చేకూరి గౌతమరాజు

చేకూరి గౌతమరాజు
Facebook

Monday, August 2, 2010

“మడి”ని మనం పేటెంట్ చేసివుంటే బాగుండేది!

శ్లో|| శ్రుతిద్వైథం తు యత్ర స్యాత్తత్ర ధర్మావుభై స్మృతౌ |
ఉభావపి హితౌ ధర్మౌ సమ్యగుక్తౌ మనిషిభిః||
క్కడ శ్రుతుల మద్య తేడాలు కనిపిస్తాయో అక్కడ రెండు ధర్మాలు చెప్పబడుతున్నాయన్నమాట. ఈ రెండిటినీ మనోమధనం చేసి మనఃప్రమాణాన్ని అనుసరించి ధర్మాచారణ చేయవచ్చును. అంటే మనం ధర్మ నిర్ణయం చేయడం తప్పుకాదు అని భృగు మహర్షి చెప్పాడు కనుక…. మన ప్రయత్నం మనం చేద్దాం.. .. ..
 
మడి అన్న సాంప్రదాయం  తెలుగువారి అందరి పూజాకార్యక్రమాలలోనూ, లేక బ్రాహ్మణులు వంటలు చేసేటప్పుడు కనపడుతుంది. ఈ సాంప్రదాయం ఒప్పు అని కొందరంటే, తప్పు అని అనడానికి మరెందరో సిద్ధంగా వున్నారని అందరికీ తెలుసు. కానీ అమెరికన్లు కూడా మడి కట్టుకుంటారని మాత్రం మనలో చాలామంది సరిగ్గా గమనించి వుండరు.  ఒకవేళ మడి అనే పరిజ్ఞానం (టెక్నిక్కు) తెలుగు వారిదే ఐతే, దాన్ని మనం పేటెంటు చేసుకునివుండి వుంటే మనమంతా ఈపాటికి బిలియనీయర్లు అయిపోయేవాళ్లం.  ఇలా ఎందుకు అంటున్నానంటే ... చదవండి...
 
 
జేమ్స్ బాండ్ మడి -- “డాక్టర్ నో చిత్రంలో జేమ్స్ బాండ్‌ని డీకంటామినేట్ చెయ్యడం
మడి అన్నది ఒక మూఢాచారం అని కొట్టివేయకుండా, అది ఒక పరిజ్ఞానం”( లేక process)  అంటూ ఒక హోదాని కల్పించి పునఃపరిశీలించి చూద్దాం. మడికి సరైన మాటలు ఆంగ్లంలోకానీ సంస్కృతంలో కానీ వున్నట్లుగా కనబడవు. బ్రౌణ్య నిఘంటువు ప్రకారం "మడి"  అన్నది "మడగు" అన్న అచ్చతెలుగు పదం నుంచి పుట్టిన తెలుగు పదమట. దీనికి అర్థాలు శుచి, ధౌతవస్త్రము; మడిబట్ట అంటే శుభ్రమైన బట్ట అని అర్థము; మడగులేక మడుగు అన్న పదానికి మడచు, మడత పెట్టు అని అర్థమట, లేక ధౌతవస్త్రము, పరిశుద్ధము, శుచి వంటి అర్థాలు కూడా చెప్పబడివున్నాయి. ఐతే నీటిమడుగు అన్న శబ్దానికి మాత్రం మనకు కొలను, గోతులలో నిలబడినపోయిన నీరు (puddle) వంటి అర్థాలు గుర్తొస్తాయి. అందుకేనేమో సామాన్యంగా "మడి" అంటే "తడి" అని, మడుగుతోనె  సంబంధం పెడతారు మన పెద్దవాళ్ళు. మడిబట్ట అంటే తడిబట్టే అనుకునే వారెందరో మనకు కోకొల్లలుగా కనబడతారు. పోనీ అదొక విపరీతార్థంలే అని పక్కకు పెడదాం. మడి అంటే మరొక అర్థం నాలుగు దిక్కులలోనూ గిరి గీయబడిన వరిపొలము -- నిర్థిష్టమైన ప్రదేశమన్న మాట (a farm confined by boundaries). అందుకేనేమో నేను మడిలో వున్నాను అంటే నేనున్న చోటికి రావొద్దు, లేక నన్ను తాకొద్దు…. .. అని గిరిగీసుకు కూర్చున్నట్లుగా కూడా భావనలోకి వచ్చి వుండవచ్చును. వెరసి నన్ను తాకొద్దు అని గిరిగీసు కోవడాన్ని మనం ఈనాడు మడి అని అనుకుంటున్నాం. అంటే ఛాదస్తాలు పెరిగి శుభ్రమైన బట్టలు కాస్తా తడిబట్టలుగా కాలక్రమేణా మారేయోమో అని అనిపించొచ్చు. అలా  పదాలకు, భావాలకు  మనం అనేక  ఉత్పత్తులు సాధించుకోవచ్చును. కానీ ఈ సాంప్రదాయానికి ఉత్పత్తి ఎక్కడ నుంచీ వచ్చింది అనేది చాలా ఆశక్తికరంగా వుంటుంది. పదపరంగా ఆలోచిస్తే ఈ సాంప్రదాయం తెలుగువారి నుంచే పుట్టినట్లుగా తెలుస్తున్నది. ఇది తరువాత దక్షిణభారత నాగరికతలోనూ పాశ్చాత్యుల నాగరికతలలోనూ  పాకిందేమో పరిశీలిద్దాం.
 
ముందుగా మడి కట్టుకోవడంలోని రకాలు గురించి కొంచెం తెలుసుకుంటే విశ్లేషణ కొంచెం సులువవుతుంది. మడి ముఖ్యంగా రెండు రకాలు.
1) తడిమడి: బట్టలతోనే స్నానంచేసి ఆ నీళ్ళుకారుతున్న తడిబట్టలతోనే పనులన్నీ చేసుకోవడం, ఎవరినీ తాకకుండా జాగ్రత్త పడటం. తడిబట్ట ఒక అగ్నినిరోధకవస్త్రంగా కూడా మారి వంట చేసేవారిని రక్షిస్తుంది.
2) పొడిమడి: తడిబట్టలతో (తడిమడిలో వున్నపుడు) బట్టని ఒకరోజు ముందుగా ఆరేసి, మరసటి రోజు మళ్ళీ తడిబట్టలతో(తడిమడిలో) వచ్చి ఆ పొడారిన బట్టలను వేసుకోవడం. ఆ తరువాత మడిలో వున్నవారిని తప్ప ఎవరినీ ముట్టుకోకుండా జాగ్రత్తగా వుండటం. అంటే శుచిగా మసలడానికి తగిన మార్గోపదేశం చేసారన్నమాట.
ఇవి కాక పట్టు వస్త్రాలు ధరించడం లేక పూర్తిగా వివస్త్రులై (నగ్నంగా) వుండటం అనే మరో రెండు రకాల మడులు  కూడా వాడుకలో కనబడతాయి. కానీ పట్టు వస్త్రాలలో అర్థంలేదు, నగ్నత అసలు హైందవ ధర్మం కానేకాదు.
శ్లో|| కౌశేయావిక యోరూషైః కుతపానామరిష్టకై|
శ్రీఫలైరశుపట్టానాం క్షౌమాణాం గౌరసర్షషైః||
పట్టుదారంతో నెయ్యబడిన బట్టలు, గొర్రెబొచ్చుతో చెయ్యబడిన కంబళ్ళు చౌటిమట్టితో శుభ్రం చెయ్యాలి. నేపాళ దేశపు కంబళ్ళు వేప విత్తుల చేత, కాశ్మీరదేశపు శాలువాలు మారేడు ఫలాల చేత, వెలిపట్టును తెల్ల ఆవాల చేత శుద్ధిచేయాలి.
అంటే పట్టు కూడా శుభ్రానికి అతీతం కాదని మనుధర్మసారం చెబుతోంది. దానిని ఎప్పటికప్పుడు శుద్ది చేయకపోతే శుభ్రతకు (మడికి) పనికిరాదు అని తేటతెల్లం అవుతోంది. అలాగే
శ్లో|| నాన్నమద్యాదేక వాసా న నగ్నస్నాన మాచరేత్ |
న మూత్రం పధి కుర్విత న భర్మని న గోవ్రజే ||
ఎన్నడూ ఒకే బట్టతో భోజనానికి వెళ్ళరాదు (కండువా కూడా వుండాలి). నగ్నంగా స్నానం చేయకూడదు.
కానీ ఈ నగ్నత  అనేది ఎలాగోఅలా వాడుకలోకి వచ్చేసింది. పైన చెప్పిన విధంగా మనుస్మృతే నగ్నంగా స్నానం చేసేవారినిఅలాగే నగ్నంగా పుణ్యకార్యాలు చేసేవారిని నిషేదించింది. అందుచేత కేవలం ఛాందస భావాలవల్ల తప్పుడు ఆచారాలుగా ఈ రెండూ ప్రాభల్యంలోకి వచ్చాయని తెలుస్తోంది. కనుక మనం మొదట చెప్పిన రెండు రకాలనే మడి క్రింద పరిగణిస్తూ, పశ్చిమదేశాల వారు మడి ఎప్పుడు, ఎలా, ఎందుకు  కట్టుకుంటున్నారో నిశితంగా పరిశీలిద్దాం.
  
వెట్ డీ కంటామినేషన్
పైన చూపిన చిత్రంలోని వ్యక్తులు మడి కట్టుకోబోతున్న హిందువులు కానీ భారతీయులు కానీ కారు. వీరు అమెరికన్ జవానులు (U.S. Army Biological Chemical Command (SBCCOM)). వీరు అవసరాన్నిబట్టి తమ పని చేసే ముందు కానీ తరువాత కానీ ఇలా స్నానం చేస్తారట. దీని మూలంగా బాక్టీరియాలు, రసాయనాలు తమకు కానీ, లేక తమ ద్వారా వేరే వాళ్ళకు కానీ సోకకుండా వుండటానికి వీరు తీసుకునే అతిసామాన్య జాగ్రత్త మాత్రమేనట.  అలాగే WMD (weapons-of-mass-destruction) Attack ఒకవేళ జరిగితే,  ఇది వీరు వెంటనే తీసుకోవల్సిన వెట్ డీకంటామినేషన్ అనే ఒక జాగ్రత్త చర్య.  ఈ వెట్ డీకంటామినేషన్ ఈ క్రింద చూపినట్లుగా నాలుగు రకాలుగా చేయబడుతుంది అని అమెరికన్ రక్షణశాఖ తెలియజేస్తోంది. అన్నిటిలోనూ మన మడిలో లాగా బట్టలతోనే స్నానం చెయ్యడం, బట్టలు విడవడం, చివరికి అతిజాగ్రత్తగా వుతికిన బట్టలు (మడిబట్టలు) వేసుకోవడం, తరువాత బయటివారిని (మడిలో లేని వారిని) తాకకుండా వుండటం, అన్నది ఈ ధర్మసూక్ష్మంగా మనం గుర్తించవచ్చు.
వెట్ డీకంటామినేషన్  పద్ధతులు
 
వెట్ డీ కంటామినేషన్, ఆ తరువాత ధరించే మడిబట్టలు
వ్యక్తిని పూర్తిగా బట్టలతో సహా తడపడం, ఆ మడుగులో ఒక సురక్షిత కవచాన్ని ఇవ్వడం అనే ఈ వెట్ డీకంటామినేషన్ చర్యలను చూస్తే ఇది దాదాపుగా మన మొదటిరకం మడిలాగా లేదూ? బ్రిటీషువారు  ప్లేగు వంటి వ్యాదులు ప్రభలినప్పుడు కూడా ఈ వెట్ డీకంటామినేషన్ టెక్నిక్కుని వాడారనడానికి చారిత్రాత్మక ఆధారాలున్నాయి. మందులు వగైరాలు ఈ వెట్ డీకంటామినేషన్ తరువాతే ఇచ్చేవారు.  రోగిని లేక శిశువులను తాకే ముందు స్నానం చేయడం మంచిది అనడం అందరికీ అర్థమయ్యే విషయమే. అలాగే రోగిని తాకిన తరువాత కూడా స్నానం చేయడం మంచిది. రోగాలను అలా అదుపు చేయవచ్చు అన్నదే ఈ ధర్మసూక్ష్మం.
ఇక మన రెండవ రకం మడి అంటే పొడి బట్టలతో (లేక ముందుగా తగిన జాగ్రత్తలో వుతికిన బట్టలతో) నడిచే మడి. ఇది ఎక్కువగా వైద్య రంగంలోని ఆపరేషన్ థియేటర్లలోనూ, సెమీ కండక్టర్లు తయారుచేసే "క్లీన్ రూముల"లోనూఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోని వంటశాలలోను ఎక్కువగా వాడతారు.  అంటే కొద్ది కొద్ది మార్పులు చేర్పులతో,  వీరంతా కూడా మడి కట్టుకుంటున్నారనే కదా! 
cleanroom suit  http://pad2.whstatic.com/images/thumb/2/2c/Rows-and-rows-8380.jpg/220px-Rows-and-rows-8380.jpg
సెమీ కండక్టర్ ఫాక్టరీలోని క్లీన్ రూములు
క్లీన్ రోములలోకి



  1. శుభ్రంగా స్నానం చేస్తే తప్ప అడుగు పెట్టనివ్వరు,



  2. కాస్మటిక్సు, సెంటులూ వంటివి ధరించ కూడదు.



  3. లోనికి వెళ్ళే ముందు కార్మికులు తమ బట్టలు విడిచి, యాజమాన్యం నిర్థిష్టమైన పద్ధతిలో ఉతికి ఇచ్చిన దుస్తులనే వేసుకోవాలి. 



  4. అంతేకాదు లోదుస్తుల పైన కూడా అనేక ఆంక్షలు విధిస్తారు. లింట్ లేని దుస్తులనే లోదుస్తులుగా వాడాలి (అంటే కొంత వరకు పట్టు లాంటివి అని మనం సరి పెట్టుకోవచ్చునేమో).



  5. బట్టలు పొడిగా (తడి లేకుండా) వుండాలి.  



  6. నోటిలో ఏ ఆహార పధార్థం వుండకూడదు.



  7. పాదరక్షలు బయటే విప్పి(లేక బూటీలతో కప్పి), లోనికి వెళ్ళాలి. 



  8. మనిషే కలుషితానికి ముఖ్య కారణం అని నమ్మాలి.
http://www.aerofreeze.com/SiteCollectionImages/Spiral%20Freezer%20Photos/Steamed%20chicken%20strips.jpg  http://www.afisservices.com/FoodWorkers.JPG
మాంసమైనా మడిగానే వండుతారు వీరు
దాదాపు ఇవే సూత్రాలను పైన చిత్రాలలో చూపినట్లుగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కూడా వాడతారు. అలాగే ఆస్పత్రులలో, ఆపరేషన్ థియేటర్లలోనూ, మందుల ఫాక్టరీలలోనూ  వాడతారు. వెరసి మన మడిలోని సూత్రాలే మూకుమ్మడిగా దాదాపుగా అందరూ వాడుతున్నారు. అంటే మన మడి ఆచారం ప్రపంచమంతా పాకిపోయింది.
హిందూదేశంలోని అన్ని ప్రాంతాలలో "మైల" అన్న సంస్కారం చాలా సర్వసాధారణంగా కనిపిస్తుంది. దీనికి కారణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఎవరైనా చనిపోయిన వ్యక్తులను చూడడానికి వెడితే అక్కడ ఆ మనిషి మరణానికి కారణమైన బాక్టీరియా వంటి క్రిములు సోకకుండా వెట్ డెకంటామినేషన్ చేసుకోవడం గురించి భృగుమహర్షి సవివరంగా తెలిపాడు.
శ్లో|| అనుగమ్యేఛ్ఛయా ప్రేతం జ్ఞాతిమజ్ఞాతిమేవ వా|
స్నాత్వా సచేతః స్పృష్ట్వాగ్నిం ఘృతం ప్రాశ్య విశుద్ధ్యతి||
జ్ఞాతులుగాని, అజ్ఞాతులుగానీ ఆ ప్రేతం మీద అనురాగంతోటి శ్మశానానికి వెడితే, వారు సచేల శ్నానం చేసి అగ్నిని తాకి కొద్దిగా నేతిని ఆచమనం చేస్తే, పరిశుద్ధులవుతారు.
దీని వర్ణన పైన చూపిన అమెరికావారి వెట్ డీకంటామినేషన్ - Method -2 తో సరిగ్గా సరిపోతోంది. అంటే డీకంటామినేషన్ అనేది మన హైందవ పరిజ్ఞానమే అని మనం నమ్మవచ్చు. కాని పూజ చేసే (లేక వంట చేసే) పద్ధతులు చెప్పేటప్పుడు మాత్రం, భృగువు శుచి శుభ్రం ముఖ్యం అని చెప్పి వదిలేసాడు కానీ,  మడి గురించి ఏమీ విస్తారంగా ప్రస్తావించలేదు. ఈ మాత్రం శుచిశుభ్రత గురించి అన్ని మతాలలోనూ చెబుతారు. ఉదాహరణకి  ఇస్లాం మతంలో కూడా ప్రార్థన (అరబిక్‌లో సలత్ అంటారు) చేసేటప్పుడు వుతికిన బట్టలనే ధరించమనీ, శుభ్రమైన చోటనే ప్రార్థన చేయమనీ, మలినమయ్యే ఆస్కారమున్న శరీర  భాగాల నన్నిటినీ కడగమనీ చెప్పబడివుంది. క్రైస్తవులు కూడా దాదాపు అదే చేస్తారు. మనువు కూడా ఈ క్రింది విధంగానే హిందువులకు చెప్పాడు.
శ్లో|| నిత్యం స్నాత్యా శుచిః కుర్యాదేవర్షి పితృతర్పణ్మ్ |
దేవతాభ్యర్చనం చైవ సమిదాధానమేవ చ ||
ప్రతీరోజూ స్నానం చేసి పరిశుద్ధుడయి దేవ, ఋషి పితృతర్పణాలను చేసి, ఈశ్వరాధనను సమిధాయజ్ఞాన్ని నిర్వర్తించాలి.
పరిశుద్ధత అవసరం అని చెప్పాడు కానీ బట్టలతో స్నానంచేయ్యాలా, బట్టలు ఎప్పుడు విప్పాలి అనే వెట్ డీకంటామినేషన్ టెక్నిక్కుల వివరాల వంటివేవీ ఇందులో చెప్పబడలేదు. అంటే మడి”, మడిబట్టల గురించి,  చెప్పలేదు.  అంటే మనువు, భృగువుల కాలానికి కనీసం మడి లాంటి పదం కూడా మన సంస్కృతిలోకి రాలేదు అని అర్థమవుతుంది.  “మడి అన్న పదానికి సంస్కృతం నుంచీ  ఏదైనా ఒక ఉత్పత్తిని సాధించగలమా అని ప్రఖ్య మధుబాబు గారిని ఆడిగితే "మండిత" అనే పదం దీనికి దగ్గిరగా వుంటుందని అభిప్రాయపడ్డారు. మండిత అంటే చుట్టబడిన, ధరించబడిన అనే అర్థాలు వస్తాయి. అంటే మన మడి అన్న పదం ఈ మండి నుంచే పుట్టి వుండవచ్చు. మండువా అన్నా  కూడా ఇంటి చేత చుట్టబడిన మద్యస్థలము అనే అర్థం గోచరిస్తుంది. అలా ఆలోచిస్తే, మడికట్టుకున్నామన్న మాట కూడా ఇచ్చే అర్థం -- "నన్ను నేను ఒక పరిథిలో ఉంచుకుంటున్నాను"  --  అని అర్థాన్ని ఉత్పత్తి చేయచ్చు అంటున్నారు వీరు. అంటే చివరికి మడి అన్నపదానికి సంస్కృతం నుంచీ ఉత్పత్తి సాధించగలిగాము. ఐతే, మనం కట్టే మడిఅనే సంస్కారానికి సంబంధించిన  ప్రస్తావన మాత్రం సంస్కృత  శాస్త్రాలలో ఎక్కడా దొరకలేదు.  ఇంకా పరిశీలిస్తే మనుధర్మశాస్త్రంలో, రామాయణ భారతాలు వంటి పౌరాణికాల్లో కూడా మడి ప్రస్తావన కనబడలేదు. వేదాలలో ఏమైనా వుందా అని ప్రశ్నించి చూసినా తగిన ఉదాహరణలు దొరకలేదు. అంటే మడి సనాతన ధర్మ సాంప్రదాయము కాకపోవచ్చుననే తెలుస్తోంది.
కానీ ముందు చెప్పుకున్నట్టుగా మడి (Terminology లేక process లేక  ఆచారం) అన్నది అచ్చ తెలుగు పదం అని బ్రౌణ్య నిఘంటువు ప్రకారం మాత్రం మనకు తెలుస్తోంది. తతిమా దక్షిణ రాష్ట్రాలలో అంటే తమిళ కన్నడ మళయాళ భాషల వారిలో మడి ఆచారం వుంది; కానీ అందరూ ఇదే పదాన్ని వాడుతున్నారు. వీరికి కనీసం వేరే పదం కూడా లేదు కాబట్టి, ఇది వారి పరిజ్ఞానం కూడా కాదు అని అనుకోవచ్చు. అలాగే మడి ఉత్తర భారతంలో కనపడదు (తెలుగు వారి ప్రభావమేమో ఇది కొంచెం మనపొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో కనిపిస్తుంది). ఏకంగా మూల విరాట్‌ను తాకడం కూడా ఉత్తర భారతంలో ఆలయాలలో నిషేధం కాదుమడి అన్న ఆచారానికి తెలుగులోనే  మరో పర్యాయ పదం గానీ, పోనీ  వేరే ఏ భాషలలో తగిన పదం గానీ దొరకడం లేదు. అందుచేత ఈ ఆచారం ఖచ్చితంగా తెలుగు సాంప్రదాయమే అయ్యి వుండాలి.  లేకపోతే తెలుగు వారే  “మైల సంస్కారాన్ని మరింత అభివృద్ధిచేసిదానిని మడి అని నిర్వచించి, నిత్యజీవనంలోకి ప్రవేశ పెట్టారన్న మాట. ఈ మాట పూర్తిగా మనదే అని అనడానికి మరొక ఉదాహరణ -- ఆంధ్ర ప్రాంతంలోని చాకలివారి దేవతను "మడేల్" అని అనడం.  ఏమైతేనేమి "మడి" అనే పరిజ్ఞానం లేక ఆచారం తెలుగు వాడి సొత్తే అని తేలుతోంది.
ఛాందస భావాల జోలికి వెళ్ళకుండా, అసలు భావాన్ని గ్రహిస్తే ఈ మడి ఆధునిక నాగరికతలో భాగంగా దేశవిదేశాలలో అతి ప్రాచుర్యం పొందిందని తెలుస్తోంది. అలా అని మనం కట్టే మడిని సమర్ధించడం ఎంత మాత్రం కాదు. మన పూర్వీకులు నిర్దేశించిన అసలు మడి కాలక్రమేణా ఎన్నో రూపాంతరాలు చెంది, మూఢనమ్మకాలకు తలవొగ్గి...  ఓడిపోయి, ఈ నాడు మనం ఎందుకు మడి కట్టుకున్నామో కూడా మనకే తెలియని దుఃస్థితికి చేరింది. అంతే కానీ ఆ పరిజ్ఞానం మొత్తం తప్పుకాదని మాత్రం చెప్పగలం.  అందుకే ఈ నాడు అన్ని దేశాల సైనికులు, సెమీ కండక్టర్‌ కార్మికులూ, ఫుడ్‌ప్రాసెసింగ్ రంగంలోనివారూ, వైద్య నిపుణులూ మన ఆంధ్ర గృహిణులతో పోటీ పడి ఈ మడిని కట్టుకుంటున్నారు.  తేడా ఎక్కడొచ్చింది అంటే కాలక్రమేణా మనం దీనిని ఒక మూఢాచారంగా మార్చేసుకున్నాం. పాశ్చాత్యులు సమయానుసారంగా వైజ్ఞానిక అవసరంతో సరిగ్గా అమలు చేస్తున్నారు. శుభ్రత అవసరం లేకపోయినా దైవభీతితో కట్టుకునే మడి అసలు మడే కాదు. అది సాంప్రదాయ విరుద్ధం కూడాను.  ఏమైతే నేమి  ఒకవేళ ఈ ఆచారం తెలుగు వారిదే ఐతే; ఇంకా అవకాశం వుంటే; మనం మడిని తప్పక పేటెంటు చేసుకోవాలి!  
- తల్లాప్రగడ రావు

1 comment:

  1. yes correct madi ante shubrata kani daivikamga madi kattukunna varu evarini taka kudadu

    ReplyDelete