సెల్ ఫోన్‌తో ఒక్క కాల్ చేస్తే చాలు... ఆ సౌండ్‌కే మోటర్ ఆన్ అవుతుంది...
చేనుకి నీళ్లు పెట్టాలంటే కరెంటు మోటర్ అవసరం లేదు... సైకిల్ ఉంటే చాలు...
లైట్ వెలగాలన్నా, ఫ్యాన్ తిరగాలన్నా స్విచ్ వేయాల్సిన పనిలేదు... రిమోట్ నొక్కితే చాలు...
ఐరన్ చేసుకోవడానికి కరెంటు, బొగ్గులు అవసరం లేదు... గ్యాస్ ఉంటే చాలు...
ఆ బైక్‌ని ఎంత దూరం నడిపితే దాన్లో ఉన్న బ్యాటరీ అంత ఎక్కువ చార్జ్ అవుతుంది... ఆ చార్జ్‌తో మళ్లీ అంత దూరం నడపొచ్చు... ఏంటి ! ఇవన్నీ నిజమే ! అని సందేహపడవద్దు. వీటిని కనిపెట్టిన వ్యక్తుల్ని కూడా ఈ పేజీల్లో మీరు చూడొచ్చు. వాళ్లెవరూ పెద్దగా చదువుకున్నవాళ్లు కాదు. వాటితో వ్యాపారాలు చేద్దామనుకుంటున్నవాళ్లూ కాదు. సాదాసీదా మనుషులు. Necessity is the mother of invention కి అచ్చమైన ఉదాహరణలుగా నిలిచే వ్యక్తులు. వారి పేర్లు రాంబాబు, బ్రహ్మం, మల్లేష్, జగదీశ్వర్ వగైరా వగైరా. అంటే మనవాళ్లే. తెలుగు వాళ్లే. పల్లెతల్లి బిడ్డలే.
కాల్ చేస్తే నీళ్లొస్తాయ్
ఖమ్మం జిల్లాలోని మారుమూల గ్రామం బొమ్మనపల్లికి చెందిన రాంబాబు వృత్తిరీత్యా మోటర్ మెకానిక్. బాగు చేయడమే తెలిసిన అతనికి ఏదైనా తయారు చేయాలనిపించేది. వానాకాలంలో తడిసిన మోటర్లు ఆన్ చేయడం వల్ల షాక్ కొట్టి రైతులు చనిపోవడం గమనించాడు రాంబాబు. మోటర్ స్విచ్‌ను అంటుకోకుండా దాన్ని ఆన్ చేయడమెలా అని ఆలోచించాడు. మోటర్ సర్క్యూట్‌లో సౌండ్ సెన్సర్ (శబ్దానికి స్పందించేది) వాడి చప్పట్లతో మోటర్‌ను ఆన్ చేయడం కనుగొన్నాడు. అక్కడితో ఆగలేదు. బైక్‌లకు, కార్లకు ఉపయోగించే రిమోట్‌ని కరెంటు మోటర్‌కి కూడా బిగించి దానితో ఆన్, ఆఫ్ చేయవచ్చని కనిపెట్టాడు. రిమోట్లు కొనాలంటే ఖర్చెక్కువ కాబట్టి దానికి ప్రత్యామ్నాయాలు ఆలోచించాడు. అప్పుడే రాంబాబు దృష్టి సెల్‌ఫోన్‌పై పడింది.
సెల్‌ఫోన్ రింగ్ ఇస్తే మోటర్ ఆన్ చేసే పద్ధతి కనుగొన్నాడు. నాలుగు సార్లు రింగ్ అయ్యే వరకు సెల్‌ఫోన్‌ను ఆన్‌లో ఉంచి వింటే మోటర్ తిరుగుతున్న శబ్దం, నీళ్లు పడే శబ్దం కూడా వినవచ్చు. రాంబాబు అక్కడితో కూడా ఆగలేదు... మోటర్ సర్క్యూట్‌కి మరో పరికరాన్ని అమర్చాడు. దానివల్ల మోటర్‌కి మూడు మీటర్ల దూరంలోకి ఎవరైనా వస్తే సైరెన్ మోగుతుంది. ఆ పరికరంలో ఫీడ్ చేసిన యజమాని నెంబర్‌కి వెంటనే కాల్ కూడా వస్తుంది. దీనివల్ల మోటర్‌ని దొంగలు ఎత్తుకెళ్లే అవకాశం కూడా ఉండదు. ఈ పరికరాన్ని మోటర్‌కి బిగించుకోవడానికి మూడువేల రూపాయలు ఖర్చు అవుతుంది. సహజంగానే రైతులకు ఇది బాగా నచ్చింది. ఇప్పుడు వాళ్ల ఊరు చుట్టుపక్కల గ్రామాల రైతులందరూ రాంబాబు సహాయంతో ఇళ్ల వద్దనుండే మోటర్లని సెల్‌ఫోన్‌తో ఆన్, ఆఫ్ చేసుకుంటున్నారు. వీటన్నిటినీ తయారు చేసిన రాంబాబు చదువుకున్నది రెండో తరగతే.
లైటెయ్యాలంటే రిమోట్ నొక్కితే చాలు...
బొమ్మగాని మల్లేష్ పదో తరగతి వరకూ చదువుకున్నాడు. పదహారేళ్ల వయసులో కుటుంబ పోషణకోసం బేకరీపని నుంచి క్లీనర్ పని వరకూ అన్ని రకాల పనులూ చేశాడు. అలా కష్టపడి ఇద్దరు అక్కల పెళ్లిళ్లు చేశాడు. చివరికి ఇంటి దగ్గరే ఎలక్ట్రిక్ షాపు పెట్టుకున్నాడు. ఉన్నట్టుండి తల్లికి పక్షవాతం వచ్చింది. దాంతో మంచానికే అతుక్కుపోయిన తల్లి పగలంతా ఒంటరిగా ఉండేది. ఫ్యాన్ వేసుకోవాలన్నా, లైట్ వేసుకోవాలన్నా మరొకరి సాయం అవసరమయ్యేది. దాంతో ఆ పనుల కోసం ఒక రిమోట్ తయారుచేసి తల్లి చేతిలో పెట్టాడు. ఆ రిమోట్‌తోటే ఇప్పుడు ఇంట్లో ఫ్యాన్, లైట్లు అన్నీ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. మల్లేష్ తల్లి చేతిలో ఆ రిమోట్‌ని చూసిన ప్రతివారూ తమకూ అలాంటిది తయారుచేసి పెట్టమని అతన్ని కోరారు. ప్రస్తుతం మల్లేష్ అదే పనిలో బిజీగా ఉన్నాడు.
ఆటోమేటిక్ స్టవ్ ఆఫ్
గద్వాల్‌లో ఉంటున్న ఇష్వాక్‌కు మిఠాయి దుకాణం ఉంది. తండ్రికి సహాయంగా షాపులోనే పనిచేస్తూ ఉంటాడు. ఓ రోజు ఇష్వాక్ ఒక దుర్వార్త విన్నాడు. గ్యాస్ స్టౌ పేలి ఇద్దరు చనిపోయారని. సిలిండర్ నుండి స్టౌకి ఉండే పైపులో నుంచి గ్యాస్ లీకవ్వడమే అందుకు కారణమని తెలుసుకొన్నాడు. స్టౌ కట్టేసినపుడు ఆటోమెటిక్‌గా సిలిండర్ కూడా ఆఫ్ అయ్యేలా ఓ పరికరాన్ని తయారు చేశాడు. ఇప్పుడు ఇష్వాక్ చాలామందికి ఈ ఆటోమెటిక్ పరికరాన్ని అమర్చిపెడుతున్నాడు. ఇష్వాక్ చెప్పేది ఒక్కటే..."చాలామంది స్టౌ కట్టేస్తారు కాని సిలిండర్ ఆఫ్ చెయ్యరు. పేలుళ్లకు ఆ అశ్రద్ధే కారణం. నేను కనిపెట్టిన ఈ పరికరం వల్ల కొందరైనా ప్రమాదం నుంచి తప్పించుకోగలిగితే నాకు అంతే చాలు.''
గ్యాస్ ఐరన్ బాక్స్
ఐరన్ బాక్స్ అనగానే మనకి గుర్తుకొచ్చేది బొగ్గులతో చేసేది, విద్యుత్‌తో నడిచేది. ఈ రెండింటికీ భిన్నంగా గ్యాస్‌తో వాడుకునే ఐరన్ బాక్స్‌ని తయారుచేశాడు వరంగల్ జిల్లా నర్సంపేట సమీపంలోని ఎల్లాయగూడెంకి చెందిన బ్రహ్మం. "బొగ్గు నింపి అంటించడం పెద్దపని. వర్షాకాలంలో అయితే ఇంకా తలనొప్పి. కరెంటు వాడకం ఖర్చుతో కూడుకున్న పని. పర్యావరణ రీత్యా కూడా గ్యాస్ మేలు. పైగా షాక్ కొడుతుందేమోనని భయపడాల్సిన అవసరం లేదు'' అంటాడు బ్రహ్మం. ఆ ఉద్దేశ్యంతోనే ఈ గ్యాస్ ఐరన్ బాక్స్‌ని కనిపెట్టానంటాడు. పైగా కరెంటు, బొగ్గు ఐరన్‌బాక్స్‌లతో పోలిస్తే గ్యాస్ బాక్స్‌కి అయ్యే ఖర్చు తక్కువని అంటాడు.
సైకిల్ తొక్కుతూ చేనుకు నీళ్లు పెట్టొచ్చు...
ఐదో తరగతి వరకు చదువుకున్న విక్రమ్‌ది ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు. తనకి, తన అన్నకి చెరో నాలుగెకరాల పొలం ఉంది. అన్నకి విద్యుత్ మోటార్ ఉంది కాని తమ్ముడు విక్రమ్ రాథోడ్‌కి లేదు. తన పొలంలో వ్యవసాయం చేసుకుంటూనే విక్రమ్ సైకిల్ రిపేర్లు చేసుకుంటూ బతుకుతున్నాడు. ఐదేళ్లక్రితం సంగతి... విక్రమ్ మూడెకరాల్లో పత్తిపంట వేశాడు, ఒక ఎకరంలో వరి వేద్దామనుకున్నాడు కాని మోటర్‌గాని కరెంటు సదుపాయం గాని లేకపోవడంతో ఆ పని చెయ్యలేకపోయాడు. కరెంటు లేకుండా మోటర్ నడపలేమా? అని ఆలోచించాడు. కరెంట్ మోటర్‌లో ఫ్యాన్ (నీటిని తోడే పుల్లీ) వేగంగా తిరగడం వల్లే నీరు పైకి వస్తుందని గుర్తించాడు. చేతితో కూడా ఆ ఫ్యాన్‌ని తిప్పవచ్చుకదా అని ఆలోచించాడు. ప్రయత్నిస్తే నీళ్లు కొద్ది కొద్దిగా వచ్చాయి. సైకిల్‌తో మోటర్‌ని అనుసంధానం చేస్తే ఎక్కువ నీళ్లు వస్తాయనుకున్నాడు. కాని విక్రమ్‌కు సొంత సైకిల్ కూడా లేదు. ఇంట్లో ఉన్న జొన్నలు అమ్మేసి పాత సైకిల్ ఒకటి కొన్నాడు. కావాల్సిన సామాగ్రి మొత్తం సమకూర్చుకుని మొత్తం మీద ప్రయత్నం మొదలెట్టాడు.
సైకిల్ చక్రం నిమిషానికి యాభై సార్లు తిరుగుతుంది. అదే మోటర్ అయితే మూడు వేల సార్లు తిరుగుంది. బెల్టుల సహాయంతో సైకిల్ రిమ్‌కు మోటర్ ఫ్యాన్‌ను కలిపాడు. సైకిల్ తొక్కుతుంటే మోటర్ నుంచి నీళ్లు వచ్చాయి. అలా సైకిల్ మోటార్‌తో ఒక సంవత్సరం వరి కూడా పండించాడు.
బైక్... బ్యాటరీ బైక్ !
వరంగల్ జిల్లా చెన్నారావుపేటకి చెందిన జగదీశ్వర్ బ్యాటరీతో నడిచే మోటర్ సైకిల్‌ని కనిపెట్టాడు. తొమ్మిదో తరగతి వరకు చదువుకొన్న జగదీశ్వర్ వృత్తి రీత్యా బైక్ మెకానిక్. బైక్ ఇంజన్లతో ఏవేవో ప్రయోగాలు చేయడం ఆయనకి అలవాటు. ఒకసారి తన స్నేహితుడి బండి తీసుకుని దానికొక బ్యాటరీ బిగించాడు. బైక్ నడుస్తుంటే దాన్లో ఉన్న బ్యాటరీ చార్జ్ అవడం గమనించాడు. ఆ చార్జ్ తోటే మళ్లీ బైక్‌ను నడిపి చూశాడు. అలా రెండు వందల కిలోమీటర్లు నడిపి చూపించాడు. ఎవరైనా ఆసక్తి చూపించి ఆర్థిక సహాయం చేస్తే ఈ బ్యాటరీలను తయారు చేస్తానని అంటున్నాడు జగదీశ్వర్.
ఆసు యంత్రం
తల్లి పడుతున్న కష్టం చూసి తట్టుకోలేపోయాడు మల్లేష్. ఏడేళ్లు కృషి చేసి ఆసుయంత్రం కనిపెట్టాడు. నల్గొండ జిల్లా ఆలేరు ప్రాంతానికి చెందిన చింతకింది మల్లేష్ ఏడవ తరగతితో చదువాపేసి చేనేత కార్మికుడిగా స్థిరపడ్డాడు. చీర నేతకు ముందు దారాలను ఆసుపోస్తారు. ఆ పనంతా తల్లిదే. ఒక చీరకు సరిపడా దారాలను చేత్తో ఆసు పోయడానికి ఆరు గంటల సమయం పడుతుంది. అదే మల్లేష్ కనిపెట్టిన ఆసుయంత్రంతో అయితే రెండు గంటల్లో ఆసు పోయవచ్చు. ఇప్పుడు చాలామంది మల్లేష్ నుండి ఈ యంత్రాల్ని కొనుగోలు చేస్తున్నారు.
దోమలకి చెక్...
దోమల బెడద గురించి వేరే చెప్పనవసరం లేదు. పల్లెల నుండి పట్టణాల దాకా అందరూ దోమల బెడద ఎదుర్కోక తప్పదు. పల్లెటూళ్లలో అయితే మనుషులు దోమతెరలతో వాటి బారినుంచి బయట పడినా గేదెలు, ఆవుల పరిస్థితి ఏమిటి? అందుకే ఈ సమస్యకి పరిష్కారం కనుగొనాలనుకున్నాడు చిత్తూరు జిల్లా కారకొల్లు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అనే రైతు. తెల్లజుమ్కి అనే చెట్టు రసం దోమల నివారణకి ఉపయోగపడుతుందని కనిపెట్టాడు. ఈ రసం నుంచి తయారుచేసిన తైలం కొద్దిగా మన ఒంటికి రాసుకుంటే దోమలు మనదరికి చేరవు. ఇంటి చుట్టుపక్కల నీళ్ల గుంటల్లో దీన్ని కొద్దిగా వేస్తే దోమగుడ్డు పూర్తిగా చనిపోతుందని కూడా తెలుసుకున్నాడు.
వీళ్లంతా తమకొచ్చిన ఆలోచనలని ఆచరణలో పెట్టి విజయం సాధించిన వారే. అయితే అలాంటి వారికి తగిన గుర్తింపు రావాలంటే ఏం చెయ్యాలి? వారి ప్రయోగాల గురించి, సాధించిన విజయాల గురించి బయటి ప్రపంచానికి తెలియజేయడమే కాకుండా వారు తయారు చేసిన వస్తువులకి పేటెంట్‌లు ఇ ప్పించే పనిలో ఉంది హనీబీ అనే స్వచ్ఛందసంస్థ. అంతేకాదు వీరి గురించి నలుగురికి తెలిపే పనిలో భాగంగా పల్లె సృజన పేరుతో ఒక మాసపత్రికని కూడా ప్రచురిస్తోంది.
హనీబీ ఎవరు?
హనీబీ అంటే తేనెటీగ. తేనెటీగ ఏం చేస్తుంది? పువ్వుల్లోని మకరందాన్ని తీసుకెళ్లి తేనెగా మారుస్తుంది. అదే ఉద్దేశంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్ అనిల్‌గుప్తా ఈ హనీబీ సంస్థని 1989లో స్థాపించారు. పల్లె ప్రజల్లో ఉండే విజ్ఞానం అందరికీ అందాలనే ఆలోచనే దీన్ని నెలకొల్పడం వెనక ఉద్దేశం. మారుమూల పల్లెల్లోని ఈ గ్రామీణ శాస్త్రవేత్తలని జాతీయ ఆవిష్కరణా సంస్థ (నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్-ఎన్.ఐ.ఎఫ్.)తో అనుసంధానం చేయడమే హనీబీ పని.
ప్రకృతికి దగ్గరగా ఉండే పల్లెవాసులు వారి అవసరాల కోసం రకరకాల ఔషధాలు, వస్తువులు తయారు చేసుకుంటారు. వారి విజ్ఞాన సంపద నలుగురికీ తెలిసే అవకాశం తక్కువ. ఎందరో పల్లెవాసుల విజ్ఞానాన్ని చూసిన ఆయన దేశంలోని అన్ని రాష్ట్రాలకు హనీబీ నెట్‌వర్క్‌ని విస్తరించారు. దీనిలో పనిచేసేవారంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చినవారే. పెద్దపెద్ద ఉద్యోగాలు చేసి పదవీ విరమణ చేసినవారు చాలామంది ఈ సంస్థలో చేరుతున్నారు. మన రాష్ట్రం విషయానికొస్తే... బ్రిగేడియర్ గణేశం, డా.కె.ఎల్ రావు, పి. చంద్రకాంత్ శర్మ అనే ముగ్గురు 2005లో ఈనెట్‌వర్క్‌లో చేరారు.
కొన్నాళ్లకు దీని విశిష్టత తెలుసుకుని ఇంకా చాలామంది వీరితో చేతులు కలిపారు.తమ దృష్టికి వచ్చిన పల్లె 'శాస్త్రవేత్తల' గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటుంది హనీబీ. ఆ వ్యక్తి కనిపెట్టిన వస్తువుని పరిశీలించి ముందుగా దాని వివరాలను రికార్డు చేస్తారు. ఇంకెక్కడైనా అలాంటి వస్తువు వాడకంలో ఉందో లేదో కనుక్కొంటారు. ఒకవేళ లేకపోతే దాని అవసరాన్ని గుర్తించి వారికి పేటెంట్ హక్కు ఇప్పిస్తారు. ఆ వస్తువు పట్ల ఆసక్తి చూపే సంస్థల్ని సంప్రదిస్తారు, పెద్ద ఎత్తున ఆ వస్తువు తయారుచేయడానికి ఆ వ్యక్తే సిద్ధమైతే వాటిని మార్కెట్‌లో అమ్ముకోడానికి తగిన సదుపాయాల్ని కూడా సమకూరుస్తారు.
దేశవ్యాప్తంగా లక్షానలభై వేల ఇన్నొవేటర్ల గురించి తెలుసుకొని వాళ్లు కనిపెట్టిన వస్తువుల గురించి రికార్డ్ చేసింది ఈ సంస్థ. వాటిలో డెభ్బైశాతం సంప్రదాయ జ్ఞానంతో తయారైనవైతే ముప్పైశాతం సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించి తయారు చేసినవి. మన రాష్ట్రంలో ఇప్పటివరకు 74 మంది ఇన్నొవేటర్లని వారు గుర్తించారు. వీరి ఆవిష్కరణలను ఎన్.ఐ.ఎఫ్‌లో రిజిష్టర్ చేశారు. వీరిలో నలుగురి ఆవిష్కరణలను పారిశ్రామికవేత్తలకు అందించి వారితో ఆర్థిక ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రం నుండి ఎన్.ఐ.ఎఫ్‌కి మొత్తం వెయ్యికి పైగా ఎంట్రీలు వచ్చాయట.
శోధ(న) యాత్రలు కూడా...
తమంతట తాము పంపేవాళ్ల సమాచారంతో ఆగిపోకుండా ఈ సంస్థ ప్రతినిధులు దేశమంతటా పర్యటించి జనం సృజనాత్మకంగా తయారు చేసుకున్న పరికరాలను గుర్తించే పనికూడా పెట్టుకున్నారు. హనీబీ అధ్యక్షుడు అనీల్‌గుప్తా సారధ్యంలో ఆర్నెల్లకొకసారి ఈ శోధ యాత్ర జరుగుతుంది. బ్రిగేడియర్ గణేశం మాటల్లో చెప్పాలంటే... శోధ యాత్ర అంటే 'మరుగున పడిన జ్ఞాన దేవాలయాలను సందర్శించే తీర్థ యాత్ర'. ఈ యాత్రలో పాల్గొన్నవాళ్లు మారుమూల గ్రామాలు, గిరిజన తండాల్లో తిరిగి వారి జీవనవిధానాల్ని పరిశీలించి వారిలోని ఇన్నొవేటర్లని గుర్తిస్తారు. యాత్రలో 60 నుంచి 70 మంది దాకా పాల్గొంటారు. వారిలో పలురాష్ట్రాలకు చెందిన రైతులు, పరిశోధకులు, విద్యార్థులు, నిపుణులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, విదేశీయులు ఉంటారు. దేశంలోని అన్ని ప్రదేశాల్లోనూ ఈ యాత్ర జరుగుతుంది. ఇప్పటివరకు మొత్తం 24 శోధ యాత్రలు చేశారు.
వందలో ఒక్కరికి గౌరవం దక్కినా చాలు...
"పల్లె శాస్త్రవేత్తల ఇన్నొవేషన్స్ పెద్ద ఖరీదు కూడా ఉండవు. పైగా కనిపెట్టిన ఏ వస్తువైనా పదిమందికి ఉపయోగపడితే చాలనుకుంటారు కాని వాటి వల్ల ఆర్థికంగా ఎదిగిపోవాలన్న అత్యాశ వారికి లేదు. అదే వారి గొప్పతనం. అలాంటి వారికి పూర్తిస్థాయిలో న్యాయం జరగకపోయినా కొంతలో కొంతైనా వారికి గుర్తింపు లభించేందుకు కృషి చేస్తున్నాం. దీనికి చింతకింద మల్లేషే పెద్ద ఉదాహరణ. తల్లి పడుతున్న కష్టం చూడలేక ఆసు యత్రం కనిపెట్టాడు. అది ఎందరో తల్లులకు వరమైంది. హనీబీ నెట్‌వర్క్ మల్లేష్‌కి జాతీయస్థాయిలో గుర్తింపుని తీసుకొచ్చింది. వందలో ఒక్కరికి ఇలాంటి గౌరవం దక్కినా చాలు. మేము చేస్తున్న పనికి సార్థకత చేకూరుతుంది'' అంటారు బ్రిగేడియర్ గణేశం.
గుర్తింపు అంతంత మాత్రమే!
ఈ ఆవిష్కరణలకి పరిశ్రమల నుండి వస్తున్న స్పందన మాత్రం అంతంత మాత్రమే. ఇష్వాక్ కనిపెట్టిన గ్యాస్ స్టౌని ఆపే యంత్రం గురించి హనీబీ వాళ్లు బెంగుళూరులోని గ్యాస్ కంపెనీ నిపుణులకు తెలియజేస్తే వాళ్లు చెప్పిన సమాధానం ఇదీ- ఇకముందు తయారు చేసే పైపుల్లో నుంచి గ్యాస్ లీకయ్యే ప్రమాదముండదు. ఆ రకమైన పైపులు తయారు చేశాం కాబట్టి ఇష్వాక్ ఇన్నొవేషన్‌తో పని లేదన్నారు. మంచిదే. కాని తాము కనిపెట్టలేని దాన్ని కనిపెట్టాడనైనా ప్రశంసించి ఉండవచ్చు.
బైక్ నడుస్తుంటే రీచార్జ్ అయ్యే బ్యాటరీ తయారు చేసిన జగదీశ్వర్ పరిస్థితి కూడా ఇంతే. అతని ఆవిష్కరణను స్వీకరించే సంస్థలేవైనా ముందుకు వస్తాయేమో కనుక్కునే ప్రయత్నం చేసింది హనీబీ. ఒక పేరున్న సంస్థని సంప్రదిస్తే వారు జగదీశ్వర్‌ని ఆ బ్యాటరీ తయారీ వివరాలు చెప్పమని అడిగారు. ఆ రహస్యాన్ని చెప్పడానికి ఇష్టపడని జగదీశ్వర్ వెనుదిరిగాడు.
సైకిల్-మోటర్ తయారు చేసిన విక్రమ్ గురించి తెలుసుకున్న హనీబీ సంస్థ వాటిని తయారు చేయడానికి ఆయనకి ఆర్థిక సహాయం చేసింది. ఆ సహాయంతో విక్రమ్ పది యంత్రాలను తయారు చేసి ఢిల్లీలో అమ్మాడు కూడా. అయితే స్థానికులు మాత్రం ఈ సైకిల్ మోటార్ పట్ల ఎలాంటి ఆసక్తి చూపలేదని అంటాడు విక్రమ్. ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తే ఈ పరికరాలు మరిన్ని తయారు చేస్తానని అంటున్నాడు.
చంద్రశేఖర్ తయారు చేసిన దోమల తైలాన్ని పూర్తిగా పరిశీలించి హనీబీ ఎన్.ఐ.ఎఫ్‌కి దాని వివరాలు పంపింది. వారు చంద్రశేఖర్‌కి 85 వేల రూపాయల వడ్డీ లేని రుణాన్ని ఇచ్చారు.
గ్యాస్ ఐరన్ బాక్స్‌ది మరోకథ. దాని గురించి తెలుసుకొన్న హనీబీ ఒక ప్రైవేటు సంస్థతో మాట్లాడి అక్కడ బ్రహ్మం ఆలోచనకి గుర్తింపునిచ్చే ప్రయత్నం చేసింది. కాని అది ఫలించలేదు. అయితే హనీబీ సంస్థ బ్రహ్మంకి పేటెంట్ హక్కుల్ని కూడా ఇప్పించింది. తనకి ఏదైనా మార్గం చూపమని ఆయన మళ్లీ హనీబీనే ఆశ్రయించాడు. ఆయనలాంటి వారి కోసమని హనీబీ నెలకొల్పిన 'క్రియేటివ్ మైండ్స్' కంపెనీలో ఈ గ్యాస్ ఐరన్ బాక్స్ తయారుచేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇన్నాళ్లకి తన కలకి గుర్తింపు వస్తున్నందుకు బ్రహ్మం చాలా సంతోషపడుతున్నాడు. ఈ సంస్థ విడుదల చేయబోయే మొట్టమొదటి ఉత్పత్తి కూడా ఇదే.
మల్లేష్ తయారు చేసిన ఆసు యంత్రం గురించి తెలుసుకున్న హీనీబీ ఆయనకి పేటెంట్ ఇప్పించడంతోపాటు ఇతర రాష్ట్రాల్లోని చేనేత కార్మికులకు ఈ యంత్రాలను అమ్ముకునే సదుపాయాల్ని కూడా కల్పించింది. మన రాష్ట్రంలోనే 500 వందల ఆసు యంత్రాల్ని మల్లేష్ అమ్ముకుని ఆర్థికంగా స్థిరపడ్డాడు. మల్లేష్ సృజనాత్మకతకి రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది.
మీకు కూడా ఇలాంటి ఆవిష్కరణల గురించి తెలిస్తే వాటి గురించి, వాటి ఆవిష్కర్తల గురించి హనీబీకి తెలియజేయవచ్చు. హనీబీ ఫోన్ నంబర్ 040-271185555.

'క్రియేటివ్ మైండ్స్' వచ్చేసింది...
ఎంతో శ్రమపడి తయారుచేసిన వస్తువులు, కనుగొన్న ఔషధాలకు గుర్తింపులేకుండా పోవడాన్ని హనీబీ కో ఆర్డినేటర్లు జీర్ణించుకోలేకపోయారు. వారికి తగిన గుర్తింపు తీసుకురావడానికి కంపెనీల చుట్టూ ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయారు. వీరికి ఒక ఉపాయం తట్టింది. 'ఇంత కష్టపడుతున్న మనం మన ఇన్నొవేటర్ల కోసం ప్రత్యేకంగా ఒక కంపెనీనే స్థాపించుకుంటే ఎలా ఉంటుంది' అనుకున్నారు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. మూడు నెలల క్రితం 'క్రియేటివ్ మైండ్స్' పేరుతో కంపెనీని స్థాపించారు. దీనికి వారే పెట్టుబడి పెట్టుకున్నారు. ఇప్పుడు ఎవరైనా ఇన్నొవేటర్ తను కనుగొన్న వస్తువుని ఈ కంపెనీ ద్వారా మార్కెట్‌లోకి తెచ్చుకోవచ్చు.. * భువనేశ్వరి