చేకూరి గౌతమరాజు

చేకూరి గౌతమరాజు
Facebook

Thursday, August 12, 2010

పెట్స్ కోసం లండన్ టు ఢిల్లీ బైరోడ్

ఒక జీపు..
ఇద్దరు వ్యక్తులు..
15 దేశాలు..
51 రోజులు..
13,500 కిలోమీటర్లు..
లండన్ నుంచి న్యూఢిల్లీ వరకు..
అంతా రోడ్డు ప్రయాణమే.

పెంపుడు జంతువుల కోసం ఒక జంట జరిపిన అవగాహన యాత్ర ఇది. లండన్‌లో నివసిస్తున్న తుషార్, పూజ దంపతులు ఈ వినూత్న ప్రయాణం చేసి ఎన్నో అనుభవాలు మూటగట్టుకున్నారు. ఆ మహాయాత్రలోని కొన్ని మైలురాళ్లను ఇమెయిల్ ద్వారా ఇలా పంచుకున్నారు.

ప్లాన్ ఎ
లాంగ్ డ్రైవ్ అందరికీ ఒక కల. ఆ కలకు ఒక ప్రతిఫలం ఉండాలి. అది చరిత్రలో నిలిచిపోవాలి. అప్పుడే మనస్సుకు తృప్తి. పడ్డ కష్టానికి ప్రయోజనం. పెంపుడు జంతువుల పట్ల అవగాహన కల్పించడంతో పాటు ఢిల్లీకి చెందిన ఫ్రెండికోస్ స్వచ్ఛంద సంస్థ కోసం నిధులు సేకరించటం మా యాత్ర ఉద్దేశ్యం. పదిహేను దేశాల మీదుగా ప్రయాణం అంటే అంత సులువు కాదు.

రూట్ మ్యాప్ సరిగ్గా ఉండాలి. వీసాలు, పర్మిట్లు, వెహికిల్, ఇన్సూరెన్స్, వసతి, వనరులు, ఆహారం.. ఇన్ని చూసుకోవాలి. ఆరునెలల పాటు ఇంటర్‌నెట్‌లో సర్చ్‌చేసి ఒక ప్లాన్ రూపొందించాం. వీసాలు, పర్మిట్లు, ఇన్సూరెన్స్‌లు, కార్నెట్లు, స్పాన్సర్లను రెడీ చేసుకోవడానికి తలప్రాణం తోకకొచ్చింది.

ప్లాన్ బి
మాకు అన్ని సదుపాయాలూ ఉండే ఒక వాహనం కావాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది దాని ధర. ఎందుకంటే ఫారిన్ వెహికిల్ ఇండియాలో తిరగాలంటే కార్నెట్ డి ప్యాసెజ్ డాక్యుమెంట్ ఉండాలి. అందుకోసం వాహనం ధరలో 15శాతం సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. చాలా వాహనాలు పరిశీలించిన తర్వాత చెరోకీ 2.5 లీటర్ స్పోర్ట్ జీప్‌ని ఎంపికచేశాం.

దానికి గూఫీ అని పేరు పెట్టాం. అది ఢిల్లీలోని మా కుక్క పేరు. ఆహారం, మందులు, ఎంపీ3 సీడీలు, జెర్రీ క్యాన్లు, పోర్టబుల్ కిచెన్, పోర్టబుల్ టాయ్‌లెట్, ల్యాప్‌ట్యాప్, డిజిటల్ కెమెరా, వీడియోక్యామ్, ఛార్జర్లు అన్నీ జీపులో ఎక్కించేందుకు 12 బ్యాగులు రెడీ చేసుకున్నాం.

డే1 : ఏప్రిల్ 17, 2010 ఉ. 7.15, మెహు యానిమల్ సెంటర్, లండన్
ఇండియన్ హై కమిషన్ ఫస్ట్ సెక్రటరీ జితేందర్‌కుమార్ జెండా ఊపి మా జర్నీని ప్రారంభించారు. డోవర్ మీదుగా ఫ్రాన్స్‌లోని డన్‌కిర్క్‌లో ల్యాండ్ అయ్యాం. ఆదిలోనే హంసపాదు అన్నట్లు జిపిఎస్ పనిచేయడం మానేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. మేం తప్పుగా వెళ్తున్నట్లు అర్థమౌతోంది. అట్లస్ వెతుకుదామంటే అది వెనక ఏ బ్యాగ్‌లో ఉందో తెలియదు.

ఎలాగోలా బెల్జియం చేరుకున్నాం. యాంట్‌వర్ప్‌లో జంతువుల కోసం పనిచేస్తున్న ఆస్త సంస్థని కలిశాం. వారు మాకు రెండు బస్తాల జంతువుల ఆహారం ఇచ్చారు. మా జిపిఎస్ పనిచేయడం మొదలెట్టింది. నైస్ పీపుల్. ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్ మీదుగా రాత్రి 11.30కి ఫ్రాంక్‌ఫర్ట్ చేరుకున్నాం. రాత్రి అక్కడే బసచే శాం.

డే 13 : ఏప్రిల్ 29, 2010
ఉక్రెయిన్‌లో ఉన్నాం. ఇది ఇంత పెద్ద దేశం అనుకోలే దు. ఇప్పటివరకు ఈ దేశంలో 1600 కిలోమీటర్లు ప్రయాణించాం. కీవ్ నుంచి ఖార్కివ్ వెళ్తున్నప్పుడు మధ్యలో లంచ్ కోసం ఆగాం. ఆ కేఫ్‌లో ఎవరూ ఇంగ్లిష్‌లో మాట్లాడడం లేదు. మెనూ కూడా రష్యన్ భాషలో ఉంది. రష్యన్ టు ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ బుక్ చూసి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం. డిమిత్రో మా ఉక్రెయినీ ఫ్రెండ్.

రాత్రికి వాళ్లింటికి డిన్నర్‌కి తీసుకెళ్లాడు. డిమ్ మంచి యానిమల్ లవర్. ఉక్రెయినియన్లు కూడా జంతువులను చాలా ఇష్టపడతారని డిమ్ చెప్పాడు. మేం ఇప్పుడు ఉక్రెయిన్ - రష్యా బార్డర్ దాటుతున్నాం. ఉదయాన్నే ఓల్గోగ్రాడ్ చేరుకుంటాం. మాకు చాలాసంతోషంగా ఉంది. ఎందుకంటే అక్కడ మా అమ్మనాన్నలుంటారు. రష్యా నుంచి కజఖస్తాన్ వరకు మాతో వస్తారు. ఓహ్ మళ్లీ ఇంటిభోజనం తినబోతున్నాం.

డే 28 : మే 14, 2010
ఉజ్బెకిస్తాన్ గుండా వెళ్తూ ఖివా, బుఖారా, సమర్కండ్ లాంటి చరిత్రాత్మక ప్రదేశాలు చాలా చూశాం. సమర్కండ్‌లో బాబర్ తాత అమీర్ తైమూర్ విగ్రహాలు చాలా ఉన్నాయి. ఢిల్లీని, ఆ చుట్టుపక్కల ప్రాంతాలను కొల్లగొట్టిన ఆయన ఉజ్బెకిస్తాన్‌లో మాత్రం హీరో. ఆయన ధైర్యసాహసాల గురించి కథలు కథలుగా చెబుతుంటారు.

బుఖారాలో మేం కేథరిన్‌ని కలిశాం. ఆమె అజర్‌బైజాన్ బ్రిటిష్ ఎంబసీలో పనిచేస్తోంది. ముంబాయి బ్రిటిష్ ఎంబసీలో పనిచేస్తున్నప్పుడు దత్తత తీసుకున్న 'స్పైక్' అనే పిల్లిని అజర్‌బైజాన్‌కు తెచ్చుకుంది. ఇక్కడ ఎవరైనా సారీ చెప్పేటప్పుడు కుడిచేయిని గుండెలపై పెట్టుకుని చెబుతారు.

ఉజ్బె కిస్తాన్ మర్యాదలు.. కజఖస్తాన్ ఒంటెపాలు
'లండన్ టు ఢిల్లీ భై రోడ్' కంటే ముందు విషయాలు చెప్పండి.
'లండన్ టు ఢిల్లీ బై రోడ్' కల ఎప్పటి నుంచో ఉంది. దీనికోసం మేం ఒక సంవత్సరం పాటు రీసెర్చ్ చేశాం. ముందు ప్లాన్ చేసుకున్నదానికి, బయలుదేరే ముందు ప్లాన్‌కి చాలా మార్పులు జరిగాయి.

ఫ్రెండికోస్ గురించి రెండు మాటలు?
పెంపుడు జంతువుల కోసం 1979 నుంచి పనిచేస్తున్న నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అది. ఈ జర్నీ ద్వారా మేం ఆరు వేల డాలర్ల ఫండ్స్ కలెక్ట్ చేశాం. దక్షిణ దేశాల వారితో పోల్చుకుంటే మన దేశంలో పెంపుడు జంతువుల పట్ల అంతగా అవేర్‌నెస్ లేదు.

రకరకాల దేశాల్లో రకరకాల మనుషుల్ని చూశారు కదా. మీకేం అనిపించింది? ఎన్నో ప్రతికూలతలున్నా చాలామంది ఎంత సంతోషంగా జీవిస్తున్నారో చూశాం. టిబెట్ లాంటి ప్రాంతంలో టాయ్‌లెట్స్‌లాంటి కనీస సదుపాయలు లేకపోయినా వారంతా ఎంతో ఆనందంగా బతుకుతున్నారు.

మీకు ఎప్పటికీ గుర్తుండి పోయే ఒక ఐదు విషయాలు చెప్పండి.
1. ఉజ్బెకిస్తాన్ వారి అతిథి మర్యాదలు మరువలేనివి.
2. టిబెట్‌లో 16,400 అడుగుల ఎత్తయిన కొండమీది నుంచి ప్రయాణిస్తున్నప్పుడు పూజకు ఊపిరాడలేదు. కిందికి వచ్చాక ఆక్సిజన్ మాస్క్ పెట్టుకునే వరకు ఇబ్బంది పడింది. రాత్రి మూడు గంటలప్పుడు కారు ఆగిపోయింది. ఏం చేయాలో అర్థంకాలేదు. లక్కీగా వెంటనే స్టార్ట్ అయిందనుకోండి. కానీ అది ఓ భయంకరమైన రాత్రి.
3. కజఖస్తాన్‌లో గుర్రం, ఒంటె పాలు తాగడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
4. ప్రతిదేశంలోనూ పోలీసులు, కస్టమ్స్ అధికారులు ఆపడం మాకు రొటీన్ అయిపోయింది. అఫ్‌కోర్స్ ఒకదశలో దాన్ని కూడా ఎంజాయ్ చేశామనుకోండి.
5. నేపాల్ ఇండియా బార్డర్‌లో 'వెల్‌కమ్ టు ఇండియా' అనే సైన్ బోర్డు చూసిన క్షణం.

డే 35 : మే 21, 2010
చైనాలో ఉన్నాం. ఇప్పటికి 8000 కిలోమీటర్లు ప్రయాణించాం. మ్యాప్ చూస్తూ "వుయ్ ఆర్ హియర్'' అని గర్వంగా ఫీలయ్యాం. కానీ అసలైన ఛాలెంజ్ అప్పుడే మొదలైంది. మీరు ఊహించగలరా? జీపులో అంత ఎత్తయిన పర్వతాన్ని ఎక్కడం! బయటి ఉష్ణోగత్ర 15 డిగ్రీలుంది. ప్రకృతి అందాలను చూస్తూ సరదాగా ఫొటోలు తీస్తూ వెళ్తున్నాం.

సడన్‌గా ఎవరో స్విచ్ఛాప్ చేసినట్లు ఉష్ణోగ్రత ఒక్కసారిగా సున్నా డిగ్రీలకు పడిపోయింది. సూర్యుడి స్థానంలో నల్లని మేఘాలొచ్చాయి. మంచు కురవడం మొదలైంది. రోడ్డు కనిపించడం లేదు. జారే బురదలో జీపు నడపడం కష్టంగా ఉంది. ఇప్పుడు మేం 10,500 అడుగుల ఎత్తయిన కొండపైన ఉన్నాం. ఓష్ నుంచి సారిటాష్‌కు వెళ్తున్నాం. సాహసం చేస్తున్నట్లుగా ఉంది.

డే 45 : మే 31, 2010
నేను పూజని. నిన్ననే నేపాల్ చేరుకున్నాం. మొన్న సగాలో చైనీస్ టీవీలో చూశాను. ఒక డాక్టర్ పాములతో మసాజ్ చేస్తారట. అది వింటేనే ఒళ్లు జలదరిస్తుంటే ఇక స్నేక్ వైన్ గురించి? పెద్ద వైన్ బ్యారెల్‌లో రెండు మూడు పాముల్ని వేస్తారట.

40 రోజుల తర్వాత తీస్తే స్నేక్ వైన్ రెడీ. మరి పాములు బతికుంటాయో లేదో తెలియదు. సరే.. ఆ విషయం వద్దుగానీ మేం చైనా బార్డర్ దాటుతున్నప్పుడు ఆర్మీవాళ్లు మా కెమెరాలోని ప్రతి ఫొటోని చూశారు. మా ప్రతి బ్యాగ్‌ని చెక్‌చేశారు. త్వరలో మేం ఢిల్లీ చేరుకోబోతున్నాం. ప్రతి రోజూ (బ్లాగ్) మమ్మల్ని ఫాలో అవుతూ ప్రోత్సహిస్తున్నందుకు మీకందరికీ థ్యాంక్స్.

డే 51 : జూన్ 6, 2010
మళ్లీ నేనే పూజను. యస్... మేం సాధించాం. మా కల నెరవేరింది. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని కుతుబ్‌మినార్ దగ్గరికి చేరుకున్నాం. 15 వందల లీటర్ల పెట్రోలు, 9 టైమ్‌జోన్లు, లెక్కలేనన్ని అనుభవాల తర్వాత 51వ రోజు ఇక్కడున్నాం. ఈ ఆనందాన్ని ఎలా పంచుకోవాలో అర్థం కావడం లేదు. మీడియా వాళ్లు చుట్టుముట్టారు.

కెమెరా ఫ్లాష్‌లైట్లు టకటకా వెలుగుతున్నాయి. నాకైతే తుషార్‌ని మళ్లీ పెళ్లి చేసుకుంటున్నట్లుగా ఉంది. ఫ్రెండికోస్ కోఫౌండర్ గౌతమ్ భరత్ మాతో ఉన్నాడు. ఈ జర్నీ ఇంతటితో అయిపోలేదు. మా అనుభవాలన్నీ పుస్తకంగా రాయబోతున్నాం. 

-బీరెడ్డి నగేష్ రెడ్డి

No comments:

Post a Comment