లాడుతున్నంత సేపూ. అరవై ఏళ్లు దాటిన ఆయన ఒక్కో అనుభవాన్ని విప్పుతుంటే, గంటలు నిమిషాల్లా దొర్లిపోయాయి. ఖైరతాబాద్ రాజ్‌భవన్ రోడ్డులో ఎకరా విస్తీర్ణంలో ఉంది 'ద నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో'. దానికి జన్మనిచ్చి, ప్రాణంపోసి మన దేశం తలెత్తుకొనేలా చేశారు ఎస్.సూరి. వర్షాకాలంలో ఆయన అవసరం మనకు చాలా ఉంటుంది.

"మాకప్పుడు ఆఫీసు కూడా లేదు. మాసబ్‌ట్యాంకు దగ్గర ఓ చిన్న సెల్లార్‌లో హ్యామ్ రేడియో క్లబ్ ఉండేది. 'నౌక చెడిపోయి బంగాళాఖాతంలో ఇరుక్కుపోయాం. కమ్యూనికేషన్ తెగిపోయింది. మాకున్న ఏకైక ఆధారం ఈ హ్యామ్ రేడియోనే. మీ సిగ్నల్ తగిలింది. దయచేసి మా ప్రమాదాన్ని ప్రపంచానికి చెప్పి, రక్షించండి..' అన్నారు నౌకలోని బాధితులు.

క్షణాల్లో నేను డిఫెన్స్ మినిస్టర్‌కు సమాచారం పంపించాను. విశాఖ కలెక్టర్‌కూ చెప్పేశాను. మరుసటి రోజుకు కూడా సముద్రంలో బతికే ఉన్నారు వాళ్లు. ఆలస్యంగానైనా స్పందించిన ప్రభుత్వం.. అండమాన్ నుంచి షిప్పులను పంపించి నౌకలోని వ్యక్తులను కాపాడింది. ఇదొక సంఘటన. ఆ మధ్య అండమాన్ దీవులను సునామీ ముంచెత్తింది. హైదరాబాద్ నుంచి వెళ్లిన భారతి హ్యామ్ రేడియో ద్వారా అన్ని దేశాలకు చెబుతోంది.

నాతో కూడా మాట్లాడుతున్న సమయంలోనే వాళ్ల గది కూలిపోయింది. కరెంటు పోయింది. ఫోన్‌లైన్లు, సెల్‌టవర్లు ధ్వంసమయ్యాయి. నేను మళ్లీ ట్రై చేస్తే హ్యామ్‌రేడియోకు మాత్రం సిగ్నల్ తగిలింది. కొద్దిసేపటికి దాని బ్యాటరీ కూడా అయిపోయింది. అక్కడే ఉన్న ఓ కారు బ్యాటరీకి, రేడియోకు కనెక్షన్ ఇచ్చి, సునామీ తీవ్రతను నాకు చెప్పిందామె.

నేను ప్రభుత్వ అధికారులను అప్రమత్తం చేశాను. కమ్యూనికేషన్‌లేని దీవులకు హెలికాప్టర్‌లో మా బృందాన్ని పంపించి, ఎంతోమంది ప్రాణాలను కాపాడాం. ఇంత చేసింది, ఇదిగో చేతిలో పట్టుకున్న ఈ చిన్న హ్యామ్ రేడియోతోనే.

ఎయిర్‌ఫోర్స్ నుంచి..
కృష్ణా జిల్లా ఉయ్యూరు మా సొంత ఊరు. అయితే అక్కడున్నది తక్కువ రోజులే. ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం రావడంతో దేశమంతా చుట్టొచ్చాను. ఢిల్లీ చేరాక, ప్రఖ్యాత శాస్త్రవేత్త సూరి భగవంతం ఇంటికి తరచూ వెళ్లే వాణ్ణి. 'హ్యామ్ రేడియోకు భవిష్యత్తు ఉంది. అందులో వర్క్ చెయ్!' అన్నారాయన ఓ రోజున. రాజగోపాల్ అనే ఆయన పరిచయంతో తెలియని విషయాలు ఎన్నో తెలుసుకున్నాను.

అమెచ్యూర్ రేడియో లైసెన్స్ సంపాదించా. ఎయిర్‌ఫోర్స్‌లో లీడింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్‌మన్‌గా పనిచేస్తూనే, హ్యామ్ రేడియోలో అన్ని దేశాల వాళ్లతో మాట్లాడేవాణ్ణి. అప్పటికి మన దేశంలో ఓ వందమంది వీఐపీల దగ్గర మాత్రమే హ్యామ్‌రేడియో ఉండేది. కొన్నాళ్లకు హైదరాబాద్‌లోని హిందుస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)లో చేరాను.

కార్మిక నాయకుడిగా..
మేడే రోజున ముఖ్యమంత్రి వెంగళరావును హెచ్ఏఎల్‌కు ఆహ్వానించాం. అందరూ వాడివేడిగా ప్రసంగిస్తున్నారు. నా వంతురాగానే, 'ఈ దేశానికి హ్యామ్ రేడియో ఎంతో అవసరం' అన్నాను. వేదిక మీద కూర్చున్న అంజయ్య (అప్పటి కార్మిక శాఖా మంత్రి) నా వద్దకు వచ్చి.. 'ఏందయ్యా, కార్మికుల కష్టాల గురించి మాట్లాడకుండా, టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నావ్..! హ్యామ్ రేడియో ఏంది..? తమాషాగ అనిపిస్తుందే.

నాక్కూడా చెప్పు' అన్నాడు. ఆ రోజు నుంచి ఆయనే స్వయంగా మా ఇంటికి పదిసార్లు వచ్చి దీని గురించి తెలుసుకున్నాడు. నేను ఎక్కడ కనిపించినా 'హాకీ టాకీ సూరి' అని పిలిచేవాడు. కొన్ని నిధులను కూడా అందించాడు. ఓ రోజు మా ఇంటికొచ్చిన ఆయనతో హ్యామ్‌రేడియోలో జోర్డాన్ రాజు కింగ్ హుస్సేన్‌తో మాట్లాడిస్తే, చాలా ఆశ్చర్యపోయాడు.

'టెలిఫోన్ కనెక్షన్ లేకున్నా హ్యామ్ రేడియోతో మాట్లాడొచ్చా.. భలే బాగుంది. మన రాష్ట్రంలో తుపానొచ్చినప్పుడు ఈ రేడియో బాగా పనికొస్తుంద'న్నాడు. వెంటనే ఒక కమిటీ వేశాడు.

రాజీవ్‌గాంధీతో..
ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఫ్లయింగ్ క్లబ్‌లో హ్యామ్ రేడియో క్లబ్ ఉండేది. రాజీవ్‌గాంధీ అందులో సభ్యుడు. నేను అక్కడికి వెళ్లినప్పుడల్లా ఆయనను కలిసేవాన్ని. రాజీవ్ పార్లమెంటు సభ్యుడయ్యాక క్లబ్ సభ్యులమంతా సన్మాన సభ పెట్టాం. అందులో నేను 'మా రాష్ట్రంలో చదువురాని మంత్రి అంజయ్య హ్యామ్ రేడియోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి టెక్నాలజీని అభివృద్ధి చేస్తే ప్రజలకు ఎంతో ఉపయోగం' అన్నాను. కొన్నాళ్లకు రాజీవ్ కూడా హ్యామ్‌రేడియోను తన ఇంట్లో అమర్చుకున్నారు.

దివిసీమను తుపాను కుదిపేస్తున్నప్పుడు మూడు హ్యామ్ రేడియో సెట్లను తీసుకెళ్లి సమాచార వ్యవస్థ ధ్వంసమైన ఊళ్లలో పెట్టించా. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఆ సెట్ల ద్వారానే బాధితులతో నేరుగా మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. అదే రోజు జరిగిన టెలీకాన్ఫరెన్సులో ఏ ఊరు ఎక్కువగా దెబ్బతినిందో కలెక్టర్ల కంటే ముందుగా ఇందిరాగాంధీనే టకటకా చెప్పేస్తుంటే, కలెక్టర్లు నోరెళ్లబెట్టారు.

'మీ హ్యామ్‌రేడియోతో మా మదర్ చాలా సంతోషించారు..' అన్నారు రాజీవ్‌గాంధీ. ఆయన ప్రోత్సాహంతో- హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంకు దగ్గరున్న ఓ చిన్న సెల్లార్‌లో రేడియోక్లబ్ పెట్టాను. స్వయంగా రాజీవ్‌గాంధీనే హైదరాబాద్ వచ్చి మా క్లబ్‌ను ప్రారంభించడం నాకు ఒక అపురూప జ్ఞాపకం.

ఉద్యోగం వదులుకొని..
"ప్రభుత్వం మీద ఆధారపడితే ఏ పనీ చేయలేవు. నువ్వు బయటికి రావాలి. హ్యామ్‌రేడియోను కొత్త భారతదేశం కోసం మెరుగుపరచాలి..'' అన్న రాజీవ్ మాటలను విశ్వసించి.. ఉద్యోగాన్ని వదిలేశా. యూరప్, అమెరికా, జపాన్, సింగపూర్, హాంకాంగ్, ఇలా చాలా దేశాలకు వెళ్లి..

అక్కడ హ్యామ్‌రేడియోను దేశం కోసం ఎలా ఉపయోగిస్తున్నారు..? కొత్త టెక్నాలజీని ఎలా కనుగొంటున్నారు..? అని ఆయన కోరికపై ఓ నివేదికను రాసి కేంద్రానికి సమర్పించాను. (ఇప్పటికీ అపురూపంగా దాచుకున్న ఆ కాపీని చూపించారు) అంతలో ఇందిరాగాంధీ చనిపోయారు. రాజీవ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే నాకు పిలుపొచ్చింది. నివేదికను ఆమోదిస్తూ ఫైల్‌పైన సంతకం చేశారాయన. 'మీరు సహకరిస్తే, దేశంలోనే తొలి హ్యామ్‌రేడియో కేంద్రం హైదరాబాద్‌లో ప్రాణం పోసుకుంటుంది..' అన్నాను రాజీవ్‌తో.

వెంటనే ఆయన అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుకు ఫోన్ కొట్టారు. 'ఇది రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిన విషయం. మీ రాష్ట్రానికే కాదు. దేశానికే ఉపయోగం. మా మిత్రుడు సూరి రేడియో కేంద్రం పెడుతున్నాడు. మీరు దయచేసి స్థలాన్ని కేటాయించండి..'' అన్నారు.

కొన్నాళ్లకు ఖైరతాబాద్ రాజ్‌భవన్‌రోడ్డులో ఎకరా స్థలాన్ని ఇచ్చింది ప్రభుత్వం. అలా వెలిసింది 'ద నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో'. ప్రస్తుతం ఈ సంస్థకు ఛైర్మన్ అండ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాను.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు సూరి.

టెలిఫోన్‌కు హ్యామ్ రేడియో ప్రత్యామ్నాయం కాదు. ఏ సిగ్నలూ లేని చోట హ్యామ్ రేడియో పనిచేస్తుంది. ఎలక్ట్రోమాగ్నటిక్ వేవ్స్ రూపంలో ఉన్న సిగ్నల్స్ ద్వారా ప్రపంచంలో ఏ మూలనున్న వారితోనైనా మాట్లాడవచ్చు. అమెరికాలో 6 లక్షలమంది హ్యామ్‌రేడియో ఆపరేటర్లుంటే, మన దేశంలో 30 వేల మంది ఉన్నారు. కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, శాటిలైట్, బ్రాడ్‌కాస్టింగ్‌లలోకి వెళ్లాలనుకొనే వారికి హ్యామ్‌రేడియో అభిరుచి ఎంతో ఉపయోగపడుతుంది.

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ సంస్థ ఔత్సాహికులకు ట్రైనింగ్ ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే చిన్నపాటి పరీక్ష పాసైతే, రేడియోకు పర్మిషన్ ఇస్తారు. రేడియోసెట్ సొంతంగా పెట్టుకోవాలంటే రూ.5 వేలు ఖర్చు అవుతుంది. అభిరుచితోపాటు సేవాభావం ఉన్న వాళ్లకు హ్యామ్ రేడియో కొత్త జీవితాన్ని ఇస్తుందనేందుకు ఎస్.సూరి విజయగాథే నిదర్శనం.
జూ మల్లెంపూటి ఆదినారాయణ,
ఫొటోలు : జి.భాస్కర్

1 comment:

  1. ప్రకృతి విపత్తులలో హాం రేడియో చేసిన సేవల గురించి వింటూ ఉంటాం .వారి సేవాభావం నిబద్ధత ముగ్ధులను చేస్తుంది. యువతను ఆకర్షించి వారి భాగాస్వాన్యం తో మరింతగా విస్తరించాలని ఆకాంక్ష. : నూతక్కి రాఘవేంద్ర రావు .

    ReplyDelete