చేకూరి గౌతమరాజు

చేకూరి గౌతమరాజు
Facebook

Tuesday, August 24, 2010

అనుబంధానికి ‘రాఖీ’

rakhi
అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి... కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నదీ అని ఓ చెల్లెలు తన అన్నయ్య అనురాగం గురించి పాడడంలో ఎంతో అర్థముంది... తనను ప్రాణంకన్నా మిన్నగా ప్రేమించే అన్నయ్యలంటే ఈ ప్రపంచంలో ప్రతి చెల్లెలికీ అభిమానం, అనురాగం, ఆప్యాయత. ఇంతటి ఆత్మీయతను పంచే అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక ‘రక్షాబంధన్‌’ పండుగ. దుర్బలులను దుర్మార్గులనుంచి కాపాడాలన్న సంస్కృతికి నాగరకతకు ప్రతీక రాఖీ. ప్రతి యేటా శ్రావణమాసంలో వచ్చేపౌర్ణమినే శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పౌర్ణమి అంటారు. ఉత్తర భారతంలో ఈ పండుగను కజ్రీ పూర్ణిమ అని కూడా అంటారు. అక్కడ ఈ సమయంలోనే రైతులు గోధుమ, బార్లీ నాట్లు వేయటం విశేషం.

rakhi3
ఒక కుటుంబంలోనే కాక యావత్‌ సమాజంలో సోదర ప్రేమకు, సుహృద్భావానికి రాఖీ ప్రతీక నిలుస్తుంది. సమాజంలో సామరస్యానికి పునాది వేస్తుంది. శాంతియుత సహజీవనానికి రాజమార్గం రాఖీ. గురుదేవులు విశ్వకవి రవీంద్రుడు రాఖీ ఉత్సవాలను భారీ ఎత్తున జరిపించేవారు. ఈ రోజు ‘ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌’గా ప్రచారంలో వున్నది ఒక విధంగా రాఖీ సంప్రదాయానికి కొనసాగింపేనంటే అతిశయోక్తి కాదు. ఒక పురుషుడు సాటియువతిపై హద్దుమీరిన మమకారం పెంచుకున్న సందర్భంలో ఆ సదరు యువతికి అతనిపై ఇష్టం లేనట్లయితే... ఆ మక్కువను స్నేహానికే పరిమితమని అది సోదర ప్రేమగా మాత్రమే ఉంటే బాగుంటుందని సున్నితంగా సూక్షంగా రాఖీ ద్వారా తెలియజేస్తుంది. అలాంటి పవిత్ర సోదర ప్రేమకు ప్రతీక అయిన రాఖీ పండుగ మూలాలు ఇప్పటివి కావు. చరిత్రలో ఎందరో ప్రముఖులు రాఖీ ద్వారా తమ సోదరప్రేమను చాటుకున్నారు.

అలెగ్జాండర్‌కు రాణీ సంయుక్త రాఖీ
rakhi2పురుషోత్తమ మహారాజుకు అలెగ్జాండర్‌కు మధ్య జరిగిన యుద్ధంలో పురుషోత్తముడు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. తన చేతిలో పరాజితుడైన పురుషోత్తముడిని అలెగ్జాండర్‌ బందీని చేసి తీసుకువెళ్తున్న సమయంలో ఆ విషయం తెలుసుకున్న పురుషోత్తముని భార్య రాణీ సంయుక్త వెంటనే అలెగ్జాండర్‌ వద్దకు వెళ్లి అతని చేతికి రాఖీ కడుతుంది. దాంతో సంయుక్తను చెల్లెలిగా అంగీకరించిన అలెగ్జాండర్‌ ఏమి కావాలో కోరుకోమంటాడు. యుద్ధంలో పరాజితుడై బందీగా పట్టుకున్న తన భర్త పురుషోత్తముడిని బంధ విముక్తుడిని చేయాలని ఆమె వేడుకుంటుంది. దీనికి అలెగ్జాండర్‌ ఒప్పుకొని పురుషోత్తముని విడిచి పెట్టడంతోపాటు అతని రాజ్యాన్ని కూడా తిరిగి ఇచ్చేస్తాడు. రాఖీ కట్టి సోదరి అయిన రాణీ సంయుక్తను విలువైన కానుకలతో సత్కరించి తిరిగి వెళతాడు.

బలి చక్రవర్తి కాలంలో...
దానవుల రాజుగా వాసికెక్కిన బలి చక్రవర్తి కాలంలో అతనికి బందీలైన వారంతా
‘‘యేన బద్ధో బలీరాజా... దానవేంద్రో మహాబలః...
తేనత్వాం అభిబద్ధామి... రక్షేమాచల మాచల’’... ఆయన చేతికి రాఖీ కట్టి తమను తాము కాపాడుకున్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.
సుదూర ప్రాంతాల్లోని సోదరులకు సైతం ‘రాఖీ’లు
‚అయితే ఈ రాఖీ పండుగను వివిధ ప్రాంతాల వారు వివిధ పేర్లతో పిలిచినా ఎక్కువగా ‘రక్షాబంధన్‌’ పేరుతో వ్యవహరిస్తారు. పెళ్లై అత్తవారింట్లో ఉన్న సోదరీ మణులు సైతం పండుగ రోజున తమ పుట్టింటికి వచ్చి సోదరులకు రాఖీ కడుతుంటారు. ప్రస్తుత ఆధునిక కాలంలో రాఖీలను దూర ప్రాంతాల్లో ఉన్న తమ అన్నదమ్ములకు ప్రత్యేకంగా రాఖీలను పంపుతుంటారు అక్కా చెల్లెళ్లు.

క్రిష్ణుడి చేతికి ద్రౌపది రాఖీ..
rakhi4ద్వాపరయుగం కాలంలో సైతం రాఖీ పండుగ అత్యంత విశిష్టతను చాటుకుంది... శ్రీకృష్ణుని చేతికి ద్రౌపది రాఖీ కట్టి తనను రక్షించా లని కోరుతుంది. ఇదే క్రమంలో ఆమెకు కష్టం వచ్చిన ప్రతిసారి శ్రీకృష్ణుడు వచ్చి ఆదుకునేవాడు. ఇలా చెప్పుకుం టూ వెళితే మన పురాణాల్లో మరెన్నో సంఘటనలు అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తాయి.

‘రాఖీ కేరాఫ్‌ ధూల్‌పేట్‌‌‌’
నగరంలోని ధూల్‌పేట్‌ రాఖీల తయారీకి పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో ఏ సీజన్‌కు ఆ వస్తువులను తయారుచేయడం ప్రత్యేకత. అయితే రాఖీ పండు గకు రెండు నెలల ముందునుంచే పెద్ద ఎత్తున, రకరకాల రాఖీలను తయా రు చేస్తూ వందలాది కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. గతంలో పెద్ద సైజులో మెరుపు కాగితాలతో వీరు రాఖీలను తయారు చేసేవారు అయితే మారుతున్న కాలంతో పాటే వీరు కూడా రాఖీలను అందంగా అర్థవంతంగా తయారుచేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. నగరంలోనేగాక రాష్ట్రంలోని ఇతర ప్రాం తాలకు, దేశ, విదేశాలకు సైతం వీరు తయారుచేసిన రాఖీలే వెళుతుండడం విశేషం. రాఖీ పండుగ దగ్గరపడడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే రంగురంగుల, అందమైన రాఖీలు మార్కెట్‌లో కొలువుదీరాయి.

rakhi1రాఖీ రాజ్యాల మధ్య బాంధవ్యం నెలకొల్పిందనేదది చారిత్రక సత్యం. రాజ్‌పుట్‌, మరాఠా రాణులు మొగలాయి చక్రవర్తులకు రాఖీలు పంపి సామరస్య బాంధవ్యాలు నెలకొల్పిన ఉదంతాలు చరిత్రలో కోకొల్లలు. రాఖీ పౌర్ణమి నాడు అక్కా చెల్లెళ్లు తమ సోదరులకు కట్టే రాఖీ కేవలం దారానికి పూలు, మెరుపు కాగితాలు అలంకరించిన ఒక ఆభర ణంగా మాత్రమే భావించడానికి వీలులేదు. ఇది అన్నా చెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ముడిపడి ఉన్న బలమైన ప్రతీక. తమ సోదరులు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని చెల్లెళ్లు కోరుకుంటే, తమ అక్కా చెల్లెళ్లు సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలని అన్నద మ్ములు కోరుకుంటారు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ రాఖీ పండుగను దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలు ప్రత్యేకంగా జరుపుకొంటారు. రాఖీ పండుగ ఈనాటిది కాదని తరతరాలుగా ఈ సంప్రదాయం వుంద నడానికి ఎన్నో గాథలు మనకు పురాణాల్లో కనిపిస్తాయి.

కేవలం స్వగ్రామంలోనే ఉన్న సోదరులకేగాక దేశ, విదేశాల్లో స్థిరపడ్డ అన్నదమ్ములకు సైతం రాఖీలు పంపే సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో పండుగలు సైతం ఆ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుం టున్నాయి. నేడు విదేశాల్లో ఉన్న తమ సోదరులకు చాలామంది యువతలు ఇంటర్‌నెట్‌ కేవలం ఒక మౌస్‌ క్లిక్‌తో రాఖీ కట్టేస్తున్నారు. కొన్ని సంస్థలు ఇంటర్నెట్‌ ద్వారా ఆర్డర్లు తీసుకొని రాఖీలను చేరవేస్తున్నాయి. వారు వెబ్‌సైట్లలో ముందే పొందు పరిచిన రాఖీ నమూనాల నుండి మనకు ఇష్టమైన రాఖీని ఎంచుకొని విదేశాల్లో ఉన్న సోదరులకు పంపవచ్చు.


ఎంత దూరమైనా ఒక్కరోజులోనే సోదరులకు ‘రాఖీ’
ఇతర ప్రాంతాల్లో ముఖ్యంగా విదేశాల్లో ఉన్న సోదరులకు ఇప్పటివరకు పోస్టు ద్వారా రాఖీలను పంపేవారు. దీనివలన షిప్‌లలో వెళ్లే మెయిల్‌కయితే అమెరికా, యుకె వంటి సుదూర దేశాలకు రాఖీ అందడానికి కనీసం పక్షం రోజులైనా పట్టేది. ఒకవేళ విమానంలో పంపినా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే కొన్ని సంస్థలు ఈ సమస్యకు పరిష్కారంగా ప్రత్యేక వెబ్‌సైట్‌లను ప్రారంభించాయి. ఈ వెబ్‌సైట్‌లలో లాగిన్‌ అయి ఆర్డర్‌ చేస్తే తాము కోరుకున్న ప్రాంతంలోని చిరునామాకు అదే రోజున రాఖీ అందే ఏర్పాటు చేస్తూ కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. ఇందులో భాగంగా మంగళవారం ఓ ప్రైవేట్‌ సంస్థ నెలకొల్పిన ఠీఠీఠీ.జీజ్టట2టజీ.ఛిౌఝ ప్రత్యేక వెబ్‌సైట్‌ను హీరో వరుణ్‌ సందేశ్‌, వర్ధమాన నటి శరణ్య మోహన్‌లు ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా ఆర్డర్‌చేసిన రోజునే అమెరికా, యు.కె, కెనడా వంటి దేశాల్లో ఉన్నవారికి రాఖీలు అందే ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
- ఏముల ఈశ్వర్‌బాబు,

ప్రేమను బంధాం రాఖీ బంధాం

బలహీనమైన దారాలే బలమైన అనుబంధాలకు ఆలంబన కావడం మన సంస్కృతిలోని ఒక వైచిత్రి. భార్యాభర్తల బంధానికి మంగళ సూత్రం ఒక చిహ్నమయితే సోదరీసోదరుల అనుబంధానికి రాఖీ అందమైన ప్రతీకగా మారింది. సారంలోనే కాదు రూపంలోనూ ఇది ఏటా కొత్త అందాన్ని సంతరించుకుంటోంది. మార్కెట్‌లో ఉన్న కొన్ని కొత్త రాఖీల గురించి తెలుసుకుందాం.

రాఖీ అంటే ఇప్పుడు కేవలం ఒక ఎర్రదారం కడితే సరిపోదు. మీ సోదరుల పట్ల మీ ప్రేమ ప్రత్యేకమైనదని తెలియజెప్పాలంటే మీరు ఎంచుకునే రాఖీకి అలాంటి ప్రత్యేకత ఏదో ఉండాలి మరి. స్టోన్ వర్క్, కుందన్, ముత్యాలు, రుద్రాక్ష, చమ్కీ, బటన్ హోల్, వెల్‌వెట్, త్రిజోన్, సింగిల్ పీస్, ఫ్యాన్సీ మెటల్, జరీ, డోరీలు, చందన్, రేషం, కోల్‌కత్తా పర్ని, పంజాబి, లుంబ, క్రిస్టల్ బీడ్స్, జర్దోసీ వర్క్ ఇన్ని రకాల రాఖీలున్నాయి కాబట్టి వాటిల్లోంచి మీకూ మీ సోదరుడికీ ఏది నచ్చుతుందో ఆలోచించి ఎంపిక చేసుకోవచ్చు.

కాస్త కాస్ట్‌లీ
ఒక రూపాయి నుంచి 300 రూపాయల వరకు రాఖీలు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. ఇంకా కాస్త కాస్ట్‌లీవి కావాలంటే విలువైన రుద్రాక్షలు, రాళ్లు అద్దినవి, మోతీ, వెండి, డైమండ్ రాఖీలను మీ స్థోమతని బట్టి ఎంచుకోవచ్చు. పది, వంద, ఐదు వందల రూపాయల నోటు పెట్టి అల్లిన రాఖీలు కూడా మార్కెట్‌లో దొరుకుతున్నాయి.

పిల్లలకు ప్రత్యేకం
పిల్లల రాఖీలంటేనే స్పెషల్‌గా ఉంటాయి. వారి ఆల్‌టైమ్ ఫేవరెట్ స్పైడర్ మ్యాన్ రాఖీలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మగధీర, బాల హనుమాన్ , జూజూ రాఖీలు ఇప్పుడు కొత్తగా వచ్చాయి. బైక్స్, మిక్కీ మౌస్, టామ్ అండ్ జెర్రీ, పవర్ రేంజర్స్, జంతువులు, పక్షుల బొమ్మలున్న రాఖీలు కూడా పిల్లల కోసం ప్రత్యేకంగా అమ్ముతున్నారు.

భయ్యా బాబీ రాఖీలు
కేవలం సోదరుల కోసమే కాదు అన్నా వదిన, తమ్ముడు మరదలు కోసం ప్రత్యేకమైన రాఖీ సెట్లు భయ్యా బాబీ రాఖీల పేరుతో దొరుకుతున్నాయి. అంతేకాదు వేరే ఊర్లో ఉండి స్వయంగా వెళ్లి రాఖీ కట్టలేని వారు కొరియర్ చేసేందుకు వీలుగా కుంకుమ, గంధం, అంక్షింతలు ఉన్న ప్యాకేజీలు కూడా ఉన్నాయి.

ఫోటో రాఖీలు
ఈ రక్షాబంధన్‌కి 'సువా గిఫ్ట్స్' వాళ్లు ప్రత్యేక రాఖీలు తయారుచేశారు. ఇప్పటి వరకు ఎవరూ చేయని ప్రయోగాన్ని వాళ్లు చేశారు. చుట్టూ మెటల్ బీడ్స్, స్టోన్స్, జరీ మధ్యలో రాఖీ కట్టించుకునే అన్న ఫోటో లేదా వాళ్ల పక్కన మీరున్న ఫోటో ఉండటమే ఈ రాఖీ ప్రత్యేకత. పది రోజుల కిందట మార్కెట్లోకి వచ్చిన ఈ రాఖీలు ఇప్పటికే వెయ్యికి పైగా అమ్ముడయ్యాయి.

మీకు కావాల్సిన ఫోటో ఇస్తే అరగంట వ్యవధిలో చేసి ఇస్తారు. ఈ రాఖీలకు రాష్ట్రం నుంచే కాదు దేశం నలుమూలల నుంచి మంచి డిమాండు వస్తోందని చెప్పారు వీటి రూపకర్తలు సిద్ధార్థ జైన్, పవన్ రాజ్ జైన్‌లు. కుంకుమ, అక్షింతలు, ఒక డైరీ మిల్క్ చాక్‌లెట్ మధ్యన ఈ రాఖీ ఒదిగి అందమైన ప్యాక్‌లో లభిస్తుంది. కాబట్టి రాఖీ కట్టగానే కుంకుమ, అక్షింతలు, స్వీట్ కోసం వెతుక్కునే పనికూడా ఉండదు. బావుంది కదూ ఈ ఏర్పాటు.

రేటు కాస్త ఎక్కువే 225 రూ. ఇవీ, ధూల్‌పేటలో తయారయ్యే కొన్ని రకాల రాఖీలు మినహా ఎక్కువ రాఖీలు మనకు ఢిల్లీ, ముంబై, కోల్‌కతాల నుండి వస్తాయి. వీటిలో కోల్‌కతా ఫ్యాన్సీ రాఖీలకు ఎక్కువ డిమాండ్ ఉందని చెప్పారు. హోల్‌సేల్ డీలరు సురేష్ యాదవ్.

ఇంటర్ నెట్ రాఖీలు
విదేశాల్లో ఉండేవారు ఇక్కడ తమ వారికి రాఖీని, కానుకలను పంపేందుకు కొన్ని వెబ్‌సైట్లు సహకరిస్తున్నాయి. అందులో మనం ఎంచుకున్న రాఖీని, కానుకలను మనం ఇచ్చిన చిరునామాకు ఆ పోర్టల్స్ పంపుతాయి. అందుకోసం కొంత ఛార్జి తీసుకుంటున్నాయి. అలాంటి కొన్ని వెబ్‌సైట్లు ఇవి.

www.sendrakhigiftstoindia.com
rakhi.rediff.com
rakhi.indiangiftsportal.com
www.virtualrakhi.com
www.rakhiindia.com

1 comment:

  1. Rakhi is the festival of brother and sister. It increase the love between them so the sister never skip Send Rakhi to the brother when he is out of country.

    ReplyDelete