సైకిల్ స్టేషన్స్ చైనా ప్రయోగం
మీరు జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో ఉన్నారు. లక్డీకాపూల్ వెళ్లాలి. బైక్ లేదు. అక్కణ్నుంచి అర్జంటుగా వెళ్లాలంటే ఆటోనో, కారో పట్టుకోవాలి. అంతవరకు ఓకే. కాని ట్రాఫిక్‌లో అర్జంటుగా వెళ్లడమనేది మీ చేతుల్లో లేని పని కదా. నడిచివెళ్లలేరు. అయితే ఒక పని చెయ్యండి. ఒక సైకిల్ తీసుకోండి. చిన్నచిన్న సందుల్లో నుంచి, గల్లీల్లో నుంచి కూడా ట్రాఫిక్‌ను తప్పించుకునిపోవచ్చు. బేగంపేట రైల్వే స్టేషను వరకు సైకిల్‌పై వెళ్లి అక్కణ్నుంచి రైలెక్కి వెళ్లండి. లేదా పంజగుట్టలోనే బస్సెక్కి వెళ్లండి. లేదా మధ్యలో ఇంకెక్కడైనా దిగిపోండి. మీ ఇష్టం. 'ఇప్పటికిప్పుడు సైకిల్ ఎవరిస్తారు? ఇచ్చినా దాన్ని మధ్యలో ఎక్కడ పెట్టి వెళ్లాలి? అవును కదా... కాని ఈ ఐడియా మాత్రం భలే ఉంది కదూ. కచ్చితంగా ఇదే ఐడియాతో చైనాలోని షాంఘైలో 'సైకిల్ రివల్యూషన్' మొదలైంది.వాహనాల వల్ల వాయు, శబ్ద కాలుష్యం పెరిగిపోతుందని పాతమాటే చెప్పటం కాదుగాని మెట్రోనగరాల్లో పెద్ద వాహనాల్లో ప్రయాణం వల్ల బోలెడంత సమయం వృథా అవుతోంది. పైగా ట్రాఫిక్ నుంచి తప్పించుకోవటం బహుకష్టం. స్టేషన్లు ఒకదానికొకటి దగ్గర్లోనే ఉన్నా అక్కడికెళ్లటమే సమయానికి మించిన పని. ఇవన్నీ తలుచుకుంటే బస్సు కంటే కారు బెటర్, కారు కంటే బైక్ బెటర్, ఇంకా చెప్పాలంటే సైకిలైతే మరీ మంచిది. చిన్న చిన్న దూరాలను సునాయాసంగా చేరుకోవచ్చు. అందుకే పై సమస్యలన్నింటికీ చైనాలోని సైకిల్‌తోనే చెక్ పెడుతోంది షాంఘై. ఆకాశహర్మ్యాలతో, అల్ట్రాఫాస్ట్ మాగ్నటిక్ ట్రెయిన్స్, స్టీల్ బ్రిడ్జ్‌లు, అద్దాల్లాంటి రోడ్లతో ఒక రేంజ్‌లో ఉండే షాంఘైలో 'సైకిల్ షేరింగ్ స్కీమ్' ఫేవరేట్‌గా మారిపోయింది.
సైకిల్ షేరింగ్ అంటే...?
రైల్వై స్టేషన్లు, బస్ స్టేషన్లకు దగ్గర్లో సైకిల్ స్టాండ్స్ ఉంటాయి. ప్రయాణీకులు అక్కణ్నుంచి మరోచోటుకు లేదా వేరే స్టేషనుకు వెళ్లాలంటే ఆ సైకిళ్లను వాడుకోవచ్చు. గమ్యానికి చేరుకున్నాక ఆ సైకిల్‌ను దగ్గర్లోని ఇంకో సైకిల్‌స్టాండ్‌లో ఇవ్వాలి. అందుకు ఎలాంటి ఛార్జీ చెల్లించవలసిన అవసరం లేదు. ఇవి ప్రభుత్వం తరపున నడుస్తున్న స్టాండ్స్. ఆదాయం, సమయం ఆదా అవడమే కాకుండా ఆరోగ్యంగా ఉండేందుకు కూడా పనికొస్తుంది.
షాంఘై రాజధాని పడాంగ్ ఆరు లేన్ల రోడ్లు, అద్దాల మేడలతో పొరుగుదేశాల కంటికి రాయల్‌గా కనిపిస్తుంది. ఎన్ని హైటెక్ సొబగులున్నా 'సైకిల్ షేరింగ్ స్కీమ్' కూడా బాగానే పాపులర్ అవుతోందక్కడ. గత సంవత్సరమే మొదలైన ఈ ప్రోగ్రాం పడాంగ్, మిన్హాంగ్ జిల్లాలతో పాటు క్రమంగా చాలా నగరాల్లోకి విస్తరించింది.
ఏ వ్యక్తి ఆలోచనో, ఏ స్వచ్ఛంద సంస్థల సలహానో కాని సైకిల్ షేరింగ్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో ప్రభుత్వం కూడా ఈ ప్రోగ్రాం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. రెండు మెట్రో స్టేషన్లు మాత్రమే కలుపుతూ మొదలైన సైకిల్ షేరింగ్ ఇప్పుడు 230 మెట్రో రైల్వే స్టేషన్లను కలుపుతోంది. ఇప్పటి వరకు మొత్తం 12000 సైకిళ్లు ఉపయోగంలో ఉన్నాయి. ప్రభుత్వంలో కలిసి జాంగ్‌మింగ్ అనే సైకిల్ కంపెనీ ఈ స్కీమ్‌లో పాలు పంచుకుంటోంది. రాబోయే ఐదేళ్లలో మరో 6500 సైకిళ్ల వాడకాన్ని పెంచాలనే ఆలోచనతో ఉన్నారట.
నిజానికి ఇది షాంఘైలోనే పుట్టిన ఐడియా కాదు. కాకపోతే విశేషంగా అమలవుతున్నది మాత్రం అక్కడే. ఫ్రాన్స్, డెన్మార్క్, క్యూబా లాంటి కొన్ని దేశాల్లో ఇలాంటి సైకిల్ షేరింగ్ పద్ధతులు ప్రారంభించినా,పెద్దగా స్పందన లేదు. మన దేశంలో ఢిల్లీలో కూడా ఇలాంటి ప్రోగ్రాం ఒకటి నడిచింది. అయితే అది సైకిల్ కాదు బైక్. ఖరీదైన వ్యవహారం కావటం వల్ల అది పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.
ఎలా పనిచేస్తుంది...?
ఈ సైకిళ్లు ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో ఉంటాయి. ఎనీ టైమ్ సైకిల్ సర్వీస్ అన్నమాట. అయితే ఈ సైకిళ్లు ఉపయోగించుకోవాలంటే ప్రభుత్వం ఇచ్చే ఒక గుర్తింపు కార్డును తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు పదివేలకు పైగానే గుర్తింపు కార్డులు ఇచ్చారట. ఉద్యోగులు, విద్యార్ధులతో పాటు రోజువారీ పనులు చూసుకునేవారు కూడా సైకిళ్లనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారట. అయితే ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ప్రయివేట్ సైకిల్ కంపెనీలు కూడా ఈ విధమైన స్టాండ్లను నిర్వహిస్తున్నాయి. అందుకు ఒక గంటకు రెండు యెన్‌లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మన కరెన్సీలో అయితే పద్నాలుగు రూపాయలు.
ఈ ప్రోగ్రామ్ ఎందుకు సక్సెస్ అవుతోందంటే... ఇవి ప్రధానంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ల దగ్గర ఉండటం వల్ల ఆయా స్టేషన్ల మ«ధ్య దూరం సైకిల్‌పై వెళ్లగలిగేంత వ్యత్యాసంలో ఉండటం వల్ల. 'సైకిల్ పట్టుకుంటే చాలు. ఐదుపది నిమిషాల్లో బస్ స్టేషనో, రైల్వే స్టేషనో చేరుకోవచ్చు. అందుకే ఈ ప్రోగ్రామ్‌కు ఆదరణ లభిస్తోందని' పడాంగ్ జిల్లా రవాణా అధికారి చెప్పారు. ఖర్చుకు వెనకాడకుండా పాదచారులకు ఉన్నట్టుగా సైకిల్ వినియోగదారుల కోసం ప్రత్యేక లేన్లు కూడా ఏర్పాటు చేస్తోంది. కాలుష్య నివారణ, ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసింది.
వ్యక్తిగతంగా కూడా కొన్ని లాభాలు ఉన్న ఇటువంటి ప్రయోగాలు ఎక్కడ చేసినా మంచి ఫలితమే ఉంటుంది.
No comments:
Post a Comment