చేకూరి గౌతమరాజు

చేకూరి గౌతమరాజు
Facebook

Monday, August 23, 2010

నలందోదయం

nalanda
ఎన్నో దేశాలు కన్ను తెరవకముందే చదువుల్లో కీర్తి బావుటను నలంద ఎగరవేసింది. ప్రపంచానికి జ్ఞానజ్యోతులని పంచింది. భారత ఖ్యాతిని ్రపపంచవ్యాప్తంగా చాటిచెప్పింది. ఎన్నో ఏళ్ల చరిత్ర గల నలందా విశ్వవిద్యాలయం....మరికొన్ని రోజుల్లో కొత్త రూపురేఖను సంతరించుకోవటానికి ఓ అడుగు (బిల్లు) దూరంలో ఉంది. నలంద విశ్వవిద్యాలయం తిరిగి ప్రాచీన వైభవాన్ని సంతరించుకోవాలంటే లోక్‌సభ ఓటింగ్‌ కీలకం. నలంద విశ్వవిద్యాలయ బిల్లు 2010ని రాజ్యసభ ఆమోదించింది. యూనివర్సిటీ ఆఫ్‌ నలంద యాక్ట్‌ 2007లో బీహార్‌ అసెంబ్లీలో తొలిగా ప్రవేశెపెట్టింది. 2007లో జరిగిన దక్షిణాసియా సదస్సులో దీని మీద చర్చలు జరిగాయి. 2009 అక్టోబర్‌ 25న థాయ్‌లాండ్‌లో జరిగిన 4వ దక్షిణాసియా సదస్సులోను దీన్ని ప్రస్తావించారు.

నలంద ఖ్యాతి
nalaబీహార్‌ రాజధాని పాటా్ని ( పాటలీపుత్రం) 55 కిలోమీటర్ల దూరంలో నలంద విశ్వవిద్యాలయం ఉంది. గుప్తుల రాజైన కుమారగుప్త సమయంలో దీన్ని నిర్మించారు. బుద్ధులు సందర్శించే పవిత్ర స్థలాల్లో నలంద కూడా ఒకటి. 10వేల విద్యార్థులు, 2వేల ఉపాధ్యాయులు మరెంతో మంది సిబ్బందికి ఒకేసారి బోధనను అందించే సదుపాయం ఇక్కడ ఉండేది. ఖగోళ, వాస్తు ప్రకారం దీన్ని నిర్మించారు. ఇక్కడ 8 అద్భుత భవనాలు, ఓ సూర్యాలయంతో పాటూ పది ఇతర దేవాలయాలుండేవి. యోగా, ధ్యానం కోసం ప్రత్యేక గదులుండేవి. కొలనులు, సుందర ఉద్యానవనాలతో పరిసర ప్రాంతాలు కళకళలాడుతుండేవి. 9 అంతస్థుల భవనంలో గ్రంథాలయం ఉండేది. గణితం, సాహిత్యం, భాష, ఖగోళం ఇలా ఒకటేమిటి ప్రతి అంశం మీద బోధించటానికి సుశిక్షితులైన అధ్యాపకులుండేవారు.

కొరియా, జపాన్‌, చైనా, టిబెట్‌, ఇండోనేషియా, పర్షియా, టర్కీ విద్యార్థులు నలందలో చదువుకోవటానికి ఎక్కువగా వస్తుండేవారు. 427 బిసి నుంచి 1197 సంవత్సరం వరకు బౌద్ధులకి విద్యా బోధనా కేంద్రంగా ఉంది. చరిత్రలో మొట్టమొదటి విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందింది నలందనే. మౌర్య రాజులు, అశోకుడు, గుప్తులు ఇక్కడ చారిత్రక కట్టడాలను నిర్మించారు. భక్తయార్‌ ఖిల్జి (1193) పరిపాలనలో నలంద పతనం ప్రారంభమైంది. విశిష్టమైన కట్టడాలెన్నింటినో ధ్వంసం చేశారు. ఎంతోమందిని తరిమేశారు. ఎన్నో విలువైన గ్రంథాలను, సాహిత్యాలను తగులబెట్టారు. ఇక్కడ ఉన్న గ్రంథాలయాన్ని కాల్చితే.... అందులో ఉన్న పుస్తకాలు మూడు నెలల పాటూ కాలుతూనే ఉన్నాయంటే ..ఎన్ని కోట్ల సాహిత్యాన్ని నాశనం చేశారో అర్థం చేసుకోవచ్చు.

అమర్త్వసేన్‌ నాయకత్వంలో..
నలంద పునరుద్ధరణకు కొన్ని సంస్థలు, దేశాలు ముందుకొచ్చినా....ఆర్థికశాస్త్రంలో భారత్‌కి తొలి నోబెల్‌ని అందించిన అమర్త్వసేన్‌ ఆధ్వర్యంలో ఓ బృందం ఏర్పాటైంది. దేశానికి చెందిన ప్రముఖ ప్రొఫెసర్లు, మేఘనాథ్‌ దేశాయ్‌, సుగోత్‌ బోస్‌, నంద్‌ కిషోర్‌ సింగ్‌, చైనా ఫ్రొఫెసర్‌ వాంగ్‌ బెన్‌వాయి ( బీజింగ్‌ విశ్వవిద్యాలయం) సింగపూర్‌ విదేశాంగ మంత్రులు హిరయామ, జార్జి యో ఇందులో ఉన్నారు. వీరందరూ కలసి వివిధ పట్టణాల్లో నలంద పునరుద్ధరణ పైన ఆరు సమావేశాలను నిర్వహించారు.నలందలో ప్రవేశపెట్టబోయే కోర్సులు వాటి బోధనా విధానంపైన వీరు కసరత్తు చేస్తున్నారు.

ప్రపంచానికి కాంతులు
amartya-sen నలంద పునరుద్ధరణకు అంతర్జాతీయంగా 1951లోనే నవ నలందా మహావీరా పేరుతో ఓ సంస్థ ఏర్పాటైంది. పాట్నాకి 100 కిలోమీటర్ల దూరంలో ప్రధాన కేంద్రం ఉంది.దేశ తొలి రాష్టప్రతి బాబూ రాజేంద్రప్రసాద్‌ దీనికి పునాది రాయి వేశారు. 1956లో మొదటి భవనాన్ని సర్వేపల్లి రాధాకృష్ణనన్‌ ప్రారంభించారు. 1981లో రాష్టప్రతి నీలం సంజీవ రెడ్డి విదేశీ విద్యార్థుల కోసం అంతర్జాతీయ హస్టల్‌ భవన నిర్మాణానికి పునాది వేశారు. 2008 - 2009 సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం 397 విద్యార్థులు ఇక్కడ ఉన్నారు.

బర్మా, శ్రీలంక, థాయ్‌లాండ్‌, కాంబోడియా, బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన 95 మంది సన్యాసులున్నారు. 2006లో సింగపూర్‌, చైనా, భారత్‌, జపాన్‌తో పాటూ మరికొన్ని దేశాలు నలంద విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించటానికి ముందుకొచ్చాయి. ఇప్పటి వరకు లభించిన మనుస్క్రిప్ట్స్‌ను నలందా మ్యూజియంలో జనవరి 26, 2008న తొలిసారిగా 3డిలో ప్రదర్శించారు. నలంద కాంతి దశదిశలా మళ్లీ వ్యాపించాలి. అందరికి జ్యోతిని ( విద్య) పంచాలి. నలంద కిరణాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి.

No comments:

Post a Comment