చేకూరి గౌతమరాజు

చేకూరి గౌతమరాజు
Facebook

Tuesday, August 24, 2010

రాజీవ్ అసలు నాయకుడే కాదు!

కుష్వంత్‌సింగ్ ఎప్పట్లాగే మసాలాలతో దట్టించిన మరో కొత్త పుస్తకం తీసుకొచ్చారు. దాని పేరు 'ఆబ్సెల్యూట్ కుష్వంత్'. తిట్టినా, మెచ్చుకున్నా ఏ మాత్రం మొహమాటాలూ లేవు. 'నేను ఎవర్నీ సీరియస్‌గా తీసుకోలేదు నాతో సహా' అంటారొక చోట. 'అరవై ఏళ్లకు పైగా కలిసి ఉన్నా నేనూ, నా భార్యా సంతోషంగా కాపురం చేయలేదెప్పుడూ' అని కూడా చెప్పుకున్నారాయన. ఒంటరితనం, నిరంతర రచన.. ఈ రెండూ తనకిచ్చిన ఆనందం మరేదీ ఇవ్వలేదని చెప్పుకున్న 95 ఏళ్ల కుష్వంత్ సింగ్ పుస్తకంలోంచి కొన్ని భాగాలు...

అన్నింట్లోకి నాకు ఎక్కువ ఇష్టమైంది ఒంటరితనం. అది నాకు విరివిగా లభించడం నా అదృష్టం. ఒంటరితనం ఎన్నో రకాలుగా ప్రయోజనకరం. మెదడుకు బోలెడు విశ్రాంతి దొరుకుతుంది. ఒక రోజంతా మౌనంగా ఉంటే ఎంతో శక్తి చేకూరుతుంది. మెదడును కాసేపు ఖాళీగా ఉంచగలిగితే- ధ్యానం ఉద్దేశం అదే ఒంటరితనాన్ని ఎంజాయ్ చేయొచ్చు.

శృంగారం వైపే నేను..
పురుషులు వృద్ధులవుతున్న కొద్దీ శృంగార వాంఛలు శరీరం కింది భాగాల నుంచి పైకి పాకి మెదడులోకి చేరతాయి. యుక్త వయస్సులో ఏం చేయాలనుకుని చేయలేకపోయారో- వాటిని ఊహించుకొని తృప్తిపడుతూ ఉంటారు. శృంగారం, రొమాన్స్‌లలో ఏది ముఖ్యం అని నన్ను అడిగితే- శృంగారమే అని చెబుతాను. రొమాన్స్ పైపూతలాంటిది. కొద్ది కాలం పోయిన తర్వాత తొలగిపోతుంది.

దానికి ఉండే ఆకర్షణ కూడా పోతుంది. రొమాన్స్ చేయటానికి అవసరమైన సమయం కానీ అభిరుచి కానీ నాకు ఎప్పుడూ లేవు. రొమాన్స్ చేయాలంటే చాలా సమయం కావాలి. అపారమైన శక్తియుక్తులను ఖర్చుపెట్టాలి. దాని వల్ల ఫలితం కూడా పెద్దగా ఉండదు. అందుకే శృంగారం వైపే నేను మొగ్గుచూపుతాను. పురుషులు మాత్రమే మహిళల వెనకపడి ఆకర్షించటానికి ప్రయత్నిస్తారనే ప్రచారం నిజం కాదు.

మహిళలే ఈ కళలో ఆరితేరిన వారని నా గట్టినమ్మకం. నా జీవితంలో- నేను ఆకర్షించటానికి ప్రయత్నించిన మహిళల కన్నా- నన్ను ఆకర్షించటానికి ప్రయత్నించిన మహిళలే ఎక్కువ. నాకు ఎవరి పట్ల అయినా ఆకర్షణ కలిగితే- ఆ విషయం వాళ్లకు చెప్పటానికి చాలా బెరుకుగా అనిపించేది. ఆత్మవిశ్వాసం చాలేది కాదు. కాని చాలా కాలం తర్వాత కలిసినప్పుడు- సందర్భం కుదిరితే చెప్పేవాడిని. అప్పుడు వాళ్లు- "అరే.. ఆ విషయం అప్పుడే ఎందుకు చెప్పలేదు?'' అనేవారు.

నెహ్రూ ముచ్చట్లు..
సరుకుల్ని రవాణా చేసే బృందాల నాయకుడికి ఉండాల్సిన లక్షణాలను ప్రముఖ కవి అలం ఇక్బాల్ ఒకచోట ఇలా చెబుతాడు. "నిగాహ్ బులంద్, సుఖాః దిల్‌నవాజ్, జాన్ పర్ సోజ్- యహీ హై రక్త్ ఎ సఫర్ మీర్ ఎ కార్వాన్ కే లియే'' (విశాల దృక్పథం, అందరినీ ఆకట్టుకొనే మాటతీరు, ఆకర్షించే వ్యక్తిత్వం- కార్వాన్‌ను ముందుకు నడిపించే నేతకు ఉండాల్సిన లక్షణాలు ఇవే).

నెహ్రూకు ఈ మాటలు అతికినట్లు సరిపోతాయి..
నేను నెహ్రూను తొలిసారి లండన్‌లో కలుసుకున్నా. అప్పుడు నేను భారత ఎంబసీలో సమాచార శాఖ అధికారిగా ఉండేవాడిని. నెహ్రూను దగ్గరగా చూసిన తర్వాత ఆయనకు కోపం ముక్కుమీదే ఉంటుందని అర్థమయింది. ఒక్క కోపమే కాదు చాలా అమర్యాదగా కూడా ప్రవర్తిస్తాడని తర్వాత తెలిసింది. బ్రిటన్‌లో ఉన్న ముఖ్యమైన పత్రికల ఎడిటర్లు నెహ్రూను కలవాలనుకున్నారు.

దాంతో నేను ఒక విందు సమావేశం ఏర్పాటు చేశాను. అందరూ భోజనాలు చేస్తున్నారు. ఇంతలో నెహ్రూ హఠాత్తుగా మౌనముద్ర దాల్చాడు. ఎడిటర్లు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా పైకప్పు వైపు చూడటం మొదలుపెట్టాడు. అందరి భోజనాలూ పూర్తికాక ముందే సిగరెట్టు తీసి వెలిగించాడు. గోరుచుట్టుపై రోకలిపోటు అన్నట్లు - మరోపక్క కృష్ణమీనన్ నిద్రపోయాడు.

పబ్లిక్ రిలేషన్స్ ఇంతకన్నా పెద్ద ఉత్పాతం ఏముంటుంది చెప్పండి! మరోసారి నెహ్రూ లండన్‌లో దిగేసరికి అర్థరాత్రి అయింది. నేను ఆయనకు స్వాగతం చెప్పటానికి ఎయిర్‌పోర్టుకు వెళ్లాను. మర్యాదకు- "నన్ను కూడా మీతో పాటు హోటల్‌కు రమ్మంటారా?'' అని అడిగాను. "డోన్ట్ బీ సిల్లీ.. ఇంటికి వెళ్లి పడుకో'' అని నెహ్రూ కసురుకున్నాడు. ఆ మర్నాడు పేపర్లలో- నెహ్రూ, లేడీ మౌంట్‌బాటెన్‌ల ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి.

ఆ ఫోటోలో- కురచ దుస్తులు వేసుకొని ఉన్న లేడీ మౌంట్‌బాటెన్ తలుపుతీస్తోంది. నెహ్రూ తలుపు దగ్గర ఉన్నాడు. ఒక పత్రికలో ఆ ఫోటో పైన- "లేడీ మౌంట్‌బాటెన్ ఇంటికి అర్థరాత్రి అతిథి'' అనే శీర్షిక పెట్టారు. నెహ్రూకు తీవ్రమైన ఆగ్రహం వచ్చింది. మరోసారి నెహ్రూ, లేడీ మౌంట్‌బాటెన్‌లు కలిసి ఒక గ్రీకు రెస్టారెంట్‌కు వెళ్లారు. ఆ మర్నాడు కూడా వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలను పత్రికలు ప్రచురించాయి.

నెహ్రూ దగ్గరకు వెళ్లమని నన్ను నా పైఅ«ధికారులు ఆదేశించారు. నేను నెహ్రూ దగ్గరకు వెళ్లాను. ఆయన మూడ్ బావులేదు. "ఎవరు నువ్వు?'' అని నెహ్రూ నన్ను ప్రశ్నించాడు. "సర్.. నేను లండన్‌లో మీ పీఆర్ఓను..'' అని సమాధానమిచ్చాను. "పబ్లిసిటీ ఎలా ఇవ్వాలనే విషయంలో నీకు విచిత్రమైన ఆలోచనలు ఉన్నాయి'' అన్నాడు. అలాంటి సమయాల్లో మౌనమే మంచిదనుకున్నా. నేనేమీ మాట్లాడలేదు.

రాజీవ్ నేత కాదు..
రాజీవ్ గాంధీని కీర్తిస్తూ, అతనిని ఒక ఉన్నత శిఖరాలమీద నిలబెట్టటానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ రాజీవ్ కూడా అనేక తప్పులు చేశాడు. వాటిలో కొన్ని తీవ్రమైన తప్పులు కూడా. రాజీవ్‌ను బలవంతంగా రాజకీయాల్లోకి దింపారు. వాటిని అతను సరిగ్గా నిర్వహించలేకపోయాడు. నిజానికి రాజీవ్ చాలా ఆహ్లాదకరమైన వ్యక్తి. కొన్ని మంచి ఆలోచనలు కూడా ఉన్నాయి. కానీ అవి చరిత్రను మార్చేసేటంత గొప్పవైతే కావు.

అసలు అతను ఒక మంచి నాయకుడే కాదు. తన తల్లి అడుగుజాడల్లో నడిచి ఆమె చేసిన తప్పులే అతనూ చేశాడు. టెలికాం, కంప్యూటర్స్ వంటి ఆలోచనలు కూడా ఇందిరాగాంధీ సమయంలో మొదలుపెట్టినవే. శ్రీలంక వ్యవహారాన్ని పూర్తిగా చెడగొట్టాడు. ఒక బహిరంగ సమావేశంలో ఒక మంత్రిని పదవి నుంచి తొలగించాడు. బాబ్రీమసీదు, షాబానో కేసుల్లో అతని పాత్రను మనం తక్కువగా తీసేయలేం.

ఈ రెండు కేసులు మనకు దీర్ఘకాల హాని చేశాయి. ఇందిరాగాంధీ మరణించిన తర్వాత రాజీవ్ ప్రవర్తించిన తీరును చరిత్ర ఎన్నటికీ క్షమించదు. సిక్కులను ఢిల్లీలో సజీవంగా తగలబెట్టేస్తుంటే-"ఒక మహావృక్షం కుప్పకూలినప్పుడు.. చుట్టుపక్కల ఉన్న భూమి కూడా కంపిస్తుంది..'' అన్నాడు. ఆ హత్యలను అతను ఆపి ఉండాల్సింది. ఒక్కసారి బయటకు వెళ్లి- "ఈ హత్యాకాండ ఆపాలి.. రండి..'' అని సైన్యాన్ని పిలిచి ఉంటే సరిపోయేది. కానీ రాజీవ్ అలా చేయలేదు. అంతేకాకుండా తన వ్యాఖ్యల ద్వారా ఆ హత్యాకాండను సమర్థించాడు కూడా.

ఆ పరిస్థితుల్లో నెహ్రూ ఉంటే- ఆ విధంగా చేసి ఉండేవాడు కాదని నేను కచ్చితంగా చెప్పగలను. నెహ్రూకు ధైర్యం ఉంది. బయటకు వెళ్లి అల్లరిమూకలను చెదరగొట్టి ఉండేవాడు. దేశ విభజన సమయంలో నెహ్రూ ఆ విధంగా చేశాడు కూడా. ఒక నేతకు, ఔత్సాహికుడికి మధ్య ఉండే తేడా అదే. అయితే రాజీవ్ సోదరుడు సంజయ్‌గాంధీ చురుకైనవాడు. రాజీవ్ స్కౌట్‌లాంటివాడు.

రాహుల్ శభాష్!
నా దృష్టిలో రాజీవ్ కంటే రాహుల్ చాలా సమర్థుడు. అతనికి ఒక విశాల దృష్టి ఉంది. అది చాలా ముఖ్యమైన విషయం. అతను ప్రవర్తిస్తున్న తీరు కూడా చాలా బావుంది. సరైన దృక్పథమూ ఉంది. అతను చేస్తున్నది పెద్ద పెద్ద పనులు కాకపోయినా- ఆ పనుల వెనకున్న ఆలోచనలు మాత్రం మంచివే. రాహుల్ పరిణతి చెందిన నాయకుడుగా అభివృద్ధి చెందుతున్నాడు.

2014 ఎన్నికలలో- కాంగ్రెస్ గెలిస్తే- రాహుల్ ప్రధాని కావటానికి ఒప్పుకోవచ్చు.. ఒప్పుకోకపోవచ్చు కూడా. అయితే అతని ప్రాధమ్యాలు సరిగ్గానే ఉన్నాయి. అతను కుర్చీల గురించి, పదవుల గురించి పట్టించుకోవటం లేదు. కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలా అని మాత్రమే ఆలోచిస్తున్నాడు. గత ఏడాది రాహుల్ నాకు ఫోన్ చేశాడు. ఒకసారి వచ్చి కలుస్తాన న్నాడు.

ముందుగా అనుకున్నటు ్ల సాయంత్రం పూట సరిగ్గా నాలుగు గంటలకు వచ్చాడు. ఒక గంటసేపు నాతో కూర్చుని కబుర్లు చెప్పాడు. మేము రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం. కాని మా మధ్య జరిగిన మాటల్లో అతని నాయనమ్మ గురించి కానీ, ముత్తాత గురించి కానీ ఎటువంటి ప్రస్తావన రాలేదు.

No comments:

Post a Comment