చేకూరి గౌతమరాజు

చేకూరి గౌతమరాజు
Facebook

Wednesday, August 18, 2010

ఫోన్ పాడితే జేబు నిండుతుంది!

"అనిత అని టైప్ చేసి 56263 నెంబరుకు ఎస్ఎంఎస్ చేయండి. మీరు కోరుకున్న పాట క్షణాల్లో డౌన్‌లోడ్ అయిపోతుంది..'' ఒక చిన్న సమాచారం విద్యుత్ వేగంతో జనాల్లోకి వెళ్లిపోయింది. ఒకటి.. రెండు.. మూడు.. వెయ్యి.. పదివేలు.. యాభైవేలు.. లక్ష.. పది లక్షలు.. ఇరవై నాలుగు లక్షల మంది స్పందించారు.

వామ్మో! ఈ అంకెలను చూసి మీకే కాదు, పంపన త్రినాథ్‌కూ దిమ్మతిరిగింది. 'అనితా ఓ అనితా' అనే ప్రైవేటు ఆల్బమ్‌లోని పాటను డౌన్‌లోడ్ చేసుకున్న వాళ్ల సంఖ్య అది. అక్షరాలా ఇరవై నాలుగు లక్షల మంది. ఒకర్ని చూసి మరొకరు. వాళ్లను చూసి ఇంకొందరు. ఏ కుర్రాడి జేబులో సెల్‌మోగినా ఇదే పాట. ఇంతకూ ఆ పాటలో ఏముంది..? ఎన్నో మధురమైన సినీ గీతాలుండగా, ఈ పాటంటేనే జనాలకు ఎందుకంత పిచ్చి..? అని మీరు కొట్టిపారేయవచ్చు.

అంటే ఆ పిచ్చినే వ్యాపారం చేసుకుంటే ఎలాగుంటుంది..? అనే ఆలోచన మీ బుర్రకు రాలేదన్న మాట. త్రినాథ్ బుర్రకు వచ్చింది. 'కాలర్‌ట్యూన్ల' వ్యాపారంలో అది కేక పుట్టించింది. "ఎప్పుడు ఏ గాలి వీస్తుందో ఎవ్వరికీ తెలీదు. గాలి వీసినప్పుడే తూర్పారబట్టుకోవాలి...'' పంట నూర్పిడి సూత్రాన్నే వ్యాపారానికి అన్వయించిన ఈ కుర్రాడు చదువుకుంది మళ్లీ ఐఐటీనో, ఐఐఎంనో కూడా కాదు. బీఏకంటే వీసమెత్తు మెరుగైన బీకాం అయిందనిపించాడు.
సినిమాల నుంచి వెనక్కి..

అందరి కుర్రాళ్లలాగే త్రినాథ్‌కూ సినిమాల పిచ్చి. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలోని దుర్గాడ నుంచి చెన్నై చెక్కేశాడు. అమ్మానాన్నలది సాధారణ రైతు కుటుంబం. "నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే యమక్రేజ్. నా సినిమా కలలు సాధ్యం కావాలంటే నా వయసు, అనుభవం సరిపోవని చెన్నై వెళ్లాక తెలిసింది..'' అంటున్న త్రినాథ్ ఒట్టి చేతులతో వెనక్కి రాలేక అక్కడే డీఎఫ్‌టెక్ డిప్లమో చేశాడు.

తర్వాత పెట్టేబేడా సర్దుకుని మన హైదరాబాద్ వచ్చేశాడు. అక్కడక్కడ అసిస్టెంట్ డైరెక్టర్‌గా చక్కర్లు కొట్టాడు. ఉప్పలపాటి నారాయణరావు దగ్గర కొంతకాలం పనిచేశాడు. ఎంతకాలం ఇలా...? తనే సొంతంగా వ్యాపారంలోకి దిగితే, ఆ మాటే తమిళ స్నేహితులతో చెబుతుండేవాడు.

దేశమంతా తిరిగి..

అప్పటికే వాళ్లు యాడ్ఏజెన్సీలు పెట్టి సక్సెస్ అయ్యారు. "నీ ఆలోచనల్లో కొత్తదనం, తపన ఉన్నాయి. చురుగ్గా స్పందించే గుణం ఉంది. నువ్వు కూడా సృజనాత్మకరంగంలోకి అడుగుపెట్టు'' అని ఎప్పుడూ ఉచిత సలహాలు ఇచ్చే స్నేహితులు ఈసారి ఖరీదు సలహా ఇచ్చారు. కానీ, తన దగ్గర పెద్దగా పెట్టుబడి లేదు. ఉన్నది ఒక్క ఆత్మవిశ్వాసమే.

అదే తన పెట్టుబడి అనుకున్నాడు. నేరుగా హైదరాబాద్‌లోని చందనాబ్రదర్స్ యజమాని దగ్గరికి వెళ్లి, 'సార్, ఒట్టి అడ్వర్‌టైజ్‌మెంట్లు ఇస్తే తక్కువ మందే చూస్తారు. ప్రజలకు ఉపయోగపడే సమాచారంతో సీడీలు తయారుచేసి, అందులో ప్రకటనలు ఇస్తే మీ సంస్థ గురించి చాలా కుటుంబాలకు తెలుస్తుంది..' అన్నాడు. ఆయన 'సరే, ఒక్కసారి చేసివ్వు చూద్దాం' అన్నారు.

ఒక వీడియో కెమెరా భుజాన తగిలించుకొని ఇండియా మొత్తం చుట్టేసి 'ద్వాదశ జ్యోతిర్లింగాలు' సీడీని ఆయన చేతుల్లో పెట్టాడు త్రినాథ్. అది ఆయనకు తెగ నచ్చింది. ఇంకేముంది..? ఏటా రెండు లక్షల సీడీలు రికార్డు చేసి చందనా వాళ్లకిచ్చే ఆర్డర్ దక్కించుకున్నాడు త్రినాథ్. అక్కడి నుంచి మరికొన్ని మన రాష్ట్రంలోని 'పంచారామక్షేత్రాలు', 'గోదావరి' సీడీలను ప్రమోషన్ కింద కొన్ని సంస్థలకు తయారుచేసిచ్చాడు. అవి కూడా ఏటా కనీసం రెండు లక్షల సీడీలు చేసివ్వాలి. ఈసారి సొంతంగా సీడీ మానుఫాక్చరింగ్ యూనిట్ పెట్టాడు. పట్టుదల+ఆత్మవిశ్వాసం కలిశాక జీవితంలో కొత్తరుచి దొరికింది త్రినాథ్‌కు. 'మై3 ఆడియో అండ్ వీడియో'సంస్థ ప్రాణం పోసుకుంది.

కాలర్‌ట్యూన్‌ల నాడి పట్టుకొని..

ఇరవైఏడేళ్ల ఈ కుర్రాడికి తోటి కుర్రాళ్ల మనస్తత్వాన్ని పసిగట్టడం చాలా సులువు. తన చిన్న వ్యాపారాన్ని ట్రెండుకు తగ్గట్టు నడపాలనుకున్నాడు. అప్పటికే ప్రముఖ మ్యూజిక్ కంపెనీలు కాలర్‌ట్యూన్, రింగ్‌టోన్‌ల బిజినెస్ చేస్తున్నాయి. రిలీజైన కొత్త సినిమాల ఆడియో హక్కులు ఎంత ఖరీదైనా వారే కొనుక్కుంటున్నారు. 'అంత పోటీలో నువ్వు ఎలా నిలబడదామని అందులోకి దిగావ్..?' అంటే- "నాక్కూడా మొదట్లో అదే భయం కలిగింది.

సంగీతమంటే సినిమాలే కాదు కదా, బయట దొరికే ప్రైవేటు సాంగ్స్, జానపదగేయాలు, పద్యాలు, భక్తి గీతాలు.. వీటి హక్కులు కొని, కాలర్‌ట్యూన్స్ పెడితే ఎలాగుంటుంది..? అన్న ఆలోచన వచ్చింది.

ఏ రాష్ట్రంలో ఎలాంటి కాలర్‌ట్యూన్లు క్లిక్ అవుతున్నాయో తెలుసుకొనేందుకు దక్షణాది ప్రాంతాలన్నీ తిరిగాను. వ్యాపారసంస్థలతో మాట్లాడాను..'' అని చెప్పిన త్రినాథ్ తెలుగులో అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న రెండువేల భక్తిగీతాల డిజిటల్ హక్కులను కొనేశాడు. ఈ పాటలు రాష్ట్రంలోని అన్ని దేవుళ్లపై ఉన్నాయి. మరో 40 చిన్న సినిమాల పాటల డిజిటల్ హక్కులను కూడా కొన్నాడు.

కిటుకు కునుక్కొని..

డౌన్‌లోడ్ చేసుకున్న వినియోగదారుడి నుంచి 10 నుంచి 15 రూపాయల దాకా టెలిఫోన్ ఆపరేటర్లకు వెళుతుంది. అందులో డిజిటల్ హక్కులు తీసుకున్న త్రినాథ్ ఖాతాకూ కొంత మొత్తం వెళుతుంది. ఆ కిటుకులన్నీ తెలుసుకున్న త్రినాథ్ ఇప్పటి వరకూ 2,400 కాలర్‌ట్యూన్స్, రింగ్‌టోన్స్‌ను అప్‌లోడ్ చేశాడు. ఇందులో కొన్నే క్లిక్ అయ్యాయి.

"మొదట్లో ఆశించినంత ఫలితం రాలేదు. మన రాష్ట్రంలోని యూత్‌కు వారానికి రెండుసార్లు కాలర్‌ట్యూన్స్ మార్చే అలవాటుంది. వాళ్లకు ఏ పాట నచ్చుతుందో అంచనా వేయడం చాలా కష్టం. "అనితా, ఓ అనితా' ప్రైవేటు ఆల్బమ్‌లోని పాటల్ని విన్నప్పుడు వీటిని కాలర్‌ట్యూన్స్‌గా పెడితే కచ్చితంగా హిట్ అవుతుందనుకున్నా. వెంటనే ఆల్బమ్ చేసిన యువకుడి నుంచి రైట్స్ కొనుక్కున్నా..'' అదే తన దశ తిరిగేలా చేస్తుందని త్రినాథ్ కలలో కూడా ఊహించలేదు.

ఇప్పటివరకు 24 లక్షల మంది ఆ పాటను డౌన్‌లోడ్ చేసుకొని కాలర్‌ట్యూన్‌గా పెట్టుకున్నారు. ఇదొక రికార్డు. టాప్-5 ట్యూన్లలో ఈ పాట చేరిపోయింది. "ఏటా మన రాష్ట్రంలో కాలర్‌ట్యూన్ల వ్యాపారం సుమారు 10 నుంచి 15 కోట్ల రూపాయలు. ట్యూన్లు పెట్టుకుంటున్న వాళ్లు ఎంతమందో తెలుసా రెండు కోట్ల మంది..! ఒకప్పుడు భక్తిపాటలు, సినిమా పాటలు పెట్టుకొనేవారు. ఇప్పుడు తెలంగాణ, బోనాలు, జానపదగేయాలు, తెలుగుతల్లి పాటలు పెట్టుకుంటున్నారు.

తమ వ్యక్తిత్వాన్ని కాలర్‌ట్యూన్స్ ద్వారా అవతలివాళ్లకు వ్యక్తీకరించుకొనే ట్రెండ్ మొదలైంది. మనుషులందరికీ సెల్‌ఫోన్లున్నాయి. వాటికంటే ముందు వారికి ఒక కల్చర్ ఉంది. ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉంది. సెంటిమెంట్లున్నాయి. ఎమోషన్లున్నాయి. నా బిజినెస్‌కు ఇవే ముడిసరుకు. ఇన్ని రకాల మనుషులకు ఎన్ని రకాల కాలర్‌ట్యూన్లు కావాలో కనుక్కునే శక్తి మనకున్నంత కాలం.. ఈ బిజినెస్ ఎప్పటికీ ఏదో ఒక కొత్త ట్యూన్‌తో మోగుతూనే ఉంటుంది..'' అంటున్న త్రినాథ్, తన సెల్‌ఫోన్‌కు మాత్రం ఎలాంటి కాలర్‌ట్యూనూ పెట్టుకోలేదు. పక్కా బిజినెస్‌మ్యాన్.

No comments:

Post a Comment